బీహెచ్ఈఎల్ డిజిన్వెస్ట్‌మెంట్ వాయిదా!
న్యూఢిల్లీ: విద్యుత్‌రంగ ఉపకరణాల దిగ్గజం బీహెచ్ఈఎల్లో డిజిన్వెస్ట్‌మెంట్ ప్రతిపాదనను ప్రభుత్వం వాయిదా వేసినట్లు తెలుస్తోంది. ఇందుకు షేరు ధర పతనంకావడంతోపాటు, ఆర్డర్‌బుక్ బలహీనపడటం కారణంగా నిలిచినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ప్రభుత్వం 2011లోనే 5% వాటాను డిజిన్వెస్ట్ చేయాలని నిర్ణయించింది.
అయితే విద్యుత్ రంగం పలు సమస్యలను ఎదుర్కొంటూరావడంతో ఈ కాలంలో కంపెనీ షేరు ధర కూడా 60% పతనమైంది. తాజాగా ఆర్థిక ఫలితాలు నిరుత్సాహపరచడంతో బీఎస్ఈలో షేరు దాదాపు 20% పతనమై రూ. 120 వద్ద ముగిసింది. ఈ ఆర్థిక సంవత్సరం తొలి(ఏప్రిల్-జూన్) క్వార్టర్‌కు కంపెనీ నికర లాభం దాదాపు సగానికి పడిపోయి రూ. 465 కోట్లకు పరిమితమైంది. అమ్మకాలు కూడా 24% తగ్గి రూ. 6,353 కోట్లకు చేరాయి. ఇక ఆర్డర్‌బుక్ విలువ రూ. 1.15 లక్షల కోట్ల నుంచి రూ. 1.08 లక్షల కోట్లకు క్షీణించింది. ఈ నేపథ్యంలో కంపెనీలో డిజిన్వెస్ట్‌మెంట్‌ను భారీ పరిశ్రమల శాఖ వ్యతిరేకిస్తూ వస్తోంది. ప్రస్తుత మార్కెట్ పరిస్థితుల్లో చౌక ధరల్లో కంపెనీ వాటాను విక్రయించడం సమర్థనీయంకాదని వాదిస్తోంది. ప్రస్తుతం కంపెనీలో ప్రభుత్వానికి 67.72% వాటా ఉంది.