Central Department of Labor
-
ఈ–శ్రమ్ పోర్టల్‌లోకి 4 కోట్ల అసంఘటిత కార్మికులు
న్యూఢిల్లీ: ప్రారంభించిన రెండు నెలల్లోపే 4 కోట్ల అసంఘటిత రంగ కార్మికుల పేర్లు ఈ–శ్రమ్ పోర్టల్‌లో నమోదయ్యాయని కేంద్ర కార్మిక ఉపాధి శాఖ ఆదివారం తెలిపింది. నిర్మాణం, దుస్తుల తయారీ, మత్స్య, వ్యవసాయ, రవాణా తదితర రంగాల్లో ఉపాధి పొందుతున్న వారంతా పేర్లు నమోదు చేయించుకున్నారని పేర్కొంది. చాలా రంగాల్లో పెద్ద సంఖ్యలో వలస కార్మికులు కూడా ఉన్నారని తెలిపింది. వీరిలో అత్యధిక భాగం నిర్మాణ, వ్యవసాయ రంగాలకు చెందిన వారేనని పేర్కొంది. ఈ పోర్టల్ ఆధారంగానే అసంఘటిత రంగ కారి్మకులకు అన్ని రకాల సామాజిక భద్రత, ఉపాధి ఆధారిత పథకాల ప్రయోజనాలు అందుతాయని వెల్లడించింది. మొత్తం 4.09 కోట్ల అసంఘటిత రంగ కారి్మకుల్లో 50.02% మంది లబి్ధదారులు మహిళలు కాగా 49.98% మంది పురుషులని వివరించింది. వీరి సంఖ్య ఇంకా పెరుగుతూ పోతోందని కూడా తెలిపింది. నమోదైన వారిలో ఒడిశా, బెంగాల్, ఉత్తరప్రదేశ్, బిహార్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలవారు ఎక్కువ సంఖ్యలో ఉన్నారని తెలిపింది. నమోదు చేసుకోవాలనుకునే వారు ఈ–శ్రమ్ మొబైల్ అప్లికేషన్‌ను గానీ వెబ్‌సైట్‌ను గాని ఉపయోగించుకోవచ్చని తెలిపింది. ఇంకా, కామన్ సర్వీస్ సెంటర్లు(సీఎస్సీలు), రాష్ట్ర సేవా కేంద్ర, లేబర్ ఫెసిలిటేషన్ సెంటర్లు, గుర్తించిన పోస్టాఫీసులు, డిజిటల్ సేవా కేంద్రాలకు వెళ్లాలని వివరించింది. నమోదైన వారికి దేశవ్యాప్తంగా చెల్లుబాటయ్యే డిజిటల్ ఈ–శ్రమ్ కార్డు అందజేస్తారనీ, వారు తమ వివరాలను ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవచ్చని తెలిపింది. ఈ–శ్రమ్ కార్డు కలిగిన వారు ప్రమాదవశాత్తు మరణించినా, శాశ్వత అంగవికలత్వం ప్రాపించినా రూ.2 లక్షల పరిహారం అందుతుందనీ, పాక్షిక అంగ వైకల్యమైతే రూ.1 లక్ష సాయం అందుతుందని తెలిపింది. -
పొంగిపోను.. కుంగిపోను..: దత్తాత్రేయ
సాక్షి, హైదరాబాద్: ‘‘నేను సన్మానాన్ని, అవమానాన్ని ఒకే విధంగా స్వీకరిస్తా. సన్మానించారని పొంగిపోను.. అవమానించారని కుంగిపోను. స్థిరంగా ఉంటా’’ అని కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. రాజ్‌భవన్ సిబ్బంది గృహ సముదాయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆయన గైర్హాజరైన విషయం తెలిసిందే. దీనిపై విలేకర్లు ప్రశ్నించగా పైవిధంగా బదులిచ్చారు. ఆహ్వానం అందిందా.. లేదా.. అనే అంశంపై తాను స్పందించనన్నారు. సోమవారం ఈఎస్ఐసీ కార్యాలయంలో బండారు దత్తాత్రేయ మీడియాతో మాట్లాడారు. పార్ల మెంటులో మహిళా బిల్లు ఆమోదం పొందితే మహిళలకు మరింత లబ్ధి చేకూరుతుందని పేర్కొన్నారు. దీనికి అన్ని పార్టీలూ మద్దతివ్వాలని కోరారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం నగరంలో మహిళా కార్మికు లు, సంబంధిత అంశాలపై రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించనున్నట్లు ఈ సంద ర్భంగా మంత్రి తెలిపారు. -
