nagesh kukunoor
-
'పాతాళ్ లోక్'తో ట్రెండ్ అవుతున్న నగేశ్ కుకునూర్ ఎవరో తెలుసా..?
పాతాళ్ లోక్-2 (Paatal Lok-2) వెబ్ సిరీస్ ఓటీటీలో ట్రెండ్ అవుతుంది. క్రైమ్ థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే వారు ఈ సిరీస్‌కు ఫిదా అవుతున్నారు. 2020లో వచ్చిన మొదటి సీజన్‌కు చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. జనవరి 17న రెండో సీజన్ విడుదలైంది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో టాప్ టెన్‌లో ఈ సిరీస్ కొనసాగుతోంది. అనుష్క శర్మ నిర్మించిన ఈ వెబ్ సిరీస్‌లో ఓ కేసును దర్యాప్తు చేసే పోలీసు అధికారి హాథీరామ్ చౌదరి పాత్రకు మంచి పేరొచ్చింది. మన తెలుగు దర్శకుడు, నటుడు నగేష్ కుకునూర్ (Nagesh Kukunoor) కూడా ఇందులో ఓ బిజినెస్ మ్యాన్‌గా కనిపించాడు. ఆయన పాత్రకు కూడా మంచి గుర్తింపు దక్కుతోంది. దీంతో ఆయన గురించి నెటిజన్లు తెగ వెతికేస్తున్నారు.హైదరాబాద్‌లో జన్మించిన నగేశ్ కుకునూర్.. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో కెమికల్ ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేశారు. ఉన్నత విద్యనభ్యసించేందుకు యునైటెడ్ స్టేట్స్‌లోని అట్లాంటా వెళ్లి తన చదువు పూర్తి అయిన తర్వాత కొన్నాళ్లు అక్కడే ఉద్యోగం చేశారు. తనకు ఉద్యోగం కంటే సినిమాలపై ఉన్న ఆసక్తితో అక్కడే నటన, దర్శకత్వ విభాగాల్లో శిక్షణ తీసుకున్నారు. అక్కడే ఉంటూ ఉద్యోగం ద్వారా సంపాధించిన డబ్బుతో 1998లోనే 'హైదరాబాద్ బ్లూస్' అనే ఆంగ్ల చిత్రానికి తొలిసారి దర్శకత్వం వహించి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా నుండి స్వదేశానికి తిరిగి వస్తున్న భారతీయుల గురించి అట్లాంటాలో వ్రాసిన స్క్రిప్ట్ ఆధారంగా రూపొందించబడింది.హైదరాబాద్ బ్లూస్ (1998), రాక్‌ఫోర్డ్ (1999), ఇక్బాల్ (2005), దోర్ (2006), ఆశేయిన్ (2010), లక్ష్మి (2014), ధనక్ (2016) చిత్రాలకు గాను ఏడు అంతర్జాతీయ అవార్డులతో పాటు రెండు జాతీయ చలనచిత్ర అవార్డులు అందుకున్నారు. కీర్తి సురేశ్ ప్రధాన పాత్రలో ‘గుడ్‌లక్ సఖి’ అనే తెలుగు చిత్రాన్ని కూడా ఆయన డైరెక్ట్ చేశారు. నగేశ్ ఇప్పటికే అక్షయ్ కుమార్, అయేషా టాకియా,జాన్ అబ్రహం, సోనాల్ సెహగల్ వంటి బాలీవుడ్ స్టార్స్‌ను డైరెక్ట్ చేశారు.‘పాతాళ్ లోక్-2’లో నగేశ్ వ్యాపారవేత్త పాత్రలో మెప్పించారు. అనుష్క శర్మ మొదటిసారి నిర్మాతగా ఈ వెబ్ సిరీస్ రంగంలోకి అడుగుపెట్టారు. ఫస్ట్ సీజన్‌కు వచ్చిన రెస్పాన్స్ రెండో సీజన్‌కు కూడా వచ్చింది. ఇందులో జైదీప్ అహ్లావత్, నగేశ్ కుకునూర్, గుల్ పనాగ్, ఇశ్వక్ సింగ్ ముఖ్యపాత్రలు పోషించారు. అనివాష్ అరుణ్ దర్శకత్వం వహించారు.చదవండి: సైఫ్ అలీ ఖాన్‌పై దాడి.. అసలైన నిందితుడి అరెస్టు -
‘గుడ్ లక్ సఖి’ వేడుకకి నేను ముఖ్య అతిథిగా రాలేదు: రామ్‌చరణ్
