'నిండుసభ సాక్షిగా చంద్రబాబు కుమ్మక్కు'
చంద్రబాబు సూచనల మేరకే నడుస్తున్న పాలకపక్షం
వైఎస్ఆర్సీపీ నాయకురాలు శోభానాగిరెడ్డి ధ్వజం
సాక్షి, హైదరాబాద్: సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, ప్రతిపక్షనేత చంద్రబాబు కుమ్మక్కై రాష్ట్ర విభజన బిల్లు అసెంబ్లీలో చర్చ జరిగేలా సహకరిస్తున్నారని వైఎస్ఆర్సీపీ శాసనసభాపక్ష ఉపనాయకురాలు భూమా శోభానాగిరెడ్డి ధ్వజమెత్తారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలను అరెస్టు చేసి తీసుకెళ్లిన తర్వాత గోషామహల్ స్టేడియంలో ఆమె విలేకరులతో మాట్లాడారు. సమైక్య తీర్మానం చేయాలని లేదా రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లుపై ఓటింగ్ జరపాలని తాము డిమాండ్ చేస్తే, సభ నుంచి సస్పెండ్ చేశారని చెప్పారు. తమను సస్పెండ్ చేసే సమయంలో కూడా వీరిద్దరి మధ్య జరిగిన కుమ్మక్కు స్పష్టంగా బయటపడిందన్నారు.
శాసనసభ వ్యవహారాల మంత్రి శైలజానాథ్ తమ పార్టీ ఎమ్మెల్యేలను రెండు రోజులపాటు సస్పెండ్ చేస్తున్నట్లు తీర్మానం ప్రతిపాదిస్తూ ఉండగానే... ప్రతిపక్షనేత చంద్రబాబు సీఎంకు చేత్తో సైగ చేస్తూ ఒక్కరోజే సస్పెండ్ చేయాలన్నట్లు సంకేతం ఇచ్చారని వెల్లడించారు. ఆ సంకేతం అందుకున్న సీఎం.. తమను ఒక్కరోజే సస్పెండ్ చేయాలని శైలజానాథ్ ద్వారా మళ్లీ ప్రతిపాదించారని తెలిపారు.
చంద్రబాబు సూచనల మేరకే అధికారపక్షం నడుస్తుందనడానికి ఇంతకంటే ఏ సాక్ష్యం కావాలన్నారు. చర్చ విషయంలోనూ సీఎం అధిష్టానం ఆదేశాల మేరకే వ్యవహరిస్తున్నారని, తెలంగాణకు చెందిన డిప్యూటీ స్పీకర్‌ను సభాపతి స్థానంలో కూర్చోబెట్టి తెలంగాణపై చర్చ జరిగేలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.