Bhavanidvipam
-
బరం పార్కు చేజారేనా!
ఇప్పటికే భవానీద్వీపం ప్రై‘వేటు’కు యత్నాలు మంత్రులకు, ఉన్నతాధికారులకు బరం పార్కు గదుల కేటాయింపు యోచనలో పాలకులు పర్యాటకులకు కేటాయిస్తేనే ఉపయుక్తం విజయవాడ : ఆంధ్రప్రదేశ్ పర్యాటకాభివృద్ధి సంస ్థ(ఏపీటీడీసీ) ఆధ్వర్యంలోని బరం పార్కును ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు భవానీద్వీపాన్ని, బరం పార్కు స్థలాన్ని ఏపీటీడీసీకి ఇచ్చారు. 2002లో బరం పార్కులో రెస్టారెంట్లు, గదులను, 2004లో భవానీ ద్వీపాన్ని అభివృద్ధి చేశారు. భవానీద్వీపంలో నేటికీ పూర్తిస్థాయిలో సౌకర్యాలు లేవు. అయినా ద్వీపం, బరం పార్కులు ఏపీటీడీసీకి లక్షల ఆదాయం సమకూర్చి పెడుతున్నాయి. రాష్ట్ర విభజన నేపథ్యంలో భవానీద్వీపాన్ని ప్రభుత్వం మరింత అభివృద్ధి చేస్తుందని అందరూ భావించారు. ఏడాదిన్నర అయినా ముఖ్యమంత్రి చంద్రబాబు దీనిపై దృష్టి పెట్టలేదు. భవానీద్వీపం ప్రై’వేటు’కు యత్నాలు ఇటీవల వివిధ శాఖల అధికారులతో ముఖ్యమంత్రి సమావేశం నిర్వహించినప్పుడు 133 ఎకరాల్లోని భవానీద్వీపం అభివృద్ధి గురించి చర్చకు వచ్చింది. ద్వీపం ఒకటే కాదని, నదిలోని చిన్నచిన్న ద్వీపాలతో కలిసి మొత్తం ఐదువేల ఎకరాలను ఏమీ చేయాలనే అంశంపై తనకు ప్రత్యేక ఆలోచన ఉందని సీఎం తెలిపారు. ఇటీవల సింగపూర్, జపాన్ బృదాలు వచ్చినప్పుడు వారికి బరం పార్కును, భవానీద్వీపాన్ని కలెక్టర్ వ్యక్తిగతంగా చూపించారు. దీన్నిబట్టి భవానీద్వీపాన్ని ప్రై‘వేటు’ వ్యక్తులకు కట్టబెట్టేందుకు ముఖ్యమంత్రి ఆలోచిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. బరం పార్కును పరిశీలించిన మంత్రి నారాయణ బుధవారం మున్సిపల్ మంత్రి నారాయణ ఆకస్మికంగా బరం పార్కును పరిశీలించారు. గదులు ఎన్ని ఉన్నాయి. సమావేశాలు పెట్టుకునే అవకాశం ఉందా తదితర సమాచారం సేకరించినట్లు తెలిసింది. ఈ గదులను మంత్రులకు గాని, ఉన్నతాధికారులకు గాని కేటాయిస్తే ఏ విధంగా ఉంటుందని కూడా ఆరా తీసినట్లు సమాచారం. దీంతో ఏపీటీడీసీ అధికారులు, సిబ్బందిలో కలకలం మొదలైంది. ప్రభుత్వ యంత్రాంగాన్ని విజయవాడకు తరలించేందుకు మున్సిపల్ మంత్రి నారాయణ తీవ్రంగా కసరత్తు చేస్తున్నారు. ఇందులో భాగంగానే బరం పార్కులోని గదులను కూడా పరిశీలించినట్లు తెలిసింది. వీటిని మంత్రులకు కాని, ఉన్నతాధికారులకు కాని, ఏదైనా ప్రభుత్వ శాఖకు కేటాయిస్తే.. పర్యాటకులు తీవ్ర ఇబ్బంది పడతారని ఏపీటీడీసీ సిబ్బంది ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం కేవలం సమావేశాలు నిర్వహించుకునేందుకే దీన్ని ఉపయోగించుకోవాలి తప్ప పూర్తిగా స్వాధీనం చేసుకోకూడదని వారు డిమాండ్ చేస్తున్నారు. రూ.కోటిన్నరతో అభివృద్ధి బరం పార్కు, భవానీద్వీపంలోని గదుల్లో కనీస సౌకర్యాలు లేకపోవడంతో ఇటీవలే ఏపీటీడీసీ అధికారులు రూ.కోటిన్నరతో మరమ్మతులు చేయించారు. పాడైపోయిన ఏసీలు బాగు చేయించడం, ఫ్లోరింగ్, రంగులు వేయించి, అవసరమైన గదుల్లో సౌకర్యాలు కూడా ఏర్పాటుచేశారు. ఆదాయం పెంచుకోవడంలో భాగంగా రాత్రులందూ క్యాండిల్ డిన్నర్, ఉదయం బోట్లో బ్రేక్ఫాస్టులు ఏర్పాటు చేసి పర్యాటకుల్ని ఆకట్టుకుంటున్నారు. ఇప్పుడు దీనిపై ప్రభుత్వం కన్నేయడం అధికారులకు మింగుడు పడటం లేదు. అద్దెకు తీసుకుంటారని అనుకుంటున్నా బరంపార్కులోని గదులను, రెస్టారెంట్‌ను ఇటీవల కోటిన్నరతో అభివృద్ధి చేశాం. ఇతర పర్యాటకుల లాగానే ప్రజాప్రతినిధులు, అధికారులు ఈ వీటిని తీసుకుని అద్దె చెల్లిస్తారని భావిస్తున్నాం. పర్యాటక కేంద్రంగానే దీన్ని అభివృద్ధి చేస్తే బాగుంటుంది. బరం పార్కును మంత్రులకు కేటాయించడంపై ఉన్నతాధికారుల నుంచి ఏ విధమైన ఆదేశాలూ అందలేదు. - డీవీఎం వి.వి.ఎస్.గంగరాజు -
అద్భుత ద్వీపం
► భవానీద్వీపానికి సింగపూర్ బృందం కితాబు ► ఏటా పెరుగుతున్న ఆదాయం ► అయినా.. అభివృద్ధి శూన్యం ► ఇప్పటికైనా స్పందించాలి మరి.. ‘ఇటువంటి ద్వీపాన్ని మా వద్ద కృత్రిమంగా నిర్మించాం. ఇక్కడ సహజసిద్ధంగా ఉంది. కృష్ణానదిలో ఉన్న ఈ ద్వీపాన్ని చూస్తే ఆశ్చర్యమేస్తోంది.’ ..ఇవి ఎవరో సాధారణ వ్యక్తులు అన్న మాటలు కావు. కొత్త రాజధానిని ఏరియల్ సర్వే చేసేందుకు వచ్చిన సింగపూర్ బృందం బుధవారం మునిసిపల్ మంత్రి నారాయణ వద్ద చెప్పిన మాటలు. అంతగా విదేశీయులను సైతం ఆకట్టుకున్న భవానీద్వీపం అభివృద్ధిలో మాత్రం అధఃపాతాళంలోనే ఉంది. ఏటా పర్యాటకుల సంఖ్య పెరుగుతున్నా.. లక్షల్లో ఆదాయం వస్తున్నా.. ద్వీపంలో అదనపు సౌకర్యాల కల్పనపై దృష్టిసారించే వారే కరువయ్యూరు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రాజధాని నిర్మాణంతో పాటు భవానీద్వీపాన్ని కూడా అభివృద్ధి చేయూలని పర్యాటకులు కోరుతున్నారు. విజయవాడ : చుట్టూ పచ్చటి పచ్చికబయళ్లు.. కృష్ణమ్మ పరవళ్లు.. ప్రశాంతమైన వాతావరణంతో ప్రకృతి సహజసిద్ధంగా ఏర్పడిన అద్భుతమైన పర్యాటక ప్రాంతం భవానీద్వీపం. 133 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. అయితే, ఇందులో కేవలం 25 ఎకరాలను మాత్రమే ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీటీడీసీ) ఉపయోగించుకుంటోంది. నాలుగు ట్రీ రిస్టార్ట్స్, 14 డీలక్స్ కాటేజీలు, రెండు కాన్ఫరెన్స్ హాళ్లు, రెండు రెస్టారెంట్లు ఉన్నాయి. చిన్నారుల కోసం సాహస క్రీడలు, రోప్గేమ్స్ అదనపు ఆకర్షణ. వీటికితోడు కృష్ణానదిలో విహారానికి బోధిసిరి, కృష్ణవేణి, అమర్పాలి, భవానీ బోట్లతో పాటు స్పీడ్, జట్‌స్కీ బోట్లు అందుబాటులో ఉన్నాయి. వీటన్నింటి వల్లే ఇటీవల ముగిసిన కార్తీకమాసంలో భవానీద్వీపం ద్వారా ఏపీటీడీసీకి సుమారు రూ.30 లక్షల ఆదాయం వచ్చింది. గత ఏడాది రూ.19 లక్షలు రాగా, ఈ ఏడాది మరో రూ.11 లక్షలు ఎక్కువ రావడం విశేషం. అభివృద్ధి సంగతేంటి? విదేశీయులను సైతం ఆకట్టుకున్న భవానీద్వీపం ఎంతమేరకు అభివృద్ధి చెందిందనేది పర్యాటకుల ప్రశ్న. సింగపూర్ బృందం, రాష్ట్ర ప్రభుత్వం దీనిపై పూర్తిస్థాయిలో దృష్టిసారిస్తే అద్భుత పర్యాటక కేంద్రాల్లో ఒకటిగా తీర్చిదిద్దవచ్చని వారు పేర్కొంటున్నారు. రాజధాని నిర్మాణంతో పాటు ద్వీపం అభివృద్ధిపైనా దృష్టి సారించాలని కోరుతున్నారు. అభివృద్ధికి ఐదు మార్గాలు.. 1 . కేరళలోని అలప్పీ సరస్సులో వెయ్యి హౌస్ బోట్లు ఉంటాయి. ఇటువంటి హౌస్ బోట్లను కృష్ణానదిలో కూడా ఏర్పాటుచేస్తే పర్యాటకుల్ని ఆకట్టుకుంటాయి. ఈ బోట్లలోనే ఒకటి రెండు రోజులు గడిపేందుకు కావాల్సిన సౌకర్యాలూ ఉంటాయి 2 . భవానీ ద్వీపంలో డిస్నీల్యాండ్ తరహాలో వాటర్ గేమ్స్ ఏర్పాటు చేయాలి. స్విమ్మింగ్‌పూల్స్ కూడా సిద్ధంచేస్తే సమ్మర్లో పర్యాట కులను ఆకట్టుకోవచ్చు. 3 విదేశీ పర్యాటకుల్ని ఆకట్టుకునేలా భవానీ ద్వీపంలో వివిధ రకాల ఫుడ్ ఐటమ్స్‌ను అందుబాటులోకి తేవాలి. నిష్ణాతులైన చెఫ్‌లతో వీటిని తయూరుచేరుుస్తే బాగుంటుంది. అలాగే, పర్యాటకులు షాపింగ్ చేసుకునేందుకు వీలుగా హ్యాండీక్రాఫ్ట్ ఎగ్జిబిషన్లు నిర్వహించాలి. 4 దుర్గగుడికి-భవానీద్వీపానికి అనుసంధానం ఏర్పాటు చేయాలి. దీనివల్ల గుడికి, ద్వీపానికి పర్యాటకుల సంఖ్య పెరుగుతుంది. దుర్గగుడి నుంచి బరం పార్కుకు రోప్‌వే, అక్కడి నుంచి భవానీ ద్వీపానికి బోటింగ్ సౌకర్యం కల్పించాలి. 5. సందర్శకులు జిల్లాలోని వివిధ పర్యాటక ప్రాంతాలను చూసేలా ద్వీపం నుంచి టూరిస్టు బస్సు సౌకర్యం కల్పించాలి. ఇలాంటి సౌకర్యాలు కల్పిస్తే భవానీ ద్వీపానికి పర్యాటకుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. -
శిల్పారామానికి విరామం