‘‘గుడ్ లక్ సఖి’ చిన్న సినిమా అని శ్రావ్య అనడం నాకు ఇబ్బందిగా అనిపించింది. మహానటి కీర్తీ సురేష్, నగేష్ సార్ వంటి జాతీయ అవార్డు గ్రహీతలు, దేవిశ్రీ ప్రసాద్‌గారు ఈ సినిమాకి పనిచేసినప్పుడు ఇది చిన్న సినిమా ఎలా అవుతుంది? చాలా పెద్ద సినిమా’’ అని హీరో రామ్‌చరణ్ అన్నారు. కీర్తీ సురేష్ ప్రధాన పాత్రలో నగేష్ కుకునూర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘గుడ్ లక్ సఖి’. ఆది పినిశెట్టి, జగపతి బాబు, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రలు పోషించారు. నిర్మాత ‘దిల్’రాజు సమర్పణలో వర్త్ ఏ షాట్ మోషన్ ఆర్ట్స్ బ్యానర్‌పై సుధీర్ చంద్ర పదిరి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 28న విడుదలవుతోంది. హైదరాబాద్‌లో జరిగిన ప్రీ రిలీజ్ వేడుకలో రామ్‌చరణ్ మాట్లాడుతూ–‘‘గుడ్ లక్ సఖి’ వేడుకకి నేను ముఖ్య అతిథిగా రాలేదు. మా నాన్నగారికి(చిరంజీవి) ఒక మెసెంజర్‌గా వచ్చాను. ఈ వేడుకలో ఆయన లేని లోటు తీర్చలేనిది.. కానీ నేను ఇక్కడికొచ్చినందుకు ఎంతో ఆనంద పడుతున్నాను.. గర్వపడుతున్నాను. సుధీర్, కావ్యలు ఈ స్థాయికి రావడం మామూలు విషయం కాదు. నగేష్ సార్ ‘ఇక్బాల్’ సినిమా చూసి చాలా స్ఫూర్తి పొందాను. ప్రస్తుతం సినిమా అన్నది తెలుగు, హిందీ, తమిళ్ అనే ఏ సరిహద్దులు లేకుండా రాజమౌళిగారి వల్ల ఇండియన్ సినిమా అనే పేరు తెచ్చుకుంది. ‘గుడ్ లక్ సఖి’ కి ఎక్కువ మంది మహిళలు పనిచేశారని మళ్లీ మళ్లీ చెప్పొద్దు. ఇండస్ట్రీలో మహిళలు, పురుషులు అనే తేడా ఉండకూడదు.. అందరూ ఒక్కటే. ‘అజ్ఞాతవాసి’ లో కీర్తీ సురేష్ నటన బాగుందనుకున్నా. ‘మహానటి’ చూశాక ఆమె అభిమాని అయ్యాను. ‘గుడ్ లక్ సఖి’ లాంటి స్ఫూర్తిదాయక కథలు ఆమె ఇంకా చేయాలి. ఈ సినిమాకి సోలో రిలీజ్ కుదరడం అదృష్టం. మా అభిమానులతో పాటు కీర్తి ఫ్యాన్స్ కూడా ఈ సినిమాని చూడండి.. ఒక మంచి సినిమాని ఆదరించండి.. ఇలాంటి సినిమాలు మళ్లీ మళ్లీ రావాలి’’ అన్నారు. ‘దిల్’ రాజు మాట్లాడుతూ–‘‘గుడ్ లక్ సఖి’ చిత్రానికి తొలుత ‘బ్యాడ్ లక్ సఖి’ అనే టైటిల్ అనుకున్నారు. ఈ విషయాన్ని దేవిశ్రీ చెప్పాడు. కథ విన్నాక మంచి కాన్సెప్ట్ అనిపించి సపోర్ట్ చేయాలనిపించింది. అయితే టైటిల్ మార్చమని చెప్పడంతో ‘గుడ్ లక్ సఖి’ అని పెట్టారు’’ అన్నారు. (మరిన్ని ఫొటోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి) కీర్తీ సురేష్ మాట్లాడుతూ–‘‘మహానటి’ లాంటి సీరియస్ ఫిల్మ్ తర్వాత సరదాగా ఉండే సినిమా చేయాలని ‘గుడ్ లక్ సఖి’ కి సైన్ చేశా. ఇండస్ట్రీలో నాకున్న మంచి ఫ్రెండ్ జగపతిబాబు సార్. చరణ్‌గారి ‘ఆర్ఆర్ఆర్’ కోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్నా. మీరందరూ ‘గుడ్ లక్ సఖి’ చిత్రాన్ని ఆదరించాలి’’ అన్నారు. నగేష్ కుకునూర్ మాట్లాడుతూ–‘‘నేను తెలుగువాణ్నే. హైదరాబాదీ అయినందుకు గర్వపడుతున్నా. ‘హైదరాబాద్ బ్లూస్’ తర్వాత ‘గుడ్ లక్ సఖి’ వంటి పక్కా తెలుగు సినిమా చేయడానికి ఇన్నేళ్లు పట్టింది. ఈ సినిమాని వినోదాత్మకంగా తెరకెక్కించడానికి దర్శకులు కె.విశ్వనాథ్, జంధ్యాలగార్లే నాకు స్ఫూర్తి’’ అన్నారు. ‘‘గుడ్ లక్ సఖి’ కోసం యూనిట్ బాగా కష్టపడ్డారు.. అందరూ ఆదరించాలి’’ అన్నారు సుధీర్ చంద్ర పదిరి. ఈ వేడుకలో చిత్ర సహ నిర్మాత శ్రావ్య వర్మ, నిర్మాత అట్లూరి నారాయణరావు పాల్గొన్నారు. -
