విషాద యాత్ర
మారేడుమిల్లికి మిత్రులతో కలిసి
బయలుదేరిన విద్యార్థులు
అదుపు తప్పి చెట్టును ఢీకొన్న బైక్
ఇద్దరు విద్యార్థులు దుర్మరణం
గోకవరం:
వారంతా నవయువకులు.. ముందుగా ప్లాన్ చేసుకున్న ప్రకారం ఎనిమిది మంది మారేడుమిల్లికి విహారయాత్రకు బయలుదేరారు. గమ్యం చేరకుండానే ఓ మలుపు రెండు కుటుంబాల్లో విషాదం నింపింది. గోకవరం మండలం సింగారమ్మచింత, జగన్నాథపురం గ్రామాల మధ్య ప్రధాన రహదారి పక్కన చెట్టుని బైక్ ఢీకొన్న ఘటనలో ఇద్దరు విద్యార్థులు దుర్మరణం చెందగా, మరో యువకుడు గాయపడ్డాడు. కాకినాడకు చెందిన ఓలేటి లోవరాజు (19), గుత్తుర్తి పవన్‌కళ్యాణ్ (20), కొల్లు సతీష్, మరో ఐదుగురు యువకులు కలిసి మూడు బైక్‌లపై శనివా రం ఉదయం 6 గంటలకు కాకినాడ నుంచి మారేడుమిల్లి విహారయాత్రకు బయలుదేరారు. మార్గమధ్యలో మల్లిసాల వద్ద తెలిసిన వారి ఇంటి వద్ద అల్పాహారం తీసుకుని తొమ్మిది గంటలకు ప్రయాణం కొనసాగించారు. అక్కడ బయలుదేరిన కొద్ది సేపటికే సింగారమ్మచింత దాటిన తరువాత భారీ మలుపులో వీరు ప్రయాణిస్తున్న ఒక పల్సర్‌బైక్ అదుపు తప్పి రహదారి పక్కన ఉన్న చెట్టుని ఢీకొట్టింది. దీంతో బైక్‌పై ప్రయాణిస్తున్న ఓలేటి రాజు, గుత్తుర్తి కళ్యాణ్ అక్కడికక్కడే మృత్యువాత పడగా అదే వాహనంపై ఉన్న సతీష్ తీవ్ర గా యాలపాలయ్యాడు. అతడిని సహచరులు 108 వాహనంలో రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతి చెందిన విద్యార్థులు ఇద్దరూ కాకినాడ ఏపీటీ కళాశాల విద్యార్థులు కాగా, క్షతగాత్రుడు పదో తరగతితో చదువు ఆపేశాడు. సమాచారం అందుకుని అక్కడకు వచ్చిన మృతుల బంధువుల రోదనలతో ఆ ప్రాంతం దద్దరిల్లింది. ఘటన స్థలానికి చేరుకున్న గోకవరం పోలీసులు పరిస్థితిని సమీక్షించారు. అదే మలుపులో రెండు వారాల క్రితం ఓ కారు చెట్టును ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. ఇంకా ఆ కారు అక్కడే ఉంది. కారును ఆనుకుని ఉన్న చెట్టును ఢీకొని ప్రస్తుతం ఇద్దరు యువకులు మృత్యువాత పడ్డారు. బైక్ వేగంగా నడపడంతో మలుపులో ఉన్న కారును చూసి కంగారు పడి వాహనాన్ని అదుపు చేయలేక చెట్టుని ఢీకొట్టి ఉండవచ్చని స్థానికులు భావిస్తున్నారు. సహ విద్యార్థులు మాత్రం తాము ముందు వెళ్తున్నామని వెనుక వస్తున్న బైక్ చెట్టుని ఢీకొట్టి శబ్ధం రావడంతో వెనక్కు వెళ్లామంటున్నారు. ఎస్సై వెంకటసురేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
తెగిపోయిన ఆధారం
కాకినాడ క్రైం :
వారిద్దరు నిరుపేద కుటుంబాలకు చెందిన పాలిటెక్నిక్ విద్యార్థులు. ఒకరు రెండో సంవత్సరం చదువుతుండగా, మరొకరు కోర్సు పూర్తిచేసి ఉద్యోగాన్వేషణలో ఉన్నారు. స్నేహితులతో మారేడుమిల్లి జలపాతం వద్దకు విహార యాత్రకు కాకినాడ నుంచి మూడు బైక్‌లపై ఎనిమిది మంది ఉత్సాహంగా బయలుదేరి వెళ్లారు. వారిలో ఒక వాహనం అదుపుతప్పి చెట్టును ఢీకొనడంతో ఇద్దరు మృతి చెందగా, ఒకరు గాయపడ్డారు. దీంతో మృతుల కుటుంబాల్లో విషాదం నెలకొంది.
