శ్రీకారాలు - శ్రీమిరియాలు
- శ్రీరమణ
సూర్యచంద్రులు
వంగ సాహిత్యాకాశంలో రవీంద్రుణ్ణి, శరత్‌బాబుని సూర్యచంద్రులుగా అభివర్ణిస్తారు. ఇద్దరూ లబ్ధప్రతిష్టులే. వారిరువురికీ అసంఖ్యాక పాఠకులు, అభిమానులు ఉన్నారు. ఒకసారి కలకత్తాలో (ఇప్పటి కోల్‌కతా) శరత్చంద్రకి, రవీంద్రనాథ్ ఠాగోర్‌కి ఒకే వేదిక మీద సన్మానం ఏర్పాటు చేశారు. సభా నిర్వాహకులు మొదటగా ఠాగోర్‌ని సత్కరించడంతో శరత్ అభిమానులు నొచ్చుకున్నారు.
దాన్ని గమనించిన శరత్చంద్ర తన అభిమానులనుద్దేశించి- ‘‘మిత్రులారా! గురుదేవులు నాలాంటి వారికోసం రచనలు చేస్తారు. నేను మీలాంటి సామాన్య పాఠకుల కోసం రాస్తాను. రచయితల రచయితగా ప్రథమ తాంబూలం వారికి దక్కడమే ధర్మం. అందుకే నిర్వాహకులు తొలుత వారిని సత్కరించారు’’ అనడంతో జనం చల్లబడ్డారు. సభ దిగ్విజయంగా జరిగింది.
ఇప్పుడైతే?- లాటరీ తీసి, టాస్ వేసి గెలిచిన వారికి ప్రథమ తాంబూలం ఇచ్చేవారు. లేకపోతే జనం ఊరుకున్నా మీడియా ఊరుకోదు. ఎవరు ప్రథమం, ఎవరు అధమం అంటూ ఎస్సెమ్మెస్ పోల్సు, చర్చలు నడిచేవి. మూలాల్లోకి వెళ్ళిపోయి ఈ పాయింటు మీద వంగదేశం బీట వేసేది. వచన కవులు ప్రపంచవ్యాప్తంగా ఎలా అణగదొక్క బడ్డారో తెరమీదకు వచ్చేది. తొలినాళ్ల వంగ వచన కవుల ఫ్లెక్సీలకు పాలాభిషేకాలు జరిగేవి. మిగతావి మీ ఊహకే వదిలేస్తున్నా.
తాజావార్త
మోదీ ప్రభుత్వం ‘‘స్వచ్ఛభారత్’’ని ప్రతిష్టాత్మకంగా, గాంధీ సాక్షిగా, ఉద్యమ స్ఫూర్తితో అమలు చేయాలని సంకల్పించింది. వెనకటికి సాయిబాబా ఉత్తరాల్లాగా (ఒక ఉత్తరం అందినవారు దాని నకలుని తిరిగి పదకొండుమందికి రాసి పోస్ట్ చెయ్యాలి. అలా చెయ్యకపోతే అనర్థం వస్తుందని హెచ్చరిక ఉంటుంది. ఈ టైపులో కొన్ని వ్యాపారాలు కూడా నడుస్తాయి) ఇప్పుడు తొమ్మిది మందిని స్వచ్ఛభారత్ దూతలుగా నియమిస్తారు. తిరిగి ఒక్కొక్కరు తొమ్మిది మంది పేరుగల వారిని... అలాగా తొమ్మిదో ఎక్కం నడుస్తోంది.
ఈ నేపథ్యంలో దీనికి ప్రత్యేకంగా ఒక మంత్రిత్వ శాఖని ఏర్పాటు చేస్తారని హస్తినలో పుకార్లు షికారు చేస్తున్నాయి. ఆ శాఖమంత్రిని చెత్తమంత్రిగా కాకుండా స్వచ్ఛమంత్రిగా పిలిచేలాగా జాగ్రత్తపడాలని ఇప్పటికే సూచనలు అందినట్టు వార్త.
నిరాశావాది
ఈ మెట్రోరైలు అలా పై నుంచి దడదడా వెళ్లిపోతుంటే ఏమి బావుంటుందండీ. ఏదో ఆకాశంలో వెళ్తున్నట్లుంటుంది. పైగా అంత స్పీడుగా వెళ్తుంటే సినిమా పోస్టర్లూ అవీ అలుక్కుపోయినట్లు కనిపిస్తాయి కూడాను!