కీర్తీ సురేష్.. ‘గుడ్ లక్ సఖి’
'మహానటి'తో జాతీయ అవార్డు అందుకున్న హీరోయిన్ కీర్తి సురేశ్. ఆమె తాజాగా నటిస్తోన్న లేడీ ఓరియంటెడ్ చిత్రం "గుడ్ లక్ సఖి". ఒక పల్లెటూరు నుంచి వచ్చిన అమ్మాయి.. దేశం గర్వించే షూటర్‌గా ఎలా తయారైందన్న అంశంతో ఈ చిత్రం రూపుదిద్దుకుంది. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్ విశేషంగా ఆకర్షిస్తోంది. గ్లామర్‌కు దూరంగా, పల్లెటూరి పడుచు పిల్ల పాత్రలో కీర్తి ఒదిగిపోయారు. ఆరు మిలియన్లకు పైగా వ్యూస్‌తో దూసుకుపోతున్న సఖి టీజర్ ప్రస్తుతం యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో నిలిచింది. ఆమె నటనకు మరోసారి ఫిదా అవుతున్న అభిమానులు కీర్తికి మరో జాతీయ అవార్డు ఇవ్వాల్సిందేనంటున్నారు. 'లక్ అనేది లేదు', 'మన రాత మనమే రాసుకోవాల' అనే డైలాగులు నిజ జీవితంలోనూ ఇన్స్పిరేషనే అని చెప్తున్నారు. (గుడ్‌లక్ సఖి.. టీజర్ వచ్చేసింది) ఈ సినిమాలో కీర్తిని ప్రేమించే అబ్బాయి పాత్రలో ఆది పినిశెట్టి, ఆమెకు శిక్షణనిచ్చే కోచ్ పాత్రలో జగపతి బాబు నటిస్తున్నారు. ఓ చిన్న షెడ్యూల్ మినహా సినిమా మొత్తం పూర్తయింది. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రం నిర్మాణానంతర కార్యక్రమాలు ముగింపు దశలో ఉన్నాయి. నాగేశ్ కుకునూర్ దర్శకత్వం వహిస్తుండగా రాక్‌స్టార్ దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ‘దిల్’రాజు సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని వర్త్ ఏ షాట్ మోషన్ ఆర్ట్స్ బ్యానర్‌పై సుధీర్‌చంద్ర పాదిరి నిర్మిస్తున్నారు. కాగా ఆమె సాని కాయితం(పేడ పేపర్) అనే కొత్త సినిమా చేయబోతున్నట్లు శనివారం వెల్లడించారు. శనివారం ఈ సినిమా టైటిల్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఇందులో కీర్తి వీపు వెనక వేట కొడవలి పెట్టుకుని, ఎడమ చేతిలో తుపాకీ పట్టుకుని నాటు పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. (ఆ లవ్ లెటర్‌ను దాచుకున్నా: కీర్తి సురేష్) -
గుడ్‌లక్ సఖి.. టీజర్ వచ్చేసింది
మహానటి ఫేం కీర్తి సురేశ్, ఆది పినిశెట్టి ప్రధాన పాత్రల్లో స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న గుడ్‌లక్ సఖీ అఫీషియల్ టీజర్ వచ్చేసింది. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని చిత్రబృందం శనివారం టీజర్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చింది. 