నేడు బ్యాంకు, బీమా ఉద్యోగుల సమ్మె
ముంబై: కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తోందంటూ కార్మిక సంఘాలు బుధవారం (నేడు) తలపెట్టిన దేశవ్యాప్త సమ్మెలో బీమా కంపెనీల సిబ్బంది... ప్రభుత్వ, ప్రైవేటు, విదేశీ బ్యాంకుల ఉద్యోగులు కూడా పాల్గొంటున్నారు. దీంతో ఆర్థిక సేవలు అంతరాయం కలగనుంది. 25 ప్రభుత్వ రంగ బ్యాంకులు, 11 ప్రైవేట్, తొమ్మిది విదేశీ బ్యాంకులకు చెందిన సుమారు 13 లక్షల మంది ఉద్యోగులు సమ్మె చేస్తున్నట్లు ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (ఏఐబీఈఏ) వెల్లడించింది.
వీటితో పాటు 56 ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, 650 సహకార బ్యాంకులు, రిజర్వ్ బ్యాంక్, నాబార్డ్, సిడ్బి సిబ్బంది కూడా సమ్మెలో పాల్గొంటున్నారని పేర్కొంది. మొత్తం మీద బ్యాంకు ఉద్యోగులు, అధికారులకు ప్రాతి నిధ్యం వహించే 14 యూని యన్లు సమ్మెలో పాల్గొంటున్నాయి. ప్రభు త్వ రంగ బ్యాంకులను దొడ్డిదారిన కార్పొరేట్ల చేతికి అప్పజెప్పేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని, దీన్ని వ్యతిరేకిస్తూ తాము సమ్మెలో పాల్గొంటున్నట్లు బ్యాంక్ యూనియన్లు పేర్కొన్నాయి. కాగా, ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్‌కు అనుబంధ సంస్థ అయిన ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయిస్ యూనియన్ హైదరాబాద్ డివిజన్ కూడా ఈ సమ్మెలో పాల్గొంటుంది.