కేంద్ర ఉద్యోగులకు రెండేళ్ల బోనస్ | Unions stick to strike call despite govt announcing bonus, minimum wage hike | Sakshi
Sakshi News home page

కేంద్ర ఉద్యోగులకు రెండేళ్ల బోనస్

Published Wed, Aug 31 2016 1:53 AM | Last Updated on Sat, Apr 6 2019 9:38 PM

కేంద్ర ఉద్యోగులకు రెండేళ్ల బోనస్ - Sakshi

కేంద్ర ఉద్యోగులకు రెండేళ్ల బోనస్

* కనీస దినసరి వేతనం రూ. 350కి పెంపు: కేంద్రం ప్రకటన
* కార్మిక సంఘాల అసంతృప్తి.. 2న సమ్మె యథాతథం

న్యూఢిల్లీ: డిమాండ్ల సాధన కోసం శుక్రవారం దేశ వ్యాప్తంగా సమ్మె చేస్తామని ప్రకటించిన కార్మిక సంఘాలను శాంతింపజేసే ప్రయత్నంలో భాగంగా.. కేంద్ర ప్రభుత్వంలోని నైపుణ్యంలేని వ్యవసాయేతర కార్మికుల కనీస వేతనాన్ని 42 శాతం మేర పెంచటంతో పాటు.. పెండింగ్‌లో ఉన్న రెండేళ్ల బోనస్‌ను చెల్లిస్తామని కేంద్ర సర్కారు మంగళవారం ప్రకటించింది. అయితే.. ఈ చర్యలు ఏమాత్రం సరిపోవంటూ కార్మిక సంఘాలు తిరస్కరించాయి. శుక్రవారం నాటి తమ సమ్మె యథాతథంగా కొనసాగుతుందని స్పష్టంచేశాయి.

ఇదిలావుంటే.. కేంద్ర ప్రభుత్వ విభాగాలన్నీ ఏడో వేతన సంఘం సిఫారసులను ప్రతిఫలిస్తూ సర్వీసు, నియామక నిబంధనలను మార్చాలని సర్కారు నిర్దేశించింది. కార్మిక సంఘాల అంశాలపై ఏర్పాటైన మంత్రుల బృందం సారథి, ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. నైపుణ్యంలేని వ్యవసాయేతర కార్మికుల కనీస వేతనాన్ని రోజుకు రూ. 246 నుండి రూ. 350 కి పెంచుతున్నట్లు ప్రకటించారు. అలాగే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెండింగ్‌లో ఉన్న 2014-15, 2015-16 సంవత్సరాల బోనస్‌ను సవరించిన నిబంధనలు ప్రాతిపదికగా చెల్లిస్తామని వెల్లడించారు.

బోనస్ చెల్లింపుల వల్ల ఏటా రూ. 1,920 కోట్ల మేర ఆర్థిక భారం పడుతుందన్నారు. బోనస్ చెల్లింపుపై హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న కేసులను సత్వరం పరిష్కరించేందుకు ప్రభుత్వం అవసరమైన చర్యలను కూడా చేపడుతుందని హామీ ఇచ్చారు. కార్మిక సంఘం రిజిస్ట్రేషన్‌ను 45 రోజుల్లో పూర్తిచేసేలా చూడాలని చెప్తూ రాష్ట్రాలకు సలహాలను జారీ చేస్తామని కూడా చెప్పారు. కార్మిక, ఉపాధి శాఖామంత్రి బండారు దత్తాత్రేయ, విద్యుత్, బొగ్గు శాఖల మంత్రి పియూష్‌గోయల్‌లు కూడా జైట్లీతో ఉన్నారు. ‘‘గత ఏడాదిన్నర కాలంలో మంత్రిత్వశాఖల కమిటీ కేంద్ర కార్మిక సంఘాలతో సమావేశమైంది.