'హైదరాబాద్ బ్లూస్, డోర్, ఇక్బాల్ సినిమాలతో క్రియేటివ్ డైరెక్టర్‌గా జాతీయస్థాయిలో గుర్తింపును తెచ్చుకున్న నగేష్ కుకునూర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. సీనియర్ నటి రమాప్రభ, రాహుల్ రామకృష్ణ, తదితరులు నటిస్తున్నారు. కీర్తి సురేశ్ అచ్చమైన పల్లెటూరి పిల్లగా కనిపిస్తూ టీజర్లో ఆకట్టుకుంటుంది. ఒక పల్లెటూరు నుంచి వచ్చిన అమ్మాయి.. దేశం గర్వించే షూటర్‌గా ఎలా తయారైందన్న అంశంతో చిత్రం రూపుదిద్దుకుంది. కీర్తిని జాతీయ షూటర్‌గా తయారు చేసే కోచ్‌గా జగపతిబాబు కీలకపాత్రలో నటించారు. టీజర్లో కీర్తి సురేశ్ డైలాగ్ డెలివరీ ఆకట్టుకుంటుంది. ఈ చిత్రానికి రాక్‌స్టార్ దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. దిల్‌రాజు సమర్పణలో వార్త్ షాట్ మోషన్ ఆర్ట్ ప్రొడక్షన్లో తెరకెక్కుతున్న గుడ్‌లక్ సఖీ చిత్రానికి సుధీర్ చంద్ర పాదిరి, శ్రావ్య వర్మ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. -
ఎందుకొచ్చావురా బాబూ అనుకోకూడదు
‘‘సినిమా రాయడాన్ని పాత్రలు తయారు చేయడాన్ని చాలా ఎంజాయ్ చేస్తాను. ఫస్ట్ కాపీ సిద్ధమైనప్పుడు సాంకేతిక నిపుణులతో కలసి సినిమా చూస్తాను. నా సినిమాని ఫైనల్‌గా చూసేది కూడా అప్పుడే. ఆ తర్వాత జరిగేదాన్ని పట్టించుకోను. సినిమా ఎలా ఆడుతుంది? కలెక్షన్లు, రివ్యూలు పెద్దగా పట్టించుకోను’’ అన్నారు దర్శకుడు నగేశ్ కుకునూర్. ‘హైదరాబాద్ బ్లూస్’తో దర్శకుడిగా మారిన ఈ తెలుగు దర్శకుడు కొన్ని హిందీ చిత్రాలకు దర్శకత్వం వహించారు. 22 ఏళ్ల తర్వాత తెలుగులో తొలి చిత్రంగా ‘గుడ్ లక్ సఖీ’ని తెరకెక్కిస్తున్నారు. ఆది పినిశెట్టి, కీర్తీ సురేశ్, జగపతిబాబు ముఖ్య పాత్రధారులు. సుధీర్ చంద్ర నిర్మాణంలో తెరకెక్కుతోంది. ఈ చిత్రవిశేషాలను నగేశ్ కుకునూర్ పంచుకున్నారు. ► నేను పక్కా హైదరాబాదీ. నేను దాచుకున్న సేవింగ్స్‌తో నా తొలి సినిమా ‘హైదరాబాద్ బ్లూస్’ చేశాను. నాన్న ప్రొడక్షన్ చూసుకున్నారు. అమ్మ కుక్, ఆంటీ కాస్ట్యూమ్స్ చూసుకున్నారు. మొదటిసారి స్క్రీన్ మీద నా పేరు చూసుకోగానే నేను దర్శకుడినయిపోయాను అని గర్వంగా ఫీల్ అయ్యాను. ‘హైదరాబాద్ బ్లూస్’ చిత్రాన్ని అమెరికాలో ఫిల్మ్ ఫెస్టివల్‌కు పంపుదాం అనుకుని ప్రింట్లను సూట్‌కేస్‌లో అమెరికా తీసుకెళ్లాను. అనుకోకుండా ముంబై ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శించాం. ప్రేక్షకులకు నచ్చింది. అక్కడే ఉండిపోయి సినిమాలు చేస్తున్నాను. ► నేను హిందీ రాయగలను, మాట్లాడగలను. అయితే తెలుగు మాట్లాడతాను. తెలుగు సినిమా చేయాలంటే భాష మీద పూర్తి అవగాహన ఉండాలనుకునేవాణ్ణి. నాకున్న పెద్ద చాలెంజ్ తెలుగు సినిమా చేయడం. హిందీలోనే ఉండకుండా ఇక్కడికెందుకు వచ్చావురా బాబూ అని ప్రేక్షకులు అనుకోకూడదు. ► కీర్తీ సురేష్‌తో వర్క్ చేయడం బెస్ట్ ఎక్స్పీరియన్స్. ఇందులో మేకప్ లేకుండా యాక్ట్ చేసింది. ఇప్పుడు చేస్తున్న ఈ సినిమాకి టైటిల్ ‘గుడ్‌లక్ సఖీ’ అనుకుంటున్నాం. 60 శాతం షూటింగ్ చేశాం. 25 రోజుల షూటింగ్ ఉంది. నాటకాలు వేసే కంపెనీలో పనిచేస్తుంటాడు ఆది. జగపతిబాబు కోచ్ పాత్రలో కనిపిస్తారు. ► నాకు ఇద్దరు దర్శకులంటే విపరీతంగా ఇష్టం. టాలీవుడ్లో కె. విశ్వనాథ్‌గారు, బాలీవుడ్లో రిషికేశ్ ముఖర్జీ. ఈ సినిమాలో ముఖర్జీగారి స్టయిల్ కనిపిస్తోంది. ఇది ఆడియన్స్ టేస్ట్‌కి నచ్చుతుందా లేదా? అని నేను చెప్పలేను. ఇప్పటికీ ఆడియన్స్‌కు ఏం నచ్చుతుందో నాకు తెలియదు. ► నా సినిమా