bike stolen
-
క్వార్టర్ సీసా తెస్తాడని నమ్మితే నట్టేట ముంచాడు.. ఎంతసేపైనా రాకపాయె!
నాగిరెడ్డిపేట (నిజామాబాద్): ఓ గుర్తు తెలియని వ్యక్తి మద్యం తాగుదామని పరిచయం పెంచుకొని బైక్ ఎత్తుకెళ్లిన ఘటన నాగిరెడ్డిపేట మండలంలో చోటు చేసుకుంది. ఎస్సై ఆంజనేయులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని ఎర్రగుట్ట తండాకు చెందిన మాలవత్ లింగ్య ఈ నెల 24న మద్యం తాగేందుకు తన ద్విచక్ర వాహనంపై గోపాల్పేట మద్యం దుకాణం వద్దకు వెళ్లాడు. అదే సమయంలో వైన్‌షాపు వద్ద ఓ గుర్తు తెలియని వ్యక్తి లింగ్యతో పరిచయం చేసుకుని మాటలు కలిపాడు. ఈ క్రమంలో ఇద్దరు కలిసి మద్యం తాగుదామని నిర్ణయించుకున్నారు. సదరు వ్యక్తి మద్యం షాప్‌నకు వెళ్లి క్వార్టర్ బాటిల్‌ను తీసుకున్నాడు. ఇద్దరు కలిసి బైక్‌పై మండలంలోని తాండూరు శివారులో పౌల్ట్రీఫామ్ వెనుకకు వెళ్లి మద్యం తాగారు. మరికొంత మద్యం తాగుదామని చెప్పడంతో లింగ్య అంగీకరించాడు. దీంతో గుర్తుతెలియని వ్యక్తి లింగ్య బైక్‌ను తీసుకుని మద్యం తెస్తానని చెప్పి వెళ్లి.. తిరిగి రాలేదు. దీంతో తన బైక్ పోయిందని గుర్తించి, ఇట్టి విషయమై బాధితుడు లింగ్య పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు. (చదవండి: వలపు వల విసిరి బ్లాక్మెయిల్.. రూ.80 లక్షలు వసూలు చేసిన జంట) -
‘దొంగ’ తెలివి! ఏకంగా హోంగార్డు బైక్‌నే దొంగిలించి...వెళ్తు..వెళ్తూ..
సాక్షి, బంజారాహిల్స్: చోరాగ్రేసరుల తెలివే వేరు. విభిన్నంగా ఆలోచించడమే వీరికున్న అదనపు అర్హత. ఏకంగా హోంగార్డు బైక్‌నే దొంగిలించి.. దానిపైనే వెళుతూ ఓ ద్విచక్ర వాహన చోదకుడి మొబైల్‌నే కొట్టేశారు. ఆ తర్వాత ఎట్టకేలకు దొరికిపోయిన ముగ్గురు యువకుల ‘దొంగ’ తెలివి బయటపడిన ఉదంతం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. బాధితులు చెప్పిన వివరాల ప్రకారం.. బంజారాహిల్స్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో ధర్మ అనే హోంగార్డు పని చేస్తున్నారు. కారి్మకనగర్‌లో ఆయన నివసిస్తున్నారు. రోజువారీలాగే బుధవారం రాత్రి విధులు ముగించుకొని ఇంటికి వచి్చన ధర్మ.. తన బైక్‌ను బయట పార్కింగ్ చేశారు. రాత్రి 12 గంటల సమయంలో ముగ్గురు యువకులు సదరు బైక్‌ను అపహరించారు. ఆ వాహనంపైనే రహమత్‌నగర్ మీదుగా యూసుఫ్‌గూడ వైపు దొంగతనానికి బయల్దేరారు. కొట్టేసిన వాహనంపైనే వెళుతూ.. అదే సమయంలో శంషాబాద్ ఎయిర్పోర్ట్ కాలనీకి చెందిన మల్లారెడ్డి అనే స్విగ్గి డెలివరీ బాయ్ ఓ ఆర్డర్ కోసం కోట్ల విజయభాస్కర్‌రెడ్డి స్టేడియం వద్ద వేచి చూస్తున్నాడు. బైక్‌పై వచి్చన దొంగలు సదరు మల్లారెడ్డిని లైటర్ ఉందా అని అడుగుతూనే మల్లారెడ్డి చేతుల్లోని మొబైల్ ఫోన్‌ను క్షణాల్లో లాక్కుని ఉడాయించారు. బాధితుడు అప్రమత్తమై తన బైక్‌పై వారిని వెంబడిస్తూ దొంగా.. దొంగా అంటూ అరిచాడు. చుట్టుపక్కల వారు సైతం ఆయనతో పాటు దూసుకెళ్లారు. సందుల్లోకి వెళ్లిన ముగ్గురు దొంగలు ఆ ప్రాంతం కొత్తది కావడంతో అటు తిరిగి... ఇటు తిరిగి మళ్లీ కోట్ల విజయభాస్కర్‌రెడ్డి స్టేడియంవైపే వచ్చారు. అప్పటికే వీరి కోసం వెంట పడుతున్నవారికి కనిపించారు. వీరందరిని చూడగానే దొంగలు ముగ్గురు మొబైల్ ఫోన్‌తో పాటు బైక్‌ను అక్కడే పడేసి ఉడాయించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్ క్రైం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. (చదవండి: స్పాల ముసుగులో వ్యభిచారం.. ఆరు నెలల నుంచి విచ్చలవిడిగా..) -
చలానాతో.. పోయిన బైక్ తిరిగొచ్చింది!