కలర్స్! కలర్స్!
‘‘మేష్టారూ! ఇది సాదావాకర్కి రెట్టింపు - జానీవాకర్ రెడ్ లేబిల్’’
‘‘తెలుసు... తెలుసు’’
‘‘ఇది జానీవాకర్ బ్లాక్ లేబిల్ - రెడ్‌కి రెట్టింపు’’
‘‘చూశాం... చూశాం’’
‘‘ఇది రెడ్ లేబిల్కి రెట్టింపు - జానీవాకర్ బ్లూ’’
‘‘విన్నాం... విన్నాం’’
‘‘ఇది బ్లూ లేబిల్కి రెట్టింపు-....’’
‘‘చాలు బాబోయ్...! ఇంకా ఎన్నిరంగులు తాగాలో ఏవిటో...’’
ఏం తేడా పడింది?
స్వతంత్రం వచ్చిందని తెలిసి ఆబాలగోపాలం తెగ సంబరపడిపోయారు. ‘‘ఇన్నాల్టికి కష్టం ఫలించింది’’ అనుకున్నది బామ్మ.
ఆ మర్నాడు గారెలకి పప్పు నానపోయాల్సి వచ్చింది. ఎటూ స్వతంత్రం వచ్చింది కదా, రాత్రే దేనికి పొద్దున్నే నానపోయచ్చులే అంది బామ్మ. అమ్మకేమీ అర్థం కాలేదు. పొద్దున్నే నానపోస్తే అవి సమయానికి నానలేదు. మరి స్వతంత్రం వచ్చిందన్నారు - ఏమి తేడా పడిందని దీర్ఘాలు తీసింది బామ్మ.
మూడు వాయలు పప్పు రుబ్బడానికి మూడు గంటలూ పట్టింది. ‘‘స్వతంత్రం వచ్చిందన్నారు కదే’’ అన్ని కళ్లతోనే అడిగింది - ఒక చెయ్యి పొత్రం మీద ఉంచి మరో చేత్తో ఎత్తిపొడుపు ముద్ర పట్టి. అమ్మకేం అర్థం కాలేదు.
‘‘అమ్మాయ్! నూనె కూడా ముందుకులాగే లాగాయి. ఏమీ తగ్గలేదు. తేడా ఏమిటో...’’ బామ్మ సమస్య ఏమిటో అర్థం అయింది గాని అమ్మకి ఎలా సర్దిచెప్పాలో అర్థం కావడం లేదు.
సాయంత్రానికి గారెల బుట్ట ఖాళీ అయింది. మునుపు మూడు రోజులు బుట్ట కళకళలాడుతూ ఉండేది. ఇదేవిటో బుట్టెడు గారెలూ మరు పూటకే మాయం అయినాయంటూ బామ్మ బుగ్గలు నొక్కుకుంటుంటే- ‘‘స్వతంత్రం వచ్చింది కదోచ్’’ అంటూ పిల్లలు అడుగూ బొడుగూ కూడా ఖాళీ చేసి పారిపోయారు. బామ్మకి స్వతంత్రం అంటే తినడం అని అర్థమైంది.
దండులో మరో వాహనం?
ఔను. ముఖ్యమంత్రుల కాన్వాయ్‌లలో మరో వాహనం అదనంగా చేరబోతోంది. ఇప్పుడున్న తొమ్మిదికి అదనంగా పదోది. ఒకవేళ సంఖ్యాశాస్త్ర ప్రకారం పది సరికాకుంటే పదకొండు బేసికి వెళ్తారు. ఈ కొత్త వాహనంలో టెలిస్కోపులు ధరించిన వాస్తుపండితులు వాస్తుస్కోపుని సదా పరిశీలిస్తూ ఉంటారు. ఎక్కడ వారికి తేడా వచ్చినా సైరన్ హారన్ మోగిస్తారు. స్పాట్లో వాస్తుదోషాన్ని వివరించి దానికి పరిహారం ప్రాయశ్చిత్తం చెప్పేస్తారు. ఒకసారి హద్దులు చూసుకుని వేటిని ఏ మేరకు కూల్చివేయాలో డిసైడ్ చేస్తారు. న వాస్‌తో న భవిష్యతి అనే సంస్కృత సూక్తిని తెలుగు రాష్ట్రాలు నమ్ముతున్నాయి, కనుక కాన్వాయ్‌లో వాస్తువాహనం తప్పదు.
