దేవికి.. భరత్‌కు గొడవ, ఆ కోపంలోనే యాక్సిడెంట్?
బీటెక్ విద్యార్థిని కట్కూరి దేవి (21) అనుమానాస్పద మృతి కేసులో పోలీసు విచారణ ముగిసింది. దేవి ఇంటికి సమీపంలో ఉండగానే ఆమెకు, భరత్‌కు వాగ్వాదం జరిగినట్లు సమాచారం తెలుస్తోంది. ఆ కోపంలోనే భరత్ తన కారును గంటకు 130 కిలోమీటర్ల వేగంగా నడిపాడని నిర్ధారణ అయింది. కేవలం 10 మీటర్ల దూరంలోనే రెండు చెట్లను ఢీకొన్నట్లు ఆధారాలు కూడా లభ్యమయ్యాయి. కారు వేగంగా చెట్టును ఢీకొనడంతోనే దేవి మృతి చెందిందని పోలీసులు ఒక నివేదిక తయారు చేశారు. మద్యం సేవించి అత్యంత వేగంగా కారు నడపడం వల్లే ఈ ఘటన సంభవించిందని అంటున్నారు. దేవి మృతికి సంబంధించిన వివరాలను సీపీ మహేందర్ రెడ్డి ఆదివారం వెల్లడించనున్నారు.
సీపీ మహేందర్‌రెడ్డికి మొత్తం 5 రకాల విచారణ నివేదికలు అందాయి. అందులో బంజారాహిల్స్ పోలీసులు అందించిన నివేదిక కూడా ఒకటి. ప్రాథమిక పోస్టుమార్టం నివేదికలో రోడ్డు ప్రమాదం వల్లే దేవి మరణించినట్లు వైద్యులు తేల్చారు. భరత్ సింహారెడ్డి, అతడి స్నేహితులను శుక్రవారం అర్ధరాత్రి వరకు పోలీసులు విచారించారు. వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ డీసీపీ లింబారెడ్డి, వెస్ట్‌జోన్ డీసీపీ ఎ.వెంకటేశ్వరరావు నిందితుడిని పలు రకాలుగా విచారణ చేపట్టారు. ఆ రోజు ఏం జరిగిందన్నది పూసగుచ్చినట్లు నివేదిక రూపొందించారు. దర్యాప్తులో భాగంగా అంతకు ముందు రోజు రాత్రి పబ్ ప్రారంభోత్సవానికి వెళ్లినప్పుడు అక్కడ ఎవరెవరిని కలిశారు, ఎవరెవరు కలిసి వెళ్లారన్న వివరాలు రాబట్టారు.
భరత్‌సింహారెడ్డి స్నేహితుడు విక్కి, విశ్వనాథ్, పృధ్వీలతో పాటు మృతురాలి స్నేహితురాలు సోనాలిని కూడా శనివారం విచారించి మరింత సమాచారాన్ని తెలుసుకున్నారు. వారి సెల్‌ఫోన్ డాటాను సేకరించారు. స్నేహితుల వేర్వేరు విచారణ, టవర్ సిగ్నల్స్ ఆధారంగా ఆదివారం తెల్లవారుజామున భరత్‌సింహారెడ్డి తన కారులో దేవిని ఎక్కించుకొని వచ్చినట్లు పోలీసులు నిర్ధాణకు వచ్చారు. కారణం ఏంటో తెలియదు గానీ, ఇద్దరి మధ్య గొడవ జరిగిందని, ఆ కోపంతోనే వేగంగా కారు నడిపి చెట్లను ఢీకొన్నాడని అంటున్నారు. అయితే తమకు మాత్రం దేవి మృతిపై ఇప్పటికీ అనుమానాలున్నాయని, తాము న్యాయపోరాటం చేస్తామని దేవి కుటుంబ సభ్యులు చెబుతున్నారు.