అంతా ఒడుదొడుకుల ప్రయాణం... | nagesh kumar acting taken as challenge | Sakshi
Sakshi News home page

అంతా ఒడుదొడుకుల ప్రయాణం...

Published Sun, Mar 30 2014 12:12 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM

అంతా ఒడుదొడుకుల ప్రయాణం... - Sakshi

అంతా ఒడుదొడుకుల ప్రయాణం...

సందర్భం  నగేష్ కుకునూర్ బర్త్‌డే
 సినిమా అనేది మనసుకు స్వాంతన ఇవ్వాలి... మెదడులో ఆలోచన రేకెత్తించాలి. సృజనాత్మక దర్శకుడు నగేష్ కుకునూర్ స్ట్రాటజీ ఇదే.    
 16 ఏళ్లుగా ఆయనది ఇదే పంథా. అందుకే 12 సినిమాలే చేసినా జాతీయ స్థాయిలో ఓ గుర్తింపు సంపాదించుకున్నారు. నగేష్ స్వస్థలం హైదరాబాద్. తన గురించిన ప్రతి అంశం ఆసక్తికరమే. ఆయన కెరీర్, అభిప్రాయాలపై స్పెషల్ ఫోకస్...
 
 చదివింది కెమికల్ ఇంజినీరింగ్. కానీ, మనసు పడింది నటన, దర్శకత్వంపై. ఆ సినిమా పిచ్చితోనే విదేశంలో ఉద్యోగాన్ని సైతం వదిలేసుకుని, హైదరాబాద్‌లో అడుగుపెట్టారు నగేష్. అప్పుడంతా మాస్ మసాలా సినిమాల హవా నడుస్తోంది. తను కూడా ఆ గుంపులో గోవిందయ్య కాదలచుకోలేదు నగేష్. సమ్‌థింగ్ డిఫరెన్స్ చూపించాలనుకున్నారు. అలా, ‘వన్ కల్చర్ ఎట్ ఎ టైమ్’ అనే లఘు చిత్రం తీశారు. ఆ తర్వాత ‘హైదరాబాద్ బ్లూస్’కి శ్రీకారం చుట్టారు.
 
 17 లక్షలు... 17 రోజులు
 మన సంస్కృతీ సంప్రదాయాలను ప్రతిబింబించే కథతో ‘హైదరాబాద్ బ్లూస్’ని తెరకెక్కించారు నగేష్. విదేశాల్లో తను సంపాదించిన డబ్బునంతా ఈ సినిమాకి పెట్టేశారు. 17 లక్షల బడ్జెట్‌తో 17 రోజుల్లో ‘హైదరాబాద్ బ్లూస్’ని స్వీయదర్శకత్వంలో రూపొందించడంతో పాటు నటించారు. 1998లో ఈ చిత్రం విడుదలై, భేష్ అనిపించుకుంది. ఈ సినిమాలోని సంభాషణలు ఇంగ్లిష్, తెలుగు, హిందీ భాషల్లో ఉంటాయి. సినిమా చూసినవాళ్లు ‘రియలిస్టిక్ మూవీ’ అని ప్రశంసించారు. ఈ జానర్‌లో కూడా సినిమా తీయొచ్చా అనుకున్నారు.
 
