పీఎఫ్‌పై 8.7% వడ్డీ ఖరారు
వడ్డీ తగ్గింపుపై కార్మిక సంఘాల ఆందోళన
న్యూఢిల్లీ: 2015-16 ఆర్థిక సంవత్సరానికి పీఎఫ్ డిపాజిట్లపై 8.7 శాతం వడ్డీని కేంద్రం ఖరారు చేసింది. కార్మిక మంత్రి నేతృత్వంలోని భవిష్య నిధి సంస్థ ఈపీఎఫ్‌వో ట్రస్టీల సెంట్రల్ బోర్డు(సీబీటీ) ఫిబ్రవరిలో పీఎఫ్ డిపాజిట్లపై వడ్డీని 8.8 శాతం చేయాలని ప్రతిపాదించింది. ఆ నిర్ణయాన్ని పక్కనబెట్టిన కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ 8.7 శాతం వడ్డీని ఖరారు చేసింది. ఈ మేరకు సోమవారం లోక్‌సభలో కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ ఇచ్చిన లిఖిత పూర్వక సమాధానంలో వెల్లడించారు. కాగా దీన్ని కార్మిక వ్యతిరేక చర్యగా అభివర్ణించిన కార్మిక సంఘాలు ఆందోళన బాటపట్టాయి.
భారతీయ మజ్దూర్ సంఘ్ (బీఎంఎస్) ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించింది. ఈ నెల 27న ఈపీఎఫ్ కార్యాలయాల ఎదుట నిరసన ప్రదర్శన చేయనున్నట్లు బీఎంఎస్ ప్రధాన కార్యదర్శి విర్జేష్ ఉపాధ్యాయ తెలిపారు. స్వతంత్ర సంస్థ అయిన సీబీటీ నిర్ణయంలో ఆర్థిక మంత్రిత్వ శాఖ వేలుపెట్టడం తగదని అన్నారు. ఇండియన్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు అశోక్ సింగ్ ప్రభుత్వానికి పీఎఫ్ నిర్ణయాల్లో తలదూర్చే హక్కు లేదన్నారు. సెప్టెంబర్ 2న భారత్ బంద్ ఆందోళనలో దీన్ని ఓ అంశంగా చేరుస్తామన్నారు.