భవానీద్వీపంలో స్థలం ఇచ్చేందుకు ప్రభుత్వం నో మరోచోట 10 ఎకరాల అన్వేషణ భూమి దొరికితేనే నిర్మాణం సాక్షి, విజయవాడ : భవానీద్వీపంలో నిర్మించ తలపెట్టిన శిల్పారామం ప్రస్తుతానికి వాయిదాపడింది. ఈ ప్రతిపాదన మరోసారి కాగితాలకే పరిమితమైంది. శిల్పారామం ఏర్పాటుకు కావాల్సిన భూమి లభ్యంకాక ఇన్నాళ్లు నిర్మాణం వాయిదా పడుతూ వచ్చింది. గత్యంతరం లేని పరిస్థితుల్లో భవానీద్వీపంలో శిల్పారామం నిర్మించాలని అధికారులు నిర్ణయించారు. దీనికి రాష్ట్ర ప్రభుత్వం బ్రేక్ వేయడంతో శిల్పారామం సొసైటీ అధికారులు తిరిగి స్థలాన్వేషణలో పడ్డారు. ద్వీపంలో 20 ఎకరాల భూమి భవానీద్వీపం 133 ఎకరాల విస్తీర్ణంలో ఆంధ్రప్రదేశ్ పర్యాటకాభివృద్ధి సంస్థ (ఏపీటీడీసీ) ఆధీనంలో ఉండగా, కేవలం 10 ఎకరాలను మాత్రమే ఏపీటీడీసీ ఉపయోగించుకుంటోంది. మిగిలిన భూమిలో ఇరవై ఎకరాలను శిల్పారామం సొసైటీకి బదిలీ చేయాలని ఏపీటీడీసీ ప్రిన్సిపల్ సెక్రటరీ చందనాఖాన్ గతంలో నిర్ణయించారు. భూ బదిలీ జరిగాక హైదరాబాద్‌లోని శిల్పారామానికి దీటుగా రూ.5 కోట్ల వ్యయంతో భవానీద్వీపంలో శిల్పారామం నిర్మించాలని అప్పట్లో అధికారులు నిర్ణయించారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలిసారిగా నగరానికి వచ్చినప్పుడు శిల్పారామానికి శంకుస్థాపన చేస్తారని జోరుగా ప్రచారం జరిగింది. చివరి నిమిషంలో కార్యక్రమం వాయిదా పడింది. భూమి ఇవ్వడం కుదరదు భవానీద్వీపంలో 20 ఎకరాల భూమి బదలాయింపునకు ఏపీటీడీసీ అధికారులు ఫైల్ నడిపారు. ఈ ఫైల్ ప్రభుత్వం వద్దకు వెళ్లగా ముఖ్యమంత్రి చంద్రబాబు నిరాకరించినట్లు సమాచారం. ద్వీపం మొత్తం భూమి కేవలం ఒకే కార్యక్రమానికి వినియోగించాలని, దాన్ని విభజించడం వల్ల లాభం ఉండదని ఆయన అభిప్రాయపడి నట్లు తెలిసింది. నగరంలో కాకపోయినా నగర పరిధిలోని సుమారు 10 కి.మీ. దూరంలో 20 ఎకరాల భూమి ఉంటే దాన్ని శిల్పారామానికి కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుత పరిస్థితుల్లో భూమి లభ్యత అనుమానమే. నగరం రాజధానిగా మారిన నేపథ్యంలో గజం భూమి ఇవ్వడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. నగరం చుట్టూ ఎక్కడా ప్రభుత్వ భూములు లేవు. కొన్ని ప్రభుత్వ శాఖల వద్ద భూమి ఉన్నా.. వాటిని ఇతర శాఖలకు బదలాయించేందుకు ఆయా శాఖల ఉన్నతాధికారులు సుముఖంగా లేరు. ఇక శిల్పారామానికి భూమి దొరకడం కష్టమేనని పలువురు అభిప్రాయపడుతున్నారు. సత్వర నిర్ణయం తీసుకోవాలి.. శిల్పారామం ఎక్కడ ఏర్పాటు చేయాలనే అంశంపై ప్రభుత్వం సత్వర నిర్ణయం తీసుకోవాలి. లేకపోతే శిల్పారామానికి మంజూరైన రూ.5 కోట్లు వెనక్కి వెళ్లే అవకాశం ఉంది. ఇప్పుడు అధికారులు, ప్రజా ప్రతినిధులు శిల్పారామం విషయంలో అశ్రద్ధ చేస్తే భవిష్యత్తులో దీన్ని సాధించడం చాలా కష్టమవుతుంది.