Bike Ambulances
-
గిరిజన ప్రాంతాల్లో బైక్ అంబులెన్సులు
-
వైద్యచరిత్రలో మరో మైలురాయి.. మారేడుమిల్లి ఘటనతో చలించిపోయి..
సాక్షి, కాకినాడ: మారుమూల పల్లెలకు సైతం 108, 104 సేవలను అందుబాటులోకి తెచ్చిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి నిరుపేదల పాలిట ప్రాణదాతగా నిలిచారు. ఎవరైనా అనారోగ్యం బారిన పడినా.. ఎక్కడ ప్రమాదం జరిగినా ‘కుయ్.. కుయ్..’మంటూ రయ్యిన అంబులెన్స్‌లు వచ్చి వాలిపోయేలా చేసిన ఘనత వైఎస్‌కే దక్కింది. ఆయన తనయుడుగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి 108, 104 సేవలను మరింత ముమ్మరం చేశారు. 108 అంబులెన్స్‌లు, ఫీడర్ అంబులెన్స్‌లు సైతం వెళ్లలేని మారుమూల కొండ ప్రాంతాలకు సైతం వెళ్లేలా బైక్ అంబులెన్స్‌లను అందుబాటులోకి తీసుకొస్తున్నారు. కొండలు, గుట్టలు దాటి గిరిజనుల చెంతకు వెళ్లేలా కాకినాడ జేఎన్టీయూ ప్రొఫెసర్, డిజైన్ ఇన్నోవేషన్ సెంటర్ డైరెక్టర్ అల్లూరు గోపాలకృష్ణ రూపొందించిన బైక్ అంబులెన్స్‌లను రాష్ట్రవ్యాప్తంగా ఏజెన్సీ ప్రాంతాలకు సమకూర్చేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చర్యలు చేపట్టారు. ఈ వినూత్న కార్యక్రమం త్వరలో సాకారం కానుంది. తొలి దశలో 108 బైక్ అంబులెన్స్‌లను కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం టెండర్లు కూడా పిలిచింది. ఈ బైక్ అంబులెన్స్ వాహనం డ్రైవింగ్‌తో పాటు కనీస వైద్య సేవలందించేలా శిక్షణ ఇచ్చేందుకు ముమ్మర ఏర్పాట్లు జరుగుతున్నాయి. మారేడుమిల్లి ఘటనతో చలించిపోయి.. ఏజెన్సీ ప్రాంతాల్లో అంబులెన్స్‌లు వెళ్లే దారిలేక సకాలంలో వైద్యమందక కొండలపై ఉండే గిరిజనులు ప్రాణాలు కోల్పోతున్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రతిపక్ష నేతగా ఉన్న కాలంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం నియోజకవర్గ పరిధిలోని మారేడుమిల్లి మండలం చాపరాయిలో 12 మంది మృతిచెందారు. ఆ విషాదకర ఘటనను చూసి చలించిపోయిన జగన్ గిరిజనుల ప్రాణాలు కాపాడేందుకు ఏదో ఒక ప్రత్యామ్నాయం ఉండాలని పరితపించారు. అందుకనుగుణంగానే గతేడాది నుంచి ప్రత్యామ్నాయ అంబులెన్స్ తీసుకురావాలనే ప్రయత్నంలో ప్రాజెక్టు రూపకల్పన బాధ్యతను జేఎన్టీయూ(కాకినాడ)కి అప్పగించారు. ఈ నేపథ్యంలోనే జేఎన్టీయూ ప్రొఫెసర్ గోపాలకృష్ణ పట్టుదలతో ద్విచక్ర వాహనాన్ని తలపించే బైక్ అంబులెన్స్‌ను ఆవిష్కరించారు. ప్రపంచంలోనే ద్విచక్ర వాహనంతో కూడిన అంబులెన్స్ సిద్ధం చేయడం