నకిలీ విత్తనాలపై రైతు ఫిర్యాదు
ర్యాలి(ఆత్రేయపురం), న్యూస్‌లైన్ : సాగు చేసేందుకు కొనుగోలు చేసిన విత్తనాల్లో బియ్యం, ముక్కిపోయిన ధాన్యం ఉన్నాయని ఓ రైతు వ్యవసాయ అధికారులకు ఫిర్యాదు చేశాడు. వివరాల్లోకి వెళితే.. మండలంలోని ర్యాలి గ్రామానికి చెందిన రైతు గెడ్డం సత్తిబాబు ఆరు ఎకరాల వరి చేను కౌలుకు సాగు చేస్తున్నాడు. తుపాన్లు, భారీ వర్షాలతో రెండేళ్లుగా పంట నష్టపోయాడు. రబీకి నారుమడి వేసేందుకు రావులపాలెంలోని ప్రైవేట్ విత్తనాల షాపులో 30 కిలోల (8 బస్తాలు) విత్తనాలు కొనుగోలు చేశాడు. రెండు బస్తాల విత్తనాలను చేలో వేయగా, మిగలిన 6 బస్తాల్లోని రెండింటిలో నకిలీ విత్తనాలు ఉన్నాయి.
వాటిని నానబెట్టినా మొలకొచ్చే పరిస్థితి లేదని గ్రహించి దీనిపై మండల వ్యవసాయాధికారి భార్గవ్ మహేష్‌కు ఫిర్యాదు చేశాడు. దీనిపై విచారణ జరిపి, చర్యలు తీసుకుంటామని ఏఓ మహేష్ హామీ ఇచ్చారు. అనేక మంది రైతులు డీలర్ల మోసాలకు తీవ్రంగా నష్టపోతున్నారని కొందరు రైతులు ‘న్యూస్‌లైన్’ దృష్టికి తీసుకొచ్చారు. ఏఓ భార్గవ్ మహేష్ మాట్లాడుతూ రైతులు ఎక్కడపడితే అక్కడ విత్తనాలు కొనుగోలు చేయకుండా, సర్టిఫై చేసిన విత్తనాలనే కొనుగోలు చేయాలని రైతులకు సూచించారు.