Bike tour
-
స్టార్ హీరో షాకింగ్ నిర్ణయం?
నటుడు అజిత్ రూటే సపరేటు. ఆయనకు నటన వృత్తి. బైక్ రేస్, రైఫిల్ షూటింగ్ ప్రవృత్తి. అగ్ర కథానాయకుడిగా రాణిస్తునే మరోపక్క మనసుకు నచ్చిన పలు క్రీడాంశాల్లో పాల్గొంటున్నారు. ఇటీవల రైఫిల్ షూటింగ్ పోటీల్లో పాల్గొని బహుమతులను గెలుచుకున్నారు. అనంతరం 30 రోజుల పాటు ఉత్తరాది రాష్ట్రాల్లో బైక్‌పై ప్రయాణించి మక్కువను తీర్చుకున్నారు. ప్రస్తుతం హెచ్.వినోద్ దర్శకత్వంలో బోనీ కపూర్ నిర్మిస్తున్న తుణివు చిత్ర షూటింగ్ పూర్తి చేశారు. ప్యాచ్ వర్క్ మాత్రమే మిగిలింది. నటి మంజు వారియర్ నాయకిగా నటిస్తోంది. బ్యాంక్ రాబరింగ్ ఇతివృత్తంతో రూపొందుతున్న ఈ చిత్రం సంక్రాంతి సందర్భంగా విడుదలకు ముస్తాబవుతోంది. ఈ నేపథ్యంలో అజిత్ మరోసారి బైక్‌పై ప్రపంచాన్ని చుట్టి రావడానికి రెడీ అవుతున్నారు. ఈసారి ఆయన భారీ బైక్ ప్రయాణానికి ప్లాన్ చేసినట్లు సమాచారం. 18 నెలల బైక్ ప్రయాణంలో అంటార్కిటికా సహా ఏడు ఖండాలు దాటి 62 దేశాలు చుట్టి రానున్నారని సమాచారం. అయితే అంతకుముందు నయనతార భర్త విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో నటించడానికి అజిత్ సిద్ధం అవుతున్నారు. ఈ క్రేజీ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ నిర్మించడానికి సన్నాహాలు చేస్తోంది. ఇది త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ చిత్రాన్ని పూర్తి చేసిన తరువాత అజిత్ బైక్ ప్రయాణం ప్రారంభిస్తారని తెలుస్తోంది. దీంతో ఆయన ఏడాదిన్నర పాటు సినీ ప్రపంచానికి దూరంగా ఉండనున్నట్లు తెలిసింది. చదవండి: Rajeev Kanakala: సంపాదన విషయంలో గొడవలు? రాజీవ్ వ్యాఖ్యలు వైరల్ -
సాహసం.. ఆ సేతు హిమాచలం
(విశాఖపట్నం) చరిత్రలో మనకంటూ ఓ పేజీ ఉండాలి. నాలుగు గోడల మధ్య గొంగళి పురుగులా బతకడం కంటే సీతాకోకచిలుకలా మారి ప్రపంచాన్ని చుట్టేయాలి. కళ్లకు గంతలు విప్పేయాలి. హాయిగా.. ఆనందంగా ప్రపంచంతో కబుర్లాడేయాలి. చేసే ప్రయాణం లో సామాజిక బాధ్యత ఉండాలి. ఇదే ఆలోచన 20 ఏళ్ల యువకుడికి వచ్చింది. మనసులో ‘పట్టుదలతో చేస్తే సమరం.. తప్పకుండ నీదే విజయం’ అనే సాంగ్ మోగింది. ఇంకెందుకు ఆలస్యం అనుకున్నాడు. తన 125 సీసీ బైక్‌పై విశాఖ నుంచి కశ్మీర్ , కశ్మీర్ నుంచి కన్యాకుమారి, కన్యాకుమారి నుంచి విశాఖకు ప్రయాణించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. రోజుకు 500 నుంచి 850 కిలోమీటర్ల దూరం ప్రయాణించి.. 55 రోజుల్లో 11,600 కిలోమీటర్ల బైక్ యాత్రను దిగ్విజయంగా పూర్తి చేశాడు. ఇరవై ఏళ్ల బొంతు సంపత్ బైక్‌పై దేశాన్ని చుట్టివచ్చాడు. లంకపల్లి బుల్లయ్య కళాశాలలో ట్రావెల్ అంట్ టూరిజంలో బీఏ సెకండియర్ చదువుతున్నాడు. సంపత్ పర్యావరణ పరిరక్షణ కోసం ‘సేవ్ సాయిల్’పేరుతో బైక్‌పై సాహసయాత్ర చేపట్టి అందరి మన్ననలు, అభినందనలు అందుకున్నాడు. చైనా, పాకిస్థాన్ బోర్డర్ల మీదుగా సాగిన ఈ యాత్రలో ఎన్నో ఆహ్లాదకరమైన, ఆనందమైన క్షణాలను అనుభవించాడు. చిన్న చిన్న ఇబ్బందులు, ప్రమాదకర పరిస్థితులను ఎదుర్కొన్నాడు. ప్రతికూల వాతావరణాన్ని అనుకూలంగా మార్చుకున్నాడు. మొత్తంగా ఈ యాత్ర తనలో గొప్ప ఆత్మవిశ్వాసం, సంతృప్తినిచ్చిందని, త్వరలో టీవీఎస్ ఎక్స్‌ఎల్‌పై నేపాల్ యాత్ర చేపడతానని చెప్పాడు. ఈ యాత్ర అనుభవాలను ‘సాక్షి’తో పంచుకున్నాడు. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే.. ఆనందం.. అయోమయం యాత్రలో చాలా వరకు ఇంగ్లీష్, వచ్చి రాని హిందీతో మేనేజ్ చేసేవాడిని. కశ్మీర్ బోర్డర్ నుంచి అసలు సమస్య మొదలైంది. వారు మాట్లాటే కశ్మీర్, లద్దాఖ్ ప్రాంతంలో మాట్లాడే లద్దాఖీ భాష రాక.. మన భాష వారికి అర్థం కాక ఇబ్బందిపడ్డాను. రోజూ హైవే పక్కన డాబాల్లో భోజనం చేసేవాడిని. జమ్మూ కశ్మీర్, హిమాచల్‌ప్రదేశ్, లద్దాఖ్ రీజియన్‌లో టిబెటన్ సంప్రదాయ వంటలే దొరికేవి. అవి తినలేక వారం రోజుల పాటు మ్యాగీ తిని సరిపెట్టుకున్నా. కశ్మీర్ బోర్డర్లో మన సిమ్ పని చేయలేదు. అక్కడ లోకల్ సిమ్ తీసుకున్నా. అయినప్పటికీ లూసర్, స్పిటీవేలీ తదితర ప్రాంతాల్లో ఆ సిమ్ పని చేయలేదు. మూడు రోజుల పాటు కుటుంబసభ్యులతో మాట్లాడలేకపోయా. లద్దాఖ్‌లో అనుమతుల కోసం ఏడు రోజులు నిరీక్షించాను. వాతావరణం బాగోక, వర్షాల కారణంగా మొత్తం యాత్రలో 15 రోజులు రెస్ట్‌లో ఉండిపోవాల్సి వచ్చింది. ఢిల్లీ దాటాక బాగా చలి వేసింది. కశ్మీర్, హిమాచలప్రదేశ్, లద్దాఖ్ ప్రాంతాల్లో –6 డిగ్రీల చలిలో ప్రయాణించేటపుడు బాగా ఇబ్బంది పడ్డా. కాళ్లు, చేతులు తిమ్మిరెక్కిపోయేవి. గేర్ వేస్తున్నా స్పర్మ ఉండేది కాదు. హ్యాండిల్ పట్టుకోలేక పోయేవాడిని. అయినా మొండిగా ప్రయాణం కొనసాగించాను. బైక్ ఏపీ రిజిస్ట్రేషన్ చూసి చాలా మంది టూరిస్టులు, రైడర్స్ పలకరించేవారు. ఎటువైపు వెళ్లాలో సలహాలిచ్చేవారు. ఆ క్షణంలో మనోళ్లు కనిపించారన్న ఆనందం కలిగేది. యాత్ర సాగిందిలా.. విశాఖలో మొదలై తెలంగాణ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, ఢిల్లీ, హర్యానా, పంజాబ్ మీదుగా జమ్మూకశ్మీర్ చేరుకున్నా. తిరిగి అక్కడ నుంచి లద్దాఖ్, హిమాచల్‌ప్రదేశ్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రా, కర్ణాటక మీదుగా తమిళనాడులోని కన్యాకుమారి చేరుకుని అక్కడ నుంచి విశాఖకు చేరుకున్నా. మొత్తంగా 14 రాష్ట్రాలను చుట్టి.. తన యాత్రను పూర్తి చేశానని సంపత్ తెలిపాడు. గరిష్టంగా 850 కి.