Ram Charan: Good Luck Sakhi Pre Release Event Highlights, Deets Inside - Sakshi
Sakshi News home page

Good Luck Sakhi: ‘గుడ్‌ లక్‌ సఖి’ గురించి అలా అనడం నాకు ఇబ్బందిగా అనిపించింది: రామ్‌చ‌ర‌ణ్‌

Published Thu, Jan 27 2022 8:32 AM | Last Updated on Thu, Jan 27 2022 10:00 AM

Good Luck Sakhi Pre Release Event Highlights - Sakshi

‘‘గుడ్‌ లక్‌ సఖి’ చిన్న సినిమా అని శ్రావ్య అనడం నాకు ఇబ్బందిగా అనిపించింది. మహానటి కీర్తీ సురేష్, నగేష్‌ సార్‌ వంటి జాతీయ అవార్డు గ్రహీతలు, దేవిశ్రీ ప్రసాద్‌గారు ఈ సినిమాకి పనిచేసినప్పుడు ఇది చిన్న సినిమా ఎలా అవుతుంది? చాలా పెద్ద సినిమా’’ అని హీరో రామ్‌చరణ్‌ అన్నారు. కీర్తీ సురేష్‌ ప్రధాన పాత్రలో నగేష్‌ కుకునూర్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘గుడ్‌ లక్‌ సఖి’. ఆది పినిశెట్టి, జగపతి బాబు, రాహుల్‌ రామకృష్ణ ప్రధాన పాత్రలు పోషించారు. నిర్మాత ‘దిల్‌’రాజు  సమర్పణలో వర్త్‌ ఏ షాట్‌ మోషన్‌ ఆర్ట్స్‌ బ్యానర్‌పై సుధీర్‌ చంద్ర పదిరి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 28న విడుదలవుతోంది.

హైదరాబాద్‌లో జరిగిన ప్రీ రిలీజ్‌ వేడుకలో రామ్‌చరణ్‌ మాట్లాడుతూ–‘‘గుడ్‌ లక్‌ సఖి’ వేడుకకి నేను ముఖ్య అతిథిగా రాలేదు. మా నాన్నగారికి(చిరంజీవి) ఒక మెసెంజర్‌గా వచ్చాను. ఈ వేడుకలో ఆయన లేని లోటు తీర్చలేనిది.. కానీ నేను ఇక్కడికొచ్చినందుకు ఎంతో ఆనంద పడుతున్నాను.. గర్వపడుతున్నాను. సుధీర్, కావ్యలు ఈ స్థాయికి రావడం మామూలు విషయం కాదు. నగేష్‌ సార్‌ ‘ఇక్బాల్‌’ సినిమా చూసి చాలా స్ఫూర్తి పొందాను. ప్రస్తుతం సినిమా అన్నది తెలుగు, హిందీ, తమిళ్‌ అనే ఏ సరిహద్దులు లేకుండా రాజమౌళిగారి వల్ల ఇండియన్‌ సినిమా అనే పేరు తెచ్చుకుంది. ‘గుడ్‌ లక్‌ సఖి’ కి ఎక్కువ మంది మహిళలు పనిచేశారని మళ్లీ మళ్లీ చెప్పొద్దు. ఇండస్ట్రీలో మహిళలు, పురుషులు అనే తేడా ఉండకూడదు.. అందరూ ఒక్కటే.

‘అజ్ఞాతవాసి’ లో కీర్తీ సురేష్‌ నటన బాగుందనుకున్నా. ‘మహానటి’ చూశాక ఆమె అభిమాని అయ్యాను. ‘గుడ్‌ లక్‌ సఖి’ లాంటి స్ఫూర్తిదాయక కథలు ఆమె ఇంకా చేయాలి. ఈ సినిమాకి సోలో రిలీజ్‌ కుదరడం అదృష్టం. మా అభిమానులతో పాటు కీర్తి ఫ్యాన్స్‌ కూడా ఈ సినిమాని చూడండి.. ఒక మంచి సినిమాని ఆదరించండి.. ఇలాంటి సినిమాలు మళ్లీ మళ్లీ రావాలి’’ అన్నారు. ‘దిల్‌’ రాజు మాట్లాడుతూ–‘‘గుడ్‌ లక్‌ సఖి’ చిత్రానికి తొలుత ‘బ్యాడ్‌ లక్‌ సఖి’ అనే టైటిల్‌ అనుకున్నారు. ఈ విషయాన్ని దేవిశ్రీ చెప్పాడు. కథ విన్నాక మంచి కాన్సెప్ట్‌ అనిపించి సపోర్ట్‌ చేయాలనిపించింది. అయితే టైటిల్‌ మార్చమని చెప్పడంతో ‘గుడ్‌ లక్‌ సఖి’ అని పెట్టారు’’ అన్నారు. 

(మరిన్ని ఫొటోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి) 

కీర్తీ సురేష్‌ మాట్లాడుతూ–‘‘మహానటి’ లాంటి సీరియస్‌ ఫిల్మ్‌ తర్వాత సరదాగా ఉండే సినిమా చేయాలని ‘గుడ్‌ లక్‌ సఖి’ కి సైన్‌ చేశా. ఇండస్ట్రీలో నాకున్న మంచి ఫ్రెండ్‌ జగపతిబాబు సార్‌. చరణ్‌గారి ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ కోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్నా. మీరందరూ ‘గుడ్‌ లక్‌ సఖి’ చిత్రాన్ని ఆదరించాలి’’ అన్నారు. నగేష్‌ కుకునూర్‌ మాట్లాడుతూ–‘‘నేను తెలుగువాణ్నే. హైదరాబాదీ అయినందుకు గర్వపడుతున్నా. ‘హైదరాబాద్‌ బ్లూస్‌’ తర్వాత ‘గుడ్‌ లక్‌ సఖి’ వంటి పక్కా తెలుగు సినిమా చేయడానికి ఇన్నేళ్లు పట్టింది. ఈ సినిమాని వినోదాత్మకంగా తెరకెక్కించడానికి దర్శకులు కె.విశ్వనాథ్, జంధ్యాలగార్లే నాకు స్ఫూర్తి’’ అన్నారు. ‘‘గుడ్‌ లక్‌ సఖి’ కోసం యూనిట్‌ బాగా కష్టపడ్డారు.. అందరూ ఆదరించాలి’’ అన్నారు సుధీర్‌ చంద్ర పదిరి. ఈ వేడుకలో చిత్ర సహ నిర్మాత శ్రావ్య వర్మ, నిర్మాత అట్లూరి నారాయణరావు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement