bharath simha reddy
-
మెసేజ్ పంపారు.. సాయం మరిచారు..
అతడు చదువుల్లోనే కాదు..ఆటల్లోనూ ఫస్టే. అయితే రోడ్డు ప్రమాదం అతడి జీవితాన్ని కకావికలం చేసింది. ఇంజినీర్ కావాలన్న అతడి కలలను చిదిమేసింది. తల్లిదండ్రులు అతడి చికిత్స కోసం శక్తికి మించి ఖర్చు చేశారు. మరికొన్ని ఆపరేషన్ల కోసం సాయం చేసే దాతల కోసం ఎదురుచూస్తున్నారు. చిత్తూరు, మదనపల్లె : పెద్దమండ్యం మండలం గురివిరెడ్డిగారిపల్లెకు చెందిన కృష్ణారెడ్డికి తన కుమారుడు భరత్‌సింహారెడ్డి చదువుకోసం ఉన్న ఊరిని వదిలి మదనపల్లెకు చేరుకున్నారు. ప్రభుత్వ ఆస్పత్రి ఎదుట చిన్న దుకాణం పెట్టుకుని కుటుంబా న్ని పోషిస్తున్నారు. పదోతరగతిలో 9.0 పాయింట్లతో ఉత్తీర్ణుడైన భరత్‌సింహారెడ్డి ఇంటర్మీడియెట్ ఏపీఆర్జేసీ గ్యారంపల్లెలో సీటు పొందా డు. 2016లో జిల్లాస్థాయి క్రికెట్ పోటీల్లో పాల్గొని విశాఖపట్నంలో జరిగిన రాష్ట్రస్థాయి పోటీలకు హాజరై రంజీ ట్రోఫీకి సెలెక్ట్ అయ్యాడు. ఇంటర్ పూర్తిచేశాక పొట్టిశ్రీరాములు నెల్లూరుజిల్లా గూడూరులో ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలలో చేరాడు. 2017నవంబర్ 5న స్నేహితుడు ఇంటికి వెళ్లి పుస్తకాలు తీసుకువస్తున్న భరత్నసింహారెడ్డిని గుర్తు తెలియని వాహనం ఢీకొంది. ప్రమాదంలో స్నేహితుడు అక్కడికక్కడే మరణించగా, భరత్‌సింహారెడ్డికి ఎడమకాలు నుజ్జు నుజ్జైంది, చేయి, భుజం పూర్తిగా దెబ్బతినడంతోపాటు మతిస్థిమితం కోల్పోయాడు. గ్రామంలోని నాలుగెకరాల వ్యవసాయభూమిని విక్రయించి ఆ సొమ్ముతో భరత్‌సింహారెడ్డికి అతడి తల్లిదండ్రులు చికిత్స చేయించారు. మరికొన్ని ఆపరేషన్లు చేయాల్సి ఉంటుందని వైద్యులు చెప్పడంతో చేసేదిలేక అప్పట్లో సీఎం సహాయనిధికి దరఖాస్తు చేసుకున్నారు. అప్పటి టీడీపీ ప్రభుత్వం త్వరలోనే చెక్కును పంపనున్నట్లు కృష్ణారెడ్డి సెల్‌ఫోన్‌కు మెసేజ్ పంపింది. అయితే ఆ సాయం అందలేదు. చివరకు స్నేహితులు, దాతలు, బంధువులు చేసిన సాయం మూలాన చేయించిన చికిత్సతో భరత్ కొంతవరకు కోలుకున్నాడు. అతడికి నరాలకు సంబంధించిన ఆపరేషన్లు చేస్తే నడిచే అవకాశం ఉందని, రూ.3.5 లక్షల నుంచి 5లక్షల వరకు ఖర్చవుతుందని డాక్టర్లు చెప్పడంతో కుమిలిపోతున్నారు. దాతలు ఆదుకోవాలని వేడుకుంటున్నారు. ఆపన్నహస్తం అందించదలిస్తే 9676520586, 9493871077 నంబర్లలో సంప్రదించాలని కోరుతున్నారు. ఎస్బీఐ, ఎన్టీఆర్ సర్కిల్ అకౌంట్ నంబర్ 30757452216, ఐఎఫ్ఎస్సీ కోడ్..ఎస్బీఐఎన్0012727కు సహాయం అందించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. -
దేవికి.. భరత్‌కు గొడవ, ఆ కోపంలోనే యాక్సిడెంట్?
బీటెక్ విద్యార్థిని కట్కూరి దేవి (21) అనుమానాస్పద మృతి కేసులో పోలీసు విచారణ ముగిసింది. దేవి ఇంటికి సమీపంలో ఉండగానే ఆమెకు, భరత్‌కు వాగ్వాదం జరిగినట్లు సమాచారం తెలుస్తోంది. ఆ కోపంలోనే భరత్ తన కారును గంటకు 130 కిలోమీటర్ల వేగంగా నడిపాడని నిర్ధారణ అయింది. కేవలం 10 మీటర్ల దూరంలోనే రెండు చెట్లను ఢీకొన్నట్లు ఆధారాలు కూడా లభ్యమయ్యాయి. కారు వేగంగా చెట్టును ఢీకొనడంతోనే దేవి మృతి చెందిందని పోలీసులు ఒక నివేదిక తయారు చేశారు. మద్యం సేవించి అత్యంత వేగంగా కారు నడపడం వల్లే ఈ ఘటన సంభవించిందని అంటున్నారు. దేవి మృతికి సంబంధించిన వివరాలను సీపీ మహేందర్ రెడ్డి ఆదివారం వెల్లడించనున్నారు. సీపీ మహేందర్‌రెడ్డికి మొత్తం 5 రకాల విచారణ నివేదికలు అందాయి. అందులో బంజారాహిల్స్ పోలీసులు అందించిన నివేదిక కూడా ఒకటి. ప్రాథమిక పోస్టుమార్టం నివేదికలో రోడ్డు ప్రమాదం వల్లే దేవి మరణించినట్లు వైద్యులు తేల్చారు. భరత్ సింహారెడ్డి, అతడి స్నేహితులను శుక్రవారం అర్ధరాత్రి వరకు పోలీసులు విచారించారు. వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ డీసీపీ లింబారెడ్డి, వెస్ట్‌జోన్ డీసీపీ ఎ.వెంకటేశ్వరరావు నిందితుడిని పలు రకాలుగా విచారణ చేపట్టారు. ఆ రోజు ఏం జరిగిందన్నది పూసగుచ్చినట్లు నివేదిక రూపొందించారు. దర్యాప్తులో భాగంగా అంతకు ముందు రోజు రాత్రి పబ్ ప్రారంభోత్సవానికి వెళ్లినప్పుడు అక్కడ ఎవరెవరిని కలిశారు, ఎవరెవరు కలిసి వెళ్లారన్న వివరాలు రాబట్టారు. భరత్‌సింహారెడ్డి స్నేహితుడు విక్కి, విశ్వనాథ్, పృధ్వీలతో పాటు మృతురాలి స్నేహితురాలు సోనాలిని కూడా శనివారం విచారించి మరింత సమాచారాన్ని తెలుసుకున్నారు. వారి సెల్‌ఫోన్ డాటాను సేకరించారు. స్నేహితుల వేర్వేరు విచారణ, టవర్ సిగ్నల్స్ ఆధారంగా ఆదివారం తెల్లవారుజామున భరత్‌సింహారెడ్డి తన కారులో దేవిని ఎక్కించుకొని వచ్చినట్లు పోలీసులు నిర్ధాణకు వచ్చారు. కారణం ఏంటో తెలియదు గానీ, ఇద్దరి మధ్య గొడవ జరిగిందని, ఆ కోపంతోనే వేగంగా కారు నడిపి చెట్లను ఢీకొన్నాడని అంటున్నారు. అయితే తమకు మాత్రం దేవి మృతిపై ఇప్పటికీ అనుమానాలున్నాయని, తాము న్యాయపోరాటం చేస్తామని దేవి కుటుంబ సభ్యులు చెబుతున్నారు.