Bharatiya Mazdoor Sangh
-
ఫొటో చలానాలపై నిరసన
శంషాబాద్: ట్రాఫిక్ పోలీసులు ఎక్కడపడితే అక్కడ ఫొటోలు తీస్తూ చలానాలు వేయడంతో బతుకు బండి లాగలేకపోతున్నామని భారతీయ మజ్దూర్ సంఘ్(బీఎంఎస్) ఆధ్వర్యంలో గురువారం శంషాబాద్ పట్టణంలో ఆటో, ట్యాక్సీ, డీసీఎం, వ్యాన్ డ్రైవర్లు ర్యాలీ నిర్వహించారు. పట్టణంలోని సామా ఎన్క్లేవ్ నుంచి ఆర్జీఐ పోలీస్‌స్టేషన్ మీదుగా తొండిపల్లి ఆటో స్టాండ్ వరకు ర్యాలీ కొనసాగింది. ఈ సందర్భంగా బీఎంఎస్ ప్రైవేటు ట్రాన్స్పోర్ట్స్ జిల్లా నాయకుడు చింతల నందకిషోర్ మాట్లాడుతూ పోలీసులు అడ్డగోలుగా ఎక్కడపడితే అక్కడ ఫొటోలు తీయడంతో ఒక నెలలోనే శంషాబాద్ పట్టణంలో ఆటోలు నడుపుకుని జీవించే డ్రైవర్లు మూడు లక్షల రూపాయల వరకు చలానాలు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. వృద్ధులు, వికలాంగుల కోసం రోడ్డుపై ఆటో ఆపినా వెనుక నుంచి ఫొటో తీస్తున్న సందర్భాలు అనేకం ఉన్నాయన్నారు. ట్రాఫిక్ పోలీసులు ఆటో స్టాండ్, పార్కింగ్ స్థలాలను ఖరారు చేసి ట్రాఫిక్ సిగ్నల్స్‌ను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. పట్టణంలోని పెద్ద పెద్ద హోటళ్ల ముందు విచ్చలవిడిగా వాహనాలు నిలిపినా పట్టించుకోని పోలీసులు.. ప్రయాణికుల కోసం రోడ్డుపై అనివార్య పరిస్థితుల్లో వాహనాలను ఆపితే చలానాలు వేయడంతో డ్రైవర్లు ఆర్థికంగా చితికిపోతున్నారన్నారు. ట్రాఫిక్ పోలీసులు ఆటో, ట్యాక్సీ, డీసీఎం డ్రైవర్ల పరిస్థితిని అర్థం చేసుకుని ఫోటో చలానాలను నియంత్రించాలన్నారు. కార్యక్రమంలో బీఎంఎస్ జిల్లా నాయకులు జనార్దన్, భానుప్రకాష్, రామిరెడ్డి, కె.శ్రీనివాస్, ఎం.డి.సయ్యద్, కె.రాజా, జగన్, ఆజామ్, సురేష్, బాలకృష్ణ, రమేష్, మల్లేష్, దేవేందర్, కృష్ణ, సిద్దు, నిరంజన్, శేఖర్, మహేందర్ తదితరులు పాల్గొన్నారు. -
'ఉద్యోగస్తులు ట్యాక్స్‌లు కట్టనవసరం లేదు'
సాక్షి, న్యూఢిల్లీ : ఉద్యోగస్తులు ట్యాక్సులు చెల్లించాల్సిన అవసరం లేదని ఆర్ఎస్ఎస్ భాగస్వామ్య సంస్థ భారతీయ మజ్దూర్ సంఘ్ జనరల్ సెక్రటరీ, లేబర్ యూనియన్ చీఫ్ బ్రిజేశ్ ఉపాధ్యాయ్ అన్నారు. ప్రతి ఉద్యోగి కూడా ట్యాక్స్ విధించాలని అనుకోరని అన్నారు. 'మన దేశంలో నియమనిబంధనలు ఉద్యోగ వర్గం ట్యాక్సులు చెల్లించాలని చెబుతున్నాయి. కానీ, అలా జరగకూడదు. వ్యాపార వేత్తలు సంపాధించే ఆదాయం మాత్రమే పన్ను పరిధిలోకి వస్తుంది. సేవలు చేస్తున్నందుకు ప్రతిఫలంగా పొందుతున్న జీతభత్యాలపై ఎట్టి పరిస్థితుల్లో పన్ను విధించరాదు' అని ఆయన అన్నారు. 'భారత్‌లోని చాలామంది శ్రామికులు పేదవారు. అలాంటివారిపై అంతపెద్ద మొత్తంలో పన్ను విధిస్తే వాళ్లు ఎలా చెల్లిస్తారు. ఏం పొదుపు చేసుకుంటారు' అని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. భారతకు జాతీయ ఉపాధి విధానమే లేదని గుర్తు చేశారు. 'దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 70 ఏళ్లయింది. ఇప్పటి వరకు ఉపాధి విధానమే లేదు. పారిశ్రామిక విధానం మాత్రం ఇప్పటికే మూడుసార్లు చేశారు.. కానీ, ఉపాధి విధానంలో మాత్రం నిర్ణయమే లేదు. ఈ రోజు దేశంలో అతిపెద్ద సమస్య నిరుద్యోగితే. అందుకు కారణం మనకు ఉపాధి విధానమే లేకుండా పోయింది. ఏ ప్రభుత్వం కూడా దీని గురించి ఆలోచన చేసిన పాపాన పోలేదు' అని ఉపాధ్యాయ్ ఆందోళన వ్యక్తం చేశారు. -