మీ. ప్రయాణం రోజూ ఉదయం 8 గంటలకు బైక్‌పై యాత్ర ప్రారంభం అయ్యేది. ప్రారంభంలో సేవ్ సాయిల్‌పై అవగాహన కల్పించేవాడిని. భోజన విరామం తీసుకుని రాత్రి 11 గంటల వరకు బైక్‌పై ప్రయాణం చేసేవాడిని. రోజుకు 500 నుంచి 700 కిలోమీటర్ల దూరం ప్రయాణం సాగేది. అత్యధికంగా ఒక్క రోజులో 850 కిలోమీటర్లు దూరం కూడా ప్రయాణం సాగించా.. రోజూ 12 నుంచి 14 గంటల సేపు బైక్‌పై ప్రయాణించి అలసిపోయేవాడిని. ఈ ప్రయాణంలో ఎక్కడ హోటల్ అందుబాటులో ఉండే.. అక్కడే రాత్రి బస చేసేవాడిని. తన హెల్మెట్‌కు అమర్చిన మైక్, కెమెరా ద్వారా నా రైడ్‌ను వీడియోలుగా తీసి యూట్యూబ్‌లో పోస్ట్ చేశా. సామాజిక బాధ్యతగా.. సామాన్య మధ్య తరగతి కుటుంబంలో పుట్టిన సంపత్ మొదటి నుంచి పర్యావరణ పరిరక్షణ కోసం సామాజిక బాధ్యతగా ఏదైనా చేయాలన్న తపన ఉండేది. ఆరిలోవకు చెందిన సంపత్ తండ్రి బొంతు శ్రీనివాసరావు పరవాడలో చిన్న రెస్టారెంట్ నడుపుతున్నారు. తల్లి ఓమ్న గృహిణి. తమ్ముడు ఇంటర్ చదువుతున్నాడు. బుల్లయ్య కళాశాలలో ట్రావెల్ అండ్ టూరిజం కోర్సులో బీఏ జాయిన్ అయ్యాక తన సబ్జెక్ట్ పరంగా ట్రావెలింగ్ చేయాలన్న ఆలోచన వచ్చింది. గతేడాది ‘నో ప్లాస్టిక్’నినాదంతో అవగాహన కలి్పస్తూ సైకిల్‌పై విశాఖ నుంచి కన్యాకుమారి వరకు 23 రోజుల్లో 1,857 కిలోమీటర్లు ప్రయాణించాడు. ఈ ఏడాది మే 30న తన హోండా షైన్ 125 సీసీ బైక్‌పై బుల్లయ్య కళాశాల వద్ద బయలుదేరి కశ్మీర్ చేరుకుని, అక్కడ నుంచి కన్యాకుమారి వరకు ప్రయాణించాడు. కన్యాకుమారి నుంచి మరలా ఈ నెల 23న నగరానికి చేరుకున్నాడు. చైనా, పాకిస్థాన్ సరిహద్దుల్లో ప్రయాణం ఇండియాకు చైనాకు కనెక్టింగ్ రోడ్ లద్దాఖ్‌లో ప్రయాణం కొత్త అనుభూతిని కలిగించింది. చైనా బోర్డర్లో ప్రయాణం కొనసాగించా. తిరుగు ప్రయాణంలో భారత్–పాకిస్తాన్ బోర్డర్లో వాఘా వద్ద సైనిక వందనం చూశాను. చాలా గొప్ప అనుభూతికి లోనయ్యాను. 55 రోజుల ప్రయాణానికి రూ.1.60 లక్షలు ఖర్చు అయింది. కేవలం పెట్రోల్‌కే రూ.40 వేల వరకు ఖర్చు చేశా. ఆ తర్వాత రాత్రి పూట బస చేయడానికి హోటల్ రూమ్స్‌కు ఎక్కువ చెల్లించా. లద్దాఖ్‌లో ఉన్న ఒక్క రూమ్ కోసం ఆ రాత్రి రూ. 5500 ఖర్చు చేయాల్సి వచ్చింది. ఈ యాత్రకు బుల్లయ్య కళాశాల యాజమాన్యం రూ.22 వేల వరకు సాయం అందించింది. ధాన్ ఫౌండేషన్ రూ.60 వేల సాయం అందించి నన్ను ప్రోత్సహించింది. వారి సహాయాన్ని ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటా.. ప్రపంచంలో ఎత్తైన ఉమ్లింగ్ లా.. సముద్రమట్టానికి 19,042 అడుగుల ఎత్తులో ఉన్న ఉమ్లింగ్ లా పాస్‌కు 125 సీసీ బైక్‌పై చేరుకోవడం చాలా గొప్ప విషయం. 