మంచి ఉద్యోగం చేస్తాడనుకుంటే..
కాకినాడ ఫ్రేజర్‌పేట ధనమ్మతల్లి వీధికి చెందిన ఓలేటి లోవరాజు స్థానిక ఆంధ్రా పాలిటెక్నిక్ కళాశాలలో రెండో సంవత్సరం చదువుతున్నాడు. తండ్రి కామేశ్వరరావు మోటరైజ్డ్ బోట్‌పై చేపలవేటకెళ్లి కుటుంబాన్ని పోషిస్తుంటాడు. ఇంట్లో ఎవరూ పెద్దగా చదువుకోక పోవడంతో మూడో కుమారుడైన రాజును కష్టపడి చదివిస్తున్నాడు. ‘స్నేహితులం వాటర్ ఫాల్స్ వద్ద ఫొటోలు తీయించుకోవడానికి వెళుతున్నాం అమ్మా, సాయంత్రానికి తిరిగొచ్చేస్తాం. నాన్నతో చెప్పి కంగారు పెట్టకు’ అని ఇంటి వద్ద నుంచి శనివారం ఉదయం 6 గంటలకు బయలుదేరి వెళ్లిన తన కుమారుడు ఇలా అర్థాంతరంగా మృతి చెందుతాడని అనుకోలేదని కన్నీరుమున్నీరుగా తల్లి పార్వతి విలపించిన తీరు చూపరులను కంట తడి పెట్టించింది.
ఉద్యోగం చేసి ఇల్లు కట్టిస్తానన్నాడు..
‘అమ్మా.. నాన్నా, నువ్వు పడిన కష్టానికి తగిన ప్రతిఫలం దక్కింది. నాన్న రెక్కల కష్టంపైనే కుటుంబ గడవడం కష్టంగా ఉండేది. పాడైన పెంకుటింటిని అప్పు తీసుకుని పక్కాగా కట్టిస్తాను’ అని చెప్పిన కొన్ని రోజులకే ఇలా అర్థాంతరంగా తమ కుమారుడు గుత్తుర్తి పవ¯ŒS కల్యాణ్ (18) మృతి చెందుతాడనుకోలేదని తల్లి సత్యవతి విలపించిన తీరు హృదయవిదారకంగా ఉంది. ప్రమాదాలు ఎక్కువ జరుగుతున్నాయి, మోటార్ బైక్‌పై వద్దు ఆర్టీసీ బస్సుపై వెళ్లమని చెప్పినా, వినకుండా స్నేహితుడి బైక్‌పై వెళ్లి ఇలా తిరిగిరాని లోకానికి వెళ్లిపోయావా అంటూ గుండెలు బాదుకుంటూ విలపించింది. తనకు ఇద్దరు సంతానమని, కుమార్తె తర్వాత పదమూడేళ్లకు పుట్టిన నువ్వు ఇలా మృత్యువుకు చేరుతావనుకోలేదని విలపించిన తీరు స్థానికులను కలచివేసింది. వీరితో పాటూ బైక్‌పై వెళ్లిన కాకినాడ పాతబస్టాండ్ వెంకటేశ్వరకాలనీకి చెందిన కొల్లు సతీష్ తలకు తీవ్ర గాయాలు కావడంతో కాకినాడ జీజీహెచ్‌లో చికిత్స పొందుతూ అపస్మారకస్థితిలో ఉన్నాడు. ఇతని తలకు తీవ్రంగా గాయాలు కావడం, తల, ముక్కు, నోటి నుంచి తీవ్ర రక్తస్రావం కావడంతో పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. సతీష్ మెయి¯ŒSరోడ్డు బట్టలు దుకాణంలో సేల్స్మే¯ŒSగా పనిచేస్తున్నాడు. తండ్రి వీరబాబు సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. మారేడుమిల్లి పిక్నిక్కు వెళ్లొస్తామని చెప్పి వెళ్లిన తమ కుమారుడు ఇలా తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో అపస్మారకస్థితిలో ఉండడంపై కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.