హన్షిత, ఎస్‌జే సూర్య, అంజలి, శ్రీకాంత్, రామ్‌చరణ్, పవన్ కల్యాణ్, శంకర్, ‘దిల్’ రాజు, శిరీష్
‘‘తెలుగు జాతికి పేరు తెచ్చిన ఎన్.టి. రామారావుగారిని స్మరించుకుంటున్నాను. తెలుగు చిత్ర పరిశ్రమ ఇక్కడికి వచ్చిందంటే దానికి స్ఫూర్తి అక్కినేని నాగేశ్వర రావు, ఎన్.టి. రామారావు, ఘట్టమనేని కృష్ణ, శోభన్ బాబుగార్లు.. ఇలా ఎంతో మంది పెద్దలే. తెలుగు చిత్ర పరిశ్రమ కోసం ఎంతో మంది పెద్దలు శక్తి యుక్తులు ధారపోశారు... వారందరికీ ధన్యవాదాలు. మన మూలాలను మరచిపోకూడదు. పవన్ కల్యాణ్ ఉన్నా, రామ్‌చరణ్ ఉన్నా దానికి మూలం చిరంజీవిగారు. నేనెప్పుడూ మూలాలు మరచిపోను’’ అని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, నటుడు పవన్ కల్యాణ్ అన్నారు.
రామ్‌చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘గేమ్ చేంజర్’. అనిత సమర్పణలో ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మించిన ఈ మూవీ ఈ నెల 10న విడుదల కానుంది. ఈ సందర్భంగా రాజమహేంద్రవరంలో నిర్వహించిన ‘గేమ్ చేంజర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి ముఖ్య అతిథిగా హాజరైన పవన్ కల్యాణ్ మాట్లాడుతూ– ‘‘ఆర్‌ఆర్‌ఆర్’ మూవీతో రాజమౌళి, రామ్‌చరణ్, ఎన్టీఆర్‌గార్లు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చారు. భారతదేశం మొత్తం తెలుగు చిత్ర పరిశ్రమవైపు చూస్తోందంటే దానికి కారణం శంకర్‌గారు. ‘రంగస్థలం’ చూసి చరణ్‌కి బెస్ట్ యాక్టర్ అవార్డు రావాలని కోరుకున్నా. తండ్రి మెగాస్టార్ అయితే కొడుకు గ్లోబల్æస్టార్ కాకుండా ఏమవుతాడు. ‘గేమ్ చేంజర్’ ట్రైలర్ చూస్తే... మంచి సామాజిక సందేశం ఉన్న సినిమా అనిపించింది. సినిమాని సినిమాగానే చూడండి.
కిందపడిపోయి, మీద పడిపోయి, తొక్కిసలాటలో హీరోని చూడటం కంటే కూడా... దూరంగా నిలబడి మీరు క్షేమంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. డిమాండ్ అండ్ సప్లయ్ వల్లే టికెట్ల ధరలు పెంచుతున్నాం. ప్రభుత్వానికి 18 శాతం జీఎస్‌టీని పన్ను రూపంలో కడుతున్నాం... చిత్ర పరిశ్రమకి రాజకీయ రంగు పులమడం మాకు ఇష్టం లేదు. సినిమాలు తీసేవాళ్లే సినిమాల గురించి మాట్లాడాలి... తీయని వాళ్లు మాట్లాడకూడదు. సినిమాలు తీయకుండా రాజకీయాలు చేసేవాళ్లు మాకు నచ్చరు. ఎన్‌డీయే కూటమి (బీజేపీ, టీడీపీ, జనసేన) తరఫున నేను చెబుతున్నా. సినిమాలు తీసేవాళ్లతోనే మేము మాట్లాడతాం... వారినే గుర్తిస్తాం. సినిమా టికెట్ల ధరల పెంపుకోసం హీరోలు ఎందుకు రావాలి? అది మాకు ఇష్టం లేదు.
మహా అయితే నిర్మాతలు రండి... లేదా మీ యూనియన్‌తో రండి. మేము ఇచ్చేస్తాం’’ అన్నారు. రామ్‌చరణ్ మాట్లాడుతూ– ‘‘గేమ్ చేంజర్’ అనే టైటిల్‌ని శంకర్‌గారు ఎందుకు పెట్టారో తెలియదు. తెర మీద బహుశా మేము చేసే పాత్ర ఒక గేమ్ చేంజింగ్ అని పెట్టారేమో అనిపిస్తోంది’’ అని చెప్పారు.
శంకర్ మాట్లాడుతూ– ‘‘మా అమ్మాయి పెళ్లికి ఆహ్వానించేందుకు పవన్ కల్యాణ్‌గారిని కలిశాను. ఆయనలాంటి మంచి వ్యక్తి మా ‘గేమ్ చేంజర్’ వేడుకకి వచ్చినందుకు థ్యాంక్స్’’ అని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment