ఎముకల మరమ్మతుకు బయోపెన్!
మెల్బోర్న్: ప్రమాదాల వల్ల ఎముకలు ధ్వంసం అయినప్పుడు లేదా మోకాలుపై మృదులాస్థి అరిగిపోయినప్పుడు వైద్యులు ఇంప్లాంట్లను అమరుస్తుంటారు. ప్రయోగశాలలో మూలకణాలతో కొన్నివారాలపాటు మృ దులాస్థిని అభివృద్ధిపర్చి కూడా అమరుస్తుంటారు. అయితే ఎముకలు దెబ్బతిన్న చోట నేరుగా మూలకణాలను అచ్చులా పోసి ఎముకలను పెంచేందుకు ఉపయోగపడే వినూత్న ‘బయోపెన్’ను ఆస్ట్రేలియాలోని యూనివర్సిటీ ఆఫ్ వోలాంగాంగ్ శాస్త్రవేత్తలు ఆవిష్కరించారు. 3డీ ప్రింటర్లా పనిచేసే ఈ పెన్నులో మూలకణాలు, జెల్ పదార్థాలు, ఇతర పోషక పదార్థాలను కలిపి ఇంకులా వాడతారు.
ఈ ఇంకును నేరుగా ఎముకలు దెబ్బతిన్నచోట కావలసిన ఆకారం లో అచ్చుపోస్తే చాలు.. ఆ మూలకణాలు విభజన చెందుతూ ఎముకలను ఉత్పత్తిచేస్తాయి. ఇప్పటిదాకా ప్రయోగశాలలో మోకాలు వంటి మూసలపై ఈ బయోపెన్తో మృదులాస్థిని పెంచగలిగారు. దీనిపై మెల్బోర్న్లోని విన్సెంట్స్ ఆస్పత్రిలో ఔషధ పరీక్షలు చేపట్టేందుకు యత్నిస్తున్నారు. ఎముకలు మాత్రమే కాకుండా కండరాలు, నాడీకణాలను కూడా ఈ పెన్నుతో పెంచవచ్చని పరిశోధన బృందం సారథి ప్రొఫెసర్ పీటర్ చూంగ్ వెల్లడించారు. మూలకణాలతో పాటు కలిపే ఇతర పదార్థాలతో ఎలాంటి హాని ఉండదని, ఎముక కణాలు ఖాళీ చోటును ఆక్రమించగానే జెల్ పదార్థాలు విచ్ఛిన్నమవుతాయన్నారు.