ఇదే తొలిసారి కావడంతో దీనికి పేటెంట్ హక్కులు కూడా లభించాయి. ఇంతవరకు కొండలపై ఉండే గిరిజన తండాలలో వైద్య సేవలకోసం మూడు చక్రాల(ఫీడర్) అంబులెన్స్‌లను వినియోగిస్తున్నారు. అసలు రహదారి అంటూ లేకుండా కొండలపై నివసించే గిరిజనుల వద్దకు నేరుగా వెళ్లి వైద్య సేవలందించేందుకు వీలుగా బైక్ అంబులెన్స్‌ను రూపొందించారు. అల్లూరి సీతారామరాజు మన్యం జిల్లా చింతలగూడెంలో గర్భిణులను తరలించడం ద్వారా వీటికి ట్రయల్ రన్ కూడా పూర్తయ్యింది. ఈ వినూత్న ఆవిష్కరణను కేంద్ర ప్రభుత్వం ప్రశంసించింది. ఇందుకోసం రూ.5 కోట్లను రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖకు కేటాయించింది. యాప్‌తో జీపీఎస్‌కు అనుసంధానం బైక్ అంబులెన్స్‌ను పర్యవేక్షించేందుకు ప్రత్యేక యాప్ రూపొందించారు. ఈ యాప్‌ను జీపీఎస్‌కు అనుసంధానించడంతో రోగుల సమాచారం సమీపంలోని పీహెచ్సీ లేదా 108 వాహనాలకు వివరాలను చేరవేస్తుంది. 4 జీబీ ర్యామ్, 14 జీబీ స్టోరేజ్ కలిగిన 7.1 ఇంచ్ టచ్ స్క్రీన్ డిస్ప్లేతో కూడిన చిప్, శాటిలైట్ బేస్ నెట్వర్కింగ్ సిస్టమ్ ఇందులో ఉంటాయి. పేషెంట్ వచ్చేలోపు వైద్యానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు సిద్ధం చేస్తారు. అత్యవసరమైతే డాక్టర్‌తో వీడియో కాల్చేసే సౌకర్యం ఇందులో ఉంది. వాహనానికి దుమ్ము, వర్షం, ఎండ నుంచి రక్షణకు టాప్ ఏర్పాటు చేశారు. అంబులెన్స్ లైట్లు,సైరన్, గ్లూకోమీటర్, పల్స్ ఆక్సీమీటర్, యాంటీ స్కిడ్డింగ్, ట్యూబ్‌లెస్ టైర్లు, రక్త పరీక్షల నమూనా కోసం కోల్డ్‌స్టోరేజ్ కంటైనర్, మోటార్ యాక్టివేటెడ్ స్టాండ్ ఉంటాయి. ప్రథమ చికిత్సకు అవసరమైన అన్ని పరికరాలు, మందులు ఇందులో ఉంటాయి. వైద్యచరిత్రలో మైలురాయిగా నిలుస్తుంది.. బైక్ అంబులెన్స్ ద్వారా కార్డియాక్ అరెస్ట్, పెరాలసిస్ వంటి గుండె సంబంధిత రోగులకు తక్షణ వైద్యం అందించే అవకాశం లభిస్తుంది. యూనివర్సిటీలో ఉన్న డిజైన్ ఇన్నోవేషన్ సెంటర్ ద్వారా బైక్ అంబులెన్స్‌ను రూపొందించడం సంతోషంగా ఉంది. ఇది వైద్య చరిత్రలో ప్రభుత్వానికి మైలురాయిగా మిగులుతుంది. ఇప్పటివరకు దేశంలో మరే రాష్ట్రంలోనూ ఈ తరహా ఆలోచన చేయలేదు. తొలిసారి మన రాష్ట్రంలో చేపట్టిన ఈ వినూత్న బైక్ అంబులెన్స్ ఇతర రాష్ట్రాల్లో కూడా ఏర్పాటు చేయాలనే ఆలోచనతో ఉన్నాయి. – ప్రొఫెసర్ ఎ.గోపాలకృష్ణ, డిజైన్ ఇన్నోవేషన్ సెంటర్ డైరెక్టర్, జేఎన్టీయూ కాకినాడ భళా.. బైక్ అంబులెన్స్ సాధారణంగా నాలుగు చక్రాల అంబులెన్స్ ప్రయాణించాలంటే కనీసం 6 అడుగులు రోడ్డు మార్గం ఉండాలి. అదే 3 చక్రాల ఫీడర్ అంబులెన్స్‌కు 3 నుండి 4 అడుగుల రోడ్డు మార్గం ఉండాలి. రెండు చక్రాలతో నడిచే ఈ బైక్ అంబులెన్స్‌కు అడుగు నుంచి అడుగున్నర దారి లేదా కాలిబాట ఉన్నా సులభంగా ప్రయాణిస్తుంది. కొండలు, గుట్టల్ని కూడా ఎక్కేస్తుంది. డ్రైవింగ్ సీటు వెనుక పేషెంట్ కూర్చునేందుకు వీలుగా ఒక సీటును 90 డిగ్రీల కోణంలో రౌండ్‌గా తిరిగేలా అమర్చారు. 110 డిగ్రీల కోణంలో వెనుకకు వంగి సౌకర్యవంతంగా ఉండేలా ఏర్పాటు చేశారు. రోగి కూర్చున్న వెంటనే లాక్ అయ్యేలా ఆటోమేటిక్ లాకింగ్ సిస్టమ్ కూడా ఏర్పాటు చేశారు. ఈ వాహనం వ్యయం రూ.4 లక్షలు అవుతుంది. ఇందుకు బజాజ్ కంపెనీకి చెందిన అవెంజర్ వాహనాన్ని ఎంపిక చేశారు. టైమ్ షెడ్యూల్, అలారమ్ కోడ్స్, పానిక్ బటన్ (వైద్య అవసరాన్ని బట్టి వినియోగించే ఎరుపు, పసుపు, నీలం)ఏర్పాటు చేశారు. -
డోలీలకు చెక్ పెట్టేలా ‘గిరి రక్షక్’
సాక్షి, అమరావతి: మారుమూల అటవీ ప్రాంతాల్లో నివసించే గిరిజనులకు సుస్తీ చేస్తే దుప్పట్లతో డోలీ కట్టి కర్రలతో మోసుకుపోవడం.. మంచాలపై పడుకోబెట్టి ఆస్పత్రులకు తరలించే దుస్థితి తప్పనుంది. మారుమూల గిరిజన బిడ్డలకు సైతం తక్షణ వైద్య సహాయం అందించేలా రాష్ట్ర ప్రభుత్వం ‘గిరి రక్షక్’ ప్రాజెక్ట్‌కు శ్రీకారం చుడుతోంది. ఈ ప్రాజెక్ట్ కింద 123 బైక్ అంబులెన్స్‌లను రంగంలోకి దించుతోంది. ఇప్పటికే గిరిజన ప్రాంతాల్లో 108, 104 అంబులెన్స్‌లతోపాటు 122 ఫీడర్ అంబులెన్స్ (మూడు చక్రాల బైక్)లు వైద్య సేవలు అందిస్తున్నాయి. మూడు చక్రాల ఫీడర్ అంబులెన్స్‌లు సైతం వెళ్లలేని ప్రాంతాలకు చేరుకునేలా బైక్ అబులెన్స్‌లను అందుబాటులోకి తెచ్చే కసరత్తు తుది దశకు చేరుకుంది. కాలిబాట ఉన్నా సరిపోతుంది నాలుగు చక్రాల అంబులెన్స్‌లు వెళ్లాలంటే కనీసం 6 అడుగుల దారి, మూడు చక్రాల ఫీడర్ అంబులెన్స్‌లు వెళ్లాలంటే మూడు అడుగుల దారి తప్పనిసరి. అదే బైక్ అంబులెన్స్ అయితే అడుగు, అడుగున్నర మార్గం ఉంటే చాలు. దీంతో ఇది మారుమూల ప్రాంతాల గిరిజనులకు ఉపయోగపడుతుందని గిరిజన సంక్షేమ శాఖలోని వైద్య, ఆరోగ్య విభాగం అధికారులు చెబుతున్నారు. రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ పర్యవేక్షణలో కాకినాడ జేఎన్టీయూ రూపొందించిన బైక్ అంబులెన్స్ మోడల్ తరహాలో కొత్త బైక్ అంబులెన్స్‌లను అందుబాటులోకి తేనున్నారు. డ్రైవింగ్ సీటు వెనుక ఒక వ్యక్తి సౌకర్యంగా కూర్చునేలా 140 డిగ్రీల కోణంలో వాల్చిన తొట్టెలాంటి సీటు, అత్యవసర పరిస్థితుల్లో వినియోగించేలా ఆరకిలో ఆక్సిజన్ సిలిండర్, సెలైన్ బాటిల్ పెట్టుకునే ఏర్పాటుతోపాటు ప్రాథమిక చికిత్స(ఫస్ట్ ఎయిడ్ కిట్) సామగ్రి ఉండేలా డిజైన్ చేయడం విశేషం. ప్రత్యేక యాప్‌తో పర్యవేక్షించేలా.. బైక్ అంబులెన్స్‌లను పర్యవేక్షించేలా ప్రత్యేక యాప్‌ను కూడా ప్రభుత్వం అందుబాటులోకి తెస్తోంది. అటవీ ప్రాంతంలో వాహనాలు వెళ్లేందుకు అవకాశం లేని 1,818 ప్రాంతాలు ఉన్నట్టు ప్రభుత్వం గుర్తించింది. ఈ కారణంగా ఆ ప్రాంతాల వాసులు ఎవరికైనా ప్రాణాపాయ స్థితి తలెత్తితే డోలీ, మంచాలపై మోసుకెళ్లాల్సి వస్తోంది. ఈ పరిస్థితుల్లో ఆయా ప్రాంతాల్లోని ప్రజలకు తక్షణ వైద్య సేవలు అందిచేలా బైక్ అంబులెన్సులను అందుబాటులోకి తేనున్నారు. ఇందుకోసం గిరిజన సంక్షేమ, ఆరోగ్య, విద్య, పోషకాహారం కార్యక్రమాన్ని అమలులోకి తేనున్నారు. ప్రతి బైక్ అంబులెన్స్‌కు 15 మారుమూల గిరిజన ప్రాంతాల చొప్పున అప్పగించి.. అక్కడి ప్రజలకు ఆరోగ్యంపై అవగాహన, వారి సంక్షేమం, విద్య, పోషకాహారం వంటి అంశాలపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తారు. ప్రధానంగా గర్భిణులను నెల రోజుల ముందుగానే బర్త్ వెయిటింగ్ రూమ్‌లకు తరలిస్తారు. ఇందుకోసం రాష్ట్రంలోని ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న 45 బర్త్ వెయిటింగ్ రూమ్‌లకు అదనంగా 32 కొత్త వాటిని ఏర్పాటు చేసి మొత్తం 77కు పెంచాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తద్వారా శిశు మరణాలు, డోలీ మరణాలు పూర్తిగా నిర్మూలించాలన్నదే ప్రభుత్వ లక్ష్యం. -
ఇక కష్టాలు దూరమండి.. కొండ కోనల్లో ఆపద్బాంధవి
బుట్టాయగూడెం(పశ్చిమగోదావరి జిల్లా): మారుమూల కొండకోనల్లోని ప్రాంతాల్లో నివసిస్తున్న ఆదివాసీల అత్యవసర వైద్యానికి బైక్ అంబులెన్స్‌లు అపర సంజీవనిలా మారాయి. 108, 104 వాహనాలు వెళ్లలేని అటవీ ప్రాంతాలకు సులభంగా చేరుకుంటూ అడవిబిడ్డలకు ఆరోగ్య సేవలు అందిస్తున్నాయి. దీంతో జోలికట్టి భుజాలపై మోసుకొచ్చే కష్టాలు గిరిజనులకు తప్పాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో జిల్లాలో ఐటీడీఏ, వైద్యారోగ్యశాఖ అధికారులు ఎనిమిది బైక్ అంబులెన్స్‌లను అందుబాటులోకి తీసుకువచ్చారు. 2019 నుంచి ఈ వాహనాల ద్వారా విశేష సేవలు అందుతున్నాయి. (చదవండి: యువతి ఆత్మహత్య కేసులో షాకింగ్ ట్విస్ట్..) ఐదు మండలాల పరిధిలో.. కేఆర్‌పురం ఐటీడీఏ పరిధిలో బుట్టాయగూడెం, పోలవరం, వేలేరుపాడు, కుక్కునూరు, జీలుగుమిల్లి మండలాలు ఉన్నాయి. వీటిలో 152 గ్రామాలు, 405 శివారు గ్రామాలు ఉండగా సుమారు 1,20,000 వరకూ గిరిజన జనాభా ఉంది. దాదాపు 40 గ్రామాలకు ఇప్పటికీ సరైన రహదారి సదుపాయం లేదు. భౌగోళిక స్వరూపం దృష్ట్యా బస్సులు, 108, 104 వాహనాలు ప్రయాణించలేని పరిస్థితి. ఆయా గ్రామాల్లో గిరిజనులు అనారోగ్యాలపాలైతే జోలి కట్టి మోసుకుంటూ ఆస్పత్రికి తీసుకువచ్చేవారు. చదవండి: రైతన్నకు తోడుగా 'ఏపీ ఆగ్రోస్' ముఖ్యమంత్రి ప్రత్యేక దృష్టి ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత గిరిజనుల ఆరోగ్య సంరక్షణపై ప్రత్యేక దృష్టి సారించారు. మారుమూల ప్రాంతాల్లో సేవలందిచేలా రాష్ట్రవ్యాప్తంగా బైక్ అంబులెన్స్‌లను ఏర్పాటుచేశారు. జిల్లాలో 40 గ్రామాలకు సే వలందించేలా ఎనిమిది వాహనాలను సమకూర్చగా.. మరో ఏడు వాహనాల కోసం వైద్యారోగ్యశాఖ అధికారులు ఇటీవల ప్రతిపాదనలు చేశారు. ఇవి త్వరలో రానున్నాయని సమాచారం. రెండేళ్లు.. 11,255 కేసులు రెండేళ్ల నుంచి జిల్లాలో బైక్ అంబులెన్స్‌ల ద్వారా 11,255 అత్యవసర కేసులకు సేవలు అందించారు. 2019–20లో గర్భిణులు 824, జ్వర పీడితులు 3,012, పాయిజన్ కేసులు 160, ఆర్టీఏ 118, ఇతర కేసులు 1,020 మొత్తం 5,134 కేసులకు బైక్ అంబులెన్స్‌ల ద్వారా సేవలందించారు. 2020–21, 2021–22లో ఇప్పటివరకూ గర్భిణులు 558, ఆర్టీఏ 99, జ్వరపీడితులు 4,059, పాయిజన్ కేసులు 149, ఇతర కేసులు 956 మొత్తంగా 6,121 మందికి సేవలు అందించారు. ప్రయోజనాలు ఎన్నో.. ►పరిమాణం, పనితీరు కారణంగా బైక్ అంబులెన్స్‌లు గిరిజన ప్రాంతాల్లో క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న రోగులను కాపాడేందుకు సాధారణ అంబులెన్స్ కంటే ఎక్కువగా ఉపయోగపడుతున్నాయి. ►దీని ద్వారా ఎక్కువ మంది ప్రాణాలను రక్షించగలుగుతున్నారు. గర్భిణులను వేగంగా ఆస్పత్రులకు తరలిస్తున్నారు. ►కుక్కునూరు మండలంలో అమరవరం, కుక్కునూరు, వేలేరుపాడు మండలంలో కొయిదా, తొట్కూరుగొమ్ము, పోలవరం మండలంలో కొరుటూరు, మేడేపల్లి, బుట్టాయగూడెం మండలంలో అలివేరు, చింతపల్లి తదితర గ్రామాల్లో బైక్ అంబులెన్స్ సేవలు అందుబాటులో ఉన్నాయి. మరిన్ని సేవలు అందించేలా.. గిరిజన గ్రామాల్లో ప్రతిఒక్కరికీ మెరుగైన వైద్యసేవలు అందించే దిశగా కృషి చేస్తున్నాం. మారుమూల కొండ ప్రాంతంలో ఉన్న గ్రామాల్లో వైద్యసేవలు అందించేందుకు ప్రస్తుతం ఎనిమిది బైక్ అంబులెన్స్‌లు వినియోగిస్తున్నాం. సీఎం జగన్మోహన్రెడ్డి ఆదేశాలతో మరో ఏడు బైక్ అంబులెన్స్‌లకు ప్రతిపాదనలు పంపించాం. వీటి ద్వారా గిరిజనులకు మరిన్ని సేవలు అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. – తెల్లం బాలరాజు, ఎమ్మెల్యే, పోలవరం అత్యవసర వైద్యం బైక్ అంబులెన్స్‌లలో అత్యవసర వైద్యానికి సంబంధించిన మెడికల్ కిట్‌ను అందుబాటులో ఉంచాం. అలాగే చిన్నపాటి ఆక్సిజన్ సిలిండర్ కూడా ఉంటుంది. సెలైన్ పెట్టే సౌకర్యం కూడా అంబులెన్స్‌లో ఉంది. అనారోగ్యం పాలైన వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రాథమిక వైద్యం అందించడంతో పాటు మెరుగైన వైద్యం కోసం అందుబాటులో ఉన్న ప్రభుత్వాస్పత్రికి తరలించేలా ఏర్పాట్లు చేశాం. బైక్ అంబులెన్స్ సేవలు మరింత విస్తరిస్తాం. – జి.మురళీకృష్ణ, డిప్యూటీ డీఎంహెచ్ఓ, కేఆర్‌పురం -
కొండెక్కి వస్తారు.. ప్రాణాలు రక్షిస్తారు
సాక్షి, అమరావతి: గోదావరి జిల్లా వై.రామవరం అటవీ ప్రాంతం. చుట్టూ అడవి.. ఎటుచూసినా ఎత్తయిన కొండలు.. నడిచేందుకు కూడా దారిలేని ప్రాంతమది.. అడవంతా జోరు వాన కురుస్తోంది. ఓ గిరిజనుడు తీవ్రమై న కడుపు నొప్పితో గింగిరాలు తిరుగుతున్నాడు. ఆ గూడెంలో ఒకటే అలజడి. డోలీ కట్టి ఆస్పత్రికి మోసుకెళదామంటే సమయం మించిపోయేలా ఉంది. సమాచారం అందుకున్న గిరిజన సంక్షేమ శాఖ సిబ్బంది రంగంలోకి దిగారు. బురదమయమైన మార్గంలోనూ బైక్ (ఫీడర్) అంబులెన్స్‌పై ఓ వ్యక్తి కొండలు, గుట్టల మీదుగా మెరుపు వేగంతో ఆ గూడెం వైపు కదిలాడు. అదే బైక్ వెనుక అమర్చిన పడక కుర్చీలాంటి సీటుపై అతనిని కూర్చోబెట్టుకుని క్షేమంగా ఆస్పత్రికి తరలించాడు. సకాలంలో వైద్య సేవలు అందడంతో ఆ ప్రాణం నిలిచింది. రాష్ట్రంలోని మారుమూల గిరిజన ప్రాంతాల్లో ఎవరికి రోగమొచ్చినా.. గర్భిణులకు ప్రసవ సమయమైనా ఆస్పత్రికి చేరాలంటే కిలోమీటర్ల తరబడి డోలీ మోత తప్పదు. బలమైన కొయ్య (కర్ర)లకు దుప్పటి కట్టడం లేదా తట్ట, నులక మంచాలకు తాళ్లు కట్టి ఇద్దరు లేక నలుగురు చొప్పున కిలోమీటర్ల కొద్దీ మోసుకుపోవాల్సిన దుస్థితి. ఆ ప్రయాణంలో సమయం మించిపోయినా, పరిస్థితి చేయి దాటినా ప్రాణాలు కోల్పోవాల్సిందే. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో 16,068 గిరిజన ఆవాసాలున్నాయి. వాటిలో 1,809 ప్రాంతాలకు దారి కూడా లేకపోవడంతో పాత ఫీడర్ అంబులెన్స్‌లు సైతం అక్కడకు వెళ్లలేని పరిస్థితులు ఉన్నాయి. ఇకపై డోలీ మరణాలు సంభవించకుండా చూసేందుకు రాష్ట్ర ప్రభుత్వం పక్కా కార్యాచరణ చేపట్టింది. అధునాతన బైక్ అంబులెన్స్‌లను రంగంలోకి దించుతోంది. ఎక్కడికైనా సునాయాసంగా వెళ్లేలా.. రాష్ట్రంలోని ఏజెన్సీ ప్రాంతాల్లో ఇప్పటికే 122 ఫీడర్ (బైక్) అంబులెన్స్‌లు, 79 ప్రత్యేక అంబులెన్స్‌లు సేవలందిస్తున్నాయి. వీటికి పక్కన రోగిని పడుకోబెట్టి తీసుకెళ్లేందుకు వీలుగా తొట్టెను అమర్చడం వల్ల మూడు చక్రాలు, ప్రత్యేక అంబులెన్స్‌లకు నాలుగు చక్రాలు అమర్చబడ్డాయి. ఈ కారణంగా ఇవి మారుమూల అటవీ ప్రాంతాల్లోకి వెళ్లడం ఇబ్బందికరంగా మారింది. ఈ నేపథ్యంలో కాకినాడ జేఎన్టీయూకు చెందిన నిపుణులు ప్రత్యేకంగా బైక్ అంబులెన్స్‌కు రూపకల్పన చేశారు. రెండు చక్రాల బైక్‌కు వెనుక భాగంలో రోగిని కూర్చోబెట్టి తీసుకెళ్లేలా ప్రత్యేకంగా సిట్టింగ్ (తొట్టె) ఏర్పాటు చేశారు. దీనిని ప్రయోగాత్మకంగా తూర్పు గోదావరి జిల్లా మారుమూల అటవీ ప్రాంతాల్లో ఈ ఏడాది మార్చి నుంచి నిర్వహిస్తుండగా మంచి ఫలితాలు వచ్చాయి. బైక్ అంబులెన్స్ తీర్చిదిద్దారిలా.. రాయల్ ఎన్ఫీల్డ్ బైక్‌ను తీసుకుని దానికి వెనుక సీటు తొలగించారు. దాని స్థానంలో పడక కుర్చీ మాదిరిగా 140 డిగ్రీల కోణంలో తొట్టె అమర్చారు. రోగి లేదా గర్భిణి భద్రంగా కూర్చునేందుకు వీలుగా దీనిని తీర్చిదిద్దారు. ఆ బైక్‌లో ప్రాథమిక వైద్యానికి అవసరమైన మెడికల్ కిట్ అందుబాటులో ఉంది. అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించేందుకు చిన్నపాటి ఆక్సిజన్ సిలిండర్‌ను కూడా అమర్చారు. సెలైన్ ఎక్కించే సౌకర్యం సైతం ఇందులో ఉంది. డోలీ మరణాలు లేకుండా చూస్తాం రాష్ట్రంలో డోలీ మరణాలు సంభవించకుండా ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది. ఇందుకోసం 7 ఐటీడీఏల పరిధిలో అంబులెన్స్‌లు వెళ్లేందుకు వీలులేని 1,809 మారుమూల ప్రాంతాలు గుర్తించాం. వాటిలో 1,503 ప్రాంతాలకు బైక్ అంబులెన్స్‌ల సౌకర్యం కల్పిస్తున్నాం. గర్భిణులు, అనారోగ్యం బారిన పడి న వారిని ముందుగానే గుర్తిం చేలా ‘గిరిబాట’ కార్యక్రమం చేపట్టాం. గిరిజనుల ప్రాణా ల్ని రక్షించేలా కార్యాచరణ చేపట్టాం. – పాముల పుష్పశ్రీవాణి, ఉప ముఖ్యమంత్రి -
మేడారం జాతరకు బైక్ అంబులెన్స్‌లు
సాక్షి, హైదరాబాద్: మేడారం జాతరలో ‘108’ బైక్ అంబులెన్స్‌ల సేవలు అందించాలని అధికారులు నిర్ణయించారు. ఈ నెల 31 నుంచి ఫిబ్రవరి మూడు వరకు జరిగే జాతర కోసం పది బైక్ అంబులెన్స్‌లు కేటాయించారు. రవాణా సదుపాయం సరిగా లేని ఏటూరునాగారం, ములుగు, భద్రాచలం, మణుగూరు వంటి ఏజెన్సీ ప్రాంతాల క్షతగాత్రులకు సత్వర వైద్యసేవలు