the Bharat Ratna
-
మాలవీయ, వాజ్‌పేయి భారత రత్నాలు
* దేశ అత్యున్నత పౌర పురస్కారాన్ని ప్రకటించిన కేంద్రం * మరణానంతరం పండిట్ మదన్మోహన్ మాలవీయకు పురస్కారం * స్వాతంత్య్ర సమరయోధుడు, హిందూ జాతీయవాది మాలవీయ * బెనారస్ హిందూ విశ్వవిద్యాలయ వ్యవస్థాపకుడు కూడా * అత్యధిక కాలం ప్రధానిగా ఉన్న కాంగ్రెసేతర నేత వాజ్‌పేయి * కార్గిల్ విజయం, అణు పరీక్షలతో పేరు ప్రతిష్టలు న్యూఢిల్లీ: విద్యావేత్త, ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు దివంగత పండిట్ మదన్మోహన్ మాలవీయ.. మాజీ ప్రధాని, బీజేపీ వ్యవస్థాపక సభ్యుడు అటల్ బిహారీ వాజ్‌పేయిలకు భారత ప్రభుత్వం దేశ అత్యున్నత పౌర పురస్కారం ‘భారతరత్న’ను ప్రకటించింది. వీరిద్దరికీ ఈ ప్రతిష్టాత్మక పురస్కారాన్ని ప్రకటిస్తూ రాష్ట్రపతి భవన్ బుధవారం ప్రకటన విడుదల చేసింది. వాజ్‌పేయి 90వ జన్మదినం, మాలవీయ 153వ జయంతి అయిన డిసెంబర్ 25కు ఒకరోజు ముందు ఈ ప్రకటన వెలువడటం విశేషం. వీరితో కలిపి ఇప్పటివరకు 45 మందికి ఈ ప్రతిష్టాత్మక పురస్కారాన్ని ప్రకటించారు. గత సంవత్సరం క్రికెటర్ సచిన్ తేందూల్కర్, ప్రఖ్యాత శాస్త్రవేత్త సీఎన్ఆర్ రావులకు భారత రత్న ప్రకటించిన విషయం తెలిసిందే. ఇంతకుముందు ఈ పురస్కారం అందుకున్నవారిలో సి.రాజగోపాలాచారి, డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్, జవహర్లాల్ నెహ్రూ, సీవీ రామన్, జయప్రకాశ్ నారాయణ్, మదర్ థెరిసా, లతామంగేష్కర్, జేఆర్డీ టాటా తదితరులున్నారు. అందరివాడు అటల్జీ! భారత రాజకీయాల్లో వాజ్‌పేయి అజాత శత్రువు, స్థితప్రజ్ఞుడు, మృదు భాషి, కవి, రాజనీతిజ్ఞుడుగా పేరుగాంచారు. రాజకీయ స్పర్థలకు అతీతంగా అందరూ అభిమానించే వాజ్‌పేయి.. బీజేపీ తరఫున ప్రధాని పదవి చేపట్టిన మొదటి వ్యక్తిగా నిలిచారు. అత్యధిక కాలం ప్రధానిగా ఉన్న కాంగ్రెసేతర వ్యక్తిగా రికార్డు సృష్టించారు. జాతీయ రహదారులను అనుసంధానిస్తూ చేపట్టిన స్వర్ణ చతుర్భుజి పథకం, పాకిస్తాన్‌తో శాంతి ప్రయత్నం, పోఖ్రాన్ అణు పరీక్షలు, కార్గిల్ యుద్ధ విజయం.. ప్రధానిగా వాజ్‌పేయి పరిపాలనాపటిమకు నిదర్శనాలుగా నిలిచాయి. ధారాళంగా కవితాత్మకంగా సాగే ప్రసంగశైలి.. రాజకీయ ప్రత్యర్థులు సైతం అభిమానించే వాక్పటిమ ఆయన సొంతం. అనారోగ్య కారణాలతో కొద్దికాలంగా ఆయన క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ‘సత్యమేవ జయతే’.. పండిట్ మాలవీయ! హిందూ జాతీయ వాదిగా, బహుముఖ ప్రజ్ఞాశాలిగా పేరుగాంచిన పండిట్ మదన్మోహన్ మాలవీయకు మరణానంతరం ఈ ప్రతిష్టాత్మక పురస్కారాన్ని ప్రకటించారు. 1861లో జన్మిం చిన మాలవీయ బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం వ్యవస్థాపకుడిగా విద్యారంగ అభివృద్ధికి కృషి చేశారు. హిందూ మహాసభ తొలితరం నేతగా పలు సామాజిక సంస్కరణల కోసం కృషి చేశారు. కుల వివక్షకు వ్యతిరేకంగా పోరాడారు. ‘సత్యమేవ జయతే’ నినాదానికి ప్రఖ్యాతి కల్పించిన వారు పండిట్ మాలవీయ.. గురువారం 91వ పడిలోకి అడుగుపెడుతున్న మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయిని బుధవారం సాయంత్రం ఢిల్లీలోని ఆయన నివాసంలో కలసి శుభాకాంక్షలు తెలియజేస్తున్న కేంద్ర మంత్రి అనంత్‌కుమార్. చిత్రంలో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్. అనారోగ్యం కారణంగా కొన్నేళ్లుగా వాజ్‌పేయి తన నివాసానికే పరిమితం కావడం తెలిసిందే. ఇటీవలి కాలంలో ఆయన ఫొటో బయటికి రావడం ఇదే తొలిసారి. (వాజ్‌పేయిని కలసిన అనంతరం ఈ ఫొటోను అనంత్‌కుమార్ తన ఫేస్బుక్ అకౌంట్లో పోస్ట్ చేశారు) -
భారంగా ఓ ఏడాది..!