కేంద్ర ఉద్యోగులకు రెండేళ్ల బోనస్
* కనీస దినసరి వేతనం రూ. 350కి పెంపు: కేంద్రం ప్రకటన * కార్మిక సంఘాల అసంతృప్తి.. 2న సమ్మె యథాతథం న్యూఢిల్లీ: డిమాండ్ల సాధన కోసం శుక్రవారం దేశ వ్యాప్తంగా సమ్మె చేస్తామని ప్రకటించిన కార్మిక సంఘాలను శాంతింపజేసే ప్రయత్నంలో భాగంగా.. కేంద్ర ప్రభుత్వంలోని నైపుణ్యంలేని వ్యవసాయేతర కార్మికుల కనీస వేతనాన్ని 42 శాతం మేర పెంచటంతో పాటు.. పెండింగ్‌లో ఉన్న రెండేళ్ల బోనస్‌ను చెల్లిస్తామని కేంద్ర సర్కారు మంగళవారం ప్రకటించింది. అయితే.. ఈ చర్యలు ఏమాత్రం సరిపోవంటూ కార్మిక సంఘాలు తిరస్కరించాయి. శుక్రవారం నాటి తమ సమ్మె యథాతథంగా కొనసాగుతుందని స్పష్టంచేశాయి. ఇదిలావుంటే.. కేంద్ర ప్రభుత్వ విభాగాలన్నీ ఏడో వేతన సంఘం సిఫారసులను ప్రతిఫలిస్తూ సర్వీసు, నియామక నిబంధనలను మార్చాలని సర్కారు నిర్దేశించింది. కార్మిక సంఘాల అంశాలపై ఏర్పాటైన మంత్రుల బృందం సారథి, ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. నైపుణ్యంలేని వ్యవసాయేతర కార్మికుల కనీస వేతనాన్ని రోజుకు రూ. 246 నుండి రూ. 350 కి పెంచుతున్నట్లు ప్రకటించారు. అలాగే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెండింగ్‌లో ఉన్న 2014-15, 2015-16 సంవత్సరాల బోనస్‌ను సవరించిన నిబంధనలు ప్రాతిపదికగా చెల్లిస్తామని వెల్లడించారు. బోనస్ చెల్లింపుల వల్ల ఏటా రూ. 1,920 కోట్ల మేర ఆర్థిక భారం పడుతుందన్నారు. బోనస్ చెల్లింపుపై హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న కేసులను సత్వరం పరిష్కరించేందుకు ప్రభుత్వం అవసరమైన చర్యలను కూడా చేపడుతుందని హామీ ఇచ్చారు. కార్మిక సంఘం రిజిస్ట్రేషన్‌ను 45 రోజుల్లో పూర్తిచేసేలా చూడాలని చెప్తూ రాష్ట్రాలకు సలహాలను జారీ చేస్తామని కూడా చెప్పారు. కార్మిక, ఉపాధి శాఖామంత్రి బండారు దత్తాత్రేయ, విద్యుత్, బొగ్గు శాఖల మంత్రి పియూష్గోయల్లు కూడా జైట్లీతో ఉన్నారు. ‘‘గత ఏడాదిన్నర కాలంలో మంత్రిత్వశాఖల కమిటీ కేంద్ర కార్మిక సంఘాలతో సమావేశమైంది. కార్మిక సంఘాలు పలు డిమాండ్లు ముందు పెట్టాయి. వాటిపై మంత్రివర్గ కమిటీ సిఫారసుల ఆధారంగా ప్రభుత్వం కొన్ని నిర్ణయాలు తీసుకుంది. ‘సి’ తరగతిలో నైపుణ్యంలేని వ్యవసాయేతర కార్మికుల కనీస వేతనాలను రోజుకు రూ. 350 చేయాలని నిర్ణయించాం. అసంఘటిత రంగానికి (అంగన్వాడి, మధ్యాహ్నభోజనం, ఆశా వలంటీర్లు వంటివి) సామాజిక భద్రత ప్రయోజనం అందించే అంశాన్ని ఒక కమిటీ పరిశీలించి సాధ్యమైనంత త్వరగా తన నివేదిక ఇస్తుంది’’ అని జైట్లీ వివరించారు. కార్మిక సంఘాల సమ్మె పిలుపు గురించి ప్రశ్నించగా.. ‘‘మనకు బాధ్యతాయుతమైన కార్మిక సంఘాలు ఉన్నాయని నేను అనుకుంటున్నా’’ అని ఆయన స్పందించారు. ఎస్బీఐ అనుబంధ బ్యాంకులను మాతృ సంస్థలో విలీనం చేయాలన్న ప్రణాళికలకు ప్రతిపక్షాల వ్యతిరేకత గురించి ప్రస్తావించగా..విలీనం వల్ల ఏ ఒక్క ఉద్యోగి సర్వీస్ నిబంధనలపైనా ఎటువంటి ప్రభావం ఉండబోదన్నారు. 12 అంశాల్లో దేనినీ పరిగణనలోకి తీసుకోలేదు అయితే.. నెలవారీ కనీస వేతనం రూ. 18,000 ఉండాలని, దినసరి కనీస వేతనాన్ని రూ. 692 కు పెంచాలని, నెలకు రూ. 3,000 ఆరంభ పెన్షన్ కావాలని డిమాండ్ చేస్తున్న కార్మిక సంఘాలు.. ప్రభుత్వ ప్రకటనపై సంతృప్తి చెందలేదు. శుక్రవారం తాము తలపెట్టిన సమ్మెను యధాతథంగా కొనసాగిస్తామని ఉద్ఘాటించాయి. ‘‘కేంద్రం ప్రకటించిన కనీస వేతనం ఏమాత్రం సరిపోదు. సమ్మె యధాతథంగా ఉంటుంది. సార్వజనీనమైన కనీస వేతనాన్ని నిర్ణయిస్తూ ప్రభుత్వం చట్టం చేయాలని మేం డిమాండ్ చేస్తున్నాం’’ అని ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి గురుదాస్‌దాస్‌గుప్తా పేర్కొన్నారు. ‘‘మా 12 పాయింట్ల చార్టర్లో దేనినీ సర్కారు పరిగణనలోకి తీసుకోలేదన్నది ప్రభుత్వ ప్రకటన స్పష్టంగా చూపుతోంది’’ అని ఇండియన్ నేషనల్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు అశోక్‌సింగ్ వ్యాఖ్యానించారు. పెంపుపై మేం సంతృప్తి చెందాం: బీఎంఎస్ ప్రభుత్వ ప్రకటనను ఆర్ఎస్ఎస్ అనుబంధ భారతీయ మజ్దూర్ సంఘ్ (బీఎంఎస్) ప్రశంసించింది. సార్వత్రిక సమ్మెకు తాను దూరంగా ఉండాలని నిర్ణయించింది. ‘‘కనీస వేతనాల పెంపుపై మేం సంతృప్తిచెందాం.. దీనిని మేం ఆహ్వానిస్తున్నాం. సమ్మెలో బీఎంఎస్ పాల్గొనదు’’ అని ఆ సంస్థ ప్రధాన కార్యదర్శి వజ్రేష్ ఉపాధ్యాయ్ చెప్పారు. -
పీఎఫ్‌పై 8.7% వడ్డీ ఖరారు
వడ్డీ తగ్గింపుపై కార్మిక సంఘాల ఆందోళన న్యూఢిల్లీ: 2015-16 ఆర్థిక సంవత్సరానికి పీఎఫ్ డిపాజిట్లపై 8.7 శాతం వడ్డీని కేంద్రం ఖరారు చేసింది. కార్మిక మంత్రి నేతృత్వంలోని భవిష్య నిధి సంస్థ ఈపీఎఫ్‌వో ట్రస్టీల సెంట్రల్ బోర్డు(సీబీటీ) ఫిబ్రవరిలో పీఎఫ్ డిపాజిట్లపై వడ్డీని 8.8 శాతం చేయాలని ప్రతిపాదించింది. ఆ నిర్ణయాన్ని పక్కనబెట్టిన కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ 8.7 శాతం వడ్డీని ఖరారు చేసింది. ఈ మేరకు సోమవారం లోక్‌సభలో కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ ఇచ్చిన లిఖిత పూర్వక సమాధానంలో వెల్లడించారు. కాగా దీన్ని కార్మిక వ్యతిరేక చర్యగా అభివర్ణించిన కార్మిక సంఘాలు ఆందోళన బాటపట్టాయి. భారతీయ మజ్దూర్ సంఘ్ (బీఎంఎస్) ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించింది. ఈ నెల 27న ఈపీఎఫ్ కార్యాలయాల ఎదుట నిరసన ప్రదర్శన చేయనున్నట్లు బీఎంఎస్ ప్రధాన కార్యదర్శి విర్జేష్ ఉపాధ్యాయ తెలిపారు. స్వతంత్ర సంస్థ అయిన సీబీటీ నిర్ణయంలో ఆర్థిక మంత్రిత్వ శాఖ వేలుపెట్టడం తగదని అన్నారు. ఇండియన్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు అశోక్ సింగ్ ప్రభుత్వానికి పీఎఫ్ నిర్ణయాల్లో తలదూర్చే హక్కు లేదన్నారు. సెప్టెంబర్ 2న భారత్ బంద్ ఆందోళనలో దీన్ని ఓ అంశంగా చేరుస్తామన్నారు.