అందించేందుకు అంబులెన్స్‌లు పంపినట్లు 108 చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ బ్రహ్మానందరావు చెప్పారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల పరిధిలోని ఇరుకైన, రద్దీ రోడ్లపై జరిగిన ప్రమాదాల్లో గాయపడినవారికి సత్వర వైద్యసేవలు అందించేందుకు బైక్ అంబులెన్స్ సర్వీసులను అందుబాటులోకి తెచ్చారు. ఇవి ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకు పనిచేస్తాయి. -
ఇక బైక్ అంబులెన్సులు
రామాయంపేట: 108 అంబులెన్సులకు తోడు త్వరలో బైక్ అంబులెన్సులు రానున్నాయి. రాష్ట్రంలో మొదటి విడతగా 200 వరకు బైక్ అంబులెన్సులు మంజూరయ్యాయి. హైదరా బాద్‌తోపాటు, జాతీయ రహదారులపై ఈ వాహనాల సేవలు అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి, కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల్లో బైక్ అంబులెన్సుల్లో పనిచేయడానికి గాను సిబ్బంది నియామక ప్రక్రియ ఆదివారం కామారెడ్డిలో జరగనుంది. పట్టణాలు, నగరాల్లో అత్యంత రద్దీ ప్రాంతాలకు, మూరుమూల గ్రామాలకు, చిన్న చిన్న గల్లీలకు వెళ్లడానికి 108 అంబులెన్సులకు కష్టతరమవుతుండగా, బుల్లెట్ అంబులెన్సులతో ఈ సమస్యను అధిగమించే అవకాశం ఉంది. డిసెంబర్లోనే ఇవి రోడ్డెక్కనున్నట్లు 108 వర్గాలు తెలిపాయి. బైక్ అంబులెన్సులతో తక్షణ వైద్య సేవలు 108 అంబులెన్సులు వెళ్లలేని గల్లీలకు, మారుమూల గ్రామాలకు బైక్ అంబులెన్సులు సులభంగా వెళ్తాయి. సకాలంలో వెళ్లి తక్షణమే వైద్య సేవలు అందిస్తాయి. ఈలోగా 108 అంబులెన్సులు అక్కడికి వెళ్లి రోగిని సమీపంలోని ఆస్పత్రికి తరలించే అవకాశం ఉంటుంది. వీటిని ఫస్ట్ రెస్పాండర్ బైక్ అంబులెన్సుగా పిలుస్తారు. –జాన్ షాహిద్, ఐదు జిల్లాల 108 ప్రోగ్రామ్ అధికారి -
బైక్ అంబులెన్స్
నగరాల్లో పెరుగుతున్న ట్రాఫికర్.. అంబులెన్స్‌లోని క్షతగాత్రుల పాలిట శాపంగా పరిణమిస్తోంది. సకాలంలో అంబులెన్స్ రాక, వచ్చినా ఆస్పత్రికి చేరుకోలేక ఎందరో ప్రాణాలు గాల్లో కలసిపోతున్నాయి. ఈ సమస్యకు చెక్ పెడుతూ.. బెంగళూర్‌లో టూ వీలర్ అంబులెన్స్ తీసుకొచ్చింది అక్కడి ప్రభుత్వం. ఈ బైక్ అంబులెన్స్‌లో ఫస్ట్ ఎయిడ్ కిట్‌తో పాటు అత్యవసర పరిస్థితుల్లో అందించాల్సిన మందులు, ఆక్సిజన్ సిలిండర్‌ను కూడా అందుబాటులో ఉంచారు. ప్రమాదంలో గాయపడిన వ్యక్తిని ట్రాఫిక్ పద్మవ్యూహాన్ని దాటుకుని.. నిమిషాల వ్యవధిలో ఆస్పత్రికి చేర్చాలంటే.. ఇంతకంటే బెటర్ ఆప్షన్ లేదంటున్నారు బెంగళూరువాసులు.