నాకు బిడ్డలాంటిది. కథను తయారు చేయడానికి మానసికంగా, ఎమోషనల్‌గా చాలా శ్రమిస్తాం. ఎవ్వరైనా వచ్చినప్పుడు మీ బిడ్డ బాలేదు అంటే ఎవరికి నచ్చుతుంది? దర్శకులు విమర్శలను తీసుకోవాలి అంటారు? ఎందుకు తీసుకోవాలి? అది విమర్శ కాదు.. వాళ్ల అభిప్రాయం? నీ అభిప్రాయం ఎంత కరెక్ట్ అయినా నేను వినదలచుకోలేదు. ఎవరి గురించైనా మంచి ఉంటే చెప్పండి. ఏదైనా చెడు చెప్పాలనుకుంటే మీలోనే ఉంచుకోండి. దానికి ఎటువంటి విలువ లేదు. ► నా సినిమాలన్నీ నాకు నచ్చినట్టుగానే తీస్తాను. కొన్ని వర్క్ అవుతాయి.. కొన్ని అవ్వవు. పెద్ద పెద్ద స్టార్స్‌తో చేయాలని పరుగులు పెట్టను. నాకు స్టోరీ నరేషన్ ఇవ్వడం రాదు. రాసింది నా యాక్టర్స్‌కి ఇస్తాను. ‘మీరు అర్థం చేసుకోండి. దాన్ని మనం డిస్కస్ చేసుకుందాం’ అని చెబుతుంటాను. నేను సినిమాలు ఎక్కువగా చూడను. ట్రెండ్‌ని పట్టించుకోను. అప్డేట్ కాను. అప్డేట్ అవాల్సిన అవసరం కూడా లేదు. అప్డేట్ అయితే ప్రేక్షకులకు ఎలాంటి సినిమా నచ్చుతుందో దానికి తగ్గట్టు ఓ సినిమా చేస్తాం. ఆ లోపు వాళ్ల ఇష్టాలు మారిపోవచ్చు. -
తెలుగులో తొలిసారి
‘హైదరాబాద్ బ్లూస్’, ‘ఇక్బాల్’, ‘లక్ష్మీ’ వంటి చిత్రాల ద్వారా బాలీవుడ్లో మంచి పేరున్న దర్శకుల్లో ఒకరిగా నిలిచారు ప్రముఖ దర్శకుడు నగేశ్ కుకునూర్. దాదాపు 20 ఏళ్లుగా హిందీ సినిమాలకే పరిమితమైన ఈ హైదరాబాదీ తెలుగులో మొదటిసారి ఓ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. కీర్తీ సురేశ్, ఆది పినిశెట్టి, జగపతిబాబు ప్రధాన తారాగణంగా ఈ సినిమా రూపొందుతోంది. స్పోర్ట్స్ రొమాంటిక్ కామెడీ జోనర్లో ఈ చిత్రం తెరకెక్కుతోంది. వికారా బాద్, పూణేల్లో షూటింగ్ జరుగుతోంది. ఇంకా టైటిల్ పెట్టని ఈ చిత్రం ఇప్పటికే నాలుగు షెడ్యూల్స్‌ను పూర్తి చేసుకుంది. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 2019లో విడుదల చేయడానికి దర్శక–నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. వర్త్ ఏ షార్ట్ మోషన్ పోస్టర్ పతాకంపై ఈ చిత్రాన్ని సుధీర్ చంద్ర నిర్మిస్తుండగా, ప్రముఖ డిజైనర్ శ్రావ్య వర్మ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇ. శివప్రకాశ్ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా, ‘తను వెడ్స్ మను’ ఫేమ్ చిరంతన్ దాస్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. జాతీయ అవార్డ్ గ్రహీత శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ చేస్తున్న ఈ చిత్రంలో రాహుల్ రామకృష్ణ తదితరులు నటిస్తున్నారు. -
‘హైదరాబాద్ బ్లూస్’ ఇంకా అలాగే ఉందా!
