Biological Science
-
జీవశాస్త్ర కంపెనీలకు రూ.400 కోట్లు
సాక్షి, హైదరాబాద్: దేశంలో జీవశాస్త్ర సంబంధిత స్టార్టప్ కంపెనీలకు ఆర్థికంగా వెన్నుదన్నుగా ఉండేందుకు కౌన్సిల్ ఫర్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (సీఎస్ఐఆర్) రూ.400 కోట్లతో ఒక నిధిని ఏర్పాటు చేయనున్నట్లు సంస్థ డైరెక్టర్ జనరల్ శేఖర్ సి.మండే తెలిపారు. ప్రస్తుతం విధివిధానాల రూపకల్పనకు కసరత్తు కొనసాగుతోందని, సీఎస్ఐఆర్ సొంత నిధులతో ఏర్పాటు చేస్తున్న ఈ నిధికి సంబంధించిన ప్రతిపాదనలను కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖకూ పంపించామని ఆయన చెప్పారు. సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ) ఆధ్వర్యంలోని అటల్ ఇన్క్యుబేషన్ సెంటర్ ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా శనివారం ఏర్పాటైన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన శేఖర్ సి. మండే మీడియాతో మాట్లాడారు. బయోటెక్ స్టార్టప్ కంపెనీల కోసం ఏర్పాటు చేస్తున్న నిధి రెండు నెలల్లో అందుబాటులోకి వచ్చే అవకాశముందని తెలిపారు. దేశంలోని వివిధ వర్గాల ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలకు శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానాల సాయంతో పరిష్కారాలు కనుక్కునే లక్ష్యంతో ఐదేళ్ల క్రితం కొన్ని ప్రాజెక్టులు యుద్ధ ప్రాతిపదికన చేపట్టిందన్నారు. వాటి ఫలితాలిప్పుడు అందరికీ అందుతున్నాయని ‘సాక్షి’అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా తెలిపారు. సికిల్ సెల్ అనీమియా వంటి అరుదైన వ్యాధులను ముందుగానే గుర్తించి నివారించేందుకు సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ జన్యు ఆ«ధారిత టెక్నాలజీని అభివృద్ధి చేశామని ఆయన మండే తెలిపారు. చెరకు వ్యర్థాల నుంచి పొటాష్... దేశంలోని కొన్ని ప్రాంతాల్లో విస్తృతంగా పండే చెరకు నుంచి మరింత విలువను రాబట్టేందుకు భావ్‌నగర్‌లోని సీఎస్ఐఆర్ సంస్థ ఓ వినూత్న టెక్నాలజీని ఆవిష్కరించిందని శేఖర్ తెలిపారు. వృథాగా పోతున్న వ్యర్థాల నుంచి పొటాష్‌ను వెలికితీయగల ఈ టెక్నాలజీ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే పొటాష్ దిగుమతులను నిలిపివేయవచ్చని ఆయన చెప్పారు. కార్యక్రమంలో సీసీఎంబీ డైరెక్టర్ డాక్టర్ రాకేశ్ మిశ్రా తదితరులు పాల్గొన్నారు. -