టెక్నాలజీతో అవినీతి తగ్గుముఖం
2020 నాటికి 5 కోట్ల మందికి ఉద్యోగాలు: బండారు దత్తాత్రేయ సాక్షి, హైదరాబాద్: సాంకేతిక పరిజ్ఞానంతో వచ్చిన విప్లవాత్మక మార్పులతో ప్రభుత్వ శాఖల్లో అవినీతి గణనీయంగా తగ్గిందని కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు. నేషనల్ కెరీర్ సర్వీస్ (ఎన్సీపీ) పోర్టల్ ద్వారా గ్రామీణ ప్రాంత నిరుద్యోగుల ఎంప్లాయ్మెంట్ రిజిస్ట్రేషన్ సేవలందించేలా తపాలా, కార్మిక, ఉపాధి కల్పన శాఖలు ఆదివారం డాక్ సదన్‌లో ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఎన్సీపీ పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవడంతో 52 విభిన్న రంగాల్లో 3 వేల వృత్తులకు దరఖాస్తు చేసుకునే అవకాశం కలుగుతుందని దత్తాత్రేయ చెప్పారు. 2020 నాటికల్లా భారత యువత 80 కోట్లకు చేరుతుందని, అప్పటికి 5 కోట్ల మందికి ఉద్యోగావకాశాలు కల్పించేలా కేంద్రం కార్యాచరణ రూపొందించిందన్నారు. ఎన్సీపీ ద్వారా ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 3.75 కోట్ల మంది రిజిస్టర్ అయ్యారని, 14 లక్షల యాజమాన్యాలు ఇందులో ఉన్నాయన్నారు. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నేరుగా దరఖాస్తుదారుడికే అవకాశాలు దక్కే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టినట్లు పేర్కొన్నారు. 95 ప్రధాన పోస్టాఫీసుల ద్వారా ఎన్సీపీ సేవలు ఆరంభిస్తున్నట్లు తపాలా శాఖ కార్యదర్శి బీవీ సుధాకర్ తెలిపారు. -
మండలానికో ఈఎస్ఐ: దత్తాత్రేయ
సాక్షి, హైదరాబాద్: ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్(ఈఎస్ఐసీ) సేవల విస్తరణలో భాగంగా మండలానికో డిస్పెన్సరీ ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ తెలిపారు. శుక్రవారమిక్కడ జరిగిన ఈఎస్ఐసీ రాష్ట్ర ప్రతినిధుల సదస్సులో మంత్రి మాట్లాడారు. మారుమూల ప్రాంతాల్లోని కార్మికులకు కూడా ఈఎస్ఐ సేవలు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు. ప్రస్తుతం జిల్లా కేంద్రాలు, ముఖ్యమైన పట్టణాల్లో 58 డిస్పెన్సరీలు ఉన్నాయని, వాటిని మరింత విస్తరిస్తున్నామని చెప్పారు. ఆటోరిక్షా కార్మికుల ఈఎస్ఐ సేవలకు సంబంధించి నెల రోజుల్లో ఉత్తర్వులు జారీ చేస్తామన్నారు. ఈఎస్ఐ సంస్థకు ఐపీ(ఇన్‌పేషెంట్)లే వీఐపీలని, అందుకు అనుగుణంగా చికిత్సలు అందించాలని సిబ్బందిని కోరారు. కార్మికుల వైద్య సేవలలో పారదర్శకంగా ఉండేందుకు ఆన్లైన్ విధానాన్ని ప్రవేశ పెడుతున్నట్లు దత్తాత్రేయ తెలిపారు. దేశ వ్యాప్తంగా 2.20 కోట్ల మంది ఈఎస్ఐ కార్డుదారులున్నారని, కుటుంబ సభ్యులందరినీ కలుపుకుంటే 8 కోట్ల మందికి వైద్య సేవలు అందుతున్నాయని వివరించారు. ఈఎస్ఐ ఆస్పత్రులలో ప్రతిరోజు బెడ్‌షీట్ మర్చేలా చర్యలు తీసుకుంటున్నామని, అందుకు అనుగుణంగా ఏడు రంగుల్లో బెడ్షీట్లను అందుబాటులో ఉంచామని, రోజుకో రంగులో బెడ్షీట్లు ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఈఎస్ఐసీలోని 8,450 ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని అధికారులను ఆదేశించినట్లు దత్తాత్రేయ పేర్కొన్నారు. నూతన కార్యవర్గం ఏకగ్రీవం ఈఎస్ఐసీ 2016-2018 సంవత్సరాలకుగాను యూనియన్ రాష్ట్ర స్థాయి నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా టి.నరసింహన్, కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఎ.సుదర్శనమ్, ఉపాధ్యక్షులుగా ఎ.సురేష్‌బాబు, జి.సుభాష్‌చంద్ర, టి.వి.కిషోర్‌కుమార్, ప్రధానకార్యదర్శిగా ఎం.పాండు, సంయుక్త కార్యదర్శులుగా ఏవీ రామకృష్ణ, ఎస్వీ రమణ, కోశాధికారిగా జీఎన్వీ మహేష్ ఎన్నికయ్యారు. -
ఆర్థిక శాఖతో విభేదాల్లేవు
కార్మికుల కోసం ప్రత్యేక బ్యాంకు యోచన: దత్తాత్రేయ సాక్షి, హైదరాబాద్: ఉద్యోగుల భవిష్యనిధి విషయంలో ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలన్నీ తాత్కాలిక సమస్యలని, పునరావృతం కాబోవని కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ స్పష్టం చేశారు. కేంద్ర ఆర్థిక శాఖతో తనకు ఎలాంటి విభేదాలూ లేవని, ఆర్థిక ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొనే వారి నిర్ణయాలు ఉంటాయని చెప్పారు. ఆర్బీఐ అన్ని వడ్డీ రేట్లు తగ్గించిన నేపథ్యంలో ఆర్థిక శాఖ వడ్డీలపై కోతలు విధిస్తోందని... అందులో భాగంగానే పీఎఫ్‌పై కోతపడిందన్నారు. కార్మికుల శ్రేయస్సు దృష్ట్యా పీఎఫ్‌పై 8.8 శాతం వడ్డీ ప్రకటించినట్లు తెలిపారు. శనివారం ఆయన హైదరాబాద్ ప్రాంతీయ పీఎఫ్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కార్మికులకు మేడే శుభాకాంక్షలు తెలిపారు. ‘పీఎఫ్‌పై పన్ను విధింపు, 58 ఏళ్ల వరకు ఉపసంహరించుకునే అవకాశం లేకపోవడం, వడ్డీ తగ్గింపు వంటివి తాత్కాలిక పరిణామాలుగా పరిగణించి వాటిని మరిచిపోవాలి. అయితే 58 ఏళ్ల వరకు పీఎఫ్ ఉపసంహరించుకోకూడదని గత యూపీఏ హయాంలో నిర్ణయించినదే. కాకపోతే మేం ఆర్డినెన్స్ ఇచ్చాం. కార్మిక సంఘాల సూచన మేరకు పాత విధానాన్నే కొనసాగిస్తున్నాం’ అని దత్తాత్రేయ చెప్పారు. ప్రభుత్వంపై దుష్ర్పచారం... ఒక వర్గానికి చెందిన వారు తమ ప్రభుత్వంపై కావాలనే కార్మిక వ్యతిరేక ముద్ర వేసేందుకు ప్రయత్నిస్తున్నారని దత్తాత్రేయ అన్నారు. ‘కార్మికుల సంక్షేమం కోసం మా ప్రభుత్వం ఎనలేని కృషి చేస్తోంది. ఈపీఎఫ్ చట్టానికి మరికొన్ని సవరణలతో పాటు దేశవ్యాప్తంగా కార్మిక అవసరాల కోసం ప్రత్యేకంగా ఒక బ్యాంకు ఏర్పాటు చేయాలని యోచిస్తున్నాం. అలాగే వెట్టిచాకిరి రుగ్మతను సమాజం నుంచి పారదోలేందుకు త్వరలో ఒక వ్యవస్థ తీసుకొస్తాం. సర్వే ప్రకారం 1.42 కోట్ల మంది వెట్టిచాకిరిలో మగ్గుతున్నారు. దీని నుంచి విముక్తి పొందిన వారి పునరావాసానికి రూ.3 లక్షల ఆర్థిక సహాయం అందిస్తాం’ అని దత్తాత్రేయ చెప్పారు. -
పీఎఫ్‌పై 8.7% వడ్డీ ఖరారు
వడ్డీ తగ్గింపుపై కార్మిక సంఘాల ఆందోళన న్యూఢిల్లీ: 2015-16 ఆర్థిక సంవత్సరానికి పీఎఫ్ డిపాజిట్లపై 8.7 శాతం వడ్డీని కేంద్రం ఖరారు చేసింది. కార్మిక మంత్రి నేతృత్వంలోని భవిష్య నిధి సంస్థ ఈపీఎఫ్‌వో ట్రస్టీల సెంట్రల్ బోర్డు(సీబీటీ) ఫిబ్రవరిలో పీఎఫ్ డిపాజిట్లపై వడ్డీని 8.8 శాతం చేయాలని ప్రతిపాదించింది. ఆ నిర్ణయాన్ని పక్కనబెట్టిన కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ 8.7 శాతం వడ్డీని ఖరారు చేసింది. ఈ మేరకు సోమవారం లోక్‌సభలో కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ ఇచ్చిన లిఖిత పూర్వక సమాధానంలో వెల్లడించారు. కాగా దీన్ని కార్మిక వ్యతిరేక చర్యగా అభివర్ణించిన కార్మిక సంఘాలు ఆందోళన బాటపట్టాయి. భారతీయ మజ్దూర్ సంఘ్ (బీఎంఎస్) ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించింది. ఈ నెల 27న ఈపీఎఫ్ కార్యాలయాల ఎదుట నిరసన ప్రదర్శన చేయనున్నట్లు బీఎంఎస్ ప్రధాన కార్యదర్శి విర్జేష్ ఉపాధ్యాయ తెలిపారు. స్వతంత్ర సంస్థ అయిన సీబీటీ నిర్ణయంలో ఆర్థిక మంత్రిత్వ శాఖ వేలుపెట్టడం తగదని అన్నారు. ఇండియన్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు అశోక్ సింగ్ ప్రభుత్వానికి పీఎఫ్ నిర్ణయాల్లో తలదూర్చే హక్కు లేదన్నారు. సెప్టెంబర్ 2న భారత్ బంద్ ఆందోళనలో దీన్ని ఓ అంశంగా చేరుస్తామన్నారు. -
ఎస్బీ పల్లిని దత్తత తీసుకుంటా!
కేంద్రమంత్రి దత్తాత్రేయ ప్రకటన కొత్తూరు: మహబూబ్‌నగర్ జిల్లా కొత్తూరు మండలం ఎస్బీ పల్లిని దత్తత తీసుకుంటానని కేంద్ర కార్మికశాఖ మం త్రి బండారు దత్తాత్రేయ అన్నారు. పంచాయతీరాజ్ దివస్‌ను పురస్కరించుకుని ఆదివారం ఇక్కడ నిర్వహించిన గ్రామ్ ఉదయ్‌సే భారత్ ఉదయ్ అభియాన్ గ్రామసభలో మంత్రి మాట్లాడారు. పంచాయతీరాజ్ వ్యవస్థ ద్వారా గ్రామాలు బలపడాలని దత్తాత్రేయ పేర్కొన్నారు. కేంద్రం ప్రవేశపెట్టిన 23 గ్రామీణ పథకాలను అమలు చేస్తే ఎస్బీ పల్లి గ్రామాన్ని దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. గ్రామాల్లో విద్య, వైద్యం, రోడ్లు, సాగునీరు వంటి సౌకర్యాలను కల్పించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. మొబైల్ ద్వారా ఉద్యోగాల కల్పనకుగాను నేషనల్ క్యారియర్ కౌన్సిల్‌ను ఏర్పాటు చేసినట్లు చెప్పారు.