హైదరాబాద్(బంజారాహిల్స్): రోడ్డు భద్రత, మహిళా సాధికారత, శుభ్రత, చైల్డ్ గర్ల్ లక్ష్యంగా ఢిల్లీకి చెందిన అభయ్‌సింగ్(33) గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్‌లో చోటు దక్కించుకునేందుకు చేపట్టిన బైక్ యాత్ర మంగళవారం హైదరాబాద్‌కు చేరుకుంది. ఢిల్లీకి చెందిన అభయ్‌సింగ్ జనవరి 18వ తేదీన గుజరాత్ గాంథీనగర్‌లో ఈ యాత్రను ప్రారంభించారు. ఇప్పటివరకు ఆరు వేల కిలోమీటర్ల యాత్రను పూర్తిచేశారు. హైదరాబాద్ చేరుకున్న సందర్భంగా నిబంధనల ప్రకారం ఏదో ఒక పోలీస్‌స్టేషన్‌లో సంతకం చేయాల్సి ఉండగా బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో మంగళవారం సంతకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రోడ్డు భద్రత, శుభ్రత, బాలికా రక్షణ, మహిళా సాధికారత కోసం ఈ యాత్రను చేపట్టానని, ప్రజల్లో అవగాహన కలిగిస్తూ ముందుకుసాగుతున్నానన్నారు.
ఇప్పటివరకు బైక్ యాత్ర చైనాకు చెందిన జాంగ్ ఇంగ్‌పా పేరు మీద ఉందని, ఆయన చైనాలో 35,511 కిలోమీటర్లు పర్యటించి గిన్నీస్‌బుక్‌లో చోటు సంపాదించారని వెల్లడించారు. తాను 45 వేల కిలోమీటర్లు తిరిగే లక్ష్యంతో యాత్రను ప్రారంభించినట్లు పేర్కొన్నారు. ప్రతిరోజూ 11 గంటల పాటు తాను రాయల్ ఎన్‌ఫీల్డ్ మోటార్‌సైకిల్‌పై సోలోయాత్ర దిగ్విజయంగా చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటిదాకా 35 నగరాలను చుట్టివచ్చినట్లు పేర్కొన్నారు. అభయ్‌సింగ్ పుట్టింది సికింద్రాబాద్‌లో. తండ్రి దల్బీర్‌సింగ్ ఆర్మీలో పనిచేస్తూ సికింద్రాబాద్‌లో నివసించేవాడని తెలిపాడు. అయితే తాను పుట్టిన ఆరు నెలల తరువాత ఇక్కడి నుంచి కుటుంబం ఢిల్లీకి మకాం మార్చిందని పేర్కొన్నారు.
గిన్నిస్ రికార్డు దిశగా బైక్ యాత్ర
Published Tue, Mar 10 2015 11:59 PM | Last Updated on Sat, Sep 2 2017 10:36 PM
Advertisement