ఆ జీవకళ వెనుక అసలు రహస్యం
మహానేతల భౌతికకాయాలను భద్రపరచడంలో మాస్కో వారసత్వాన్ని ఉత్తరకొరియా కొనసాగిస్తోంది. ఇల్విచ్ ఉల్వనోవ్ వ్లాదిమిర్ లెనిన్ భౌతికకాయాన్ని అనేక కష్టనష్టాలకోర్చి అత్యాధునిక శాస్త్ర విజ్ఞానాన్ని ఉపయోగించి మాస్కోలో భద్రపరిచారు. తొలిసారిగా కమ్యూనిస్టు మహానేత లెనిన్ భౌతికకాయాన్ని ప్రజాసందర్శనార్థం 1924లో లెనిన్ ల్యాబ్‌లో ఉంచారు. లెనిన్ భౌతికకాయాన్ని అత్యంత భద్రంగా జీవత్వం ఉట్టిపడేలా ఉంచడంలో రష్యన్ సాంకేతిక నిపుణుల కృషి గణనీయమైంది. ఆ వారసత్వాన్ని ఉత్తరకొరియా కొనసాగిస్తోందని తాజా అధ్యయనం పేర్కొంది. కిమ్ జాంగ్ ఉన్ నాన్న, తాత సహా ఉత్తరకొరియాను పాలించిన ముగ్గురు ప్రముఖుల భౌతికకాయాలను ప్యాంగ్యాంగ్లోని కుమ్సుసాన్ ప్యాలెస్ ఆఫ్ సన్ మాన్యుమెంట్‌లో ఉంచారు. అయితే వీరి భౌతిక కాయాలను సుదీర్ఘకాలం పాడవకుండా ఉంచడానికి మాత్రం లెనిన్ భౌతికకాయాన్ని ఇంతకాలం భద్రపరుస్తున్న రష్యన్ నిపుణుల సాయంతోనే సాధ్యమవుతోందని అధ్యయనకారులు వెల్లడించారు. అందిపుచ్చుకున్న సాంకేతికత.. సోవియట్ యూనియన్ పతనానంతరం రష్యా సాంకేతిక పరిజ్ఞానాన్ని వియత్నాం, నార్త్ కొరియా అందిపుచ్చుకున్నాయి. తొలిసారి చేసిన ఎంబాల్మింగ్, ఆ తర్వాత ప్రతిసారీ తిరిగి చేసే రీఎంబాల్మింగ్ను కూడా మాస్కో ల్యాబ్‌కు చెందిన నిపుణులే నిర్వహిస్తున్నారని అధ్యయనకారుడు బెర్క్లీలోని కాలిఫోర్నియా యూనివర్సిటీలో ఆంత్రోపాలజీ ప్రొఫెసర్ యార్‌చాక్ వెల్లడించారు. రష్యా నిపుణుల దగ్గర ఉత్తరకొరియా, వియత్నాం శాస్త్రవేత్తలు చాలా ఏళ్లుగా శిక్షణ పొందుతున్నప్పటికీ మొత్తంగా ఎంబాల్మింగ్ రహస్యం మాత్రం వారికి అంతుచిక్కలేదు. విదేశాల నిధులతో... 1990లో సోవియట్ యూనియన్ పతనానంతరం ప్రభుత్వం ల్యాబ్ నిధుల సంక్షోభాన్ని ఎదుర్కొంది. దీంతో విదేశీసేవల ద్వారా నిధులు సమకూర్చుకున్నారని యార్‌చాక్ పేర్కొన్నారు. భౌతిక కాయాలను ఉంచిన మాన్యుమెంట్‌ను ఏటా 2 నెలల పాటు మూసి ఉంచుతారు. ఈ సమయంలోనే భౌతిక కాయాలను రష్యాకు చెందిన నిపుణులు రీఎంబాల్మింగ్ చేస్తున్నట్లు యార్‌చాక్ వెల్లడించారు. 2016లో లెనిన్ భౌతిక కాయానికి రీఎంబాల్మింగ్ చేసినప్పుడు దాదాపు రూ.1.5 కోట్లు ఖర్చు అయినట్లు మాస్కో వెల్లడించింది. -
ఎ‘ట్టెట్టా’!
ఎస్కేయూ/అనంతపురం ఎడ్యుకేషన్ : టెట్(టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్) పేరు విం టేనే అభ్యర్థులు బెంబేలెత్తిపోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం సీ – టెట్ (సెంట్రల్ టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్) సిలబస్ ఆధారంగా టెట్ విధివిధానాలు, నిబంధనలను రూపొందిస్తుండటంతో టెట్ సిలబస్ గతంతో పోలిస్తే మూడింతలు అధికంగా ఉంది. కనీస అర్హత సాధిస్తామా, లేదా అని అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. ♦ టెట్ రాత పరీక్షల్లో అన్ని మెథడాలజీ సబ్జెక్టుల వారికీ ఇబ్బందులున్నాయి. బయాలజీ సైన్సెస్ స్కూల్ అసిస్టెంట్‌కు సన్నద్ధమయ్యే అభ్యర్థుల సమస్యలు జఠిలంగా ఉన్నాయి. టెట్‌లో నిర్ధేశించిన సిలబస్ ప్రకారం కేటాయించిన ఈ 150 మార్కుల్లో బయాలజికల్ సైన్సెస్ వారికి కేవలం బయాలజీ, మెథడాలజీ రెండూ కలుపుకొని 18 మార్కుల సిలబస్ మాత్రమే తెలిసి ఉంటుంది. తక్కిన 132 మార్కుల కోసం కొత్తగా చదవాలి. దరఖాస్తుకు, పరీక్షకు గడువు కేవలం నామమాత్రంగానే ఉంది. టెట్‌లో వచ్చిన మార్కులకు డీఎస్సీలో వెయిటేజీ ఇస్తుండటంతో ప్రతి మార్కు కీలకమైన నేపథ్యంలో ఆందోళనకు గురవుతున్నారు. ♦ బీఈడీ(ఇంగ్లిష్), (తెలుగు), టీపీటీ పూర్తి చేసిన లాంగ్వేజెస్ అభ్యర్థులు ఇదివరకు సోషల్ స్టడీస్‌లో టెట్ రాయాల్సి ఉండేది. తాజాగా ఈ అభ్యర్థులను పరిగణలోకి తీసుకుని టెట్ – 3 పేరుతో నూతన సిలబస్ ఖరారు చేశారు. స్పెషల్ తెలుగు, స్పెషల్ ఇంగ్లిష్‌కు 60 మార్కులు కేటాయించారు. గతంలో ఈ 60 మార్కులకు ప్రశ్నలు తప్పనిసరిగా సోషల్ స్టడీస్‌లోనే వచ్చేవి. నూతనంగా సిలబస్ మార్చినప్పటికీ దాని రూపకల్పన పూర్తి కాలేదు. దీంతో వీరికీ ఇబ్బందులు తప్పలేదు. ఇంగ్లిష్ లాంగ్వేజెస్ వారికి ఆన్లైన్లో దరఖాస్తులు అందుబాటులోకి రాకపోవడంతో వారు దరఖాస్తు చేసుకోలేదు. అందువల్ల టెట్ పరీక్ష వాయిదా వేయాలని కోరుతున్నారు. టెట్ స్వరూపాన్నే మార్చి.. ఆవేదన మిగిల్చి.. విద్యాహక్కు చట్టం ప్రకారం ఎన్సీటీఈ(నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్) టెట్ సిలబస్‌ను రూపొదించింది. వాస్తవానికి టెట్ పరీక్షను బట్టే ఉద్యోగ ఎంపిక పూర్తి చేయాల్సి ఉన్నా టెట్‌లోని సిలబస్ కొంత, డీఎస్సీ సిలబస్ కొంత తీసుకుని టెట్, డీఎస్సీ రెండు పరీక్షలు నిర్వహించి టీచర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. టెట్ 150 మార్కులకు నిర్వహిస్తే.. ఇందులో వచ్చిన మార్కులను 20 శాతం డీఎస్సీలో వెయిటేజీ ఇస్తున్నారు. తక్కిన 80 శాతం వెయిటేజీ కోసం డీఎస్సీ పరీక్ష