సాక్షి, ఆదోని: జరిమానా అంటే సహజంగా బాధ కలిగించే విషయమే. అయితే కర్నూలు జిల్లా ఆదోని పట్టణానికి చెందిన పురుషోత్తంకి మాత్రం జరిమానా ఖుషీ కలిగించింది. అదెలాగంటే... పట్టణానికి చెందిన పురుషోత్తం 2018 మార్చిలో ఎస్కేడీ కాలనీలోని తన గది ముందు హీరో స్ప్లెండర్ బైక్ నిలిపి ఉంచాడు. కొద్దిసేపటికే అది అపహరణకు గురికావడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఏడాది గడిచినా బైక్ ఆచూకీ దొరకలేదు. ఇక దొరకదేమోనని ఆశ వదులుకున్నాడు. అయితే మూడు రోజుల క్రితం తన సెల్‌ఫోన్‌కు ఒక మెసేజ్ వచ్చింది. ట్రాఫిక్ నిబంధనలకు విరుద్ధంగా బైక్‌పై ముగ్గురు ప్రయాణం చేస్తూ పట్టుబడినందున, నిర్ణీత కాల వ్యవధిలో రూ.1,235 జరిమానా చెల్లించాలని అందులో ఉంది. వెంటనే ఈ విషయం టూటౌన్ సీఐ అబ్దుల్ గౌస్ దృష్టికి తీసుకెళ్లాడు. సీఐ స్పందించి మెసేజ్ ఏ పోలీసు స్టేషన్ పరిధి నుంచి వచ్చిందో గుర్తించి.. కోసిగి పోలీసులను సంప్రదించారు. వారు బైక్‌ను స్వాధీనం చేసుకుని సంబంధిత వ్యక్తిని సీఐ వద్దకు పంపించారు. ఏడాది తరువాత తన బైక్ తిరిగి దక్కడంతో పురుషోత్తం సంతోషం వ్యక్తం చేశాడు. -
నిఘా అధికారుల బైకు హుష్ కాకి!
నిఘా అధికారులు అనగానే వాళ్లకు వెయ్యి కళ్లుంటాయని, చీమ చిటుక్కుమన్నా ఇట్టే తెలిసిపోతుందని అనుకుంటాం కదూ. కానీ, ఇదంతా నాణేనికి ఒకవైపు మాత్రమే. రెండోవైపు చూస్తే.. వాళ్లు కూడా దొంగతనాలు, చోరీల బాధితులే అవుతున్నారు. ప్రముఖ పర్యాటక కేంద్రం గోవాలో ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారులకు చెందిన ఒక మోటారు సైకిల్ చోరీకి గురైంది. గుర్తుతెలియని వ్యక్తులు ఈ మోటారు సైకిల్‌ను దొంగిలించారంటూ నగర పోలీసు స్టేషన్లో ఫిర్యాదు కూడా నమోదైంది. తాను ఒక బ్యాంకు వద్ద తన మోటారు సైకిల్ పార్క్ చేసి ఉంచగా, ఎవరో దాన్ని ఎత్తుకెళ్లిపోయారంటూ ఇంటెలిజెన్స్ బ్యూరో అసిస్టెంట్ డైరెక్టర్ శాంతా మడివాల్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన అధికారులు, బైకు ఎక్కడుండా అని గాలించడం మొదలుపెట్టారు.