 రిస్క్ లేని జీవితం బాగుండదని...
 తొలి సినిమా విడుదల చేయడానికి చాలా కష్టాలు పడినప్పటికీ తన పంథా మార్చుకోలేదు నగేష్. హైస్కూల్ నేపథ్యంలో ‘రాక్‌ఫోర్డ్’ తీశారు. జంట నగరాల్లో అప్పుడప్పుడే పైకొస్తున్న నటీనటులను ఈ చిత్రంలో నటింపజేశారు. ఇది కూడా రియలిస్టిక్ సినిమానే. ఒకవైపు పక్కా కమర్షియల్ చిత్రాలు రాజ్యమేలుతున్న తరుణంలో, అందుకు భిన్నంగా పూర్తిగా సహజ చిత్రాలు తీయడానికి ఎంత ధైర్యం ఉండాలి? అని రెగ్యులర్ ఫిలిం మేకర్స్ అనుకున్నారు. కానీ, నగేష్ ఆలోచన ఒక్కటే. ‘‘ఇలాంటి సినిమాలే ప్రేక్షకులు చూస్తారని ఫిక్స్ అవ్వడానికి మనమెవరం? ఒకే రకం సినిమాలిస్తే, ప్రేక్షకుల ఆలోచనా పరిధి ఎలా పెరుగుతుంది? కొత్త సినిమాలు తీయకపోతే వాళ్లకి కొత్త కొత్త అనుభవాలు ఎలా కలుగుతాయి? ప్రేక్షకులకు మనం డిఫరెంట్ మూవీస్ ఇవ్వకపోతే ఎలా?’’ అంటారాయన. అది రిస్క్ కదా అంటే.. రిస్క్ లేని జీవితం ఏం బాగుంటుందని నవ్వేస్తారు.
 
 అందుకే, ఆ తర్వాత కూడా బాలీవుడ్ కాలింగ్, 3 దీవారేన్, ఇక్బాల్, డోర్.. ఇలా సామాజిక సృ్పహ ఉన్న చిత్రాలనే తీశారు. ఇటీవల తీసిన ‘లక్ష్మీ’ కూడా ఈ కోవకు చెందినదే. అమ్మాయిలను మాయలో పడేసి అమ్మేయడం, చిన్న వయసులోనే బలవంతంగా వేశ్యలుగా మార్చడం.. ఇలా సమాజంలో జరుగుతున్న అంశాలతో ఈ సినిమా తీశారు నగేష్. అభ్యంతరకర సన్నివేశాలు ఉన్నాయంటూ ‘సెన్సార్’పరంగా ఇబ్బందులు ఎదురయ్యాయి. ఎట్టకేలకు ‘లక్ష్మీ’ తెరకొచ్చింది. ప్రేక్షకులు, విశ్లేషకులు ‘భేష్’ అన్నారు.
 
 రీచార్జ్ కావాలి...
 పదహారేళ్లల్లో పన్నెండు సినిమాలే తీసినా, నగేష్‌కి మంచి పేరు వచ్చింది. కానీ, చిన్న చిత్రాల నిర్మాణానికి ఎన్నో వ్యయప్రయాసలు ఎదుర్కోవాలి. ఫైనాన్షియర్లు ముందుకు రారు. పంపిణీదారులూ ఇలాంటి రియలిస్టిక్ సినిమాలంటే పరారవుతారు. మరి.. ఇంకా ఇలాంటి సినిమాలు తీస్తుంటే, అలుపు రావడంలేదా అంటే.. ‘‘చాలా అలిసిపోయాను’’ అని నిజాయితీగా చెబుతారు నగేష్. ‘‘మన చేతిలో ఓ వివేకవంతమైన సినిమా ఉన్నా, అది ప్రేక్షకులకు దగ్గరవ్వాలంటే భారీ ఎత్తున ప్రచారం చేయాలి.
 
  దానికి బాగా ఖర్చు పెట్టాలి. ఎందుకులే అని వదిలేస్తే, పడిన కష్టమంతా వృథా అయిపోతోంది. కానీ, ఇవాళ పబ్లిసిటీ ప్రధానం కాబట్టి, ఖర్చు పెట్టక తప్పడంలేదు. ఓ కమర్షియల్ సినిమా తీసినప్పుడు ఉండేంత హాయి చిన్న బడ్జెట్, రియలిస్టిక్ సినిమాలకు ఉండదు. కానీ, నాకీ దారే బాగుంది. ప్రస్తుతానికి అలసిపోయినట్లనిపిస్తుంది. కానీ, ఓ కొత్త కథ తయారు చేయాలనే ఆలోచన రాగానే మళ్లీ రీచార్జ్ అయిపోతా. ఈ ఒడుదొడుకుల ప్రయాణం చాలా ఎగ్జైటింగ్‌గా ఉంది’’ అంటున్నారు నగేష్.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement