'చిరంజీవి సహాయ మంత్రి కాదు... అసహాయ మంత్రి'
కేంద్ర పర్యాటక శాఖ సహయ మంత్రి చిరంజీవిపై బీజేపీ సీనియర్ నాయకుడు ఎం.వెంకయ్యనాయుడు ఆదివారం విజయవాడలో నిప్పులు చెరిగారు. చిరంజీవి సహాయ మంత్రి కాదని ... అసహాయ మంత్రి అంటూ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ మునిగే పడవ అని ఆయన అభివర్ణించారు. అలాంటి పార్టీలో చిరంజీవి ఉన్నారని వెంకయ్య గుర్తు చేశారు.
ఎంత మంది చిరంజీవులు వచ్చిన కాంగ్రెస్ మృతజీవేనని వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. లోక్సత్తా నాయకుడు జయప్రకాశ్ లాంటి వారు పార్లమెంట్లో ఉంటే మంచిదేనని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే టీడీపీ తమ పార్టీ పొత్తు పెట్టుకుందని... ఈ నేపథ్యంలో మల్కాజ్గిరి ఎంపీ స్థానానికి టీడీపీ అభ్యర్థి మల్లారెడ్డికే తమ మద్దతు ఇవ్వాల్సిన ధర్మం ఉందని వెంకయ్యనాయుడు తెలిపారు.
టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు స్వర్థ ప్రయోజనాల కోసమే బీజేపీతో పొత్తు పెట్టుకున్నారని అంతేకానీ దేశ ప్రయోజనాల కోసం కాదని ఇటీవల విశాఖ పర్యటనలో కేంద్ర సహాయ మంత్రి చిరంజీవి ఆరోపించారు. అలాగే బీజేపీలో ఏకవ్యక్తి పాలన నడుస్తోందని, మోడీది హిట్లర్ తత్వమని చిరంజీవి వెల్లడించారు. ఇది దేశానికి మంచిది కాదని అన్నారు. చిరంజీవి వ్యాఖ్యలపై వెంకయ్యనాయుడు ఆదివారంపై విధంగా స్పందించారు.