Bhagya nagaram
-
‘హైదరాబాద్ బ్లూస్’ ఇంకా అలాగే ఉందా!
సాక్షి, న్యూఢిల్లీ : వత్తుగా వస్తున్న మూత్రాన్ని ఆపుకోలేక ఎదురుగా తడిగా కనిపించిన గోడ మీదనో, పక్కనున్న పాత గోడమీదనో విసురుగా వదిలేయడం, రొమ్ము విరుచుకొని పహల్వాన్‌లా చేతులు ఊపుకుంటూ ట్రాఫిక్ మధ్య నుంచి దర్జాగా రోడ్డు ఆవలి పక్కకు నడిచిపోవడం, ఎర్రగా నోరు పండేలా పాన్ నవులుతూ తూ...తూ....అంటూ ఎక్కడ పడితే అక్కడే ఊసేస్తూ ముందుకు వెళ్లడం, రాంగ్ రూట్లో బైక్ నడపడం, బాస్ పేరు చెప్పి కానిస్టేబుల్‌ను బురుడీ కొట్టించడం, ఏందిర బై పరేషాన్! అంటూ దోస్తుల పలకరింపులు, దా, బీరేద్దారాం! అన్న పిలుపులు, బీరు బాటిళ్ల మధ్య బూతు జోకులు, తెల్లవారక ముందే నిద్రలేపే మందిర్, మసీదు మైకులు, పాల వాడి గోల, పైడితల్లి డాన్సులు.. ఈ దృశ్యాలును ఎవరైన గుర్తు చేశారంటే వారు హైదరాబాద్ గురించిగానీ, హైదరాబాద్ పేరుతో వచ్చిన ‘హైదరాబాద్ బ్లూస్’ సినిమా గురించిగానీ చెబుతున్నారునుకోవాలి. పక్కా హైదరాబాదీ నగేశ్ కుకునూర్ తీసిన ‘హైదరాబాద్ బ్లూస్’ సినిమా విడుదలై సరిగ్గా ఈ రోజుకు 20 ఏళ్లు. ఇంగ్లీషు, హిందీ, తెలుగు మూడు భాషల్లో తీసిన ఈ సినిమా ప్రింట్లు అటు ముంబైలో, ఇటు హైదరాబాద్‌లో 1998, జూలై 18వ తేదీన విడుదలయ్యాయి. 20 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఈ రోజు రాత్రికి ముంబైలోని పీవీఆర్ సినిమాలో ‘దృశ్యం ఫిల్మ్స్’ సంస్థ హైదరాబాద్ బ్లూస్ ప్రదర్శనను ప్రత్యేకంగా ఏర్పాటు చేసింది. ప్రస్తుతం ‘సిటీ ఆఫ్ డ్రీమ్స్’ పేరుతో వెబ్ సిరీస్‌ను తీయడంలో బిజీగా ఉన్న నగేష్ కుకునూర్ ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు. ప్రేక్షకులు అడిగిన ప్రశ్నలకు జవాబు ఇవ్వనున్నారు. అమెరికాలో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్న నగేష్ ‘పల్ప్ ఫిక్షన్’ అనే హాలీవుడ్ చిత్రాన్ని చూసి ఎంతో స్ఫూర్తి పొందారు. అదే స్ఫూర్తితో అదే సరళిలో తాను పుట్టుపెరిగిన హైదరాబాద్ పరిసరాలు, పరిస్థితుల మధ్య సినిమా తీయాలనుకున్నారు. అప్పటికే సినిమాలో పండిపోయిన ఒకరిద్దరు ప్రముఖులు ఆయన కథను తిరస్కరించారు. అప్పటికే కొంత మంది చేతుల్లో తెలుగు సినీ పరిశ్రమ చిక్కుకొని ఉండడంతో ‘ఎన్ ఇండిపెండెంట్ మూవ్మెంట్ ఇన్ ఇండియన్ సినిమా’కు తానే శ్రీకారం చుట్టాలనుకున్నారు. పెద్ద ఖర్చు, పెద్ద నటులు లేకుండా, సింపుల్‌గా