అమెరికా, చైనాకు ట్రేడ్ వార్ తప్పదా?
బీజింగ్ : ఓ వైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు, డ్రాగన్ దేశానికి పచ్చగడ్డివేస్తే భగ్గుమనే స్థాయిలో వివాదాలు ఏర్పడగా.. చైనా ఈ-కామర్స్ దిగ్గజం అలీబాబా సీఈవో జాక్ మా మాత్రం స్వదేశానికి గట్టి హెచ్చరికలే జారీచేస్తున్నారు. వివాదాలను సరైన స్థాయిలో పరిష్కరించుకోలేకపోతే, ట్రంప్ ఆధ్వర్యంలోని అమెరికాకు, చైనాకు ''బిగ్ ట్రేడ్ వార్'' తప్పదంటూ హెచ్చరించారు. ఇప్పటికే చైనీస్ ఎకానమీ తిరుగమన స్థాయిలో ఉందని, అంచనావేసిన దానికంటే క్లిష్టతరంగా పరిస్థితులు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. వచ్చే మూడు లేదా ఐదేళ్లు తమ ఆర్థిక పరిస్థితి మరింత క్లిష్టంగా మారుతుందని చెప్పారు. జనరల్ అసోసియేషన్ ఆఫ్ జెజియాంగ్ ఎంటర్‌ప్రిన్యూర్స్ సదస్సులో జాక్‌మా తన స్వదేశాన్ని తూర్పారా పట్టారు. గత రెండు దశాబ్దాల్లో కల్లా అత్యంత కనిష్ట స్థాయిలో గతేడాది చైనీస్ ఆర్థికవృద్ధి నమోదైంది. కేవలం 6.7 శాతం మాత్రమే ఈ దేశం వృద్ధిని నమోదుచేసింది.
గత మూడు దశాబ్దాల క్రితం కొనసాగిన అత్యంత వేగవంతమైన వృద్ధి రేటును ఇక మనం చూడలేమని ఆయన చెప్పారు. మ్యానుఫాక్చరింగ్ ఇండస్ట్రిని అప్‌గ్రేడ్ చేసి మెరుగైన వృద్ధిపై దృష్టిసారించాలని చెప్పారు. అమెరికాతో సమస్యలను సరైన స్థాయిలో పరిష్కరించుకోవాలని సూచించారు. తమ ఉద్యోగాలను చైనీసులు కొట్టుకుని పోతున్నారంటూ అధ్యక్ష ఎన్నికల ప్రచారం నుంచి చైనాపై విరుచుకుపడుతున్న ట్రంప్, గెలవగానే తైవాన్ అధ్యక్షురాలితో సంభాషణలు జరిపారు. వన్ చైనా పాలసీపై విమర్శలు సంధించారు. దీనిపై చైనా ఇప్పటికే గుర్రుగా ఉంది. ట్రంప్ ట్రేడ్ వార్కి దిగితే, తాము చూస్తూ ఊరుకోబోమని చైనా సైతం హెచ్చరించింది. ఈ ప్రత్యారోపణ సమయంలోనే డ్రాగన్ దేశ ఈ-కామర్స్ దిగ్గజం అలీబాబా సీఈవో మాత్రం అమెరికా అధ్యక్షుడితో భేటీఅయ్యారు. ఈ భేటీలో అమెరికాకు ఉద్యోగాలు కల్పిస్తామని వాగ్దానం చేశారు. ఇప్పుడు చైనాకు మరింత కోపం తెప్పించేలా తన స్వదేశానికే జాక్ మా హెచ్చరికలు జారీచేశారు.