జవాబు చెప్పాల్సిందే
సాక్షి, మహబూబ్‌నగర్:
‘అధికారులకు జవాబుదారీతనం లేకుండా పోయింది. మూడేళ్లసంది అడిగేటోళ్లు లేరని ఇష్టానుసారంగా ప్రవర్తించిండ్రు. ఇక నుంచి ప్రజాప్రతినిధులు అడిగే వాటికి కచ్చితంగా సమాధానాలు చెప్పాల్సిందే. ఓట్లేసి గెలిపించిన మమ్మల్ని ప్రజలు అడుగుతున్నరు. వారికి మేం సమాధానం చెప్పుకోవాలి. వచ్చే సమావేశానికి అరకొర సమాచారంతో వస్తే సహించేది లేదు. వారిపై చర్యలు తీసుకుంటా’ అని జెడ్పీ చైర్మన్ బండారి భాస్కర్ జిల్లా అధికార యంత్రాంగంపై విరుచుకుపడ్డారు. శుక్రవారం జెడ్పీ కార్యాలయంలో గ్రామీణాభివృద్ధి, వ్యవసాయం, విద్య, వైద్యసేవలు, మహిళా శిశుసంక్షేమానికి చెందిన స్థాయి సంఘాల సమీక్షా సమావేశాలు జరిగాయి. జెడ్పీ చైర్మన్ బండారి భాస్కర్ అధ్యక్షతన గ్రామీణాభివృద్ధి, విద్య వైద్యానికి సంబంధించిన స్థాయి సంఘాలు జరగగా, వైస్ చైర్మన్ నవీన్‌కుమార్‌రెడ్డి అధ్యక్షతన వ్యవసాయ స్థాయి సంఘం, ధరూరు జెడ్పీటీసీ సభ్యురాలు పద్మమ్మ అధ్యక్షతన స్త్రీ, శిశు సంక్షేమ స్థాయి సంఘం సమీక్షలు జరిగాయి. సుదీర్ఘంగా సాగిన ఈ సమావేశాల్లో సంబంధిత శాఖలకు చెందిన అధికారులపై జెడ్పీటీసీ సభ్యులు ప్రశ్నల వర్షం కురిపించారు. దీంతో అధికారులు సరైన సమాధానాలు చెప్పలేక తడబడ్డారు. అలాగే ఎజెండా కాపీలు సక్రమంగా లేవంటూ జెడ్పీటీసీలు అసహనం వ్యక్తంచేశారు. ఈ విషయమై జెడ్పీ చైర్మన్ బండారి భాస్కర్ జోక్యం చేసుకొని అధికారుల తీరుపై మండిపడ్డారు. వచ్చే సమావేశానికి సమాచార లోపం లేకుండా సరిచూసుకోవాలని హితవు పలికారు.
బాలబడులను పెంచాల్సిందే..
గ్రామ సంఘాల ద్వారా ఆటపాటలతో బడి ఈడు కంటే ముందు పిల్లలను విద్యావంతులను చేసేందుకు ఉద్దేశించిన బాలబడులను అన్ని మండలాల్లో ఏర్పాటు చేయాలని గ్రామీణాభివృద్ధి స్థాయి సంఘం నిర్ణయించింది. జిల్లాలో ప్రస్తుతం ఏడు మండలాల పరిధిలో 180 బాలబడులలో 2721 మంది పిల్లలున్నారని, వారిని మరింత పెంచాల్సిన అవసరముందని సభ్యులు అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం ఎంతో ఉన్నత లక్ష్యంతో ఏర్పాటు చేసిన సాక్షరభారత్ స్కూళ్లు ఎక్కడా పనిచేయడం లేదన్నారు. గ్రామాల్లో నిర్మిస్తున్న వ్యక్తిగత మరుగుదొడ్లకు సంబంధించిన బిల్లులను వెంటనే మంజూరు చేయాలని సభ్యులు డిమాండ్ చేశారు.
