సాక్షి, న్యూఢిల్లీ : వత్తుగా వస్తున్న మూత్రాన్ని ఆపుకోలేక ఎదురుగా తడిగా కనిపించిన గోడ మీదనో, పక్కనున్న పాత గోడమీదనో విసురుగా వదిలేయడం, రొమ్ము విరుచుకొని పహల్వాన్‌లా చేతులు ఊపుకుంటూ ట్రాఫిక్ మధ్య నుంచి దర్జాగా రోడ్డు ఆవలి పక్కకు నడిచిపోవడం, ఎర్రగా నోరు పండేలా పాన్ నవులుతూ తూ...తూ....అంటూ ఎక్కడ పడితే అక్కడే ఊసేస్తూ ముందుకు వెళ్లడం, రాంగ్ రూట్‌లో బైక్ నడపడం, బాస్ పేరు చెప్పి కానిస్టేబుల్‌ను బురుడీ కొట్టించడం, ఏందిర బై పరేషాన్! అంటూ దోస్తుల పలకరింపులు, దా, బీరేద్దారాం! అన్న పిలుపులు, బీరు బాటిళ్ల మధ్య బూతు జోకులు, తెల్లవారక ముందే నిద్రలేపే మందిర్, మసీదు మైకులు, పాల వాడి గోల, పైడితల్లి డాన్సులు.. ఈ దృశ్యాలును ఎవరైన గుర్తు చేశారంటే వారు హైదరాబాద్ గురించిగానీ, హైదరాబాద్ పేరుతో వచ్చిన ‘హైదరాబాద్ బ్లూస్’ సినిమా గురించిగానీ చెబుతున్నారునుకోవాలి.
పక్కా హైదరాబాదీ నగేశ్ కుకునూర్ తీసిన ‘హైదరాబాద్ బ్లూస్’ సినిమా విడుదలై సరిగ్గా ఈ రోజుకు 20 ఏళ్లు. ఇంగ్లీషు, హిందీ, తెలుగు మూడు భాషల్లో తీసిన ఈ సినిమా ప్రింట్లు అటు ముంబైలో, ఇటు హైదరాబాద్‌లో 1998, జూలై 18వ తేదీన విడుదలయ్యాయి. 20 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఈ రోజు రాత్రికి ముంబైలోని పీవీఆర్ సినిమాలో ‘దృశ్యం ఫిల్మ్స్’ సంస్థ హైదరాబాద్ బ్లూస్ ప్రదర్శనను ప్రత్యేకంగా ఏర్పాటు చేసింది. ప్రస్తుతం ‘సిటీ ఆఫ్ డ్రీమ్స్’ పేరుతో వెబ్ సిరీస్‌ను తీయడంలో బిజీగా ఉన్న నగేష్ కుకునూర్ ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు. ప్రేక్షకులు అడిగిన ప్రశ్నలకు జవాబు ఇవ్వనున్నారు.
అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్న నగేష్ ‘పల్ప్ ఫిక్షన్’ అనే హాలీవుడ్ చిత్రాన్ని చూసి ఎంతో స్ఫూర్తి పొందారు. అదే స్ఫూర్తితో అదే సరళిలో తాను పుట్టుపెరిగిన హైదరాబాద్ పరిసరాలు, పరిస్థితుల మధ్య సినిమా తీయాలనుకున్నారు. అప్పటికే సినిమాలో పండిపోయిన ఒకరిద్దరు ప్రముఖులు ఆయన కథను తిరస్కరించారు. అప్పటికే కొంత మంది చేతుల్లో తెలుగు సినీ పరిశ్రమ చిక్కుకొని ఉండడంతో ‘ఎన్ ఇండిపెండెంట్ మూవ్‌మెంట్ ఇన్ ఇండియన్ సినిమా’కు తానే శ్రీకారం చుట్టాలనుకున్నారు. పెద్ద ఖర్చు, పెద్ద నటులు లేకుండా, సింపుల్‌గా సినిమా తీయాలనుకున్నారు. తాను హీరోగా, రాజశ్రీ నాయర్ హీరోయిన్‌గా మిత్రులు, తెలిసిన వారు ఇతర నటీనటులుగా సినిమా స్క్రిప్టు రాసుకొని స్వీయ దర్శకత్వంలో సినిమా ప్రారంభించారు. కేవలం 17 రోజుల్లో సినిమా షూటింగ్‌ను పూర్తి చేశారు. మొత్తం సినిమా పూర్తవడానికి ఖర్చయింది కూడా 17 లక్షల రూపాయలే.
సినిమాలో 91 ఆడియో బూతులు ఉన్నాయి. సెన్సార్ బోర్డు వాటిని కత్తిరించాలని సూచించిందట. బ్లూస్‌లోనే పెద్ద బూతుందని కూడా వాదించిందట. తాను హైదరాబాద్‌లోని సహజమైన పరిస్థితులను సహజంగా సినిమాలో చూపించాలనుకున్నానని, ఈ బూతులు కూడా నగర జీవితంలో చాలా సహజంగా ఉన్నాయని నగేశ్ వాదించారట. చివరకు కేవలం మూడు ఆడియో జోకుల కట్‌తోని సినిమాను విడుదల చేయించుకోగలిగారు. అందరికి అర్థంకాని బూతులను అలాగే వదిలేశారు. సినిమాకు మంచి పేరే కాదు, మంచి కనెక్షన్లు కూడా వచ్చాయి. అయితే నగేశ్‌కు మంచి అవకాశాలు మాత్రం రాలేదు. తెలుగువారెవరూ ఆయనతో సినిమా తీయడానికి ముందుకు రాలేదు. ‘హైదరాబాద్ బ్లూస్’ సినిమా ఏదో కుర్రకారుకు నచ్చి అనుకోకుండా హిట్టయింది తప్పా! అంటూ పెదవి విరిచారు. ఆ తర్వాత అరకొరగా వచ్చిన బాలీవుడ్ అవకాశాలను ఉపయోగించుకొని, ఎక్కువ వరకు స్వీయ నిర్మాణాన్ని నమ్ముకొని బాలీవుడ్‌లో స్థిర పడ్డారు. ఈ రంగంలో 20 ఏళ్ల పాటు కొనసాగడం ఆశ్చర్యంగానే ఉందని ఆయన ఈ రోజు ఓ జాతీయ మీడియాతో వ్యాఖ్యానించారు.
దేవున్నిగానీ, దెయ్యాన్నిగానీ, మూఢాచారాలనుగానీ గుడ్డిగా నమ్మవద్దని, అన్నింటిని ప్రశ్నించాలనే తాత్విక చింతన కలిగిన ‘హైదరాబాద్ బ్లూస్’ హీరో నగేశ్ కుల, మతాలు, కట్నాలు పెళ్లికి అడ్డంకి కాకూడని వాదిస్తాడు. అంతకంటే అసలు పరిచయం లేని వ్యక్తులను, వారి వ్యక్తిత్వం గురించి తెలుసుకోకుండా ఎలా పెళ్లి చేసుకుంటారని ప్రశ్నిస్తాడు. హీరోయిన్‌తో డేటింగ్ చేస్తున్నప్పుడు కూడా ఇవే వాదనలను తీసుకొస్తాడు. ఆమెకు చిర్రెత్తుకొచ్చి ‘మీ అమెరికా అబ్బాయిలకు కావాల్సింది పెళ్లాం కాదు. ఇంట్లో అన్ని పనులు చేసి పెట్టే పని మనిషి, రాత్రి పక్కలోకి సెక్స్‌నిచ్చే యంత్రం, పిల్లలను పోషించే ఆయా మాత్రమే’ అంటూ నిందిస్తుంది. అమెరికాలో పని మనిషికి, పిల్లలను సాకే ఆయాలకు డబ్బులు ఎక్కువ ఇవ్వాల్సి వస్తుందన్న దూర దృష్టిలో భారత్‌కు వచ్చి పెళ్లిళ్లు చేసుకుంటారని పరోక్షంగా విమర్శిస్తుంది. అమెరికాలో అలాంటి వారు ఉన్నారుకానీ, తాను అలాంటి వాడిని కాదని నగేశ్ నయానా, భయానా బతిలాడుకుంటాడు. చివరకు ఎలాగో పెళ్లి చేసుకుంటాడు.
హైదరాబాద్ బ్లూస్‌లో చూపిన సామాజిక పరిస్థితులు నేటికి కూడా ఉన్నాయి. నగేశ్ ప్రశ్నలూ ఇప్పటికీ సజీవమే. రోడ్లు విస్తరించినా, ఎత్తైన భవనాలు వచ్చినా, మెట్రో రైలు నడుస్తున్న పరిసరాల పట్ల నగర వాసుల ప్రవర్తనలో పెద్దగా మార్పేమి లేదు. హైదరాబాద్ బ్లూస్‌ను ఇప్పుడు చూసినా ఇప్పటి పరిస్థితలకు తగ్గట్టుగా తీశారు అనిపిస్తుంది. సందేహం కలిగితే మరోసారి చూడొచ్చు. అదే ‘బ్లూస్’. నగేశ్ కుకునూరు ఆ పేరును రంగుల అర్థంలో వాడారేమోగానీ ‘బ్లూస్’ అంటే ఓ విషాధ గీతం.
Comments
Please login to add a commentAdd a comment