
మాలవీయ, వాజ్‌పేయి భారత రత్నాలు
* దేశ అత్యున్నత పౌర పురస్కారాన్ని ప్రకటించిన కేంద్రం
* మరణానంతరం పండిట్ మదన్‌మోహన్ మాలవీయకు పురస్కారం
* స్వాతంత్య్ర సమరయోధుడు, హిందూ జాతీయవాది మాలవీయ
* బెనారస్ హిందూ విశ్వవిద్యాలయ వ్యవస్థాపకుడు కూడా
* అత్యధిక కాలం ప్రధానిగా ఉన్న కాంగ్రెసేతర నేత వాజ్‌పేయి
* కార్గిల్ విజయం, అణు పరీక్షలతో పేరు ప్రతిష్టలు
న్యూఢిల్లీ: విద్యావేత్త, ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు దివంగత పండిట్ మదన్‌మోహన్ మాలవీయ.. మాజీ ప్రధాని, బీజేపీ వ్యవస్థాపక సభ్యుడు అటల్ బిహారీ వాజ్‌పేయిలకు భారత ప్రభుత్వం దేశ అత్యున్నత పౌర పురస్కారం ‘భారతరత్న’ను ప్రకటించింది. వీరిద్దరికీ ఈ ప్రతిష్టాత్మక పురస్కారాన్ని ప్రకటిస్తూ రాష్ట్రపతి భవన్ బుధవారం ప్రకటన విడుదల చేసింది. వాజ్‌పేయి 90వ జన్మదినం, మాలవీయ 153వ జయంతి అయిన డిసెంబర్ 25కు ఒకరోజు ముందు ఈ ప్రకటన వెలువడటం విశేషం. వీరితో కలిపి ఇప్పటివరకు 45 మందికి ఈ ప్రతిష్టాత్మక పురస్కారాన్ని ప్రకటించారు. గత సంవత్సరం క్రికెటర్ సచిన్ తేందూల్కర్, ప్రఖ్యాత శాస్త్రవేత్త సీఎన్‌ఆర్ రావులకు భారత రత్న ప్రకటించిన విషయం తెలిసిందే. ఇంతకుముందు ఈ పురస్కారం అందుకున్నవారిలో సి.రాజగోపాలాచారి, డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్, జవహర్‌లాల్ నెహ్రూ, సీవీ రామన్, జయప్రకాశ్ నారాయణ్, మదర్ థెరిసా, లతామంగేష్కర్, జేఆర్‌డీ టాటా తదితరులున్నారు.
అందరివాడు అటల్‌జీ!
భారత రాజకీయాల్లో వాజ్‌పేయి అజాత శత్రువు, స్థితప్రజ్ఞుడు, మృదు భాషి, కవి, రాజనీతిజ్ఞుడుగా పేరుగాంచారు. రాజకీయ స్పర్థలకు అతీతంగా అందరూ అభిమానించే వాజ్‌పేయి.. బీజేపీ తరఫున ప్రధాని పదవి చేపట్టిన మొదటి వ్యక్తిగా నిలిచారు. అత్యధిక కాలం ప్రధానిగా ఉన్న కాంగ్రెసేతర వ్యక్తిగా రికార్డు సృష్టించారు. జాతీయ రహదారులను అనుసంధానిస్తూ చేపట్టిన స్వర్ణ చతుర్భుజి పథకం, పాకిస్తాన్‌తో శాంతి ప్రయత్నం, పోఖ్రాన్ అణు పరీక్షలు, కార్గిల్ యుద్ధ విజయం.. ప్రధానిగా వాజ్‌పేయి పరిపాలనాపటిమకు నిదర్శనాలుగా నిలిచాయి. ధారాళంగా కవితాత్మకంగా సాగే ప్రసంగశైలి.. రాజకీయ ప్రత్యర్థులు సైతం అభిమానించే వాక్పటిమ ఆయన సొంతం. అనారోగ్య కారణాలతో కొద్దికాలంగా ఆయన క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు.
‘సత్యమేవ జయతే’.. పండిట్ మాలవీయ!
హిందూ జాతీయ వాదిగా, బహుముఖ ప్రజ్ఞాశాలిగా పేరుగాంచిన పండిట్ మదన్‌మోహన్ మాలవీయకు మరణానంతరం ఈ ప్రతిష్టాత్మక పురస్కారాన్ని ప్రకటించారు. 1861లో జన్మిం చిన మాలవీయ బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం వ్యవస్థాపకుడిగా విద్యారంగ అభివృద్ధికి కృషి చేశారు. హిందూ మహాసభ తొలితరం నేతగా పలు సామాజిక సంస్కరణల కోసం కృషి చేశారు. కుల వివక్షకు వ్యతిరేకంగా పోరాడారు. ‘సత్యమేవ జయతే’ నినాదానికి ప్రఖ్యాతి కల్పించిన వారు పండిట్ మాలవీయ..
గురువారం 91వ పడిలోకి అడుగుపెడుతున్న మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయిని బుధవారం సాయంత్రం ఢిల్లీలోని ఆయన నివాసంలో కలసి శుభాకాంక్షలు తెలియజేస్తున్న కేంద్ర మంత్రి అనంత్‌కుమార్. చిత్రంలో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్. అనారోగ్యం కారణంగా కొన్నేళ్లుగా వాజ్‌పేయి తన నివాసానికే పరిమితం కావడం తెలిసిందే. ఇటీవలి కాలంలో ఆయన ఫొటో బయటికి రావడం ఇదే తొలిసారి. (వాజ్‌పేయిని కలసిన అనంతరం ఈ ఫొటోను అనంత్‌కుమార్ తన ఫేస్‌బుక్ అకౌంట్లో పోస్ట్ చేశారు)