ఎన్ఆర్ఐ మహిళ సాహస యాత్ర
వడోదర: మహిళలను రక్షించండి, విద్యావంతుల్ని చేయండి అని ప్రచారం చేస్తూ గుజరాత్‌కు చెందిన ఎన్ఆర్ఐ మహిళ భారులత కాంబ్లే (43) కారు యాత్ర చేపట్టారు. ఇంగ్లండ్ నుంచి 32 వేల కిలోమీటర్ల దూరం కారు నడుపుతూ స్వదేశానికి వచ్చారు. ఆమె 57 రోజుల పాటు 32 దేశాలు దాటి వచ్చారు.
భారులత సొంతూరు గుజరాత్‌లోని నవ్సారి. ఆదివారం నవ్సారిలో స్థానిక ప్రజాప్రతినిధులు ఆమెను సన్మానించారు. అంతకుముందు బరోడాలో కూడా ఆమెకు అభినందన సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా భారులత మాట్లాడుతూ.. సొంతూరులో ఆస్పత్రి నిర్మించనున్నట్టు చెప్పారు. తగిన వైద్య సదుపాయాలు లేక తన తాత మరణించడం చూశానని గుర్తు చేసుకున్నారు. 32 దేశాల ప్రజలతో మాట్లాడానని, నవ్సారిలో అన్ని వసతులతో ఆస్పత్రి నిర్మాణం కోసం నిధులు సేకరించానని తెలిపారు.
57 రోజుల్లో అత్యధిక దేశాలను సందర్శించిన తొలి మహిళ తానేనని చెప్పారు. రెండు ఖండాలు, మూడు పెద్ద ఎడారులు, పర్వతాలు దాటి వచ్చారు. ఈ కారు యాత్ర గిన్నిస్ బుక్ ప్రపంచ రికార్డుల్లో నమోదైంది.