ఉక్కుమనిషి
స్వాతంత్య్ర సమరం ముమ్మరంగా సాగుతున్న రోజుల్లో ఒక పత్రికా విలేకరి వల్లభాయ్ పటేల్‌ని - ‘‘గాంధీజీ ఏ సమస్య వచ్చినా తెగించి ఆమరణ నిరాహార దీక్షకు కూర్చుంటున్నారు. మీరు ఒక్కసారి కూడా దీక్షకి దిగలేదేమండీ’’ అని అడిగాడు. దానికి ఆ ఉక్కు మనిషి, ‘‘గాంధీజీ కాబట్టి ఎలాగో అలాగ దీక్షని విరమింప చేస్తున్నారు. నేను దిగితే ఆపేవారుండరని నా భయం’’ అని నవ్వుతూ జవాబు ఇచ్చారు.
‘‘మీరింతటి లబ్ధప్రతిష్టులు కదా... ఎక్కడా మీ విగ్రహం పెట్టారు కాదేమండీ’’ అని పటేల్‌ని ఓ పెద్దాయన అడిగారట. ‘‘ఇదే నయం. తీరా పెట్టాక ఎవరీ విగ్రహం అనిపించుకుంటే అస్సలు బాగుండదు కదా అన్నారట’’ చిరునవ్వుతో.
పటేల్ మనిషి. మనిషంత మనిషి. ఉక్కు మనిషి. ఇప్పుడాయన విగ్రహం ప్రపంచంలోనే అత్యున్నతంగా, సమైక్యతకు చిహ్నంగా మనజాతి గర్వంగా నిలబడనుంది. ఆ మహామనీషికి జోహార్!
ఈ మధ్య కాలంలో సాహిత్యసభలు నిర్వహించే వారికి పరిశ్రమగానూ, హాజరయ్యేవారికి శ్రమగానూ మారాయి.
పెళ్లి దాకా వరుడు ఆపైన నరుడు.
టీవీలో ప్రోగ్రామ్ బోరుకొడితే - మిక్సీలో కోడిగుడ్డు వేసి ఆన్ చెయ్యండి. జార్ మీద మూత మాత్రం పెట్టకండి. ఇహ తర్వాత చాలా వినోదంగా ఉంటుంది.
చిటపటలాడిద్దామంటే నిప్పుండగా ఉప్పుండదు. తీరా ఉప్పు దొరికాక నిప్పు కొడి కడుతుంది.
ఎవరికీ పదవీ వ్యామోహం లేదు, అయినా పదవులకు తీవ్ర కొరత దేనికంటే - అదే మరి చమత్కారం!
ఆనక కలిసి నడవాలనుకుంటే ముందు వెంటపడక తప్పదు.
మంత్రిగారికి పీడకల వచ్చిందట! సొంతకార్లో తిరుగుతున్నట్టు, రెంటు కరెంటు సొంత డబ్బుతో కట్టినట్టు.
అదేం చిత్రమోగాని పెళ్లి అయిపోయాక పెళ్లిళ్ల కాలంలో అద్భుతమైన సంబంధాలు కనిపిస్తాయి.
సృష్టిలో తీయనిది పొగడ్త!
గ్రంథ సమీక్ష
పుస్తకం పేరు వచన భారతము. అనేక పాత్రలతో చిక్కని కథావస్తువుతో అలరారుచున్నది. మొదటినుంచీ అన్నదమ్ముల గొడవలు అధికంగా ఉన్నవి. మొత్తం మీద లీగల్ మేటర్స్‌తో నిండివుంది. న్యాయస్థానములో పరిష్కరించుకోలేని కారణంగా చివరకు కొట్లాటకు దారితీసింది. యుద్ధానంతరం కథ సుఖాంతమైంది. ఇది వినదగినదే కాని చదవ తగినదికాదు. సమీక్ష ముగిసినది.