- భవానీద్వీపంలో స్థలం ఇచ్చేందుకు ప్రభుత్వం నో
- మరోచోట 10 ఎకరాల అన్వేషణ
- భూమి దొరికితేనే నిర్మాణం
సాక్షి, విజయవాడ : భవానీద్వీపంలో నిర్మించ తలపెట్టిన శిల్పారామం ప్రస్తుతానికి వాయిదాపడింది. ఈ ప్రతిపాదన మరోసారి కాగితాలకే పరిమితమైంది. శిల్పారామం ఏర్పాటుకు కావాల్సిన భూమి లభ్యంకాక ఇన్నాళ్లు నిర్మాణం వాయిదా పడుతూ వచ్చింది. గత్యంతరం లేని పరిస్థితుల్లో భవానీద్వీపంలో శిల్పారామం నిర్మించాలని అధికారులు నిర్ణయించారు. దీనికి రాష్ట్ర ప్రభుత్వం బ్రేక్ వేయడంతో శిల్పారామం సొసైటీ అధికారులు తిరిగి స్థలాన్వేషణలో పడ్డారు.
ద్వీపంలో 20 ఎకరాల భూమి
భవానీద్వీపం 133 ఎకరాల విస్తీర్ణంలో ఆంధ్రప్రదేశ్ పర్యాటకాభివృద్ధి సంస్థ (ఏపీటీడీసీ) ఆధీనంలో ఉండగా, కేవలం 10 ఎకరాలను మాత్రమే ఏపీటీడీసీ ఉపయోగించుకుంటోంది. మిగిలిన భూమిలో ఇరవై ఎకరాలను శిల్పారామం సొసైటీకి బదిలీ చేయాలని ఏపీటీడీసీ ప్రిన్సిపల్ సెక్రటరీ చందనాఖాన్ గతంలో నిర్ణయించారు. భూ బదిలీ జరిగాక హైదరాబాద్‌లోని శిల్పారామానికి దీటుగా రూ.5 కోట్ల వ్యయంతో భవానీద్వీపంలో శిల్పారామం నిర్మించాలని అప్పట్లో అధికారులు నిర్ణయించారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలిసారిగా నగరానికి వచ్చినప్పుడు శిల్పారామానికి శంకుస్థాపన చేస్తారని జోరుగా ప్రచారం జరిగింది. చివరి నిమిషంలో కార్యక్రమం వాయిదా పడింది.
భూమి ఇవ్వడం కుదరదు
భవానీద్వీపంలో 20 ఎకరాల భూమి బదలాయింపునకు ఏపీటీడీసీ అధికారులు ఫైల్ నడిపారు. ఈ ఫైల్ ప్రభుత్వం వద్దకు వెళ్లగా ముఖ్యమంత్రి చంద్రబాబు నిరాకరించినట్లు సమాచారం. ద్వీపం మొత్తం భూమి కేవలం ఒకే కార్యక్రమానికి వినియోగించాలని, దాన్ని విభజించడం వల్ల లాభం ఉండదని ఆయన అభిప్రాయపడి నట్లు తెలిసింది. నగరంలో కాకపోయినా నగర పరిధిలోని సుమారు 10 కి.మీ. దూరంలో 20 ఎకరాల భూమి ఉంటే దాన్ని శిల్పారామానికి కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ప్రస్తుత పరిస్థితుల్లో భూమి లభ్యత అనుమానమే. నగరం రాజధానిగా మారిన నేపథ్యంలో గజం భూమి ఇవ్వడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. నగరం చుట్టూ ఎక్కడా ప్రభుత్వ భూములు లేవు. కొన్ని ప్రభుత్వ శాఖల వద్ద భూమి ఉన్నా.. వాటిని ఇతర శాఖలకు బదలాయించేందుకు ఆయా శాఖల ఉన్నతాధికారులు సుముఖంగా లేరు. ఇక శిల్పారామానికి భూమి దొరకడం కష్టమేనని పలువురు అభిప్రాయపడుతున్నారు.
సత్వర నిర్ణయం తీసుకోవాలి..
శిల్పారామం ఎక్కడ ఏర్పాటు చేయాలనే అంశంపై ప్రభుత్వం సత్వర నిర్ణయం తీసుకోవాలి. లేకపోతే శిల్పారామానికి మంజూరైన రూ.5 కోట్లు వెనక్కి వెళ్లే అవకాశం ఉంది. ఇప్పుడు అధికారులు, ప్రజా ప్రతినిధులు శిల్పారామం విషయంలో అశ్రద్ధ చేస్తే భవిష్యత్తులో దీన్ని సాధించడం చాలా కష్టమవుతుంది.