bilsapur
-
అందరి కళ్లూ ఆయనవైపే.. ఎవరీ అరుణ్ సావో..?
రాయపూర్ (ఛత్తీస్గడ్): ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న ఐదు రాష్ట్రాల్లో ఛత్తీస్‌గఢ్ కూడా ఒకటి. ఇక్కడ ఇప్పటికే ఎన్నికలు పూర్తయ్యాయి. నవంబర్ 7న తొలి దశ, నవంబర్ 17న రెండో దశ పోలింగ్ జరిగింది. డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు జరగాల్సి ఉంది. మొత్తం 90 అసెంబ్లీ స్థానాలు ఉండగా అధికార కాంగ్రెస్, బీజేపీల మధ్యే ప్రధానంగా పోటీ ఉంది. ఇరు పార్టీల నుంచి మహామహులు పోటీలో ఉన్నారు. కాగా బిలాస్పూర్ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని లోర్మి అసెంబ్లీ సెగ్మెంట్‌పైనే అందరి కళ్లూ ఉన్నాయి. కారణం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అరుణ్ సావో ఇక్కడ నుంచే పోటీ చేస్తున్నారు. ప్రస్తుతం లోక్ సభ్యుడైన ఆయన బిలాస్పూర్ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గతేడాదే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితుడైన ఆయన ఈ సారి అసెంబ్లీ ఎన్నికల్లో లోర్మి స్థానం నుంచి పోటీ చేశారు. అతి తక్కువ కాలంలోనే రాజకీయాల్లో అగ్రస్థాయికి ఎదిగిన అరుణ సావో గురించి ఈ కథనంలో తెలుసుకుందాం.. బీజేపీ ఛత్తీస్‌గఢ్ చీఫ్ అరుణ్ సావో బిలాస్పూర్ లోక్‌సభ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి అటల్ శ్రీవాస్తవ్‌పై సావో 1,41,763 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ప్రస్తుత రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో లోర్మీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి థానేశ్వర్ సాహుపై పోటీ చేస్తున్నారు. 2022లోనే విష్ణు దేవ్ సాయి స్థానంలో సావో ఛత్తీస్‌గఢ్ బీజేపీ అధ్యక్షుడయ్యారు. ఇదీ నేపథ్యం ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లో 1968 నవంబర్ 25న అరుణ్ సావో జన్మించారు. ఛత్తీస్‌గఢ్ విశ్వవిద్యాలయంలో విద్యాభ్యాసం పూర్తి చేసి న్యాయవాద వృత్తిని చేపట్టిన ఆయన ఆ తర్వాత బిలాస్‌పూర్‌లోని హైకోర్టులో కొంతకాలం న్యాయవాదిగా ప్రాక్టీస్ చేశారు. తర్వాత అడ్వకేట్ జనరల్ కార్యాలయంలోనూ పనిచేశారు. అనతి కాలంలోనే.. 1996లో బీజేపీ యువజన విభాగం భారతీయ జనతా యువ మోర్చాలో చేరడంతో అరుణ్ సావో రాజకీయ జీవితం ప్రారంభమైంది. తర్వాత అనతికాలంలోనే వివిధ స్థాయిలకు ఎదిగి 2000 సంవత్సరంలోనే అదే బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడయ్యారు. 2005లో రాయ్‌పూర్ జిల్లా పంచాయతీ సభ్యునిగా ఎన్నికయ్యారు. 2005 నుంచి 2010 వరకు జిల్లా పంచాయతీ అధ్యక్షుడిగా పనిచేశారు. 2010లో లోర్మి నియోజకవర్గం నుంచి చత్తీస్‌గఢ్ శాసనసభకు ఎన్నికయ్యారు. 2013 నుంచి 2018 వరకు రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రిగా పనిచేశారు. తర్వాత 2019లో అరుణ్ సావో బిలాస్పూర్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ లోర్మి నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆయన గెలిస్తే పార్టీ అధిష్టానం ఆయనకు ఎలాంటి ప్రాధాన్యం ఇస్తుందో వేచి చూడాలి. -
కాంగ్రెస్, బీజేపీ వాజ్‌పేయి జపం!
సాక్షి, న్యూఢిల్లీ: ఒక పార్టీ ఒక నేత పేరుతో ఓట్లడిగితే, ఇంకో పార్టీ మరో నేత పేరుతో ఓట్లడగడం ప్రచారంలో సాధారణం. కానీ అక్కడ రెండు పార్టీలు ఒకరి పేరునే జపిస్తూ ఓట్లడుగుతున్నాయి. ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్పూర్ లోక్‌సభ నియోజకవర్గంలో ఈ విచిత్రం నెలకొంది. ఇక్కడ కాంగ్రెస్, బీజేపీకి చెందిన ఇద్దరు అభ్యర్థులు వాజ్‌పేయి నామస్మరణ చేస్తున్నారు. గత 18 ఏళ్లుగా బీజేపీకి కంచుకోట అయిన ఈ స్థానం నుంచి ఈసారి వాజ్‌పేయి అన్న కూతురు కరుణా శుక్లా కాంగ్రెస్ నుంచి బరిలో నిలిచారు. బీజేపీ నుంచి లఖన్‌లాల్ సాహూ పోటీలో ఉన్నారు. 1982 నుంచి బీజేపీలో క్రియాశీలకంగా ఉన్న కరుణా శుక్లా.. 2004 ఎన్నికల్లో జంజ్‌గిర్ లోక్ సభ స్థానం నుంచి బీజేపీ తరఫున గెలుపొందారు. 2009 ఎన్నికల్లో కొర్బా నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి.. కాంగ్రెస్ అభ్యర్థి చరణ్‌దాస్ మహంతా చేతిలో ఓటమిపాలయ్యారు. బీజేపీలో వాజ్‌పేయి ప్రాభవం తగ్గడం, మరోవైపు కరుణా శుక్లాను పార్టీ కార్యక్రమాలకు దూరం పెట్టడం వల్ల ఆమె అసంతృప్తికి లోనయ్యారు. గతేడాది అక్టోబరులో బీజేపీకి రాజీనామా చేసి, ఈ ఏడాది ఫిబ్రవరిలో కాంగ్రెస్‌లో చేరారు. ఆమెకు కాంగ్రెస్ బిలాస్‌పుర్ లోక్‌సభ టికెట్ ఇచ్చింది. ఇప్పుడు ప్రచారంలో భాగంగా ఆమె.. వాజ్‌పేయి పేరుతో నియోజకవర్గంలో ఓట్లు అడుగుతున్నారు. బీజేపీ తన పట్ల చూపిన వివక్షను ప్రజలకు వివరిస్తూ సానుభూతి పొందే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు బీజేపీ అభ్యర్థి లఖన్‌లాల్ సాహూ కూడా వాజ్‌పేయి పేరుతో ఓట్లు అభ్యర్థిస్తుండడంతో ఇరువురి మధ్య పోటీ రసకందాయంలో పడింది. కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు వాజ్‌పేయిని సొంతం చేసుకోడానికి పడుతున్న ఆరాటంలో ఓటరు ఎవరివైపు మొగ్గుచూపుతారన్నది చర్చానీయంశమైంది. మొత్తం 2,39,866 ఓటర్లు ఉన్న బిలాస్పూర్లో ఈనెల 24న ఎన్నికలు జరగనున్నాయి.