నిర్వహిస్తున్నారు. ♦ ‘టెట్’ను కాదని టీఆర్టీ.. తిరిగి టెట్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తొలి సారిగా జులై – 2011లో టెట్ నిర్వహించారు. రెండో దఫా టెట్ జనవరి 2012లో జరిగింది. మొదటి టెట్ కన్నా రెండో టెట్ పరీక్ష చాలా కఠినంగా ఉండటంతో బోనస్ మార్కులు కలిపి ఫలితాలు విడుదల చేశారు. తిరిగి మూడో టెట్‌ను జులై – 2013లో, నాలుగో టెట్‌ను మార్చి – 2014లో నిర్వహించారు. అయితే అప్పట్లో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తడంతో 2014 సార్వత్రిక ఎన్నికల్లో టెట్‌ను రద్దు చేస్తామని టీడీపీ హామీ ఇచ్చింది. అయితే ఒకసారి టెట్‌కు అర్హత సాధిస్తే ఏడేళ్ల వరకు చెల్లుబాటవుతుంది. అందువల్ల అప్పటికే అర్హత సాధించినవారు టెట్‌ను రద్దుపై తీవ్ర అభ్యంతరం తెలి పారు. దీంతో టీడీపీ ప్రభుత్వం టెట్ కమ్ టీఆర్టీ పేరుతో ఒకే పరీక్ష నిర్వహిం చింది. అయితే తిరిగి టెట్, డీఎస్సీ రెండు పరీక్షలు పెడుతున్నారు. ఇలా ప్రభుత్వ నిర్ణయాలు తరచూ మారుతుండటంతో అభ్యర్థుల్లో ఆందోళన నెలకొంది. పొంతన లేని సిలబస్ మేథమేటిక్స్ కష్టమనే బయాలజికల్ సైన్సెస్ కోర్సులు తీసుకున్నాము. టెట్‌లో మేథమేటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులు ప్రవేశపెట్టారు. మేథమేటిక్స్ బేసిక్ అయితే నేర్చుకోవచ్చుగానీ లోతైన సిలబస్ ఇచ్చారు. – భారతి, అనంతపురం సిలబస్ మూడింతలైంది గతంలో కన్నా మూడింతలు అధిక సిలబస్‌ను రూపొందించారు. దీంతో ప్రిపేరేషన్ చాలా భారంగా మారింది. తక్కువ సమయంలో ఎక్కువ సిలబస్ చదవాలంటే ఆందోళనగా ఉంది. – రాజేశ్వరి, గుంతకల్లు అర్హతమార్కులు తగ్గించాలి టెట్‌లో అర్హత మార్కులు అధిక శాతంగా నిర్ణయించారు. ఏ మాత్రం సంబంధం లేని సిలబస్‌ను ప్రవేశపెట్టారు. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని అర్హత మార్కులు తగ్గించాలి. – సావిత్రి, అనంతపురం -
సామర్థ్యాలకు సానపెట్టాల్సిందే...
నిరంతర సమగ్ర మూల్యాంకనం (సీసీఈ) పద్ధతిలో జరిగే పరీక్షా విధానంలో జీవశాస్త్రానికి 50 మార్కులకు పరీక్ష ఉంటుంది. ఈ 50 మార్కులలో 40 మార్కులకు పబ్లిక్ పరీక్ష నిర్వహిస్తారు. మిగతా 10 మార్కులు పాఠశాలలో నిర్వహించే రూపణ మూల్యాంకనం లేదా ఫార్మేటివ్ అసెస్మెంట్ ద్వారా ఉపాధ్యాయులు నిర్ణయిస్తారు. మార్కులు కేటాయించిన విధానం పబ్లిక్ పరీక్ష 40 రూపణమూల్యాంకనం 10 మొత్తం మార్కులు 50 పరీక్ష వ్యవధి 2 గంటల 30 నిమిషాలు ప్రశ్న పత్రాన్ని చదవడానికి అదనంగా 15 నిమిషాల సమయం ఇస్తారు. వార్షిక ప్రశ్నపత్రం-మార్కుల స్వరూపం ప్రశ్న రకంప్రశ్నల మార్కులు మొత్తం సంఖ్య