సగం 4జీ కనెక్షన్లు ఆసియాలోనే: జీఎస్ఎంఏ
న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా 4జీ (ఎల్టీఈ-లాంగ్ టెర్మ్ ఇవల్యూషన్) నెట్‌వర్క్‌ల జోరు పెరుగుతోంది. భారత్, చైనాల్లో 4జీ సర్వీసులు విస్తృతంగా విస్తరిస్తున్నాయి. దీంతో 2017 కల్లా మొత్తం 4జీ కనెక్షన్లలో 47 శాతం భారత్, చైనాలవే ఉంటాయని అంతర్జాతీయ టెలికాం సంస్థ, జీఎస్ఎం అసోసియేషన్(జీఎస్ఎంఏ) మంగళవారం తెలిపింది.
ఈ సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం.. 4జీ కి అవసరమైన స్పెక్ట్రమ్‌ను సకాలంలో మొబైల్ ఆపరేటర్లకు కేటాయించడం, 4జీ డివైస్‌లు చౌకధరల్లో లభ్యమవుతుండడం, అధిక స్పీడ్ ఉన్న డేటా సర్వీసుల వినియోగానికి వినూత్నమైన టారిఫ్‌లు అందుబాటులోకి రావడం వంటి కారణాల వల్ల 4జీ నెట్‌వర్క్‌లు వేగంగా విస్తరిస్తున్నాయి. ప్రస్తుతం భారత్‌లో 4జీ కనెక్షన్లను ఒక్క భారతీ ఎయిర్టెల్ మాత్రమే అఫర్ చేస్తోంది. త్వరలో రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ కూడా ఈ సర్వీసులను అందిస్తుందని అంచనా. ప్రస్తుతం 20 శాతం జనాభాకే అందుబాటులో ఉన్న 4జీ కవరేజ్ 2017 కల్లా సగం జనాభాకు విస్తరిస్తుంది. 4జీ సర్వీసుల కారణంగా ఒక్కో వినియోగదారుడి నుంచి వచ్చే సగటు రాబడి(ఏఆర్పీయూ-యావరేజ్ రెవెన్యూ పర్ యూజర్) చెప్పుకోదగ్గ స్థాయిలో పెరుగుతుంది.