భారతి, రాజేశ్వరి, సావిత్రి
ఎస్కేయూ/అనంతపురం ఎడ్యుకేషన్ : టెట్(టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్) పేరు విం టేనే అభ్యర్థులు బెంబేలెత్తిపోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం సీ – టెట్ (సెంట్రల్ టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్) సిలబస్ ఆధారంగా టెట్ విధివిధానాలు, నిబంధనలను రూపొందిస్తుండటంతో టెట్ సిలబస్ గతంతో పోలిస్తే మూడింతలు అధికంగా ఉంది. కనీస అర్హత సాధిస్తామా, లేదా అని అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు.
♦ టెట్ రాత పరీక్షల్లో అన్ని మెథడాలజీ సబ్జెక్టుల వారికీ ఇబ్బందులున్నాయి. బయాలజీ సైన్సెస్ స్కూల్ అసిస్టెంట్‌కు సన్నద్ధమయ్యే అభ్యర్థుల సమస్యలు జఠిలంగా ఉన్నాయి. టెట్‌లో నిర్ధేశించిన సిలబస్ ప్రకారం కేటాయించిన ఈ 150 మార్కుల్లో బయాలజికల్ సైన్సెస్ వారికి కేవలం బయాలజీ, మెథడాలజీ రెండూ కలుపుకొని 18 మార్కుల సిలబస్ మాత్రమే తెలిసి ఉంటుంది. తక్కిన 132 మార్కుల కోసం కొత్తగా చదవాలి. దరఖాస్తుకు, పరీక్షకు గడువు కేవలం నామమాత్రంగానే ఉంది. టెట్‌లో వచ్చిన మార్కులకు డీఎస్సీలో వెయిటేజీ ఇస్తుండటంతో ప్రతి మార్కు కీలకమైన నేపథ్యంలో ఆందోళనకు గురవుతున్నారు.
♦ బీఈడీ(ఇంగ్లిష్), (తెలుగు), టీపీటీ పూర్తి చేసిన లాంగ్వేజెస్ అభ్యర్థులు ఇదివరకు సోషల్ స్టడీస్‌లో టెట్ రాయాల్సి ఉండేది. తాజాగా ఈ అభ్యర్థులను పరిగణలోకి తీసుకుని టెట్ – 3 పేరుతో నూతన సిలబస్ ఖరారు చేశారు. స్పెషల్ తెలుగు, స్పెషల్ ఇంగ్లిష్‌కు 60 మార్కులు కేటాయించారు. గతంలో ఈ 60 మార్కులకు ప్రశ్నలు తప్పనిసరిగా సోషల్ స్టడీస్‌లోనే వచ్చేవి. నూతనంగా సిలబస్ మార్చినప్పటికీ దాని రూపకల్పన పూర్తి కాలేదు. దీంతో వీరికీ ఇబ్బందులు తప్పలేదు. ఇంగ్లిష్ లాంగ్వేజెస్ వారికి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు అందుబాటులోకి రాకపోవడంతో వారు దరఖాస్తు చేసుకోలేదు. అందువల్ల టెట్ పరీక్ష వాయిదా వేయాలని కోరుతున్నారు.
టెట్ స్వరూపాన్నే మార్చి.. ఆవేదన మిగిల్చి..
విద్యాహక్కు చట్టం ప్రకారం ఎన్‌సీటీఈ(నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్) టెట్ సిలబస్‌ను రూపొదించింది. వాస్తవానికి టెట్ పరీక్షను బట్టే ఉద్యోగ ఎంపిక పూర్తి చేయాల్సి ఉన్నా టెట్‌లోని సిలబస్ కొంత, డీఎస్సీ సిలబస్ కొంత తీసుకుని టెట్, డీఎస్సీ రెండు పరీక్షలు నిర్వహించి టీచర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. టెట్ 150 మార్కులకు నిర్వహిస్తే.. ఇందులో వచ్చిన మార్కులను 20 శాతం డీఎస్సీలో వెయిటేజీ ఇస్తున్నారు. తక్కిన 80 శాతం వెయిటేజీ కోసం డీఎస్సీ పరీక్ష నిర్వహిస్తున్నారు.
♦ ‘టెట్’ను కాదని టీఆర్టీ.. తిరిగి టెట్
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తొలి సారిగా జులై – 2011లో టెట్ నిర్వహించారు. రెండో దఫా టెట్ జనవరి 2012లో జరిగింది. మొదటి టెట్ కన్నా రెండో టెట్ పరీక్ష చాలా కఠినంగా ఉండటంతో బోనస్ మార్కులు కలిపి ఫలితాలు విడుదల చేశారు. తిరిగి మూడో టెట్‌ను జులై – 2013లో, నాలుగో టెట్‌ను మార్చి – 2014లో నిర్వహించారు. అయితే అప్పట్లో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తడంతో 2014 సార్వత్రిక ఎన్నికల్లో టెట్‌ను రద్దు చేస్తామని టీడీపీ హామీ ఇచ్చింది. అయితే ఒకసారి టెట్‌కు అర్హత సాధిస్తే ఏడేళ్ల వరకు చెల్లుబాటవుతుంది. అందువల్ల అప్పటికే అర్హత సాధించినవారు టెట్‌ను రద్దుపై తీవ్ర అభ్యంతరం తెలి పారు. దీంతో టీడీపీ ప్రభుత్వం టెట్ కమ్ టీఆర్టీ పేరుతో ఒకే పరీక్ష నిర్వహిం చింది. అయితే తిరిగి టెట్, డీఎస్సీ రెండు పరీక్షలు పెడుతున్నారు. ఇలా ప్రభుత్వ నిర్ణయాలు తరచూ మారుతుండటంతో అభ్యర్థుల్లో ఆందోళన నెలకొంది.
పొంతన లేని సిలబస్
మేథమేటిక్స్ కష్టమనే బయాలజికల్ సైన్సెస్ కోర్సులు తీసుకున్నాము. టెట్‌లో మేథమేటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులు ప్రవేశపెట్టారు. మేథమేటిక్స్ బేసిక్ అయితే నేర్చుకోవచ్చుగానీ లోతైన సిలబస్ ఇచ్చారు.
– భారతి, అనంతపురం
సిలబస్ మూడింతలైంది
గతంలో కన్నా మూడింతలు అధిక సిలబస్‌ను రూపొందించారు. దీంతో ప్రిపేరేషన్ చాలా భారంగా మారింది. తక్కువ సమయంలో ఎక్కువ సిలబస్ చదవాలంటే ఆందోళనగా ఉంది. – రాజేశ్వరి, గుంతకల్లు
అర్హతమార్కులు తగ్గించాలి
టెట్‌లో అర్హత మార్కులు అధిక శాతంగా నిర్ణయించారు. ఏ మాత్రం సంబంధం లేని సిలబస్‌ను ప్రవేశపెట్టారు. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని అర్హత మార్కులు తగ్గించాలి. – సావిత్రి, అనంతపురం
Comments
Please login to add a commentAdd a comment