Bird Festival
-
బర్డ్ ఉమన్.. పిట్టలు వాలిన చెట్టు
పురుషుల చరిత్రలో స్త్రీలు తెర వెనుక ఉంటారు. ప్రఖ్యాత పక్షి శాస్త్రజ్ఞుడైన సలీం అలీని‘బర్డ్ మేన్ ఆఫ్ ఇండియా’ అంటారు. కాని ‘బర్డ్ ఉమన్ ఆఫ్ ఇండియా’కూడా ఉంది. ఆమె పేరు జమాల్ ఆరా. బిహార్‌కు చెందిన జమాల్ ఆరా ఎన్నో అరుదైన పక్షులను, వాటి జీవనాన్నిగుర్తించి, రికార్డు చేసింది. జనవరి 5 జాతీయ పక్షుల దినోత్సవం. పక్షుల ఆవరణాలను కాపాడుకోవడంతోపాటు వాటికై స్త్రీలు చేసిన సేవను కూడా గుర్తు చేసుకోవాలి.మనిషికి పక్షిని చూశాకే ఎగరాలనే కోరిక పుట్టింది. పక్షి మనిషికి అలారం. రైతుకు పురుగుల మందుగా మారి పురుగు పుట్రను తిని పంటను కాపాడింది. పక్షి పాట పాడింది. పురివిప్పింది. గంతులేసింది. పలుకులు పలికింది. ఎడతెగని ఉల్లాసాన్ని ఇచ్చింది. జనవరి 5 ‘జాతీయ పక్షుల దినోత్సవం’ ఎందుకు జరుపుతామంటే పక్షి గురించి చైతన్యం కలిగించుకోవడానికి. ప్రపంచంలో దాని వాటా దానికి ఇవ్వడానికి. దానినీ బతకనివ్వమని కోరడానికి.అడవులు, ఆవాసాలుమన దేశంలో నలభై యాభై ఏళ్ల క్రితం వరకూ కూడా పక్షులు, మనుషులు కలిసి బతికేవారు. అడవిలో ఉండే పక్షులు, జలాశయాల పక్షులు, వలస పక్షులు... ఇవి కాక మనిషి ఆవాసాల దగ్గర ఉండే పిచుకలు, కాకులు, కోయిలలు, గొరవంకలు... వంటివి మనగలిగేవి. మనిషి ఆవాసాల్లో పెరళ్లు, బావులు, చెట్లు మాయమయ్యాక ఇక అవి వాటికి కాకుండా పోయాయి. సెల్‌ఫోన్ టవర్లు, కాంక్రీట్తనం, రేడియేషన్... పిచుకలకు దెబ్బ కొడుతోంది. అడవులను కొట్టేయడం వల్ల అడవి పిట్టలు... జలాశయాల ఆక్రమణల వల్ల తడి, తేమల్లోని పురుగుల్ని చేపల్ని తినే కొంగలు, పిట్టలు ఆర్తనాదాలు చేసే స్థితికి వచ్చాయి. పక్షులు లేని ఈ ప్రపంచం క్షణమైనా బాగుంటుందా? అందుకే పక్షికి గుక్కెడు నీళ్లు, గుప్పెడు గింజలు, మాంజా దారాలు లేని ఆకాశం ఇవ్వగలగాలి. పిల్లలకు నేర్పగలగాలి. ‘బర్డ్‌వాచింగ్’ను హాబీగా మార్చగలగాలి.అడవుల కోసంబిహార్లో అడవుల నరికివేత మీద జమాల్ ఆరాపోరాటం చేసింది. అడవులుపోతే ఎడారులొస్తాయని పక్షులు బతకవని ప్రభుత్వానికి లేఖలు రాసింది. రాచరిక కుటుంబాలు సరదా కోసం బిహార్‌లో ఖడ్గమృగాలను వేటాడటాన్ని నిషేధించాలని కోరింది. ‘అడవిలోకి ఎవరు వచ్చినా ఫారెస్ట్ ఆఫీసర్లు గానీ మామూలు మనుషులుగాని.. వారి దగ్గర తుపాకులు ఉండకూడదు’ అని ఆమె 1950లలోనే సూచించింది. 1970లో ఈ నియమం అమలయ్యింది. ఎందుకంటే తుపాకీ చేతిలో ఉంటే అడవిలో పేల్చబుద్ధవుతుంది. ఒక మూగజీవో పక్షో మరణిస్తుంది. పిల్లల కోసం పక్షుల గురించి పుస్తకాలు రాసి, ఆల్ ఇండియా రేడియోలో ఎన్నో ప్రసంగాలు చేసిన జమాల్ ఆరా ప్రపంచవ్యాప్త జర్నల్స్‌లో తన పరిశోధనలు ప్రచురించుకోవడం తెలియక తెర వెనుక ఉండి΄ోయింది. ఇటీవలే ఆమె కృషి బయటకు తెలిసి మహిళా జాతి గర్వపడుతోంది. 1995లో మరణించిన జమాల్ ఆరాను– ‘ఫస్ట్ ఇండియన్ బర్డ్ ఉమన్’గా చరిత్ర గుర్తు పెట్టుకుంటుంది. -
ఏటా బర్డ్ వాక్ ఫెస్టివల్: శోభ
సాక్షి, మంచిర్యాల: ప్రకృతి, వన్యప్రాణి ప్రేమికులను ప్రోత్సహించేలా ఏటా బర్డ్ వాక్ ఫెస్టివల్ నిర్వహిస్తామని పీసీసీఎఫ్ (ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్) ఆర్.శోభ అన్నారు. ఆదివారం తెల్లవారుజామునే ఔత్సాహికులతో కలసి మంచిర్యాల జిల్లా జన్నారం మండలం కవ్వాల్ పులుల అభయారణ్యంలోని బైసన్‌కుంట పరిసరాల్లో వివిధ రకాల పక్షులను స్వయంగా వీక్షించారు. అనంతరం రెండ్రోజులుగా సాగిన బర్డ్ వాక్ ముగింపు కార్యక్రమంలో మాట్లాడారు. అడవులు, వన్యప్రాణుల సంరక్షణ ప్రతీ ఒక్కరి బాధ్యత కావాలని పిలుపునిచ్చారు. సుదూర ప్రాంతాల నుంచి చిన్నా, పెద్దా, మహిళలు అనే భేదం లేకుండా ప్రకృతిపై ప్రేమతో ఎంతో ఉత్సాహంగా పాల్గొన్న ఔత్సాహికులను చూస్తుంటే ముచ్చటేస్తోందన్నారు. రాష్ట్రంలో యువ ఫారెస్టు అధికారులు చక్కగా పని చేస్తున్నారని కితాబిచ్చారు. ప్రస్తుతం కలప అక్రమ రవాణా పూర్తిగా తగ్గిపోయిందని, పులుల సంతతి పెరుగుతోందని ఆనందం వ్యక్తంచేశారు. కవ్వాల్ ఫీల్డ్ డైరెక్టర్ ప్రాజెక్టు టైగర్, నిర్మల్ సర్కిల్ సీఎఫ్ వినోద్‌కుమార్ మాట్లాడుతూ పులుల అభయారణ్యంలో కోర్ అవతలి కొంత భాగాన్ని ప్రకృతి ప్రేమికులు పర్యటించేలా ప్రతిపాదిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో ఆదిలాబాద్ సీఎఫ్ రామలింగం, మంచిర్యాల, ఆసిఫాబాద్, నిర్మల్, ఆదిలాబాద్, కామారెడ్డి డీఎఫ్‌వోలు శివాని డోగ్రా, శాంతారామ్, వికాస్ మీనా, రాజశేఖర్, నిఖిత బోగ, ఉమ్మడి జిల్లాలోని ఎఫ్‌డీవోలు, ఎఫ్ఆర్వోలు, అటవీ సిబ్బంది పాల్గొన్నారు. -
పక్షుల కాదు.. తమ్ముళ్ల పండగ
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: పక్షుల పండగను తమ్ముళ్లు తమ స్వార్థం కోసం ఉపయోగించుకుంటున్నారు. పక్షులను తిల కించేందుకు వివిధ ప్రాంతాల నుంచి పెద్దఎత్తున వస్తున్న పర్యాటకుల కోసం ఏర్పాట్లు చేయడం మాని టీడీపీ నాయకులు తమ ప్రాధాన్యాన్ని పెంచుకునే పనిలో పడ్డారు. ప్రభుత్వం ముద్రించిన ఆహ్వానపత్రికలు.. వాల్‌పోస్టర్లే అందు కు నిదర్శనం. కేవలం టీడీపీ నాయకుల ఫొటోలను మాత్రమే వాటిపై ముద్రించుకున్నారు. అదేవిధంగా ఆహ్వాన పత్రికల్లోనూ ప్రొటోకాల్‌ను పాటించలేదు. నేలపట్టులో శుక్రవారం నుంచి మూడురోజుల పాటు పక్షుల పండగ జరుగనుంది. ఈ పండగకు విదేశీయులతో పాటు.. వివిధ రాష్ట్రాల నుంచి పర్యాటకులు పెద్దఎత్తున రానున్నారు. అయితే వారికి వసతులు ఏర్పాటు చేయటంలో అధికార యంత్రాంగం విఫలమైంది. పర్యాటకులు విడిది చేసేందుకు ప్రభుత్వం ఎటువంటి ఏర్పాట్లు చేయలేదు. వచ్చిన