ఆర్థిక శాఖతో విభేదాల్లేవు
కార్మికుల కోసం ప్రత్యేక బ్యాంకు యోచన: దత్తాత్రేయ
సాక్షి, హైదరాబాద్: ఉద్యోగుల భవిష్యనిధి విషయంలో ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలన్నీ తాత్కాలిక సమస్యలని, పునరావృతం కాబోవని కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ స్పష్టం చేశారు. కేంద్ర ఆర్థిక శాఖతో తనకు ఎలాంటి విభేదాలూ లేవని, ఆర్థిక ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొనే వారి నిర్ణయాలు ఉంటాయని చెప్పారు. ఆర్‌బీఐ అన్ని వడ్డీ రేట్లు తగ్గించిన నేపథ్యంలో ఆర్థిక శాఖ వడ్డీలపై కోతలు విధిస్తోందని... అందులో భాగంగానే పీఎఫ్‌పై కోతపడిందన్నారు. కార్మికుల శ్రేయస్సు దృష్ట్యా పీఎఫ్‌పై 8.8 శాతం వడ్డీ ప్రకటించినట్లు తెలిపారు. శనివారం ఆయన హైదరాబాద్ ప్రాంతీయ పీఎఫ్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
కార్మికులకు మేడే శుభాకాంక్షలు తెలిపారు. ‘పీఎఫ్‌పై పన్ను విధింపు, 58 ఏళ్ల వరకు ఉపసంహరించుకునే అవకాశం లేకపోవడం, వడ్డీ తగ్గింపు వంటివి తాత్కాలిక పరిణామాలుగా పరిగణించి వాటిని మరిచిపోవాలి. అయితే 58 ఏళ్ల వరకు పీఎఫ్ ఉపసంహరించుకోకూడదని గత యూపీఏ హయాంలో నిర్ణయించినదే. కాకపోతే మేం ఆర్డినెన్స్ ఇచ్చాం. కార్మిక సంఘాల సూచన మేరకు పాత విధానాన్నే కొనసాగిస్తున్నాం’ అని దత్తాత్రేయ చెప్పారు.
ప్రభుత్వంపై దుష్ర్పచారం...
ఒక వర్గానికి చెందిన వారు తమ ప్రభుత్వంపై కావాలనే కార్మిక వ్యతిరేక ముద్ర వేసేందుకు ప్రయత్నిస్తున్నారని దత్తాత్రేయ అన్నారు. ‘కార్మికుల సంక్షేమం కోసం మా ప్రభుత్వం ఎనలేని కృషి చేస్తోంది. ఈపీఎఫ్ చట్టానికి మరికొన్ని సవరణలతో పాటు దేశవ్యాప్తంగా కార్మిక అవసరాల కోసం ప్రత్యేకంగా ఒక బ్యాంకు ఏర్పాటు చేయాలని యోచిస్తున్నాం. అలాగే వెట్టిచాకిరి రుగ్మతను సమాజం నుంచి పారదోలేందుకు త్వరలో ఒక వ్యవస్థ తీసుకొస్తాం. సర్వే ప్రకారం 1.42 కోట్ల మంది వెట్టిచాకిరిలో మగ్గుతున్నారు. దీని నుంచి విముక్తి పొందిన వారి పునరావాసానికి రూ.3 లక్షల ఆర్థిక సహాయం అందిస్తాం’ అని దత్తాత్రేయ చెప్పారు.