సాక్షి, న్యూఢిల్లీ : వత్తుగా వస్తున్న మూత్రాన్ని ఆపుకోలేక ఎదురుగా తడిగా కనిపించిన గోడ మీదనో, పక్కనున్న పాత గోడమీదనో విసురుగా వదిలేయడం, రొమ్ము విరుచుకొని పహల్వాన్‌లా చేతులు ఊపుకుంటూ ట్రాఫిక్ మధ్య నుంచి దర్జాగా రోడ్డు ఆవలి పక్కకు నడిచిపోవడం, ఎర్రగా నోరు పండేలా పాన్ నవులుతూ తూ...తూ....అంటూ ఎక్కడ పడితే అక్కడే ఊసేస్తూ ముందుకు వెళ్లడం, రాంగ్ రూట్లో బైక్ నడపడం, బాస్ పేరు చెప్పి కానిస్టేబుల్‌ను బురుడీ కొట్టించడం, ఏందిర బై పరేషాన్! అంటూ దోస్తుల పలకరింపులు, దా, బీరేద్దారాం! అన్న పిలుపులు, బీరు బాటిళ్ల మధ్య బూతు జోకులు, తెల్లవారక ముందే నిద్రలేపే మందిర్, మసీదు మైకులు, పాల వాడి గోల, పైడితల్లి డాన్సులు.. ఈ దృశ్యాలును ఎవరైన గుర్తు చేశారంటే వారు హైదరాబాద్ గురించిగానీ, హైదరాబాద్ పేరుతో వచ్చిన ‘హైదరాబాద్ బ్లూస్’ సినిమా గురించిగానీ చెబుతున్నారునుకోవాలి. పక్కా హైదరాబాదీ నగేశ్ కుకునూర్ తీసిన ‘హైదరాబాద్ బ్లూస్’ సినిమా విడుదలై సరిగ్గా ఈ రోజుకు 20 ఏళ్లు. ఇంగ్లీషు, హిందీ, తెలుగు మూడు భాషల్లో తీసిన ఈ సినిమా ప్రింట్లు అటు ముంబైలో, ఇటు హైదరాబాద్‌లో 1998, జూలై 18వ తేదీన విడుదలయ్యాయి. 20 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఈ రోజు రాత్రికి ముంబైలోని పీవీఆర్ సినిమాలో ‘దృశ్యం ఫిల్మ్స్’ సంస్థ హైదరాబాద్ బ్లూస్ ప్రదర్శనను ప్రత్యేకంగా ఏర్పాటు చేసింది. ప్రస్తుతం ‘సిటీ ఆఫ్ డ్రీమ్స్’ పేరుతో వెబ్ సిరీస్‌ను తీయడంలో బిజీగా ఉన్న నగేష్ కుకునూర్ ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు. ప్రేక్షకులు అడిగిన ప్రశ్నలకు జవాబు ఇవ్వనున్నారు. అమెరికాలో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్న నగేష్ ‘పల్ప్ ఫిక్షన్’ అనే హాలీవుడ్ చిత్రాన్ని చూసి ఎంతో స్ఫూర్తి పొందారు. అదే స్ఫూర్తితో అదే సరళిలో తాను పుట్టుపెరిగిన హైదరాబాద్ పరిసరాలు, పరిస్థితుల మధ్య సినిమా తీయాలనుకున్నారు. అప్పటికే సినిమాలో పండిపోయిన ఒకరిద్దరు ప్రముఖులు ఆయన కథను తిరస్కరించారు. అప్పటికే కొంత మంది చేతుల్లో తెలుగు సినీ పరిశ్రమ చిక్కుకొని ఉండడంతో ‘ఎన్ ఇండిపెండెంట్ మూవ్మెంట్ ఇన్ ఇండియన్ సినిమా’కు తానే శ్రీకారం చుట్టాలనుకున్నారు. పెద్ద ఖర్చు, పెద్ద నటులు లేకుండా, సింపుల్‌గా సినిమా తీయాలనుకున్నారు. తాను హీరోగా, రాజశ్రీ నాయర్ హీరోయిన్గా మిత్రులు, తెలిసిన వారు ఇతర నటీనటులుగా సినిమా స్క్రిప్టు రాసుకొని స్వీయ దర్శకత్వంలో సినిమా ప్రారంభించారు. కేవలం 17 రోజుల్లో సినిమా షూటింగ్‌ను పూర్తి చేశారు. మొత్తం సినిమా పూర్తవడానికి ఖర్చయింది కూడా 17 లక్షల రూపాయలే. సినిమాలో 91 ఆడియో బూతులు ఉన్నాయి. సెన్సార్ బోర్డు వాటిని కత్తిరించాలని సూచించిందట. బ్లూస్లోనే పెద్ద బూతుందని కూడా వాదించిందట. తాను హైదరాబాద్‌లోని సహజమైన పరిస్థితులను సహజంగా సినిమాలో చూపించాలనుకున్నానని, ఈ బూతులు కూడా నగర జీవితంలో చాలా సహజంగా ఉన్నాయని నగేశ్ వాదించారట. చివరకు కేవలం మూడు ఆడియో జోకుల కట్తోని సినిమాను విడుదల చేయించుకోగలిగారు. అందరికి అర్థంకాని బూతులను అలాగే వదిలేశారు. సినిమాకు మంచి పేరే కాదు, మంచి కనెక్షన్లు కూడా వచ్చాయి. అయితే నగేశ్‌కు మంచి అవకాశాలు మాత్రం రాలేదు. తెలుగువారెవరూ ఆయనతో సినిమా తీయడానికి ముందుకు రాలేదు. ‘హైదరాబాద్ బ్లూస్’ సినిమా ఏదో కుర్రకారుకు నచ్చి అనుకోకుండా హిట్టయింది తప్పా! అంటూ పెదవి విరిచారు. ఆ తర్వాత