400 సీసీ బైక్‌పై ప్రయాణించలేని మార్గంలో 125 సీసీ బైక్‌పై ప్రయాణించా. ఉమ్లింగ్ లా పాస్‌కు చేరాక ఊపిరి ఆడక ముఖమంతా పచ్చగా మారిపోయింది. సమీపంలో ఉన్న బీఎస్ఎఫ్ జవాన్లు ఫస్ట్ ఎయిడ్ చేసి సాయం అందించారు. కొత్త అనుభూతి కలిగింది నేను ఈ ప్రయాణంలో జీవితంలో మొదటిసారి చాలా ఆహ్లాదకరమైన ప్రదేశాలు, అరుదైన ప్రాంతాలను చూడగలిగాను. ఆగ్రా, నూబ్రా వేలీ, ప్రపంచంలో ఎత్తైన చిచామ్ బ్రిడ్జి, ప్రపంచంలో ఎత్తైన పెట్రోల్ బంకు ఖాజా బంకు, హిక్కింలో ఎత్తైన పోస్టాఫీస్, సిమ్లా, మనాలీ, ఇండియా పాక్ బోర్డర్, ఇండియా చైనా బోర్డర్, జోజి లా పాస్, కన్యాకుమారి, కశ్మీర్, హిమాచల్‌ప్రదేశ్, పాంగాంగ్ లేక్, డిస్కిట్, సోన్మార్గ్, ప్రపంచంలో ఎత్తైన రోడ్ ఖార్దుంగ్లా, ఉమ్లింగ్ లా పాస్ రహదారుల్లో ప్రయాణం, లాంగెస్ట్ అటల్ టన్నెల్లో ప్రయాణం, అందమైన ప్రకృతి, ఆహ్లాదమైన మంచు, లోయలు, జలపాతాలను చూస్తూ కశీ్మర్, హిమాచల్‌ప్రదేశ్‌లో బైక్ ప్రయాణం జీవితంలో మర్చిపోలేనని సంపత్ తన యాత్ర విశేషాలను వివరించాడు. 60 కిలోమీటర్లు.. 8.30 గంటలు కార్గిల్ నుంచి లేహ్ వెళ్తున్న సమయంలో రోడ్ బాగోక బైక్ స్కిడ్ అయి పడిపోయా. అటుగా వెళ్తున్న రైడర్ల సాయంతో బైక్ సరిచేసుకుని ముందుకు సాగా. అలాగే మనాలి నుంచి లూసర్ వరకు 60 కిలోమీటర్ల జర్నీ చేయడానికి బాగా ఇబ్బంది పడ్డా. ఈ మార్గం నేషనల్ హైవే అయినప్పటికీ రహదారి అంతా పెద్ద పెద్ద రాళ్లతో ఉంది. బైక్‌పై వెళ్లడానికి నానా పాట్లు పడ్డా. 60 కిలోమీటర్లు దూరం ప్రయాణించడానికి ఎనిమిదిన్నర గంటల సమయం పట్టింది. రాళ్లపై ప్రయాణంతో ఆ రోజు బాగా అలసిపోయా.. -
డుగ్గు డుగ్గుమంటూ .. ‘బుల్లెట్’ బైక్ ఎక్కి పోదామా!
సాక్షి, హైదరాబాద్: కరోనా అనంతరం బైక్ రైడింగ్ ఈవెంట్స్ తిరిగి రోడ్డెక్కుతున్నాయి. నగరానికి చెందిన రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ రైడర్స్ ఇష్టపడే బైక్ టూర్ మూడేళ్ల తర్వాత మరోసారి ప్రారంభం కానుంది. ఈ విషయాన్ని సంస్థ ప్రతినిధులు తెలిపారు. హిమాలయన్ ఒడిస్సీ పేరుతో నిర్వహించే ఈ బైక్ టూర్...ప్రపంచంలోని అతి పెద్ద రైడ్స్‌లో ఒకటిగా పేరొందింది. ఈ ఏడాది జులై 2న ఢిల్లీలో పునఃప్రారంభం కానున్న ఈ అడ్వంచరస్ రైడ్ 18 రోజుల పాటు హిమాలయ పర్వత ప్రాంతంలో కొనసాగుతుందని, మొత్తం 2,700 కి.మీ దూరం పాటు రైడ్ ఉంటుందని వివరించారు. చదవండి: Hyderabad: బోర్డ్ తిప్పేసిన ఐటీ సంస్థ.. రోడ్డున పడ్డ 800 మంది ఉద్యోగులు -
కేసీఆర్ ప్రధాని కావాలని..
సిద్దిపేటజోన్: కేసీఆర్ ప్రధాని కావాలని ఆకాంక్షిస్తూ ఆదిలాబాద్ నుంచి చేపట్టిన ద్విచక్రవాహన యాత్ర బుధవారం సిద్దిపేటకు చేరింది. ఆదిలాబాద్‌కు చెందిన తెలంగాణ ఉద్యమకారుడు రామోజీ ఆంజనేయులు బైక్‌పై తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా జిల్లాల్లో యాత్ర చేపట్టాడు. కేసీఆర్ ప్రధాని కావాలనే ఆకాంక్షతో తాను రాష్ట్ర మొత్తం తిరుగుతున్నట్లు పేర్కొన్నారు. -
జగమంత కుటుంబం మనది!
అమీర్‌పేట: ప్రపంచ శాంతి, జగమంతా వసుధైక కుటుంబం అనే నినాదంతో తండ్రీకొడుకు బైక్ యాత్ర చేపట్టనున్నారు. నగరంలోని పాథ్‌కేర్ ల్యాబ్స్ ఎండీ డాక్టర్ జి.వి.ప్రసాద్, ఆయన చిన్నకుమారుడు డాక్టర్ రక్షిత్‌లు ద్విచక్ర వాహనంపై ఖండాంతర ప్రయాణం చేయనున్నారు. అమీర్‌పేట మ్యారీగోల్డ్ హోటల్లో యాత్రకు సంబంధించిన వివరాలను గురువారం వారు వివరించారు. ఈ నెల 24న బైక్ యాత్ర ప్రారంభమవుతుందన్నారు. మొత్తం 17 వేల కి.మీ, 17 దేశాల్లో 55 రోజుల పాటు ప్రయాణించి జూన్ 24 లండన్ చేరుకుంటామన్నారు. బీఎండబ్ల్యూ జీఎస్–12 బైక్‌లపై సాహస యాత్ర చేయనున్నామన్నారు. గతంలో అమెరికాలో 17వేల కి.మీ బైక్ యాత్ర, నగరం నుంచి భూటాన్ వరకు 12 వేల కి.మీ యాత్ర చేసిన అనుభవం తనకు ఉందని డాక్టర్ జి.వి.ప్రసాద్ తెలిపారు. ప్రస్తుతం ప్రపంచ శాంతి, ప్రపంచమంతా వసుధైక కుటుంబం అనే నినాదంతో ఖండాంతర యాత్ర చేయనున్నామన్నారు. -
7 దేశాల్లో రాష్ట్ర మహిళల బైక్ యాత్ర
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పర్యాటక రంగాన్ని ప్రపంచానికి చాటి చెప్పాలన్న ఉద్దేశంతో రాష్ట్రానికి చెందిన నలుగురు మహిళలు బైక్‌లపై సాహసయాత్ర చేపట్టనున్నట్లు పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి అజ్మీరా చందూలాల్ తెలిపారు. ఆదివారం ఉదయం 7 గంటలకు పర్యాటక భవనం నుంచి యాత్ర ప్రారంభమవుతుందని చెప్పారు. 50 రోజుల యాత్రలో భాగంగా భారత్, బంగ్లాదేశ్, మయన్మార్, థాయ్‌లాండ్, లావోస్, కంబోడియా, వియత్నాం దేశాల్లో రోడ్డు మార్గం ద్వారా సుమారు 17 వేల కిలోమీటర్లు ప్రయాణిస్తారని తెలిపారు. ఈ యాత్రలో వీరు 19 యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్లు, 35 యునెస్కో సైట్లను సందర్శిస్తారని అన్నారు. ఈ యాత్రకు జై భారతి నాయకత్వం వహిస్తారని, ఈమెతో పాటు ప్రియ, శాంతి, శిల్ప నలుగురు సభ్యుల బృందంలో ఉంటారని తెలిపారు. వీరికి 400 సీసీ బైకులను బజాజ్ ఆటో కంపెనీ వారు స్పాన్సర్ చేశారని ఆ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం పేర్కొన్నారు. -
మేడ్చల్‌కు చేరిన ‘మిషన్ కాకతీయ’ బైక్‌యాత్ర
