ఆకట్టుకుంటున్న బిగ్ గాల్.. యోగా..
ఊబకాయం కొందరిని ఆత్మ న్యూనతకు గురి చేస్తుంది. మరి కొందరిని అనారోగ్యాల పాలు చేస్తుంది. అయితే ఊబకాయంతో ఉన్నశాన్ ఫ్రాన్సిస్కో కు చెందిన వాలెరీ సగన్ ను మాత్రం... ఎందరికో మార్గదర్శకం చేస్తోంది. ఇరవై ఏడేళ్ళ వయసులో తన భారీకాయంతో అతి క్లిష్టమైన యోగా భంగిమలను సునాయాసంగా చేస్తూ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఆమె వెబ్ సైట్ ఎనభైవేల మంది ఫాలోయర్స్ తో దిన దిన ప్రవర్థమానమౌతోంది.
ఇన్ స్టా గ్రామ్ పేజీలో బిగ్ గాల్ యోగా పేరున కొనసాగుతున్న వాలెరీ సగన్... ఇప్పుడు ఊబకాయుల్లో ఆత్మ విశ్వాసాన్ని పెంచే మహిళగా గుర్తింపు పొందింది. కృషి ఉంటే మనుషులు రుషులౌతారు అన్నట్లు.. ఎంతో కృషితో క్లిష్టమైన యోగాభ్యాసాన్ని చేసి అనుకున్నది సాధించింది. బరువుతో సంబంధం లేకుండా.. ఇంధ్ర ధనుస్సులా వంగే ఆమె శరీరం.. ఎందరో ఊబకాయుల్లో ఆత్మ విశ్వాసాన్ని పెంచుతోంది. ఆమె వేసే యోగాసనాలు చూసి జనం ఆశ్చర్యపోతున్నారు.
ఆమె శరీరం ప్రజల్లోకి అనుకూల ప్రచారాన్ని తీసుకు వెడుతోంది. ''మొదట్లో నేను అందరిలా భయపడ్డాను. యోగా నేర్చుకోవడం ఊబకాయులకు సాధ్యం కాదనే బెదిరింపులకు లోను కాలేదు. వయసుతో సంబంధం లేదు... అనారోగ్యాలకు భయపడాల్సిన అవసరం లేదు... నన్ను చూడండి.. ఎటువంటివారైనా యోగా నేర్చుకోవచ్చు'' అంటూ.. అనుకూల ప్రచారాన్ని తన వైబ్ సైట్ బ్లాగులో పోస్ట్ చేస్తోంది. అంతేకాదు వివిధ యోగా భంగిమల్లోని ఫొటోలతో ఆకట్టుకుంటోంది.
తమ సైజును బట్టి యోగాకు దూరం కావాల్సిన అవసరం లేదు అన్న విషయాన్ని అందరికీ తెలియజెప్పడమే వాలెరీ లక్ష్యం. అందరికీ ఏదో ఒకరకమైన శారీరక సమస్యలు ఉంటాయి. కానీ ఎవరి బెదిరింపులకు భయపడకుండా.. అసత్య ప్రచారాన్ని వినకుండా మీ శరీరం పై మీరు ధ్యాస ఉంచండి. మీకు.. మీరు కాస్త సమయాన్ని కేటాయించుకోండి. అంతేకాదు అందరిలాగే రకరకాల, రంగు రంగుల దుస్తులూ ధరిస్తూ మీకు కావలసిన విధంగా ఉండేందుకు ప్రయత్నించండి అంటూ ఊబకాయులకు సూచిస్తోంది. వివిధ భంగిమల్లో శరీరాన్ని రబ్బర్ లా వంచుతూ స్లిమ్ గా ఉండే వారికి కూడ ఆమె ఛాలెంజ్ విసురుతోంది.
ఒక్కోసారి నేను చేసే యోగాసనాలు నా చేతులను ఇబ్బందికి గురిచేస్తాయి. ఎందుకంటే నా శరీర బరువు అటువంటిది కనుక. అయినా నేను భయపడను. అంతేకాదు నాకు ఎంతో ఇష్టమైన చాక్లెట్స్ వంటివి కూడ తింటూనే ఉంటాను అంటుంది వాలెరీ. జనం మాట్లాడేదాన్ని నేను కేర్ చెయ్యను. నాది ఎంతో గ్రేట్ బాడీ అని కూడ అనుకుంటానంటూ తన ఆత్మవిశ్వాసాన్ని ప్రకటిస్తుంది.
మూడేళ్ళక్రితం సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టించడం మొదలు పెట్టిన వాలెరీ.. యూనివర్శిటీ ఫైనార్స్ట్ లో పట్టా పుచ్చుకుంది. ప్రస్తుతం ఆమె ఎక్కడకు వెళ్ళినా.. తనతోపాటు తన యోగా మ్యాట్ ను తీసుకొని వెడుతుంది. బీచ్ లు, పార్కులు, ఏ ప్లేస్ లో అయినా తాను చేసే ఫీట్లను ఫోటోల్లో, వీడియోల్లో బంధించి పోస్ట్ చేస్తుంటుంది. ప్రాక్టీస్ మేక్స్ మెన్ పెర్ ఫెక్ట్ అన్న చందంగా తీవ్ర కృషితో తాను అనుకున్నది సాధించిన వాలెరీ.. ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తోంది. అంతేకాదు త్వరలో తనకంటే కూడ ప్లస్ సైజ్ లో ఉన్నవారిలో ఆత్మ విశ్వాసాన్ని పెంచేందుకు... యోగా వల్ల కలిగే ప్రయోజనాలను వివరిస్తూ... ప్రత్యేక శిక్షణ ఇచ్చేందుకు కూడ సిద్ధం అవుతున్నట్లు ప్రకటించింది.