సినిమా తీయాలనుకున్నారు. తాను హీరోగా, రాజశ్రీ నాయర్ హీరోయిన్గా మిత్రులు, తెలిసిన వారు ఇతర నటీనటులుగా సినిమా స్క్రిప్టు రాసుకొని స్వీయ దర్శకత్వంలో సినిమా ప్రారంభించారు. కేవలం 17 రోజుల్లో సినిమా షూటింగ్‌ను పూర్తి చేశారు. మొత్తం సినిమా పూర్తవడానికి ఖర్చయింది కూడా 17 లక్షల రూపాయలే. సినిమాలో 91 ఆడియో బూతులు ఉన్నాయి. సెన్సార్ బోర్డు వాటిని కత్తిరించాలని సూచించిందట. బ్లూస్లోనే పెద్ద బూతుందని కూడా వాదించిందట. తాను హైదరాబాద్‌లోని సహజమైన పరిస్థితులను సహజంగా సినిమాలో చూపించాలనుకున్నానని, ఈ బూతులు కూడా నగర జీవితంలో చాలా సహజంగా ఉన్నాయని నగేశ్ వాదించారట. చివరకు కేవలం మూడు ఆడియో జోకుల కట్తోని సినిమాను విడుదల చేయించుకోగలిగారు. అందరికి అర్థంకాని బూతులను అలాగే వదిలేశారు. సినిమాకు మంచి పేరే కాదు, మంచి కనెక్షన్లు కూడా వచ్చాయి. అయితే నగేశ్‌కు మంచి అవకాశాలు మాత్రం రాలేదు. తెలుగువారెవరూ ఆయనతో సినిమా తీయడానికి ముందుకు రాలేదు. ‘హైదరాబాద్ బ్లూస్’ సినిమా ఏదో కుర్రకారుకు నచ్చి అనుకోకుండా హిట్టయింది తప్పా! అంటూ పెదవి విరిచారు. ఆ తర్వాత అరకొరగా వచ్చిన బాలీవుడ్ అవకాశాలను ఉపయోగించుకొని, ఎక్కువ వరకు స్వీయ నిర్మాణాన్ని నమ్ముకొని బాలీవుడ్లో స్థిర పడ్డారు. ఈ రంగంలో 20 ఏళ్ల పాటు కొనసాగడం ఆశ్చర్యంగానే ఉందని ఆయన ఈ రోజు ఓ జాతీయ మీడియాతో వ్యాఖ్యానించారు. దేవున్నిగానీ, దెయ్యాన్నిగానీ, మూఢాచారాలనుగానీ గుడ్డిగా నమ్మవద్దని, అన్నింటిని ప్రశ్నించాలనే తాత్విక చింతన కలిగిన ‘హైదరాబాద్ బ్లూస్’ హీరో నగేశ్ కుల, మతాలు, కట్నాలు పెళ్లికి అడ్డంకి కాకూడని వాదిస్తాడు. అంతకంటే అసలు పరిచయం లేని వ్యక్తులను, వారి వ్యక్తిత్వం గురించి తెలుసుకోకుండా ఎలా పెళ్లి చేసుకుంటారని ప్రశ్నిస్తాడు. హీరోయిన్‌తో డేటింగ్ చేస్తున్నప్పుడు కూడా ఇవే వాదనలను తీసుకొస్తాడు. ఆమెకు చిర్రెత్తుకొచ్చి ‘మీ అమెరికా అబ్బాయిలకు కావాల్సింది పెళ్లాం కాదు. ఇంట్లో అన్ని పనులు చేసి పెట్టే పని మనిషి, రాత్రి పక్కలోకి సెక్స్నిచ్చే యంత్రం, పిల్లలను పోషించే ఆయా మాత్రమే’ అంటూ నిందిస్తుంది. అమెరికాలో పని మనిషికి, పిల్లలను సాకే ఆయాలకు డబ్బులు ఎక్కువ ఇవ్వాల్సి వస్తుందన్న దూర దృష్టిలో భారత్‌కు వచ్చి పెళ్లిళ్లు చేసుకుంటారని పరోక్షంగా విమర్శిస్తుంది. అమెరికాలో అలాంటి వారు ఉన్నారుకానీ, తాను అలాంటి వాడిని కాదని నగేశ్ నయానా, భయానా బతిలాడుకుంటాడు. చివరకు ఎలాగో పెళ్లి చేసుకుంటాడు. హైదరాబాద్ బ్లూస్‌లో చూపిన సామాజిక పరిస్థితులు నేటికి కూడా ఉన్నాయి. నగేశ్ ప్రశ్నలూ ఇప్పటికీ సజీవమే. రోడ్లు విస్తరించినా, ఎత్తైన భవనాలు వచ్చినా, మెట్రో రైలు నడుస్తున్న పరిసరాల పట్ల నగర వాసుల ప్రవర్తనలో పెద్దగా మార్పేమి లేదు. హైదరాబాద్ బ్లూస్‌ను ఇప్పుడు చూసినా ఇప్పటి పరిస్థితలకు తగ్గట్టుగా తీశారు అనిపిస్తుంది. సందేహం కలిగితే మరోసారి చూడొచ్చు. అదే ‘బ్లూస్’. నగేశ్ కుకునూరు ఆ పేరును రంగుల అర్థంలో వాడారేమోగానీ ‘బ్లూస్’ అంటే ఓ విషాధ గీతం. -
డ్రగ్స్ నేపథ్యంలో 'భాగ్యనగరం'
కన్నడలో సూపర్ హిట్‌గా నిలిచిన 'రాజధాని' చిత్రాన్ని సంతోష్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై యువ నిర్మాత సంతోష్ కుమార్ 'భాగ్యనగరం' పేరుతో తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలో రిలీజ్‌కి రెడీ అవుతోంది. కన్నడ స్టార్ హీరో అయిన యష్ ఈ చిత్రంలో హీరోగా నటించారు. షీలా హీరోయిన్గా నటించింది. వెర్సటైల్ యాక్టర్ ప్రకాష్ రాజ్ పవర్ఫుల్ పోలీస్ పాత్రని పోషించారు. ముమైత్‌ఖాన్ మరో ముఖ్య పాత్రలో నటించింది. నిర్మాత సంతోష్ కుమార్ మాట్లాడుతూ - 'డ్రగ్స్ వలన పెడదారి పట్టిన నలుగురు యువకుల కథే 'భాగ్యనగరం'. మాదక ద్రవ్యాలకు అలవాటు పడి తమ జీవితాలను నాశనం చేసుకుంటూ ప్రాణాలు కోల్పోతున్న యువతీ, యువకులందరూ తప్పకుండా చూడాల్సిన చిత్రం ఇది. మాస్, యాక్షన్ ఎంటర్టైన్మెంట్తో మంచి సందేశాత్మకంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ప్రకాష్‌రాజ్, హీరో యష్‌ల మధ్య సన్నివేశాలు హైలైట్‌గా నిలుస్తాయి. అలాగే కథ, కథనం చాలా కొత్తగా వుంటుంది. దర్శకుడు కె.వి.రాజు చాలా అద్భుతంగా ఈ చిత్రాన్ని రూపొందించాడు. అర్జున్ జన్య మ్యూజిక్ సినిమాకి ఒన్ ఆఫ్ ది ఎస్సెట్‌గా నిలిచింది. సినిమా చూశాక ఒక గొప్ప చిత్రం చూశామనే ఫీలింగ్ కలుగుతుంది. నిర్మాతగా ఇది నా తొలి చిత్రం. భాగ్యనగరంలాంటి ఒక మంచి సందేశాత్మక చిత్రాన్ని ప్రేక్షకులకు అందిస్తున్నందుకు చాలా గర్వంగా ఫీలవుతున్నాను. అకున్ సబర్వాల్‌గారు ఈ సినిమా ట్రైలర్ చూసి చాలా అద్భుతంగా వుంది. ఇలాంటి చిత్రాలు ఎన్నో రావాలి అని అప్రిషియేట్ చేశారు. త్వరలో ఆయన ట్రైలర్ లాంచ్ చేయనున్నారు' అన్నారు. -
మొదటి జీతం
కథ రెండు వేల రూపాయలు... అక్షరాలా రెండు వేల రూపాయలు. నా జీవితంలో మొట్టమొదటి జీతం డబ్బులు. ఈ డబ్బును అందుకున్న రోజు నేను వేసుకున్న చొక్కా ఖరీదు రూ.800. ప్యాంటు ఖరీదు రూ.1350. అంటే ప్రస్తుత సమాజంలో ఈ 2000 రూపాయలతో ఒక జత నాణ్యమైన బట్టలను కూడా కొనుక్కోలేను. అయినా సరే ఎందుకో తెలీని ఆనందం. ఒక చిన్న గర్వం. ఇవి నా డబ్బులు. ‘మై మనీ. మేరా పైసా’. నేను ఎలాగైనా ఖర్చు చేసుకోవచ్చు.అయితే చాలామంది అంటుంటారు, డబ్బుకు మాత్రమే విలువనిచ్చేవాడు పైకి రాలేడు అని. నేనంటాను, కష్టపడి సంపాదించిన డబ్బును వృథాగా ఖర్చుపెట్టేవాడు కూడా పైకి రాలేడు అని. మన భాగ్యనగరంలో బస్సులకు, బస్టాపులకు కొదవ లేకున్నా, అకారణపు బంద్‌ల వల్ల ఆ కొరత కనిపిస్తుంది. అదృష్టం కొద్దీ ఈ రోజు అలాంటిదేమీ లేకపోవడం వల్ల, నేను ఎక్కాల్సిన బస్సు ఎక్కాను. తీస్కోవాల్సిన టికెట్ తీస్కొని, కూర్చోవాలనుకున్న కుర్చీలో కూర్చున్నాను. నేను చేరాల్సిన గమ్యం కోసం బస్సు ముందుకు వెళ్తుంటే, ఆలోచనలతో నా మనస్సు వెనక్కి వెళ్లింది. అది నేను రెండవ తరగతిలో ఉన్నప్పుడు అనుకుంటా. పుస్తకాల సంచీ భుజాలకు తగిలించుకుని బడికి బయల్దేరాను. రెండు నిమిషాలు నడిచాక, ఏదో తళుక్కున మెరిసింది, నా రెండు కాళ్లకు మూడు గజాల దూరంలో. చూస్తే ఒక రూపాయి బిళ్ల. చేతిలోకి తీస్కొని చుట్టూ చూశాను. ఎవరూ లేరు. అక్కడ అప్పుడు ఎవరైనా ఉండి ‘ఈ రూపాయి నాది’ అని అంటే ఇచ్చేవాణ్నేమో. కానీ ఎవరూ లేరు. అడగలేదు. నేనూ ఎవ్వరికీ ఇవ్వలేదు. ఆ రూపాయిని నిక్కర్ జేబులో వేస్కొని బడికి వెళ్లాను. తరగతి గదిలో అయితే కూర్చున్నాను కానీ, నా మనసంతా దొరికిన రూపాయి బిళ్లపైనే ఉంది. ఎలా ఖర్చు పెట్టాలా అని! చిత్తం శివుడిపై భక్తి చెప్పులపై అన్నట్లు నేను క్లాసులో, మనసు రూపాయితో పాటు జేబులో. మొత్తానికి ఎదురుచూసిన సాయంత్రం వచ్చింది. బడిగంట మోగింది. బడి నుండి బయటికి వచ్చేశాను. ఇక ఇంటికి వెళ్లేలోపు ఆ రూపాయిని ఖర్చు చేయడము, ఖరీదు చేసిన ఆ తినుబండారాలను తినడము, తిన్నవాటిని అరిగించుకోవడము, ఇంకాతర్వాత ఆ రూపాయి గురించి మర్చిపోవడం కూడా జరిగింది. మళ్లీ ఇన్నాళ్లకు గుర్తొచ్చింది ఆ రూపాయి. లేదు, నా మొదటి జీతం గుర్తుచేసింది. అవి నేను ఇంజనీరింగ్ చివరి సంవత్సరం చదువుతున్న రోజులు. కళాశాల నుండి ఇంటికి వస్తున్న నాకు, రెండు నిమిషాలలో ఇంటికి చేరతాననగా, దారిలో ఒక కాగితం కనిపించింది. ఏదో అనుమానంతో తీస్కున్న నాకు, అది వెయ్యి రూపాయల నోటుగా వెంటనే నిర్ధారణ అయింది. దానిలో భాగస్వామ్యం పొందడానికి ఎవరైనా నన్ను చూస్తున్నారేమోనని చుట్టూ గమనించాను. అక్కడ ఎవరూ లేరు కానీ ఎక్కడో ఉన్న నా స్నేహితులు గుర్తొచ్చారు. వాళ్లకి ఇవ్వాల్సిన ‘పార్టీ’ వాయిదా వేసి ఉన్నానని గుర్తొచ్చింది. అంతే, మరుసటిరోజుకి నా చేతిలో ఒక్క రూపాయి కూడా మిగలలేదు. నేను అంతలా ఖర్చుపెట్టినా నాకు సంతృప్తి లేదు. ఒక చిన్న ఆనందం కలిగినా అది అప్పటి తాత్కాలిక ఆనందం అని ఇప్పుడు అర్థం అవుతోంది. ఇలా రూపాయి నాణెం నుండి వెయ్యి రూపాయల నోటు వరకు ఎన్నోసార్లు ఎంత ఖర్చుపెట్టినా, వాటిల్లో ఆనందం కలిగింది కానీ సంతృప్తి మిగలలేదు. ఎందుకంటే అవి దొరికినవో నాన్న ఇచ్చినవో కాబట్టి! ఇంజనీరింగ్ అయిపోయాక, ఖాళీగా ఉన్న రోజుల్లో స్నేహితులతో కలిసి సరదాగా ఎక్కడికైనా వెళ్లాలని ప్రణాళికను రూపొందించుకొని, ఒక్కొక్కరికీ 4000 రూపాయలు అవుతుందని నిర్ణయించుకున్నాం. నా స్నేహితులంతా డబ్బు ఎలా సర్దాలా అని మథనపడుతున్నారు. కొంతమంది అంత డబ్బు లేదని చేతులెత్తేశారు. డబ్బును సర్దడానికి వాళ్లు పడుతున్న ఆందోళన నాలో కొంచెం కూడా లేకపోవడం నన్ను ఆశ్చర్యపరిచింది. బహుశా మా నాన్నకు నాపై ఉన్న ప్రేమ మీద నాకున్న నమ్మకమేమో! అదే రోజు నేను ఇంటికి వెళ్లే సమయానికి ఇంట్లో నుండి ఏవో మాటలు కొంచెం పెద్దగా వినిపిస్తున్నాయి. ఆ మాటలు గొడవకు తక్కువ, బాతాఖానికి ఎక్కువలా ఉన్నాయి. నేను ఇంట్లోకి ప్రవేశించే సరికి బుర్రమీసాలతో గుర్రుగా ఉన్న ఒక వ్యక్తి చిరాకుగా చూస్తూ వెటకారంగా మా నాన్నతో మాట్లాడుతున్నాడు. నాన్న మాటల్లో మాత్రం అభ్యర్ధించడం కనిపిస్తుంది. మొత్తానికి ఆ సంభాషణ ద్వారా నాన్న అతనికి నాలుగు లక్షలు అప్పు ఉన్నాడని అర్థమైంది. ఛ! నాన్న మాకోసం చేసిన అప్పును మేము చేసిన అప్పుగా కాకుండా, నాన్న చేసిన అప్పుగా చెప్తున్న నా విచక్షణా రాహిత్యానికి సిగ్గు పడుతున్నాను. ఆ పరిస్థితుల్లో కూడా అమ్మకి టూర్ గురించి చెప్పి డబ్బును అడగటం గుర్తు తెచ్చుకుంటుంటే ఇప్పుడు బాధగా, సిగ్గుగా ఉంది. అమ్మ ఆ రోజు నాతో ఏం మాట్లాడలేదు కానీ, మా ఆర్థిక సమస్యలతో సంబంధం లేకుండా, కేవలం నా సంతోషం కోసం తర్వాతి రోజు ఉదయం నా చేతిలో డబ్బును ఉంచింది. ఆ రోజు నాకొకటి అర్థమైంది - సమాజానికి