మార్కులు వ్యాసరూప ప్రశ్నలు 4 4 16 లఘు రూప ప్రశ్నలు 6 2 12 స్వల్పసమాధాన ప్రశ్నలు 7 1 7 బహుళైచ్ఛిక ప్రశ్నలు 10 1/2 5 మొత్తం మార్కులు 40 40 మార్కుల్లో ఉత్తీర్ణులవ్వాలంటే విద్యార్థి 14 మార్కులు సాధించాలి. ప్రామాణికం.. ఫార్మేటివ్ అసెస్మెంట్: బయలాజికల్ సైన్స్, ఫిజికల్ సైన్స్ సబ్జెక్ట్‌లకు కలిపి ఒక్కో రూపణ మూల్యాంకనం 20 మార్కులకు ఉంటుంది. వీటిలో ప్రయోగాల నిర్వహణకు 5 మార్కులు, పాఠ్యపుస్తకంలోని ప్రశ్నల సమాధానాలకు 5, ప్రాజెక్ట్ వర్క్‌కు 5, మిగతా 5 మార్కులు ఉపాధ్యాయుడు నిర్వహించే పరీక్షకు కేటాయించారు.అయితే బయలాజికల్ సైన్స్, ఫిజికల్ సైన్స్లకు వేర్వేరుగా పరీక్ష నిర్వహిస్తారు. కాబట్టి ఈ రెండు సబ్జెక్ట్‌లకు కలిపి ఉండే 20 మార్కులను సమంగా విభజించారు. ఈ నేపథ్యంలో బయలాజికల్ సైన్స్‌కు 10 మార్కులు కేటాయించారు. ఈ 10 మార్కులకు 3.5 (మూడున్నర) మార్కులు సాధించిన వారిని ఉత్తీర్ణులుగా పరిగణిస్తారు. కానీ ప్రస్తుతం ఈ నిబంధనను తొలగించారు. సామర్థ్యాలకు సాన: పబ్లిక్ పరీక్షలో ఉండే 40 మార్కుల్ని సాధించాలంటే.. విద్యార్థి కచ్చితంగా అన్ని రకాల ప్రశ్నలకు సమాధానాలు రాసే సామర్థ్యాలను మొదటి నుంచే సాధించాలి. ఈ క్రమంలో విద్యార్థి నిర్వహించే ప్రయోగాలు, ప్రాజెక్ట్ వర్క్ అధిక మార్కుల సాధనకు దోహదపడతాయి. పాఠ్యపుస్తకంలోని అంశాలను నేర్చుకోవడానికి మాత్రమే పరిమితం కాకుండా ఉపాధ్యాయుడు ఇచ్చే ప్రశ్నలకు సమాధానాల సాధన, సంబంధిత అంశాలపై ప్రాజెక్ట్‌లు నిర్వహిస్తే సబ్జెక్ట్ సామర్థ్యాలు పెరుగుతాయి. ప్రయోగ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొనాలి. తద్వారా ఆలోచనా సామర్థ్యం మెరుగవుతుంది. ప్రయోగ నిర్వహణ అంశాలు: విద్యార్థులు రికార్డులను జాగ్రత్తగా నిర్వహించాలి. ఇందులో ప్రయోగానికి సంబంధించి ఉద్దేశం, పరికరాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్రయోగ విధానం, నమోదు, ఫలితాల విశ్లేషణ, సాధారణీకరణం వంటి అంశాలను పొందుపరచాలి. ప్రయోగానికి 4 మార్కులు, రికార్డు రాసినందుకు 6 మార్కులు కేటాయించారు. రాత అంశాలు: నేర్చుకున్న అంశాలపై సొంత అభిప్రాయాలను జోడిస్తూ సమాధానాలను రాయడం ప్రాక్టీస్ చేయాలి. ఈ క్రమంలో నోట్‌బుక్‌లో సొంతంగా సమాధానాలు రాసినందుకు 5 మార్కులు, పటాలు గీసినందుకు 2 మార్కులు, భాషాదోషాలు లేకుండా ఉంటే 3 మార్కులు ఇస్తారు. ప్రాజెక్ట్ పని:ఇందులో విద్యార్థి వినడం/చదివిన విషయాల గురించి కాకుండా చేయడం లేదా అనుభవం ద్వారా నేర్చుకున్న అంశాలకు సంబంధించి ప్రాజెక్ట్‌ను నిర్వహించాల్సి ఉంటుంది. ఇందులో ప్రాజెక్ట్ జట్టు బాధ్యతలకు సంబంధించి 3 మార్కులు, నివేదిక (నిర్వహించిన కార్యక్రమాలను క్రమ పద్ధతిలో రాయడం)కు 5 మార్కులు, ప్రాజెక్ట్ గురించి ప్రసంగించినందుకు 2 మార్కులు కేటాయించారు. లఘు పరీక్ష: ఇందులో విద్యార్థుల విద్యా ప్రమాణాలను పరీక్షిస్తారు. ఇందుకు 20 మార్కులు కేటాయించారు. మూల్యాంకనం ముఖ్యమే:విద్యార్థి ప్రతి రూపణ మూల్యాంకనంలో మంచి మార్కులు సాధించడానికి ప్రయత్నించాలి. ఎందుకంటే ఇవి వార్షిక పరీక్షల్లో అధిక మార్కులతోపాటు మంచి గ్రేడును సాధించడానికి దోహదపడతాయి. ప్రతి రూపణ మూల్యాంకనంలో ఎక్కువ మార్కులు సాధించడ ం కష్టంతో కూడిన పని కాదు. ఎందుకంటే ఈ మూల్యాంకనం సిలబస్ పరిధి చాలా తక్కువ. అదే విధంగా ఉపాధ్యాయుడు ఇచ్చే ప్రాజెక్టులు, విద్యార్థులు సొంతంగా రాసే జవాబులు, పాఠశాలలో నిర్వహించే ప్రయోగాలు ఇవన్నీ ఒకదానితో ఒకటి అంతర సంబంధాన్ని కలిగి ఉంటాయి. ఈ పరీక్షల్లో సులువుగా మార్కులు సాధించవచ్చు. ప్రాజెక్ట్ వర్క్, ప్రయోగశాల కృత్యాలకూ మార్కులను కేటాయించారు. కాబట్టి వీటి నిర్వహణలో విద్యార్థి తన తోటి మిత్రులు, కుటుంబ సభ్యులు లేదా ఉపాధ్యాయుని సాయంతో సమర్థవంతంగా నిర్వహిస్తే, అధికమార్కులను పొందొచ్చు. తప్పనిసరి ప్రతి విద్యార్థి అన్ని రూపణ మూల్యాంకన పరీక్షలకు హాజరుకావాలి. సవరించిన నిబంధనల ప్రకారం అన్నిరూపణ మూల్యాంకన పరీక్షలలో ఉత్తీర్ణత సాధించాల్సిన అవసరం లేదు. కానీ ఇవి స్కోరింగ్‌కు దోహదపడతాయి. ప్రతి రూపణ మూల్యాంకన పరీక్షలకు సంబంధించి ల్యాబ్ రికార్డ్స్, ప్రాజెక్ట్ వర్క్ నోట్ బుక్, స్లిప్‌టెస్ట్ నోట్‌బుక్‌లను ఉపాధ్యాయుని సాయంతో జాగ్రత్తగా భద్రపరచుకోవాలి. ప్రశ్నలకు జవాబులు సొంతంగా రాయడానికి ప్రయత్నించాలి. సందేహాల నివృత్తిలో తోటి విద్యార్థుల లేదా ఉపాధ్యాయుని సహకారం తీసుకోవడానికి వెనుకాడవద్దు. గమనించాల్సినవి విద్యా ప్రమాణాల ఆధారంగా ప్రశ్న పత్రం ఉం టుంది. గతంలో మాదిరిగా పాఠ్యాంశాలకు భార త్వం ఉండదు. కాబట్టి అన్ని పాఠాలను చదవాలి.పాఠ్యపుస్తకంలో ఉన్న అన్నీ ప్రశ్నలు.. పరీక్షలో ఏ విధంగా అడగవచ్చో ముందే ఊహించుకుని సమాధానాలను ప్రాక్టీస్ చేయాలి.ఉపాధ్యాయుడు నిర్వహించే మూల్యాంకన పరీక్షలను రాస్తే వ్యాసరూప, లఘు, స్వల్ప ప్రశ్నలకు సమాధానాలు ఎలా రాయాలో అవగాహన ఏర్పడుతుంది. బయాలజీలో మార్కుల సాధనలో పటాలు కీలకం. కాబట్టి విద్యార్థి పటాలపై ఆసక్తి పెంచుకోవాలి. పటంలోని భాగాలు. అవి నిర్వర్తించే విధుల గురించి క్షుణ్నంగా అధ్యయనం చేయాలి. మనసులో ఉన్న జవాబును నిస్సందేహంగా రాయవచ్చు. ఎందుకంటే నూతన పరీక్షా విధానం బహుళ సమాధాన ప్రశ్నలకే ప్రాధాన్యం ఇస్తుంది. ఉదాహరణ: ప్రశ్న: దేహంలో కొవ్వుశాతం అధికమైతే ఏం జరుగుతుంది?