మేడ్చల్: ప్రభుత్వం చెరువుల పునరుద్ధరణ కోసం చేపట్టిన మిషన్ కాకతీయ పథకంపై ప్రచారం నిర్వహించేందుకు ఓ తెలంగాణ వాది చేపట్టిన బైక్‌యాత్ర గురువారం మేడ్చల్‌కు చేరింది. కరీంనగర్ జిల్లా జగిత్యాలకు చెందిన ప్రైవేట్ లెక్చరర్ సత్యం ఏప్రిల్ 14న జగిత్యాలలో బైక్ యాత్రను ప్రారంభించారు. 17 రోజులుగా కరీంనగర్, మెదక్, వరంగల్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో పర్యటించారు. ప్రభుత్వం చేపట్టిన ప్రజా సంక్షేమ పథకాలపై ప్రజల్లో చైతన్యం కలిపించేందుకు బైక్ యాత్రను చేపట్టినట్లు ఈ సందర్భంగా సత్యం తెలిపారు. అన్ని జిల్లాల్లో ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోందని ఆయన చెప్పారు. మేడ్చల్ నుంచి మహబూబ్‌నగర్, నల్గొండ జిల్లాల్లో బైక్ యాత్ర నిర్వహించి ముగిస్తానని సత్యం తెలిపారు. -
గిన్నిస్ రికార్డు దిశగా బైక్ యాత్ర
హైదరాబాద్(బంజారాహిల్స్): రోడ్డు భద్రత, మహిళా సాధికారత, శుభ్రత, చైల్డ్ గర్ల్ లక్ష్యంగా ఢిల్లీకి చెందిన అభయ్‌సింగ్(33) గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్‌లో చోటు దక్కించుకునేందుకు చేపట్టిన బైక్ యాత్ర మంగళవారం హైదరాబాద్‌కు చేరుకుంది. ఢిల్లీకి చెందిన అభయ్‌సింగ్ జనవరి 18వ తేదీన గుజరాత్ గాంథీనగర్‌లో ఈ యాత్రను ప్రారంభించారు. ఇప్పటివరకు ఆరు వేల కిలోమీటర్ల యాత్రను పూర్తిచేశారు. హైదరాబాద్ చేరుకున్న సందర్భంగా నిబంధనల ప్రకారం ఏదో ఒక పోలీస్‌స్టేషన్‌లో సంతకం చేయాల్సి ఉండగా బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో మంగళవారం సంతకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రోడ్డు భద్రత, శుభ్రత, బాలికా రక్షణ, మహిళా సాధికారత కోసం ఈ యాత్రను చేపట్టానని, ప్రజల్లో అవగాహన కలిగిస్తూ ముందుకుసాగుతున్నానన్నారు. ఇప్పటివరకు బైక్ యాత్ర చైనాకు చెందిన జాంగ్ ఇంగ్‌పా పేరు మీద ఉందని, ఆయన చైనాలో 35,511 కిలోమీటర్లు పర్యటించి గిన్నీస్‌బుక్‌లో చోటు సంపాదించారని వెల్లడించారు. తాను 45 వేల కిలోమీటర్లు తిరిగే లక్ష్యంతో యాత్రను ప్రారంభించినట్లు పేర్కొన్నారు. ప్రతిరోజూ 11 గంటల పాటు తాను రాయల్ ఎన్ఫీల్డ్ మోటార్‌సైకిల్‌పై సోలోయాత్ర దిగ్విజయంగా చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటిదాకా 35 నగరాలను చుట్టివచ్చినట్లు పేర్కొన్నారు. అభయ్‌సింగ్ పుట్టింది సికింద్రాబాద్‌లో. తండ్రి దల్బీర్‌సింగ్ ఆర్మీలో పనిచేస్తూ సికింద్రాబాద్‌లో నివసించేవాడని తెలిపాడు. అయితే తాను పుట్టిన ఆరు నెలల తరువాత ఇక్కడి నుంచి కుటుంబం ఢిల్లీకి మకాం మార్చిందని పేర్కొన్నారు.