విజయవాడ : ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రభుత్వంపై పోరాటం చేసేందుకు వైఎస్సార్ పార్టీ శ్రేణులు సమాయత్తం కావాలని ఆ పార్టీ జిల్లా నేతలు పిలుపునిచ్చారు. గురువారం బందరు రోడ్డులో జిల్లా స్థాయి ముఖ్యనాయకులు, ప్రజాప్రతినిధులు అనుబంధ సంఘాల నాయకులు సమావేశమై పార్టీ అధినేత వె..ఎస్. జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు ఈ నెల 16వ తేదీ నుంచి అన్ని మండల కేంద్రాల్లో ఆందోళనలు చేపట్టాలని తీర్మానించారు. అనంతరం ఏర్పాటైన విలేకరుల సమావేశంలో పార్టీ దక్షిణ కృష్ణా అధ్యక్షుడు, రాష్ట్ర అధికార ప్రతినిధి కొలుసు పార్థసార థి మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గత ఎన్నికల్లో ప్రజలకిచ్చిన హామీలను అమలు చేయకుండా కాలయాపన చేస్తున్నారని విమర్శించారు.
ప్రభుత్వం నియమించిన కమిటీలు గ్రామాల్లో ఇష్టారాజ్యంగా వేలాది మంది పింఛన్లు రద్దుచేస్తున్నారని అన్నారు. ప్రతిపక్షపార్టీలకు చెందిన సర్పంచి, ఎంపీటీసీలు ఉన్న గ్రామాల్లో వారితో సంతకాలు చేయించుకుని కమిటీల సిపార్సులపై తమకు గిట్టని వారిని పింఛన్లకు అనర్హులుగా ప్రకటిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అదేమని ఎంపీడీవోలను అడిగితే కమిటీలు రద్దు చేస్తే తాము చేసేది ఏమీ లేదని నిస్సహాయత వ్యక్తం చేస్తున్నారని అన్నారు. రాజధాని పేరుతో రోజుకో రకమైన ప్రకటనలు చేస్తున్న ప్రభుత్వం రైతుల భూములు లాక్కునేందుకు ప్రయత్నిస్తోందని విమర్శించారు.
కృష్ణా, గుంటూరు జిల్లాల్లో వేలాది ఎకరాల ప్రభుత్వ భూములు ఉండగా రైతుల భూములు లాక్కుంటే పోరాటం చేస్తామని ఆయన హెచ్చరించారు. స్వచ్ఛ భారత్ పేరుతో చీపుర్లు పట్టుకుని రోడ్లు ఊడుస్తూ టీవీలకు ఫోజులు పెడితే సరిపోదని, గ్రామాల్లో డ్రైన్లు, రోడ్లు నిర్మాణం జరిగేందుకు తగినన్ని నిధులు కేటాయించాలన్నారు. ప్రజాసమస్యలపై పార్టీ తరఫున సీఎంకు వినతిపత్రం ఇచ్చేందుకు అనుమతి కోరినా కనీసం ఇంటర్వ్యూ కూడా ఇవ్వలేదని పార్థసారథి అవేదన వ్యక్తం చేశారు.
పార్టీని ఏకతాటిపై నడుపుతాం: కొడాలి నాని
జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ఏకతాటిపై నడిపి, అభివృద్ధికి కృషి చేస్తామని పశ్చిమ కృష్ణా అధ్యక్షుడు, డెప్యూటీ ప్లోర్ లీడర్ కొడాలి వెంకటేశ్వరరావు (నాని) అన్నారు. పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు మేరకు ఎన్నికల హామీలు, ప్రజా సమస్యలపై ప్రభుత్వం మెడలు వ ంచే విధంగా పోరాటం ఉధృతం చేస్తామన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు సామినేని ఉదయభాను మాట్లాడుతూ 16 నుంచి అన్ని మండల కేంద్రాల్లో ఆందోళనా కార్యక్రమాలు నిర్వహించాలని పిలుపు నిచ్చారు.
పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం, ఎమ్మెల్యేలు ఉప్పులేటి కల్పన, జలీల్‌ఖాన్, రక్షణనిధి, పార్టీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఎం.వీ.ఎస్.నాగిరెడ్డి, యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు వంగవీటి రాధాకృష్ణ, ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పి. గౌతమ్ రెడ్డి, పార్టీ ముఖ్య నాయకులు పేర్ని వెంకట్రామయ్య, బూరగడ్డ వేదవ్యాస్, ఉప్పాల రాంప్రసాద్, డాక్టర్ దుట్టా రామచంద్రరావు, సింహాద్రి రమేష్, జగ్గయ్యపేట మున్సిపల్ చైర్మన్ తన్నీరు నాగేశ్వరరావు, జడ్‌పీ ప్లోర్ లీడర్ తాతినేని పద్మావతి,జెడ్పీటీసీలు, ఎంపీపీలు, కార్పొరేటర్లు పాల్గొన్నారు.
16 నుంచి వైఎస్సార్ సీపీ ప్రజా పోరాటం
Published Fri, Oct 3 2014 1:41 AM | Last Updated on Sat, Jul 7 2018 3:19 PM
Advertisement
Advertisement