బీఈఎల్- భారతీ ఇన్ఫ్రాటెల్.. భల్లేభల్లే
ముంబై, సాక్షి: తొలుత హుషారుగా ప్రారంభమైనప్పటికీ దేశీ స్టాక్ మార్కెట్లు ప్రస్తుతం ఆటుపోట్ల మధ్య కదులుతున్నాయి. అయితే సానుకూల వార్తల కారణంగా ఓవైపు పీఎస్‌యూ దిగ్గజం భారత్ ఎలక్ట్రానిక్స్(బీఈఎల్), మరోపక్క టెలికం టవర్ల దిగ్గజం భారతీ ఇన్ఫ్రాటెల్ కౌంటర్లకు డిమాండ్ కనిపిస్తోంది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో ఈ రెండు కౌంటర్లూ ఒడిదొడుకుల మార్కెట్లోనూ భారీ లాభాలతో సందడి చేస్తున్నాయి. వివరాలు చూద్దాం..
భారత్ ఎలక్ట్రానిక్స్
ఈ ఆర్థిక సంవత్సరం(2020-21) క్యూ2లో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించినప్పటికీ పూర్తి ఏడాదిలో ఆకర్షణీయ పనితీరు చూపే వీలున్నట్లు ప్రభుత్వ రంగ దిగ్గజం భారత్ ఎలక్ట్రానిక్స్ తాజాగా తెలియజేసింది. ఎల్సీఏ, ఆకాష్ వెపన్ సిస్టమ్, స్మార్ట్ సిటీ, ఎలక్ట్రానిక్ వార్ఫేర్ తదితరాల నుంచి రూ. 15,000 కోట్ల విలువైన ఆర్డర్లను ఆశిస్తున్నట్లు పేర్కొంది. దీంతో ఆదాయంలో రెండంకెల వృద్ధిని అందుకోగలమని అంచనా వేసింది. అంతేకాకుండా 20-21 శాతం స్థాయిలో ఇబిటా మార్జిన్లు సాధించగలమని అభిప్రాయపడింది. దీంతో వరుసగా రెండో రోజు ఈ కౌంటర్‌కు డిమాండ్ కనిపిస్తోంది. ప్రస్తుతం ఎన్ఎస్ఈలో బీఈఎల్ షేరు 6 శాతం జంప్‌చేసి రూ. 109 వద్ద ట్రేడవుతోంది. వెరసి రెండు రోజుల్లో 13 శాతం లాభపడినట్లయ్యింది. క్యూ2లో కంపెనీ కన్సాలిడేటెడ్ నికర లాభం 18 శాతం క్షీణించి రూ. 443 కోట్లకు పరిమితమైన సంగతి తెలిసిందే.
భారతీ ఇన్ఫ్రాటెల్
టెలికం మౌలిక సదుపాయాల కంపెనీ ఇండస్ టవర్స్‌తో విజయవంతంగా విలీనాన్ని పూర్తిచేసుకున్నట్లు భారతీ ఇన్ఫ్రాటెల్ పేర్కొంది. తద్వారా ఇండస్ టవర్స్ కంపెనీ పేరుతో అతిపెద్ద టవర్ల కంపెనీగా ఆవిర్భవించింది. ఈ సంయుక్త సంస్థలో మాతృ సంస్థ భారతీ ఎయిర్‌టెల్‌కు 36.73 శాతం వాటా లభించగా.. వొడాఫోన్ గ్రూప్ 28.2 శాతం వాటాను పొందింది. ప్రావిడెన్స్‌కు సైతం 3.25 శాతం వాటా దక్కింది. ఈ నేపథ్యంలో భారతీ ఇన్ఫ్రాటెల్ షేరు ప్రస్తుతం ఎన్ఎస్ఈలో 13 శాతం దూసుకెళ్లి రూ. 210 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 214 వరకూ ఎగసింది. నేటి ట్రేడింగ్ తొలి గంటలోనే (బీఎస్ఈ, ఎన్ఎస్ఈ) ఈ కౌంటర్లో 10 మిలియన్ షేర్లు చేతులు మారడం గమనార్హం!