కాంగ్రెస్, బీజేపీ వాజ్‌పేయి జపం!
సాక్షి, న్యూఢిల్లీ: ఒక పార్టీ ఒక నేత పేరుతో ఓట్లడిగితే, ఇంకో పార్టీ మరో నేత పేరుతో ఓట్లడగడం ప్రచారంలో సాధారణం. కానీ అక్కడ రెండు పార్టీలు ఒకరి పేరునే జపిస్తూ ఓట్లడుగుతున్నాయి. ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్ లోక్‌సభ నియోజకవర్గంలో ఈ విచిత్రం నెలకొంది. ఇక్కడ కాంగ్రెస్, బీజేపీకి చెందిన ఇద్దరు అభ్యర్థులు వాజ్‌పేయి నామస్మరణ చేస్తున్నారు. గత 18 ఏళ్లుగా బీజేపీకి కంచుకోట అయిన ఈ స్థానం నుంచి ఈసారి వాజ్‌పేయి అన్న కూతురు కరుణా శుక్లా కాంగ్రెస్ నుంచి బరిలో నిలిచారు. బీజేపీ నుంచి లఖన్‌లాల్ సాహూ పోటీలో ఉన్నారు.
1982 నుంచి బీజేపీలో క్రియాశీలకంగా ఉన్న కరుణా శుక్లా.. 2004 ఎన్నికల్లో జంజ్‌గిర్ లోక్ సభ స్థానం నుంచి బీజేపీ తరఫున గెలుపొందారు. 2009 ఎన్నికల్లో కొర్బా నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి.. కాంగ్రెస్ అభ్యర్థి చరణ్‌దాస్ మహంతా చేతిలో ఓటమిపాలయ్యారు. బీజేపీలో వాజ్‌పేయి ప్రాభవం తగ్గడం, మరోవైపు కరుణా శుక్లాను పార్టీ కార్యక్రమాలకు దూరం పెట్టడం వల్ల ఆమె అసంతృప్తికి లోనయ్యారు. గతేడాది అక్టోబరులో బీజేపీకి రాజీనామా చేసి, ఈ ఏడాది ఫిబ్రవరిలో కాంగ్రెస్‌లో చేరారు. ఆమెకు కాంగ్రెస్ బిలాస్‌పుర్ లోక్‌సభ టికెట్ ఇచ్చింది. ఇప్పుడు ప్రచారంలో భాగంగా ఆమె.. వాజ్‌పేయి పేరుతో నియోజకవర్గంలో ఓట్లు అడుగుతున్నారు.
బీజేపీ తన పట్ల చూపిన వివక్షను ప్రజలకు వివరిస్తూ సానుభూతి పొందే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు బీజేపీ అభ్యర్థి లఖన్‌లాల్ సాహూ కూడా వాజ్‌పేయి పేరుతో ఓట్లు అభ్యర్థిస్తుండడంతో ఇరువురి మధ్య పోటీ రసకందాయంలో పడింది. కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు వాజ్‌పేయిని సొంతం చేసుకోడానికి పడుతున్న ఆరాటంలో ఓటరు ఎవరివైపు మొగ్గుచూపుతారన్నది చర్చానీయంశమైంది. మొత్తం 2,39,866 ఓటర్లు ఉన్న బిలాస్‌పూర్‌లో ఈనెల 24న ఎన్నికలు జరగనున్నాయి.