కార్మిక సంఘాలు పలు డిమాండ్లు ముందు పెట్టాయి. వాటిపై మంత్రివర్గ కమిటీ సిఫారసుల ఆధారంగా ప్రభుత్వం కొన్ని నిర్ణయాలు తీసుకుంది.  ‘సి’ తరగతిలో నైపుణ్యంలేని వ్యవసాయేతర కార్మికుల కనీస వేతనాలను రోజుకు రూ. 350 చేయాలని నిర్ణయించాం. అసంఘటిత రంగానికి (అంగన్‌వాడి, మధ్యాహ్నభోజనం, ఆశా వలంటీర్లు వంటివి) సామాజిక భద్రత ప్రయోజనం అందించే అంశాన్ని ఒక కమిటీ పరిశీలించి సాధ్యమైనంత త్వరగా తన నివేదిక ఇస్తుంది’’ అని జైట్లీ వివరించారు. కార్మిక సంఘాల సమ్మె పిలుపు గురించి ప్రశ్నించగా.. ‘‘మనకు బాధ్యతాయుతమైన కార్మిక సంఘాలు ఉన్నాయని నేను అనుకుంటున్నా’’ అని ఆయన స్పందించారు. ఎస్‌బీఐ అనుబంధ బ్యాంకులను మాతృ సంస్థలో విలీనం చేయాలన్న ప్రణాళికలకు ప్రతిపక్షాల వ్యతిరేకత గురించి ప్రస్తావించగా..విలీనం వల్ల ఏ ఒక్క ఉద్యోగి సర్వీస్ నిబంధనలపైనా ఎటువంటి ప్రభావం ఉండబోదన్నారు.
 
12 అంశాల్లో దేనినీ పరిగణనలోకి తీసుకోలేదు
అయితే.. నెలవారీ కనీస వేతనం రూ. 18,000 ఉండాలని, దినసరి కనీస వేతనాన్ని రూ. 692 కు పెంచాలని, నెలకు రూ. 3,000 ఆరంభ పెన్షన్ కావాలని డిమాండ్ చేస్తున్న కార్మిక సంఘాలు.. ప్రభుత్వ ప్రకటనపై సంతృప్తి చెందలేదు. శుక్రవారం తాము తలపెట్టిన సమ్మెను యధాతథంగా కొనసాగిస్తామని ఉద్ఘాటించాయి. ‘‘కేంద్రం ప్రకటించిన కనీస వేతనం ఏమాత్రం సరిపోదు. సమ్మె యధాతథంగా ఉంటుంది. సార్వజనీనమైన కనీస వేతనాన్ని నిర్ణయిస్తూ ప్రభుత్వం చట్టం చేయాలని మేం డిమాండ్ చేస్తున్నాం’’ అని ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి గురుదాస్‌దాస్‌గుప్తా పేర్కొన్నారు. ‘‘మా 12 పాయింట్ల చార్టర్‌లో దేనినీ సర్కారు పరిగణనలోకి తీసుకోలేదన్నది ప్రభుత్వ ప్రకటన స్పష్టంగా చూపుతోంది’’ అని ఇండియన్ నేషనల్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు అశోక్‌సింగ్ వ్యాఖ్యానించారు.
 
పెంపుపై మేం సంతృప్తి చెందాం: బీఎంఎస్
ప్రభుత్వ ప్రకటనను ఆర్‌ఎస్‌ఎస్ అనుబంధ భారతీయ మజ్దూర్ సంఘ్ (బీఎంఎస్) ప్రశంసించింది. సార్వత్రిక సమ్మెకు తాను దూరంగా ఉండాలని నిర్ణయించింది. ‘‘కనీస వేతనాల పెంపుపై మేం సంతృప్తిచెందాం.. దీనిని మేం ఆహ్వానిస్తున్నాం. సమ్మెలో బీఎంఎస్ పాల్గొనదు’’ అని ఆ సంస్థ ప్రధాన కార్యదర్శి వజ్రేష్ ఉపాధ్యాయ్ చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement