జీవశాస్త్ర కంపెనీలకు రూ.400 కోట్లు  | CSIR Will Set Up Fund For Biological Startup Companies | Sakshi
Sakshi News home page

జీవశాస్త్ర కంపెనీలకు రూ.400 కోట్లు

Published Sun, Apr 14 2019 3:29 AM | Last Updated on Sun, Apr 14 2019 3:29 AM

CSIR Will Set Up Fund For Biological Startup Companies - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: దేశంలో జీవశాస్త్ర సంబంధిత స్టార్టప్‌ కంపెనీలకు ఆర్థికంగా వెన్నుదన్నుగా ఉండేందుకు కౌన్సిల్‌ ఫర్‌ సైంటిఫిక్‌ అండ్‌ ఇండస్ట్రియల్‌ రీసెర్చ్‌ (సీఎస్‌ఐఆర్‌)  రూ.400 కోట్లతో ఒక నిధిని ఏర్పాటు చేయనున్నట్లు సంస్థ డైరెక్టర్‌ జనరల్‌ శేఖర్‌ సి.మండే తెలిపారు. ప్రస్తుతం విధివిధానాల రూపకల్పనకు కసరత్తు కొనసాగుతోందని, సీఎస్‌ఐఆర్‌ సొంత నిధులతో ఏర్పాటు చేస్తున్న ఈ నిధికి సంబంధించిన ప్రతిపాదనలను కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖకూ పంపించామని ఆయన చెప్పారు. సెంటర్‌ ఫర్‌ సెల్యులార్‌ అండ్‌ మాలిక్యులర్‌ బయాలజీ (సీసీఎంబీ) ఆధ్వర్యంలోని అటల్‌ ఇన్‌క్యుబేషన్‌ సెంటర్‌ ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా శనివారం ఏర్పాటైన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన శేఖర్‌ సి. మండే మీడియాతో మాట్లాడారు. 

బయోటెక్‌ స్టార్టప్‌ కంపెనీల కోసం ఏర్పాటు చేస్తున్న నిధి రెండు నెలల్లో అందుబాటులోకి వచ్చే అవకాశముందని తెలిపారు. దేశంలోని వివిధ వర్గాల ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలకు శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానాల సాయంతో పరిష్కారాలు కనుక్కునే లక్ష్యంతో ఐదేళ్ల క్రితం కొన్ని ప్రాజెక్టులు యుద్ధ ప్రాతిపదికన చేపట్టిందన్నారు. వాటి ఫలితాలిప్పుడు అందరికీ అందుతున్నాయని ‘సాక్షి’అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా తెలిపారు.   సికిల్‌ సెల్‌ అనీమియా వంటి అరుదైన వ్యాధులను ముందుగానే గుర్తించి నివారించేందుకు సెంటర్‌ ఫర్‌ సెల్యులార్‌ అండ్‌  మాలిక్యులర్‌ బయాలజీ జన్యు ఆ«ధారిత టెక్నాలజీని అభివృద్ధి చేశామని ఆయన మండే తెలిపారు.

చెరకు వ్యర్థాల నుంచి పొటాష్‌...
దేశంలోని కొన్ని ప్రాంతాల్లో విస్తృతంగా పండే చెరకు నుంచి మరింత విలువను రాబట్టేందుకు భావ్‌నగర్‌లోని సీఎస్‌ఐఆర్‌ సంస్థ ఓ వినూత్న టెక్నాలజీని ఆవిష్కరించిందని శేఖర్‌ తెలిపారు. వృథాగా పోతున్న వ్యర్థాల నుంచి పొటాష్‌ను వెలికితీయగల ఈ టెక్నాలజీ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే పొటాష్‌ దిగుమతులను నిలిపివేయవచ్చని ఆయన చెప్పారు.  కార్యక్రమంలో సీసీఎంబీ డైరెక్టర్‌ డాక్టర్‌ రాకేశ్‌ మిశ్రా తదితరులు పాల్గొన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement