మండలానికో ఈఎస్‌ఐ: దత్తాత్రేయ
సాక్షి, హైదరాబాద్: ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్(ఈఎస్‌ఐసీ) సేవల విస్తరణలో భాగంగా మండలానికో డిస్పెన్సరీ ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ తెలిపారు. శుక్రవారమిక్కడ జరిగిన ఈఎస్‌ఐసీ రాష్ట్ర ప్రతినిధుల సదస్సులో మంత్రి మాట్లాడారు. మారుమూల ప్రాంతాల్లోని కార్మికులకు కూడా ఈఎస్‌ఐ సేవలు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు. ప్రస్తుతం జిల్లా కేంద్రాలు, ముఖ్యమైన పట్టణాల్లో 58 డిస్పెన్సరీలు ఉన్నాయని, వాటిని మరింత విస్తరిస్తున్నామని చెప్పారు. ఆటోరిక్షా కార్మికుల ఈఎస్‌ఐ సేవలకు సంబంధించి నెల రోజుల్లో ఉత్తర్వులు జారీ చేస్తామన్నారు. ఈఎస్‌ఐ సంస్థకు ఐపీ(ఇన్‌పేషెంట్)లే వీఐపీలని, అందుకు అనుగుణంగా చికిత్సలు అందించాలని సిబ్బందిని కోరారు.
కార్మికుల వైద్య సేవలలో పారదర్శకంగా ఉండేందుకు ఆన్‌లైన్ విధానాన్ని ప్రవేశ పెడుతున్నట్లు దత్తాత్రేయ తెలిపారు. దేశ వ్యాప్తంగా 2.20 కోట్ల మంది ఈఎస్‌ఐ కార్డుదారులున్నారని, కుటుంబ సభ్యులందరినీ కలుపుకుంటే 8 కోట్ల మందికి వైద్య సేవలు అందుతున్నాయని వివరించారు. ఈఎస్‌ఐ ఆస్పత్రులలో ప్రతిరోజు బెడ్‌షీట్ మర్చేలా చర్యలు తీసుకుంటున్నామని, అందుకు అనుగుణంగా ఏడు రంగుల్లో బెడ్‌షీట్లను అందుబాటులో ఉంచామని, రోజుకో రంగులో బెడ్‌షీట్లు ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఈఎస్‌ఐసీలోని 8,450 ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని అధికారులను ఆదేశించినట్లు దత్తాత్రేయ పేర్కొన్నారు.
నూతన కార్యవర్గం ఏకగ్రీవం
ఈఎస్‌ఐసీ 2016-2018 సంవత్సరాలకుగాను యూనియన్ రాష్ట్ర స్థాయి నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా టి.నరసింహన్, కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఎ.సుదర్శనమ్, ఉపాధ్యక్షులుగా ఎ.సురేష్‌బాబు, జి.సుభాష్‌చంద్ర, టి.వి.కిషోర్‌కుమార్, ప్రధానకార్యదర్శిగా ఎం.పాండు, సంయుక్త కార్యదర్శులుగా ఏవీ రామకృష్ణ, ఎస్‌వీ రమణ, కోశాధికారిగా జీఎన్‌వీ మహేష్ ఎన్నికయ్యారు.