వారంతా కేవలం ప్రైవేటు హోటళ్లలో బసచేయాల్సిందే తప్ప ప్రభుత్వ అతిథిగృహాలు లేవు. ఉన్నా అవి నిరుపయోగంగా దర్శనమిస్తున్నాయి. రుచికరమైన భోజనాలు.. తినుబండారాలు దొరికే పరిస్థితి కనిపించడం లేదు. పర్యాటకుల రాకపోకలకు సంబంధించి బస్సులు, రైళ్ల సమాచారం ఇంతవరకు ఇవ్వలేదు. ప్రత్యేక వాహనాలు ఏర్పాటు చేస్తున్నట్లు ఇంతవరకు ప్రకటించలేదు. విద్యార్థుల కోసం నిర్మించిన విజ్ఞానకేంద్రంలో వివిధ రకాల పక్షుల బొమ్మలు ఏర్పాటు చేయాల్సి ఉన్నా.. అటువంటివేమీ కనిపించలేదు. పక్షులను వీక్షించేందుకు మరో రెండు, మూడు టవర్లు ఏర్పాటు చేయాల్సి ఉన్నా.. ఆ దిశగా పనులేవీ చేపట్టలేదు. పడవల రేవు వద్ద బోట్ షికారుకు అనుకూలంగా ఉన్నా పట్టించుకోవటం లేదు. కేవలం ఫ్లెమింగో ఫెస్టివల్ నిర్వహించే మూడు రోజుల మాత్రమే నిర్వహించి వదిలేస్తున్నారు. కేవలం సూళ్లూరుపేటలో గ్రౌండ్లో స్టాల్స్‌ను ఏర్పాటు చేసి సినీతారలు, యాంకర్స్‌ను రప్పించి పండగను మమ అనిపించాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. 1992లో అప్పటి ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి భీములవారిపాళెం పడవల రేవులో మంచి టూరిజం గెస్ట్‌హౌస్ నిర్మించేందుకు శిలాఫలకం వేశారు. ఆ తర్వాత ఆనం రామనారాయణరెడ్డి పర్యాటకశాఖ మంత్రిగా 2008లో ఫ్యామిలీ ఎంటర్టైనర్ సెంటర్, హరిత ఎకో టూరిజం రిసార్ట్స్ నిర్మించాలని చెన్నై సవేరా హోటల్స్ వారి సాయంతో నిర్మించేందుకు రెండు శిలాఫలకాలు వేశారు. అవి శిలాఫలకాలకే పరిమితమైపోయాయి. తమ్ముళ్ల తహతహ.... పక్షుల పండగలో తమ్ముళ్లు హల్చల్ చేయటానికి తహతహలాడుతున్నారు. వాకాటి నారాయణరెడ్డి, గంగాప్రసాద్, వేనాటి రామచంద్రారెడ్డి తమ బలం ప్రదర్శించుకునే పనిలో నిమగ్నమయ్యారు. అందులో భాగంగానే సూళ్లూరుపేటను ఫ్లెక్సీల మయం చేశారు. పక్షుల పండగను మరిపించేస్తున్నారు. ఇదిలా ఉంటే పక్షుల పండగకు నేలపట్టు సర్పంచ్ విజయభాస్కర్, కోయిడి సర్పంచ్ సరోజనమ్మ, బీవీపాళెం సర్పంచ్ రోజారత్నంలకు అధికారులు కానీ, నాయకుల కానీ ఎటువంటి సమాచారం ఇవ్వటం లేదు. అదేవిధంగా పక్షుల పండగకు సంబంధించిన ఆహ్వాన పత్రికల్లో వారి పేర్లు ముద్రించలేదు. అదే సూళ్లూరుపేటకు చెందిన టీడీపీ వార్డుసభ్యుడి పేరు మాత్రం ముద్రించి ఉండటం గమనార్హం. ఇదిలా ఉంటే స్థానిక ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య పేరు అస్సలు లేదు. ప్రభుత్వం ముద్రించిన వాల్‌పోస్టర్లలో కేవలం ముఖ్యమంత్రి, కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు, రాష్ట్ర మంత్రి నారాయణ ఫొటోలు మాత్రమే ముద్రించారు. ఈ వాల్‌పోస్టర్లు చూసిన స్థానికులు ఔరా అని ముక్కున వేలేసుకుంటున్నారు. ఇది కేవలం తమ్ముళ్లు పండగ అని ప్రచారం జరుగుతోంది.