సరిహద్దులో డ్యాం రచ్చ
– నాలుగు గంటలు హైవే దిగ్బంధం, రైల్ రోకోలు
చెన్నై : కేరళ-తమిళనాడు సరిహద్దుల్లో ఆదివారం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నాలుగు గంటలపాటు జాతీయ రహదారిని నిరసనకారులు దిగ్బంధం చేశారు. రైల్ రోకోలకు దిగారు. పోలీసు వలయాన్ని ఛేదించుకుని కేరళ వైపు దూసుకెళ్లడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది.
తోపులాట, వాగ్వివాదాల నడుమ డీఎంకేతోపాటు పలు పార్టీల, సంఘాల నాయకుల్ని పోలీసులు అరెస్టు చేశారు. భవాని నదిపై డ్యాం కట్టేందుకు కేరళ చేస్తున్న ప్రయత్నాలు పశ్చిమ తమిళనాడులోని మూడు జిల్లాల్లో ఆక్రోశాన్ని రగిల్చింది.ఈ జలాశయంలోకి నీటి రాక కరవైన పక్షంలో కోయంబత్తూరు, తిరుప్పూర్, ఈరోడ్‌తోపాటు కరూర్ జిల్లాల్లో తాగు, సాగు నీటి కష్టాలు తప్పవన్న ఆందోళన బయలుదేరింది.
కేరళ చర్యల్ని నిరసిస్తూ ఆదివారం డీఎంకే, కాంగ్రెస్, వీసీకే, తమిళ మానిల కాంగ్రెస్, మనిద నేయ మక్కల్ కట్చి, కొంగు మక్కల్ కట్చిలతోపాటు 40 పార్టీలు, ప్రజా సంఘాలు ఇచ్చిన పిలుపు సరిహద్దుల్లో ఉద్రిక్తతకు దారితీసింది. డీఎంకే మాజీ మంత్రులు సుబ్బలక్ష్మి జగదీశన్, పొంగలురు పళని స్వామి, వెల్ల కోవిల్ స్వామినాథన్, ఎంఎంకే నేత జవహరుల్లా, కొంగు మక్కల్ కట్చి నేత ఈశ్వర్‌లతో పాటు వేలాదిగా నాయకులు, కార్యకర్తలు కేరళ సరిహద్దులో కోయంబత్తూరు– పాలక్కాడు జాతీయ రహదారిని దిగ్బంధించారు.
అక్కడి టోల్గేట్ వద్ద నాలుగు గంటల పాటు రహదారిని దిగ్బంధించడంతో పోలీసులు నిరసనకారుల్ని రెండుగా విడదీసి ఓ వైపు ఉన్న వాళ్లు మరో వైపు రాకుండా అడ్డుకున్నారు. దీంతో మరో వైపు ఉన్న వాళ్లు ఆగ్రహించి కేరళ వైపు పరుగులు తీశారు. వాగ్వాదాలు, తోపులాటల మధ్య నాయకుల్ని అరెస్టు చేశారు. కేరళ చర్యలకు నిరసనగా కోయంబత్తూరు, ఈరోడ్, తిరుప్పూర్‌లలో సీపీఐ నేతృత్వంలో రైల్ రోకోలు సాగాయి. కోయంబత్తూరు ఉత్తర స్టేషన్లో ఓ రైలును ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి ముత్తరసన్ నేతృత్వంలో కార్యకర్తలు అడ్డుకున్నారు. ఈరోడ్‌లో మాజీ కార్యదర్శి టీ పాండియన్ నేతృత్వంలో నిరసన సాగగా ఆందోళనకారుల్ని పోలీసులు అరెస్టు చేశారు.