సమాధానం: స్థూల కాయత్వానికి దారితీస్తుంది. రక్తపీడనం పెరుగుతుంది. గుండె పోటు వస్తుంది. ప్రశ్న: పోషణ పాఠం చదివిన తర్వాత నీ ఆహార అలవాట్లలో ఎలాంటి మార్పును కోరుకుంటున్నావు?సమాధానం: రోజూ సరైన సమయానికి ఆహారం తీసుకుంటాను. తినే తిండిలో పీచు పదార్థాలకు ప్రాధాన్యం ఇస్తాను. సులభంగా జీర్ణమయ్యే ఆహారాన్నితీసుకుంటాను. కొన్ని ముఖ్యమైన ప్రాజెక్టులు 1.మీ ఊరి ఆర్ఎంపీ దగ్గరకు వచ్చిన పది మంది రోగుల రక్త పీడనాన్ని కనుగొని, ఎవరు అధిక సిస్టోలిక్, డయాస్టోలిక్ పీడనాలు కలిగి ఉన్నారో జాబితా తయారు చేయండి. 2.నిత్య జీవితంలో మనకు లభించే సహజ పదార్ధాలతో జీర్ణవ్యవస్థ మోడల్‌ను రూపొందించండి. 3.ఆల్కలాయిడ్లు, టానిన్లను ఇచ్చే మొక్కల పత్రాలను సేకరించి హెర్బేరియం తయారు చేయండి. 4.వివిధ రకాల జంతువుల దంత సూత్రాలను తెలిపే సమాచారాన్ని పాఠశాల గ్రంథాలయం, అంతర్జాలం నుంచి సేకరించి నివేదిక సిద్ధం చేయండి.5.జీవవైవిధ్యానికి సంబంధించి గతంలో మీ ఊరిలో ఉండి, ప్రస్తుతం అంతరించిపోయిన మొక్కల, జంతువుల పట్టికను పొందుపరచి కారణాలు రాయండి. 6.సహజ వనరులకు సంబంధించి దగ్గరలోని ఎరువుల, క్రిమి సంహారకాల దుకాణానికి వెళ్లి ఏటా వారు అమ్మే క–{తిమ ఎరువులు, క్రిమిసంహారకాల పేర్లను, ఎంత పరిమాణంలో విక్రయించారో తెలిపే పట్టికను రూపొందించండి.ఙఞ్చట7.గ్రామ పెద్దల సాయంతో ఆదర్శరైతు అంటే ఏమిటో తెలుసుకొని, అతన్ని ఆదర్శరైతుగా ఎందుకు గుర్తించారో వివరంగా రాయండి. విద్యార్థి చేయాల్సినవి చేస్తూ నేర్చుకోవడంతో మరెన్నో కొత్త విషయాలను తెలుసుకోవచ్చు.ుండా నివేదికలు రూపొందించాలి. కేవలం పాఠ్యపుస్తకాలకే పరిమితం కాకుండా సంబంధిత అంశాలు ఉన్న అనుబంధ పుస్తకాలను చదవడం అలవాటు చేసుకోవాలి. సైన్స్ క్లబ్ కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొనాలి. ప్రాజెక్ట్ విషయంలో ఉపాధ్యాయుని సహకారంతోపాటు గ్రంథాలయం, అంతర్జాలం (ఇంటర్నెట్) సహాయం తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల విషయంపై లోతైన అవగాహన ఏర్పడుతుంది. తరగతిలో ఉపాధ్యాయుడు బోధించే పాఠ్యాంశాన్ని ముందే క్షుణ్నంగా చదివి ముఖ్యమైన పదాలను, భావనలను నోట్స్‌లో రాసుకోవాలి. విద్యా ప్రమాణాలలోని ప్రశంస, నిజ జీవిత వినియోగం, జీవ వైవిధ్యాలకు సంబంధించిన అంశాలను దృష్టిలో పెట్టుకొని ప్రశ్నలను అధ్యయనం చేయాలి. ముఖ్యంగా విద్యార్థులు ప్రాజెక్ట్, ప్రయోగశాల నిర్వహణకు సంబంధించి ఏమైనా సమస్యలుంటే ఉపాధ్యాయునితో చర్చించి పరిష్కరించుకోవాలి.