గుర్గావ్లో త్వరలో సైకిల్ షేరింగ్ విధానం
మోటార్ లేని వాహనాల వినియోగానికి కేంద్రం చొరవ
గుర్గావ్: నగరంలో మోటారేతర వాహనాల వినియోగాన్ని పెంపొందించే దిశగా కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకుంది. ఇందులోభాగంగా పబ్లిక్ బైసికిల్ షేరింగ్ విధానాన్ని అభివృద్ధి చేయాలంటూ హర్యానా ప్రభుత్వానికి ఇటీవల ఓ లేఖ రాసింది. నానాటికీ వాహనాల సంఖ్య పెరగడం, తత్ఫలితంగా నగరవాసులు ట్రాఫిక్ జామ్లలో చిక్కుకుపోవడం నిత్యకృత్యంగా మారింది. దీంతో స్థానికులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు.
ఈ నేపథ్యంలో నగరవాసులను ఇటువంటి సమస్యలనుంచి విముక్తి కల్పించేందుకు కేంద్రం చొరవ తీసుకుంది. ఇందులోభాగంగా సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)ను సిద్ధం చేయాలంటూ హర్యానా పట్టణ వికాసమంత్రిత్వ శాఖకు కేంద్ర పట్టణ అభివృద్ధి శాఖ ఇటీవల ఓ లేఖ రాసింది. ఇందుకోసం రెండు కన్సల్టెన్సీలను గుర్తించాలంటూ సదరు లేఖలో కోరింది.
సైకిళ్ల వాడకాన్ని పెంచేందుకే: కమిషనర్
ఈ విషయమై గుర్గావ్ మున్సిపల్ కార్పొరేషన్ (ఎంసీజీ) మిషనర్ వికాస్ యాదవ్ మాట్లాడుతూ సైకిళ్ల వినియోగాన్ని పెంచడమే కేంద్ర ప్రభుత్వ ఉద్దేశమన్నారు. ఇందులోభాగంగానే కార్లు, ద్విచక్ర వాహనాల వాడకాన్ని తగ్గించే అంశంపై దృష్టి సారించిందన్నారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో నగరంలో ప్రత్యేక సైకిల్ ట్రాక్లు, వాటికి పార్కింగ్ వసతులను కల్పిస్తామన్నారు. కనీసం వెయ్యి సైకిళ్లను నిలిపి ఉంచేందుకు అనువుగా మౌలిక వసతులను కల్పిస్తామన్నారు. త్వరలో ఇందుకు అవసరమైన స్థలాలను గుర్తిస్తామన్నారు.