పక్షుల కాదు.. తమ్ముళ్ల పండగ
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: పక్షుల పండగను తమ్ముళ్లు తమ స్వార్థం కోసం ఉపయోగించుకుంటున్నారు. పక్షులను తిల కించేందుకు వివిధ ప్రాంతాల నుంచి పెద్దఎత్తున వస్తున్న పర్యాటకుల కోసం ఏర్పాట్లు చేయడం మాని టీడీపీ నాయకులు తమ ప్రాధాన్యాన్ని పెంచుకునే పనిలో పడ్డారు. ప్రభుత్వం ముద్రించిన ఆహ్వానపత్రికలు.. వాల్‌పోస్టర్లే అందు కు నిదర్శనం. కేవలం టీడీపీ నాయకుల ఫొటోలను మాత్రమే వాటిపై ముద్రించుకున్నారు. అదేవిధంగా ఆహ్వాన పత్రికల్లోనూ ప్రొటోకాల్‌ను పాటించలేదు.
నేలపట్టులో శుక్రవారం నుంచి మూడురోజుల పాటు పక్షుల పండగ జరుగనుంది. ఈ పండగకు విదేశీయులతో పాటు.. వివిధ రాష్ట్రాల నుంచి పర్యాటకులు పెద్దఎత్తున రానున్నారు. అయితే వారికి వసతులు ఏర్పాటు చేయటంలో అధికార యంత్రాంగం విఫలమైంది. పర్యాటకులు విడిది చేసేందుకు ప్రభుత్వం ఎటువంటి ఏర్పాట్లు చేయలేదు. వచ్చిన వారంతా కేవలం ప్రైవేటు హోటళ్లలో బసచేయాల్సిందే తప్ప ప్రభుత్వ అతిథిగృహాలు లేవు. ఉన్నా అవి నిరుపయోగంగా దర్శనమిస్తున్నాయి.
రుచికరమైన భోజనాలు.. తినుబండారాలు దొరికే పరిస్థితి కనిపించడం లేదు. పర్యాటకుల రాకపోకలకు సంబంధించి బస్సులు, రైళ్ల సమాచారం ఇంతవరకు ఇవ్వలేదు. ప్రత్యేక వాహనాలు ఏర్పాటు చేస్తున్నట్లు ఇంతవరకు ప్రకటించలేదు. విద్యార్థుల కోసం నిర్మించిన విజ్ఞానకేంద్రంలో వివిధ రకాల పక్షుల బొమ్మలు ఏర్పాటు చేయాల్సి ఉన్నా.. అటువంటివేమీ కనిపించలేదు. పక్షులను వీక్షించేందుకు మరో రెండు, మూడు టవర్లు ఏర్పాటు చేయాల్సి ఉన్నా.. ఆ దిశగా పనులేవీ చేపట్టలేదు.
పడవల రేవు వద్ద బోట్ షికారుకు అనుకూలంగా ఉన్నా పట్టించుకోవటం లేదు. కేవలం ఫ్లెమింగో ఫెస్టివల్ నిర్వహించే మూడు రోజుల మాత్రమే నిర్వహించి వదిలేస్తున్నారు. కేవలం సూళ్లూరుపేటలో గ్రౌండ్‌లో స్టాల్స్‌ను ఏర్పాటు చేసి సినీతారలు, యాంకర్స్‌ను రప్పించి పండగను మమ అనిపించాలని చూస్తున్నట్లు తెలుస్తోంది.
1992లో అప్పటి ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి భీములవారిపాళెం పడవల రేవులో మంచి టూరిజం గెస్ట్‌హౌస్ నిర్మించేందుకు శిలాఫలకం వేశారు. ఆ తర్వాత ఆనం రామనారాయణరెడ్డి పర్యాటకశాఖ మంత్రిగా 2008లో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ సెంటర్, హరిత ఎకో టూరిజం రిసార్ట్స్ నిర్మించాలని చెన్నై సవేరా హోటల్స్ వారి సాయంతో నిర్మించేందుకు రెండు శిలాఫలకాలు వేశారు. అవి శిలాఫలకాలకే పరిమితమైపోయాయి.
తమ్ముళ్ల తహతహ....
పక్షుల పండగలో తమ్ముళ్లు హల్‌చల్ చేయటానికి తహతహలాడుతున్నారు. వాకాటి నారాయణరెడ్డి, గంగాప్రసాద్, వేనాటి రామచంద్రారెడ్డి తమ బలం ప్రదర్శించుకునే పనిలో నిమగ్నమయ్యారు. అందులో భాగంగానే సూళ్లూరుపేటను ఫ్లెక్సీల మయం చేశారు. పక్షుల పండగను మరిపించేస్తున్నారు. ఇదిలా ఉంటే పక్షుల పండగకు నేలపట్టు సర్పంచ్ విజయభాస్కర్, కోయిడి సర్పంచ్ సరోజనమ్మ, బీవీపాళెం సర్పంచ్ రోజారత్నంలకు అధికారులు కానీ, నాయకుల కానీ ఎటువంటి సమాచారం ఇవ్వటం లేదు.
అదేవిధంగా పక్షుల పండగకు సంబంధించిన ఆహ్వాన పత్రికల్లో వారి పేర్లు ముద్రించలేదు. అదే సూళ్లూరుపేటకు చెందిన టీడీపీ వార్డుసభ్యుడి పేరు మాత్రం ముద్రించి ఉండటం గమనార్హం. ఇదిలా ఉంటే స్థానిక ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య పేరు అస్సలు లేదు. ప్రభుత్వం ముద్రించిన వాల్‌పోస్టర్లలో కేవలం ముఖ్యమంత్రి, కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు, రాష్ట్ర మంత్రి నారాయణ ఫొటోలు మాత్రమే ముద్రించారు. ఈ వాల్‌పోస్టర్లు చూసిన స్థానికులు ఔరా అని ముక్కున వేలేసుకుంటున్నారు. ఇది కేవలం తమ్ముళ్లు పండగ అని ప్రచారం జరుగుతోంది.