ప్రియమైన సచిన్, అప్పుడే నువ్వు ఆటను వదిలేసి ఏడాది గడిచింది. ఇది జీర్ణించుకోవడం ఇంకా కష్టంగానే ఉంది. నీ ఆటను చూస్తూ పెరిగిన మాకు... ఈ ఏడాదంతా నీ జ్ఞాపకాలే సరిపోయాయి. నువ్వు రిటైరైన రోజే... భారతరత్న ప్రకటించగానే మా గుండె సంతోషంగా ఉప్పొంగింది. ఇక మైదానంలో నిన్ను చూడలేమనే బాధ ఆ ఆనందాన్ని మింగేసింది. పులి ఎక్కడున్నా పులే... సచిన్ ఆడినా ఆడకున్నా సచినే. అందుకే ఏడాదంతా నీ గురించిన వార్తలు వస్తూనే ఉన్నాయి. 24 ఏళ్ల పాటు కుటుంబానికి దూరంగా ప్రపంచం అంతా తిరిగి మాకు వినోదాన్ని పంచిన నీకు ఇక విశ్రాంతి దొరుకుతుందిలే అనుకున్నాం. కానీ నువ్వు మాత్రం కాళ్లకు బలపాలు కట్టుకుని ప్రపంచం అంతా తిరుగుతున్నావ్. ఈ రోజు లండన్‌లో ఉంటే... ఉదయాన్నే కొచ్చిలో కనిపిస్తున్నావ్. ఆ మరుసటి రోజే మరో దేశంలో దర్శనమిస్తున్నావ్. ఇంకా ఇంత ఓపిక ఎక్కడిది. నీకు అలుపే రాదా? ఇప్పటికీ నీ ఇంటికి క్యూ కట్టే స్పాన్సర్లను చూస్తే ఎవరికైనా తెలుస్తుంది నీ విలువ ‘అమూల్యమని'. పార్లమెంట్‌కు రాలేదని గగ్గోలు పెట్టే విమర్శకులకేం తెలుసు... నువ్వు బయటే చాలా సేవ చేస్తున్నావని. ‘అప్నాలయా’లోని చిన్నారులకు తెలుసు నీ మనసేమిటో..! ‘యూనిసెఫ్’ అధికారులకు తెలుసు నీ సమయం ఎంత విలువైనదని. స్ఫూర్తి నింపడంలో నీకు నువ్వే సాటి. ప్రధాని ‘స్వచ్ఛ భారత్’ అనగానే... వెళ్లి చీపురు పట్టావ్. పుట్టిన రోజు నాడు విహారయాత్రను వదిలేసి వచ్చి మహారాష్ట్ర ఎన్నికల్లో ఓటేసి... ఓటు విలువ ఎంతో చెప్పావ్. బైపాస్ సర్జరీ చేయించుకున్న సోదరుడికి సేవలు చేసి కుటుంబానికి అండగా నిలిచావ్. ‘ఎయిర్‌ఫోర్స్ డే’ వేడుకలకు వెళ్లి... దేశం కోసం కష్టపడేవాళ్లను సంతోషపెట్టావ్. ఈ ఏడాది మా రాష్ట్రాలకూ బాగానే వచ్చావ్. హైదరాబాద్ ప్యారడైజ్ హోటల్లో, విజయవాడలో మాల్ ఓపెనింగ్‌లో... నువ్వు ఎక్కడకు, ఎప్పుడు వచ్చినా మేం ఈగల్లా ముసురుకున్నాం. అయినా విసుక్కోలేదు. వీలైనంతగా మమ్మల్ని కలిసే ప్రయత్నం చేశావ్. అన్నింటికంటే ముఖ్యంగా మా తెలుగు గ్రామాన్నే దత్తత చేసుకున్నావ్. చాలామంది ఎంపీలు వాళ్ల రాష్ట్రంలోని గ్రామాలకే పరిమితమైతే... నువ్వు మా తెలుగు ప్రజల మీద ప్రేమ చూపించావ్. రిటైరయ్యాక ఎనిమిది నెలలకు లార్డ్స్‌లో నువ్వు మళ్లీ వన్డే ఆడితే మా మది పులకించింది. ఆ రోజు నువ్వు బ్యాటింగ్‌కు వస్తుంటే... ఇంగ్లండ్‌లో అభిమానులు నీకు ఇచ్చిన స్టాండింగ్ ఒవేషన్ చూసి... ఓ భారతీయుడిగా గర్వించా. ఈ దేశం నీ మీద చూపించిన ప్రేమకు రుణం తీర్చుకుంటున్నావ్ అనిపిస్తోంది. ఆటంటే క్రికెట్ ఒక్కటే కాదు... మిగిలిన ఆటలూ బాగా ఎదగాలన్న నీ తపన నీ మీద అభిమానాన్ని మరింత పెంచింది. ఫుట్‌బాల్ కోసం ‘ఐఎస్ఎల్’లో భాగం అయ్యావ్. హాకీ జట్టు క్యాంప్‌కు వెళ్లి వాళ్లలో స్ఫూర్తి పెంచావ్. ఆసియా క్రీడల్లో పతకాలు సాధించిన వారిని దగ్గరకు వెళ్లి అభినందించావ్. నీ కీర్తికిరీటంలో లేని అవార్డులేంటి? అయినా రిటైరయ్యాక నిన్ను పరాయి దేశస్థులూ సత్కరిస్తుంటే ముచ్చటేస్తోంది. ‘బ్రాడ్‌మన్ హాల్ ఆఫ్ ఫేమ్’లో నీకు చోటు దక్కింది. అందులో చోటు నీకు కాకుంటే ఇంకెవరికైనా దక్కుతుందా? నీకంటే అర్హులున్నారా? లేరు. ఇదుగో అదిగో అంటుండగానే నీ ఆత్మకథ వచ్చేసింది. గతంలో చాపెల్ అంటే మాకు మంచి అభిప్రాయం లేకపోయినా... ఎప్పుడూ వివాదాల జోలికి పోని నువ్వే చాపెల్‌ను విమర్శించావంటే... మేం అతడిని చీదరించుకున్నాం. నీ జీవితాన్ని తెరచిన పుస్తకం చేసి... నీ అనుభవాల పాఠాలను తర్వాతి తరానికి అందించావ్. ‘సచిన్ రిటైరయ్యాక మ్యాచ్‌లు చూడటం మానేశా’... ఇలాంటి మాటలనూ విన్నాం. నువ్వు లేని క్రికెట్‌ను చూడలేమని అనుకుంటూనే... ఆటపై అభిమానాన్ని చూపిస్తూనే ఉన్నాం. లార్డ్స్‌లో మనోళ్లు 28 ఏళ్ల తర్వాత టెస్టు గెలిస్తే సంబరపడ్డాం. రోహిత్ డబుల్ సెంచరీకి చిందులు వేశాం. ఇంగ్లండ్‌లో ఫామ్ కోల్పోయిన విరాట్ కోహ్లిని నువ్వు దగ్గరుండి పాఠాలు నేర్పించి మళ్లీ గాడిలో పెట్టావ్. అక్కడే మళ్లీ మరోసారి మా మనసు దోచుకున్నావ్. ఒక్క విరాట్‌కే ఎందుకు... మొత్తం భారత క్రికెట్‌కే సరైన నిర్దేశనం చేయొచ్చుగా. అర్జున్ను మైదానంలో చూడాలనుకుంటున్నాం. నీకంటే మార్గ నిర్దేశనం చేయగలవారెవ్వరు? కాస్త తన ఆట కోసం సమయం కేటాయించు. వీలైనంత త్వరగా మా ముందుకు తీసుకురా. కొంత విశ్రాంతి తర్వాతైనా... మళ్లీ నిన్ను మైదానంలో చూసే అవకాశం కల్పించు. భవిష్యత్‌లో భారత్ కోచ్‌గా నిన్ను చూడాలని ఉంది. నేను సాధారణ సచిన్‌నే అని నువ్వు చెప్పినా... మా క్రికెట్ దేవుడివి మాత్రం నువ్వే. నీ స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు. నువ్వు ఆటకు దూరమైనా మా మనసులో మాత్రం ఎల్లకాలం ఉంటావు. - నీ అభిమాని (గత ఏడాది సరిగ్గా ఇదే రోజు (నవంబరు 16) సచిన్ టెండూల్కర్ క్రికెట్‌కు వీడ్కోలు చెప్పాడు) -
భారత రత్న’కు బల్బీర్ సింగ్ పేరు ప్రతిపాదన
చండీగఢ్: భారత హాకీ దిగ్గజ ఆటగాడు బల్బీర్ సింగ్ (సీనియర్) పేరును అత్యున్నత పౌర పురస్కారం ‘భారత రత్న’కు సిఫారసు చేశారు. ఈ మేరకు పంజాబ్ ముఖ్యమంత్రి ప్రకాశ్ సింగ్ బాదల్ శుక్రవారం ప్రధానమంత్రి నరేంద్ర మోడికి లేఖ రాశారు.