డ్రిప్ ఇరిగేషన్‌కు
గ్రామసభ తప్పనిసరి...
డ్రిప్ ఇరిగేషన్ సబ్సిడీలకు సంబంధించి అర్హుల ఎంపిక గ్రామ సభల ఆమోదం తప్పనిసరి చేయాలని జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ నవీన్‌కుమార్‌రెడ్డి అధికారులకు సూచించారు. తన అధ్యక్షతన జరిగిన వ్యవసాయస్థాయి సంఘం సమీక్షా సమావేశంలో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. జిల్లాలో సకాలంలో వర్షాలు కురవకపోవడంతో రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. మన ఊరు- మన కూరగాయలు కార్యక్రమం ద్వారా రైతులు పండించిన కూరగాయలకు సరైన మార్కెటింగ్ సౌకర్యాలు కల్పించాలని మార్కెటింగ్ అధికారులను ఆదేశించారు. ఆధునిక వ్యవసాయంపై రైతులకు శిక్షణా కార్యక్రమాలు నిర్వహించాలన్నారు.
స్కూళ్లకు పక్కా భవనాలు...
చాలా ప్రభుత్వ పాఠశాలలోమౌలిక సదుపాయాలు కూడా లేవని విద్య, వైద్యసేవల స్థాయి సంఘం సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. పాఠశాలలో మరుగుదొడ్లు, వాటి నిర్వహణను కచ్చితత్వం చేయాలని డిమాండ్ చేశారు. శిథిలమైన పాఠశాలల భవనాలను రీషెడ్యూల్ చేయాలన్నారు. విద్యాహక్కు చట్టం పక్కాగా అమలు జరిగేలా ప్రభుత్వం కృషి చేయాలన్నారు. పీహెచ్సీలలో వైద్యుల కొరత ఉందని, వెంటనే వాటిని భర్తీ చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. ఆసుపత్రులలో మందులు లేవని, చిన్న జబ్బు చేసినా బయట నుంచి కొనుగోలు చేయాల్సిన దుస్థితి ఉందన్నారు.
సమీక్షలకు డుమ్మా కొట్టిన
ఎంపీలు, ఎమ్మెల్యేలు
స్థాయి సంఘాలలో సభ్యులుగా ఉన్న ఎమ్మెల్యేలు శుక్రవారం జరిగిన సమీక్షలకు డుమ్మా కొట్టారు. కేవలం ఇద్దరే హాజరయ్యారు. కల్వకుర్తి ఎమ్మెల్యే వంశీచందర్‌రెడ్డి, నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్‌రెడ్డి, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ జనార్ధన్‌రెడ్డి మాత్రమే హాజరయ్యారు. గ్రామీణాభివృద్ధి స్థాయి సంఘంలో సభ్యుడైన మహబూబ్‌నగర్ ఎంపీ ఏపీ జితేందర్‌రెడ్డి, వ్యవసాయ స్థాయి సంఘంలో సభ్యులుగా ఉన్న ఎమ్మెల్యేలు డీకే అరుణ, జి.చిన్నారెడ్డి, ఎనుముల రేవంత్‌రెడ్డి, విద్య, వైద్య స్థాయి సంఘంలో సభ్యులుగా ఉన్న జూపల్లి కృష్ణారావు, మహిళా, శిశుసంక్షేమ స్థాయి సంఘంలో సభ్యులుగా ఉన్న నాగర్‌కర్నూల్ ఎంపీ నంది ఎల్లయ్య, ఎమ్మెల్సీలు ఎస్.జగదీశ్వర్‌రెడ్డి, కె.నాగేశ్వర్, ఎమ్మెల్యే చిట్టెం రాంమోహన్‌రెడ్డిలు డుమ్మా కొట్టారు. సమావేశాల్లో ఇన్చార్జి జెడ్పీ సీఈఓ నాగమ్మ, పలువురు జెడ్పీటీసీ సభ్యులు, అధికారులు పాల్గొన్నారు.