టెక్నాలజీతో అవినీతి తగ్గుముఖం
2020 నాటికి 5 కోట్ల మందికి ఉద్యోగాలు: బండారు దత్తాత్రేయ
సాక్షి, హైదరాబాద్: సాంకేతిక పరిజ్ఞానంతో వచ్చిన విప్లవాత్మక మార్పులతో ప్రభుత్వ శాఖల్లో అవినీతి గణనీయంగా తగ్గిందని కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు. నేషనల్ కెరీర్ సర్వీస్ (ఎన్‌సీపీ) పోర్టల్ ద్వారా గ్రామీణ ప్రాంత నిరుద్యోగుల ఎంప్లాయ్‌మెంట్ రిజిస్ట్రేషన్ సేవలందించేలా తపాలా, కార్మిక, ఉపాధి కల్పన శాఖలు ఆదివారం డాక్ సదన్‌లో ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఎన్‌సీపీ పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవడంతో 52 విభిన్న రంగాల్లో 3 వేల వృత్తులకు దరఖాస్తు చేసుకునే అవకాశం కలుగుతుందని దత్తాత్రేయ చెప్పారు.
2020 నాటికల్లా భారత యువత 80 కోట్లకు చేరుతుందని, అప్పటికి 5 కోట్ల మందికి ఉద్యోగావకాశాలు కల్పించేలా కేంద్రం కార్యాచరణ రూపొందించిందన్నారు. ఎన్‌సీపీ ద్వారా ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 3.75 కోట్ల మంది రిజిస్టర్ అయ్యారని, 14 లక్షల యాజమాన్యాలు ఇందులో ఉన్నాయన్నారు. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నేరుగా దరఖాస్తుదారుడికే అవకాశాలు దక్కే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టినట్లు పేర్కొన్నారు. 95 ప్రధాన పోస్టాఫీసుల ద్వారా ఎన్‌సీపీ సేవలు ఆరంభిస్తున్నట్లు తపాలా శాఖ కార్యదర్శి బీవీ సుధాకర్ తెలిపారు.