అరకొరగా వచ్చిన బాలీవుడ్ అవకాశాలను ఉపయోగించుకొని, ఎక్కువ వరకు స్వీయ నిర్మాణాన్ని నమ్ముకొని బాలీవుడ్లో స్థిర పడ్డారు. ఈ రంగంలో 20 ఏళ్ల పాటు కొనసాగడం ఆశ్చర్యంగానే ఉందని ఆయన ఈ రోజు ఓ జాతీయ మీడియాతో వ్యాఖ్యానించారు. దేవున్నిగానీ, దెయ్యాన్నిగానీ, మూఢాచారాలనుగానీ గుడ్డిగా నమ్మవద్దని, అన్నింటిని ప్రశ్నించాలనే తాత్విక చింతన కలిగిన ‘హైదరాబాద్ బ్లూస్’ హీరో నగేశ్ కుల, మతాలు, కట్నాలు పెళ్లికి అడ్డంకి కాకూడని వాదిస్తాడు. అంతకంటే అసలు పరిచయం లేని వ్యక్తులను, వారి వ్యక్తిత్వం గురించి తెలుసుకోకుండా ఎలా పెళ్లి చేసుకుంటారని ప్రశ్నిస్తాడు. హీరోయిన్‌తో డేటింగ్ చేస్తున్నప్పుడు కూడా ఇవే వాదనలను తీసుకొస్తాడు. ఆమెకు చిర్రెత్తుకొచ్చి ‘మీ అమెరికా అబ్బాయిలకు కావాల్సింది పెళ్లాం కాదు. ఇంట్లో అన్ని పనులు చేసి పెట్టే పని మనిషి, రాత్రి పక్కలోకి సెక్స్నిచ్చే యంత్రం, పిల్లలను పోషించే ఆయా మాత్రమే’ అంటూ నిందిస్తుంది. అమెరికాలో పని మనిషికి, పిల్లలను సాకే ఆయాలకు డబ్బులు ఎక్కువ ఇవ్వాల్సి వస్తుందన్న దూర దృష్టిలో భారత్‌కు వచ్చి పెళ్లిళ్లు చేసుకుంటారని పరోక్షంగా విమర్శిస్తుంది. అమెరికాలో అలాంటి వారు ఉన్నారుకానీ, తాను అలాంటి వాడిని కాదని నగేశ్ నయానా, భయానా బతిలాడుకుంటాడు. చివరకు ఎలాగో పెళ్లి చేసుకుంటాడు. హైదరాబాద్ బ్లూస్‌లో చూపిన సామాజిక పరిస్థితులు నేటికి కూడా ఉన్నాయి. నగేశ్ ప్రశ్నలూ ఇప్పటికీ సజీవమే. రోడ్లు విస్తరించినా, ఎత్తైన భవనాలు వచ్చినా, మెట్రో రైలు నడుస్తున్న పరిసరాల పట్ల నగర వాసుల ప్రవర్తనలో పెద్దగా మార్పేమి లేదు. హైదరాబాద్ బ్లూస్‌ను ఇప్పుడు చూసినా ఇప్పటి పరిస్థితలకు తగ్గట్టుగా తీశారు అనిపిస్తుంది. సందేహం కలిగితే మరోసారి చూడొచ్చు. అదే ‘బ్లూస్’. నగేశ్ కుకునూరు ఆ పేరును రంగుల అర్థంలో వాడారేమోగానీ ‘బ్లూస్’ అంటే ఓ విషాధ గీతం. -
అంతా ఒడుదొడుకుల ప్రయాణం...
సందర్భం నగేష్ కుకునూర్ బర్త్‌డే సినిమా అనేది మనసుకు స్వాంతన ఇవ్వాలి... మెదడులో ఆలోచన రేకెత్తించాలి. సృజనాత్మక దర్శకుడు నగేష్ కుకునూర్ స్ట్రాటజీ ఇదే. 16 ఏళ్లుగా ఆయనది ఇదే పంథా. అందుకే 12 సినిమాలే చేసినా జాతీయ స్థాయిలో ఓ గుర్తింపు సంపాదించుకున్నారు. నగేష్ స్వస్థలం హైదరాబాద్. తన గురించిన ప్రతి అంశం ఆసక్తికరమే. ఆయన కెరీర్, అభిప్రాయాలపై స్పెషల్ ఫోకస్... చదివింది కెమికల్ ఇంజినీరింగ్. కానీ, మనసు పడింది నటన, దర్శకత్వంపై. ఆ సినిమా పిచ్చితోనే విదేశంలో ఉద్యోగాన్ని సైతం వదిలేసుకుని, హైదరాబాద్‌లో అడుగుపెట్టారు నగేష్. అప్పుడంతా మాస్ మసాలా సినిమాల హవా నడుస్తోంది. తను కూడా ఆ గుంపులో గోవిందయ్య కాదలచుకోలేదు నగేష్. సమ్‌థింగ్ డిఫరెన్స్ చూపించాలనుకున్నారు. అలా, ‘వన్ కల్చర్ ఎట్ ఎ టైమ్’ అనే లఘు చిత్రం తీశారు. ఆ తర్వాత ‘హైదరాబాద్ బ్లూస్’కి శ్రీకారం చుట్టారు. 17 లక్షలు... 17 రోజులు మన సంస్కృతీ సంప్రదాయాలను ప్రతిబింబించే కథతో ‘హైదరాబాద్ బ్లూస్’ని తెరకెక్కించారు నగేష్. విదేశాల్లో తను సంపాదించిన డబ్బునంతా ఈ సినిమాకి పెట్టేశారు. 17 లక్షల బడ్జెట్‌తో 17 రోజుల్లో ‘హైదరాబాద్ బ్లూస్’ని స్వీయదర్శకత్వంలో రూపొందించడంతో పాటు నటించారు. 1998లో ఈ చిత్రం విడుదలై, భేష్ అనిపించుకుంది. ఈ సినిమాలోని సంభాషణలు ఇంగ్లిష్, తెలుగు, హిందీ భాషల్లో ఉంటాయి. సినిమా చూసినవాళ్లు ‘రియలిస్టిక్ మూవీ’ అని ప్రశంసించారు. ఈ జానర్లో కూడా సినిమా తీయొచ్చా అనుకున్నారు. రిస్క్ లేని జీవితం బాగుండదని... తొలి సినిమా విడుదల చేయడానికి చాలా కష్టాలు పడినప్పటికీ తన పంథా మార్చుకోలేదు నగేష్. హైస్కూల్ నేపథ్యంలో ‘రాక్‌ఫోర్డ్’ తీశారు. జంట నగరాల్లో అప్పుడప్పుడే పైకొస్తున్న నటీనటులను ఈ చిత్రంలో నటింపజేశారు. ఇది కూడా రియలిస్టిక్ సినిమానే. ఒకవైపు పక్కా కమర్షియల్ చిత్రాలు రాజ్యమేలుతున్న తరుణంలో, అందుకు భిన్నంగా పూర్తిగా సహజ చిత్రాలు తీయడానికి ఎంత ధైర్యం ఉండాలి? అని రెగ్యులర్ ఫిలిం మేకర్స్ అనుకున్నారు. కానీ, నగేష్ ఆలోచన ఒక్కటే. ‘‘ఇలాంటి సినిమాలే ప్రేక్షకులు చూస్తారని ఫిక్స్ అవ్వడానికి మనమెవరం? ఒకే రకం సినిమాలిస్తే, ప్రేక్షకుల ఆలోచనా పరిధి ఎలా పెరుగుతుంది? కొత్త సినిమాలు తీయకపోతే వాళ్లకి కొత్త కొత్త అనుభవాలు ఎలా కలుగుతాయి? ప్రేక్షకులకు మనం డిఫరెంట్ మూవీస్ ఇవ్వకపోతే ఎలా?’’ అంటారాయన. అది రిస్క్ కదా అంటే.. రిస్క్ లేని జీవితం ఏం బాగుంటుందని నవ్వేస్తారు. అందుకే, ఆ తర్వాత కూడా బాలీవుడ్ కాలింగ్, 3 దీవారేన్, ఇక్బాల్, డోర్.. ఇలా సామాజిక సృ్పహ ఉన్న చిత్రాలనే తీశారు. ఇటీవల తీసిన ‘లక్ష్మీ’ కూడా ఈ కోవకు చెందినదే. అమ్మాయిలను మాయలో పడేసి అమ్మేయడం, చిన్న వయసులోనే బలవంతంగా వేశ్యలుగా మార్చడం.. ఇలా సమాజంలో జరుగుతున్న అంశాలతో ఈ సినిమా తీశారు నగేష్. అభ్యంతరకర సన్నివేశాలు ఉన్నాయంటూ ‘సెన్సార్’పరంగా ఇబ్బందులు ఎదురయ్యాయి. ఎట్టకేలకు ‘లక్ష్మీ’ తెరకొచ్చింది. ప్రేక్షకులు, విశ్లేషకులు ‘భేష్’ అన్నారు. రీచార్జ్ కావాలి... పదహారేళ్లల్లో పన్నెండు సినిమాలే తీసినా, నగేష్‌కి మంచి పేరు వచ్చింది. కానీ, చిన్న చిత్రాల నిర్మాణానికి ఎన్నో వ్యయప్రయాసలు ఎదుర్కోవాలి. ఫైనాన్షియర్లు ముందుకు రారు. పంపిణీదారులూ ఇలాంటి రియలిస్టిక్ సినిమాలంటే పరారవుతారు. మరి.. ఇంకా ఇలాంటి సినిమాలు తీస్తుంటే, అలుపు రావడంలేదా అంటే.. ‘‘చాలా అలిసిపోయాను’’ అని నిజాయితీగా చెబుతారు నగేష్. ‘‘మన చేతిలో ఓ వివేకవంతమైన సినిమా ఉన్నా, అది ప్రేక్షకులకు దగ్గరవ్వాలంటే భారీ ఎత్తున ప్రచారం చేయాలి. దానికి బాగా ఖర్చు పెట్టాలి. ఎందుకులే అని వదిలేస్తే, పడిన కష్టమంతా వృథా అయిపోతోంది. కానీ, ఇవాళ పబ్లిసిటీ ప్రధానం కాబట్టి, ఖర్చు పెట్టక తప్పడంలేదు. ఓ కమర్షియల్ సినిమా తీసినప్పుడు ఉండేంత హాయి చిన్న బడ్జెట్, రియలిస్టిక్ సినిమాలకు ఉండదు. కానీ, నాకీ దారే బాగుంది. ప్రస్తుతానికి అలసిపోయినట్లనిపిస్తుంది. కానీ, ఓ కొత్త కథ తయారు చేయాలనే ఆలోచన రాగానే మళ్లీ రీచార్జ్ అయిపోతా. ఈ ఒడుదొడుకుల ప్రయాణం చాలా ఎగ్జైటింగ్‌గా ఉంది’’ అంటున్నారు నగేష్.