ఒక కుటుంబం ఎంత హుందాగా కనిపించినా, ఆ కుటుంబంలో మాత్రం ఏదో ఒక ఆర్థిక సమస్య ఉంటుంది. అది చిన్నదైనా, పెద్దదైనా. కానీ ఆ కుటుంబానికి మాత్రం అది చిన్న సమస్య అయినా పెద్దగా కనిపిస్తుంది. ఎందుకంటే సమస్య వాళ్లది కాబట్టి. హ్హ హ్హ... నేను కుటుంబ బాధ్యత గురించి ఆలోచిస్తుంటే, నామీద నాకే ఆశ్చర్యమేస్తుంది. ఈ రోజు నాకు ఇంకొకటి అర్థమైంది. నిజాయితీగా సంపాదించేవాడికి కచ్చితంగా కుటుంబ బాధ్యత గుర్తుంటుంది. ప్రస్తుతం నా కుటుంబం ఉన్న పరిస్థితుల్లో నా నుంచి ఎటువంటి ఆర్థిక ఆసరా, అవసరం లేకున్నా, నాకు మాత్రం ఏదో చేయాలని ఉంది. రెండు రోజుల ముందు ‘నాన్నకు చొక్కా తీస్కోవాలి’ అని అమ్మ అన్నయ్యతో అన్నట్లు గుర్తు. అవును. తీస్కోవాలి. అమ్మా నాన్నలకు చెరో జత బట్టలు తీస్కోవాలని నా మనసు నిర్ణయించేసుకుంది. ఇప్పుడు వాతావరణం ప్రశాంతంగా అనిపిస్తోంది. మనసుకు కాస్త గర్వంగా ఉంది. నేను దిగాల్సిన స్టాప్ కూడా వచ్చినట్లుంది. కానీ నా జేబులో పర్సే కనిపించట్లేదు. కంగారుగా అటూ ఇటూ చూశాను. బస్సు దిగిన ఒక వ్యక్తి నాకంటే కంగారుగా నడుస్తూ వెళ్లిపోతుండటం చూశాను. ఆ వ్యక్తి నా పర్స్ తీశాడో లేదోనన్న అనుమానంతో వెళ్తున్న బస్‌ను ఆపాలో లేదో అర్థం కాలేదు. కానీ డబ్బు పర్స్‌తో పాటు పోయిందని మాత్రం అర్థమైంది. నా మొట్టమొదటి జీతంతో అమ్మా నాన్నలకిచ్చే చిన్న ఆనందాన్ని కోల్పోయిన నా దురదృష్టానికి బాధేస్తోంది. నాకు దొరికిన డబ్బులను పోగొట్టుకున్న వారి బాధ ఇప్పుడు తెలుస్తోంది. ఎంతైనా ఉన్నదాని విలువ పోయినప్పుడేగా తెలిసేది. పోయిన నా డబ్బు విలువ నా కంటే బాగా ఇంకెవరికీ తెలీదు. కానీ నా దుఃఖం మాత్రం పెరుగుతూ... ఉంది. బస్ డ్రైవర్ సడన్ బ్రేక్ వేయడం వల్ల అనుకుంటా, నేను కూడా సడన్‌గా నిద్ర నుండి లేచాను. నేను దిగాల్సిన స్టాప్ వచ్చింది. నాకు తెలీకుండానే నా చేయి ఆవేశంతో జేబు దగ్గరికి చేరింది. పర్స్ ఉందని నా మెదడుకు సమాచారం అందగానే ఆనందం నా మొహం మీదకి చేరింది. ఆనందం అద్భుతమైంది. ముఖ్యంగా దుఃఖం తర్వాత వచ్చే ఆనందం వెలకట్టలేనిది. అనుభవించేవాడు తప్ప ఎవ్వరూ వెలకట్టలేరు. బస్సు దిగిన నేను ఎదురుగా కనిపించిన షాపింగ్ మాల్‌లోకి నడక ప్రారంభించాను, నా చిన్న ఆనందాన్ని తీర్చుకోవడానికి! దుఃఖం తర్వాత వచ్చే ఆనందం వెలకట్టలేనిది. అనుభవించేవాడు తప్ప ఎవ్వరూ వెలకట్టలేరు. - శ్రీనాథ్ జెల్లా