ఏఐ, సెమీ కండక్టర్లు, క్వాంటమ్ మిషన్లతో ఉపాధి, పెట్టుబడి అవకాశాలు
ఎన్నికల తర్వాత పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెడతాం
‘స్టార్టప్ మహాకుంభ్’లో ప్రధాని నరేంద్ర మోదీ
న్యూఢిల్లీ: కృత్రిమ మేధ(ఏఐ) సామర్థ్యాల్లో ప్రపంచానికి భారత్ నాయకత్వం వహించబోతోందని ప్రధానమంత్రి నరేంద్ర చెప్పారు. ప్రపంచదేశాలు ఎదుర్కొంటున్న సమస్యలకు స్వదేశీ పరిష్కార మార్గాలు కనిపెట్టాలని భారత యువ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు, స్టార్టప్ కంపెనీల ప్రతినిధులకు పిలుపునిచ్చారు. బుధవారం ఢిల్లీలో స్టార్టప్ మహాకుంభ్‌లో ఆయన ప్రసంగించారు.
తమ ప్రభుత్వం గతంలోనే ప్రారంభించిన ఏఐ, సెమీ కండక్టర్లు, నేషనల్ క్వాంటమ్ మిషన్ల ద్వారా యువతకు పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు ఉపాధి, విదేశీ ఇన్వెస్టర్లకు పెట్టుబడి అవకాశాలు అందుబాటులోకి రాబోతున్నాయని తెలిపారు. ఏఐ టెక్నాలజీ అనే నూతన శకంలో మనం ఉన్నామని, ఈ రంగంలో భారత్‌దే పైచేయి అవుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ అవకాశం ఎట్టిపరిస్థితుల్లోనూ వదులుకోవద్దని సూచించారు.
యువతకు, ప్రపంచస్థాయి పెట్టుబడిదారులకు ఏఐ టెక్నాలజీ అవధుల్లేని అవకాశాలు అందిస్తోందని పేర్కొన్నారు. కృత్రిమ మేధలో ఇండియానే లీడర్ అవుతుందంటూ గత ఏడాది అమెరికా సెనేట్‌లో తాను తేలి్చచెప్పానని మోదీ గుర్తుచేశారు. ఎన్నికల ప్రచారం కోసం ఏఐ టెక్నాలజీని వాడుకుంటున్నానని, తెలుగు, తమిళంతోపాటు ఎన్నో భాషల్లో తన స్టేట్‌మెంట్లను ప్రజలతో పంచుకుంటున్నానని ఉద్ఘాటించారు.
మూడో అతిపెద్ద స్టార్టప్ వ్యవస్థ మనదే
సార్వత్రిక ఎన్నికల తర్వాత తమ ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశ పెట్టబోతోందని ప్రధాని మోదీ వెల్లడించారు. రూ.వేల కోట్లతో కొత్తగా ‘నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్’ ఏర్పాటు చేయాలని నిర్ణయించామని తెలిపారు. పరిశోధన, నూతన ఆవిష్కరణలకు మధ్యంతర బడ్జెట్‌లో రూ.లక్ష కోట్లు కేటాయించామని గుర్తుచేశారు. స్టార్టప్ కంపెనీలకు నిధుల సాయం అందించడానికి ఒక ఉత్తమ వ్యవస్థను ఏర్పాటు చేస్తామన్నారు.
2014లో మన దేశంలో కనీసం 100 స్టార్టప్‌లు కూడా లేవని, ఇప్పుడు వాటి సంఖ్య 1.25 లక్షలు దాటిందని హర్షం వ్యక్తం చేశారు. ఈ కంపెనీలతో 12 లక్షల మంది యువత అనుసంధానమై ఉన్నారని వివరించారు. స్టార్టప్‌లు పెద్ద సంఖ్యలో పేటెంట్లు సాధిస్తున్నాయని కొనియాడారు. మనకు 110కుపైగా యూనికార్న్ కంపెనీలు ఉన్నాయని తెలిపారు. విద్యాభ్యాసం అంటే ప్రభుత్వం ఉద్యోగం సంపాదించడం అనే ధోరణి గతంలో ఉండేదని, ప్రభుత్వ ఉద్యోగం వస్తే జీవితంలో స్థిరపడినట్లేనని భావించేవారని గుర్తుచేశారు.
అలాంటి ఆలోచనా ధోరణి ఇప్పుడు మారిందని, స్టార్టప్ విప్లవం మొదలైందని అన్నారు. నేటి మన యువత ఉద్యోగాలు కోరుకొనేవారుగా కాకుండా ఉద్యోగాలు ఇచ్చేవారిగా ఎదుగుతున్నారని ప్రశంసించారు. దేశంలో 45 శాతానికిపైగా స్టార్టప్‌లకు మహిళలే నాయకత్వం వహిస్తున్నారని చెప్పారు. ప్రపంచంలో మూడోఅతిపెద్ద స్టార్టప్ వ్యవస్థ మనదేనని పేర్కొన్నారు. వికసిత్ భారత్‌తోపాటు ప్రపంచ మెరుగైన భవిష్యత్తుకు నవీన ఆవిష్కరణల సంస్కృతి చాలా కీలకమని స్పష్టం చేశారు.
రాహుల్‌పై వ్యంగ్యాస్త్రాలు
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాందీపై ప్రధాని మోదీ పరోక్షంగా వ్యంగ్యాస్త్రాలు విసిరారు. రాజకీయాల్లో కొందరిని పదేపదే కొత్తగా ప్రారంభించాల్సి వస్తోందని అన్నారు. ఒక రంగంలో స్టార్టప్ కంపెనీ విఫలమైతే మరో రంగంలో ప్రారంభించవచ్చని చెప్పారు. రాజకీయాల్లో మాత్రం ఆ పరిస్థితి లేదన్నారు. చాలామంది స్టార్టప్‌లు ప్రారంభిస్తున్నారని, రాజకీయాల్లో స్టార్టప్‌ల సంఖ్య మరింత ఎక్కువగా ఉందని పేర్కొన్నారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో విజయం తమదేనని ధీమా వ్యక్తం చేశారు.
బుధవారం ఢిల్లీలో స్టార్టప్ మహాకుంభ్‌లో పాల్గొన్న వారికి ప్రధాని మోదీ అభివాదం
Comments
Please login to add a commentAdd a comment