బిల్ఫోర్జ్ను సొంతం చేసుకున్న మహీంద్రా
డీల్ విలువ రూ.1,331 కోట్లు
న్యూఢిల్లీ: మహీంద్రా గ్రూపులో భాగమైన మహీంద్రా సీఐఈ ఆటో మోటివ్... బెంగళూరుకు చెందిన బిల్ఫోర్జ్ కంపెనీని రూ.1,331.2 కోట్లకు కొనుగోలు చేసింది. బిల్ఫోర్జ్ ప్రైవేటు లిమిటెడ్ కొనుగోలుకు సోమవారం సమావేశమైన బోర్డు ఆమోదం తెలిపినట్టు మహీంద్రా సీఐఈ స్టాక్ ఎక్స్ఛేంజ్లకు సమాచారం అందించింది. కొనుగోలు ఒప్పందంలో భాగంగా మహీంద్రా సీఐఈ 3,19,91,563 షేర్లను బిల్ఫోర్జ్ వాటాదారులకు జారీ చేస్తుంది.
అలాగే, బిల్ఫోర్జ్ ప్రమోటింగ్ కంపెనీ అయిన పార్టిపేషన్స్ ఇంటర్నేషనల్స్ ఆటోమెటల్కు 2,25,00,000 షేర్లను కేటాయిస్తుంది. 1982లో ఏర్పాటైన బిల్ఫోర్జ్ ప్రెసిషన్ ఫోర్జింగ్లో మార్కెట్ లీడర్ స్థాయికి ఎదిగింది. ఈ కంపెనీకి బెంగళూరు సహా దేశవ్యాప్తంగా ఆరు చోట్ల తయారీ కేంద్రాలున్నాయి. మెక్సికోలో సైతం ఓ ప్లాంట్ ఏర్పాటు చేసింది. దేశ, విదేశీ ద్విచక్ర, ప్యాసింజర్ వాహనాలకు విడిభాగాలను సరఫరా చేస్తోంది. మరోవైపు క్విప్ విధానంలో సెక్యూరిటీల జారీ ద్వారా రూ.700 కోట్ల సమీకరణకు సైతం మహీంద్రా సీఐఈ ఆటోమోటివ్ బోర్డు ఆమోదం తెలిపింది.
వ్యాపార వృద్ధికి వీలు కల్పిస్తుంది..
ఈ కొనుగోలుతో ఆసియా మార్కెట్లలో ఆదాయాలు, లాభాలను గణనీయంగా పెంచుకునేందుకు, తమ స్థానాన్ని పటిష్టం చేసుకునేందుకు తోడ్పడుతుందని మహీంద్రా సీఐఈ పేర్కొంది. అలాగే, కంపెనీ పోర్ట్ఫోలియో మరిన్ని విభాగాలకు విస్తరిస్తుందని, ద్విచక్ర వాహన విభాగంలోకి ప్రవేశించడానికి అవకాశం లభిస్తుందని తెలిపింది. అక్టోబర్ చివరికల్లా కొనుగోలు ప్రక్రియ ముగుస్తుందని పేర్కొంది. గత ఆర్థిక సంవత్సరంలో బిల్ఫోర్జ్ ఆదాయం రూ.582.3 కోట్లు కాగా, పన్నుల అనంతరం లాభం రూ.51.4 కోట్లుగా ఉంది.