డబ్బుకు ‘దేశం’ దాసోహం!
సాక్షి ప్రతినిధి, విజయనగరం : భీమిలి ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత అవంతి శ్రీనివాస్ పక్క చూపులు చూస్తున్నారు. కాంగ్రెస్ పరిస్థితి దయనీయంగా ఉండడం, వైఎస్సార్ సీపీలో బెర్త్ దొరక్కపోవడంతో ఈసారి టీడీపీ తరఫున పోటీ చేయాలని యోచిస్తున్నారు. అది కూడా భీమిలి నుంచి కాకుండా వేరొక నియోజకవర్గంలో పోటీకి దిగాలని భావిస్తున్నారు. అటు విశాఖపట్నం జిల్లా అనకాపల్లి, ఇటు విజయనగరం జిల్లా నెల్లిమర్ల అసెంబ్లీ స్థానాలపై దృష్టి సారించారు. అలాగే ఆయన సోదరుడు ముత్యం శెట్టి కృష్ణారావు చీపురుపల్లిపై కన్నేశారు. తనకి గానీ, తన సోదరుడికి గానీ జిల్లాలో ఏదొక నియోజకవర్గ టిక్కెట్ ఇస్తే పార్టీకి ఆర్థికంగా సహకరిస్తానని ఆఫర్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా విజయనగరం ఎంపీ అభ్యర్థికయ్యే ఖర్చును భరించేందుకు ముందుకొచ్చినట్టు సమాచారం. ఈ క్రమంలో ‘అవంతి’కి జిల్లాలో ఎక్కడోచోట సర్దుబాటు చేస్తారని టీడీపీలో ప్రచారం జరుగుతోంది. ఆ సర్దుబాటు ఎక్కడ న్నదానిపై ఇప్పుడు విసృ్తతంగా చర్చ సాగుతోంది.
చిరంజీవులకు ‘పైసో’ప ‘దేశం’ !
ఆర్థిక బలం ఉన్న వారికే టిక్కెట్ ఇవ్వాలన్న పాలసీలో టీడీపీ ఉన్నట్టు తెలిసింది. అందుకు పార్వతీపురం నియోజకవర్గ అభ్యర్థి ఎంపిక వ్యవహా రమే ఉదాహరణగా చెబుతున్నారు. బాగా ఖర్చు పెడతానంటేనే రంగంలోకి దిగాలని.. లేకపోతే ఆర్థిక బలం ఉన్న నేతను వెతుకుదామని నియోజక వర్గ ఇన్చార్జి బొబ్బిలి చిరంజీవులకు పార్టీ అధిష్టానం తెగేసి చెప్పిందన్న విషయం ఇప్పుడు హాట్ టాఫిక్ అయ్యింది. అదే తరహాలో మిగతా నియో జకవర్గాల అభ్యర్థులను ఎంపిక చేస్తారని, ఆ లెక్కన నెల్లిమర్ల, చీపురుపల్లి నియోజకవర్గాల్లో సొమ్ము పెట్టేందుకు ముందుకొస్తున్న అవంతి బ్రదర్స్ కిచ్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.
నారాయణస్వామికి ఎగనామం !
నెల్లిమర్లలో సీనియర్ నేత పతివాడ నారాయణస్వామినాయుడు ఉన్నా ఎన్నికల సమయంలో భారీగా ఖర్చు పెట్టరని, దాని వల్ల ఇబ్బందులొస్తాయని, కాపు సామాజికవర్గం ఉన్న ఇక్కడ అవంతి శ్రీనివాస్‌ను రంగంలోకి దించితే మంచిదని అధిష్టానం యోచిస్తున్నట్టు తెలిసింది. ఒకవేళ ఇక్కడ కాదనుకుంటే అదే సామాజికవర్గం ఎక్కువగా ఉన్న చీపురుపల్లి టిక్కెట్‌ను అవంతి శ్రీనివాస్ సోదరుడు కృష్ణారావును ఇచ్చే అవకాశం ఉందన్న వాదన విన్పిస్తోంది. మొత్తానికి అటు నెల్లిమర్ల, ఇటు చీపురుపల్లి విషయంలో ‘అవంతి’ చర్చే జరుగుతోంది. అయితే, ఈ వాదనలను పార్టీ వర్గాల వ్యతి రేకిస్తున్నాయి. ఎన్నాళ్లగానో పార్టీని నమ్ముకుని ఉన్న తమకు కాకుండా వేరొకరికి టిక్కెట్ ఇస్తే ఒప్పుకునేది లేదని ఈ రెండు నియోజకవర్గాల టీడీపీ నేతలు బాహాటంగానే వ్యాఖ్యానిస్తున్నారు. అధిష్టానానికి ఇదే విషయం చెప్పినట్టు తెలుస్తోంది. అయితే, వీరి వాదనకు చంద్రబాబు ఏకీభవిస్తారో లేదంటే అశోక్‌గజపతిరాజును ఎంపీ అభ్యర్థిగా ప్రకటించినట్టుగా ఏకపక్షం నిర్ణయం తీసుకుంటారేమో చూడాలి.